వెటెల్ విజయం
► సీజన్‌లో మూడో టైటిల్
► మొనాకో గ్రాండ్‌ప్రిలో ఫెరారీ హవా
మోంటెకార్లో (మొనాకో): మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, నికో రోస్‌బర్గ్ జోరులో గత రెండు సీజన్‌లలో వెనుకబడిపోయిన మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ ఈ ఏడాది మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వెటెల్ ఈ సీజన్‌లో తన ఖాతాలో మూడో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి రేసులో వెటెల్ విజేతగా నిలిచాడు. 78 ల్యాప్‌లపాటు జరిగిన ఈ రేసును వెటెల్ గంటా 44 నిమిషాల 44.340 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ఫెరారీ జట్టుకే చెందిన కిమీ రైకోనెన్ రెండో స్థానంలో, రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఒకాన్ వరుసగా 12వ, 13వ స్థానాల్లో నిలిచి నిరాశ పరిచారు. తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 11న జరుగుతుంది. మొత్తం 20 మంది డ్రైవర్లు బరిలోకి దిగగా... 13 మంది మాత్రమే రేసును పూర్తి చేశారు. మిగతా ఏడుగురు మధ్యలోనే వైదొలిగారు.
16 ఏళ్ల తర్వాత...
‘పోల్ పొజిషన్’తో ప్రధాన రేసును ఆరంభించిన రైకోనెన్ 35 ల్యాప్‌ల వరకు ఆధిక్యంలో ఉండగా... ఆ తర్వాత రెండో స్థానంలో ఉన్న వెటెల్ ఆధిక్యంలోకి దూసుకొచ్చాడు. ఆ ఆధిక్యాన్ని చివరి ల్యాప్ వరకు కాపాడుకొని వెటెల్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. దాంతో 2001లో షుమాకర్ తర్వాత వెటెల్ రూపంలో మొనాకో గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్‌కు మళ్లీ టైటిల్ లభించింది.
కెరీర్‌లో 45 రేసుల్లో గెలిచిన వెటెల్ మొనాకో గ్రాండ్‌ప్రిలో రెండోసారి టైటిల్ సాధించాడు. చివరిసారి వెటెల్ 2011లో రెడ్‌బుల్ జట్టు తరఫున ఇక్కడ గెలిచాడు. సీజన్‌లో ఆరు రేసులు ముగిశాక... తాజా గెలుపుతో వెటెల్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో 129 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. 104 పాయింట్లతో హామిల్డన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, 75 పాయింట్లతో బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానంలో ఉన్నారు.