
వెటెల్ విజయ ‘సప్తమి’
అబుదాబి: ఇప్పటికే ఈ సీజన్ ఫార్ములావన్ టైటిల్ ఖరారయినా... రెడ్‌బుల్ రేసర్ సెబాస్టియన్ వెటెల్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. గత వారం ఢిల్లీలో చూపిన ప్రదర్శననే కొనసాగిస్తూ అబుదాబి గ్రాండ్‌ప్రిలో విజయం సాధించాడు. ఈ సీజన్‌లో వెటెల్‌కు ఇది వరుసగా ఏడో విజయం కాగా, ఓవరాల్‌గా 11వది. 55 ల్యాప్‌ల అబుదాబి రేస్‌ను వెటెల్ గంటా 38 నిమిషాల 6.106 సెకన్లలో పూర్తి చేశాడు. రెడ్‌బుల్‌కే చెందిన మార్క్ వెబెర్‌కు రెండో స్థానం దక్కగా, మెర్సిడెజ్ డ్రైవర్ రోస్‌బర్గ్ మూడో స్థానంలో నిలిచాడు. పోల్ పొజిషన్‌లో దక్కిన అగ్రస్థానాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వెబర్ విఫలమయ్యాడు. రెండో స్థానంతో ప్రారంభించిన వెటెల్ తొలి మలుపునుంచే ముందుకు దూసుకుపోయి చివరి వరకు దానిని కొనసాగించాడు.
తొలి స్థానంపై ఆశలు వదులుకున్న వెబర్, తన వెనకే దూసుకొస్తున్న రోస్‌బర్గ్‌పైనే దృష్టి నిలిపి రేస్‌ను కొనసాగించడంతో వెటెల్ పని మరింత సులువైంది.ఈ విజయంతో వెటెల్... వరుసగా ఏడు రేస్‌లు నెగ్గిన మైకేల్ షుమాకర్ (2004) సరసన చేరాడు. సీజన్‌లో మిగిలి ఉన్న రెండు రేస్‌లను కూడా నెగ్గితే వరుసగా తొమ్మిది సార్లు గెలిచిన ఆల్బర్టో అస్కారి (1952-53) రికార్డును వెటెల్ సమం చేస్తాడు. మరో వైపు తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన (2011లో 11 రేస్‌లు) కూడా సెబాస్టియన్ సమం చేశాడు. చివరి రెండూ గెలిస్తే సీజన్‌లో అత్యధిక విజయాల షుమాకర్ (13) రికార్డును కూడా అతను అందుకోగలడు.
టాప్-10లో ఫోర్స్ డ్రైవర్లు
మరో వైపు ఫోర్స్ ఇండియా జట్టు ప్రదర్శన ఇండియన్ గ్రాండ్‌ప్రి కంటే మెరుగు పడింది. సీజన్‌లో రెండో వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ ఫోర్స్ డ్రైవర్ పాల్ డి రెస్టా ఆరో స్థానంలో నిలిచాడు. మరో డ్రైవర్ ఆడ్రియన్ సుటిల్ 10వ స్థానం సాధించాడు. ఫోర్స్ ఇండియాకు ఇది వరుసగా రెండో డబుల్ పాయింట్ ఫినిష్ కావడం విశేషం.