వెటెల్‌దే ఆధిపత్యం
గ్రేటర్ నోయిడా: వరుసగా మూడో ఏడాది ‘ఇండియన్ గ్రాండ్ ప్రి’ టైటిల్‌పై గురిపెట్టిన రెడ్‌బుల్ డ్రైవర్, డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ శుక్రవారం జరిగిన రెండు ప్రాక్టీస్ సెషన్లలోనూ దుమ్మురేపాడు. బుద్ధ సర్క్యూట్‌లో ఉదయం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్‌లో ని.1:26.683 సెకన్ల ల్యాప్ టైమింగ్ నమోదు చేశాడు. అయితే మధ్నాహ్నం జరిగిన రెండో ప్రాక్టీస్ సెషన్‌లో వెటెల్ మరింత మెరుగ్గా డ్రైవ్ చేశాడు.
ని. 1:25.722 సెకన్లతో అత్యంత వేగవంతంగా ల్యాప్‌ను పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించాడు. దీంతో రెండు సెషన్లలోనూ టాప్‌లో నిలిచాడు. రెడ్‌బుల్‌కు చెందిన మరో డ్రైవర్ మార్క్ వెబెర్ కూడా రెండు సెషన్లలో (1:26.871 సెకన్లు; 1:26.011 సెకన్లు) హవా కొనసాగిస్తూ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తొలి ప్రాక్టీస్ (ఎఫ్‌పీ-1) సెషన్‌లో నాలుగో స్థానంలో నిలిచిన లోటస్ డ్రైవర్ గ్రోస్‌జీన్... రెండో ప్రాక్టీస్‌లో 1:26.220 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలవగా... మెర్సిడెస్‌కు చెందిన లూయిస్ హామిల్టన్ (1:26.399 సెకన్లు) నాలుగో స్థానం దక్కించుకున్నాడు.
గేర్‌బాక్స్ సమస్యతో తొలి ప్రాక్టీస్ సెషన్‌లో 12వ స్థానానికి పరిమితమైన ఫెరారీ డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో.... రెండో ప్రాక్టీస్‌లో ఆకట్టుకున్నాడు. 1:26.430 సెకన్ల టైమింగ్‌తో ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. నికో రోస్‌బెర్గ్ (మెర్సిడెస్) 1:26.582 సెకన్లతో ఆరోస్థానంలో నిలవగా... ఫెలిప్ మసా (ఫెరారీ) 1:26.601 సెకన్లతో; కిమీ రైకోనెన్ (లోటస్) 1:26.632 సెకన్లతో; మెక్‌లారెన్ డ్రైవర్లు సెర్గి పెరెజ్ 1:26.857 సెకన్లతో; జెన్సన్ బటన్ 1:26.972 సెకన్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
‘ఫోర్స్’ విఫలం
భారత రేసింగ్ జట్టు ‘ఫోర్స్ ఇండియా’ రెండు ప్రాక్టీస్ సెషన్లలోనూ విఫలమైంది. తొలి ప్రాక్టీస్ సెషన్‌లో 15వ స్థానంలో నిలిచిన ఆడ్రియన్ సుటిల్... రెండో సెషన్‌లో 1:27.375 సెకన్ల ల్యాప్ టైమింగ్‌తో 12వ స్థానంలో నిలిచాడు. తొలి ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్న పాల్ డి రెస్టా... రెండోసెషన్‌లో 1:27.608 సెకన్లతో 15వ స్థానానికి పరిమితమయ్యాడు.
విలియమ్స్ జట్టుకు జరిమానా
పిట్ స్టాప్‌లో చేసిన చిన్న తప్పిదానికి విలియమ్స్ జట్టుపై 60వేల యూరోల (రూ. 50 లక్షలు) జరిమానా పడింది. రెండో ప్రాక్టీస్ సెషన్‌లో విలియమ్స్ డ్రైవర్ పాస్టర్ మల్డొ నాల్డో నడుతుపున్న కారు కుడి టైర్ నట్ ఊడిపోయింది. మరోవైపు తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పిట్‌లైన్ వద్ద కారును వేగంగా నడిపినందుకు లోటస్ డ్రైవర్ కిమీ రైకోనెన్‌పై 400 యూరోల (రూ.34వేలు) జరిమానా విధించారు.