తొమ్మిదేళ్ల తర్వాత...
► క్వాలిఫయింగ్‌లో తొలి రెండు స్థానాలు ఫెరారీ డ్రైవర్లకే
► వెటెల్‌కు పోల్ పొజిషన్
► నేడు రష్యా గ్రాండ్‌ప్రి
సోచి (రష్యా): ఒకప్పుడు ఫార్ములావన్‌లో ఆధిపత్యం చలాయించి... ఆ తర్వాత వెనుకబడి పోయిన ఫెరారీ జట్టు మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. కొత్త సీజన్‌లో తమ ప్రత్యేకతను చాటుకుంటూ డిఫెండింగ్ చాంపియన్ మెర్సిడెస్ జట్టుకు గట్టిపోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. సీజన్‌లోని నాలుగో రేసు రష్యా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో ఫెరారీ డ్రైవర్లు సెబాస్టియన్ వెటెల్, కిమీ రైకోనెన్ అదరగొట్టారు. వెటెల్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 33.194 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకోగా... రైకోనెన్ ఒక నిమిషం 33.253 సెకన్లతో రెండో స్థానాన్ని పొందాడు.
ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును వెటెల్, రైకోనెన్ వరుసగా తొలి రెండు స్థానాల నుంచి ప్రారంభిస్తారు. ఈ సీజన్‌లో తొలిసారి ఫెరారీ డ్రైవర్‌కు ‘పోల్ పొజిషన్’ లభించింది. 2008 జూన్‌లో ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి (రైకోనెన్, మసా) తర్వాత ఓ ప్రధాన రేసును ఇద్దరు ఫెరారీ డ్రైవర్లు మొదలుపెట్టనుండటం ఇదే తొలిసారి. మెర్సిడెస్ డ్రైవర్లు బొటాస్, హామిల్టన్ వరుసగా మూడు, నాలుగు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. భారత్‌కు చెందిన పెరెజ్, ఒకాన్ వరుసగా తొమ్మిది, పది స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్‌లో మూడు రేసులు జరగ్గా... వెటెల్ రెండింటిలో... హామిల్టన్ ఒక రేసులో విజేతగా నిలిచారు.
గ్రిడ్ పొజిషన్స్: 1. వెటెల్ (ఫెరారీ), 2. రైకోనెన్ (ఫెరారీ), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. హామిల్టన్ (మెర్సిడెస్), 5. రికియార్డో (రెడ్‌బుల్), 6. మసా (విలియమ్స్), 7. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), 8. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 9. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 10. ఒకాన్ (ఫోర్స్ ఇండియా), 11. సెయింజ్ (ఎస్టీఆర్), 12. లాన్స్ స్ట్రాల్ (విలియమ్స్), 13. క్వియాట్ (ఎస్టీఆర్), 14. మాగ్నుసెన్ (హాస్), 15. అలోన్సో (మెక్‌లారెన్), 16. పాల్మెర్ (రెనౌ), 17. వాన్‌డూర్నీ (మెక్‌లారెన్), 18. వెర్లీన్ (సాబెర్), 19. ఎరిక్సన్ (సాబెర్), 20. గ్రోస్యెన్ (హాస్).