Indian Grand Prix
-
డోప్ టెస్టులో పట్టుబడ్డ ఇద్దరు భారత అథ్లెట్లు
న్యూఢిల్లీ: భారత్ తరఫున ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాల్సిన ఇద్దరు భారత అథ్లెట్లు డోపీలుగా తేలారు. గత నెలలో పాటియాలా వేదికగా జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రి మీట్లో నిర్వహించిన డోపింగ్ పరీక్షలో వీరిద్దరు విఫలమైనట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ శనివారం తెలిపారు. అయితే వారి పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ ఇద్దరు అథ్లెట్ల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో శక్తినిచ్చే మిథైల్హెక్సాన్–2–అమైన్ అనే నిషేధిత ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలిందని ఆయన పేర్కొన్నారు. వీరిని త్వరలోనే ‘నాడా’ క్రమశిక్షణా ప్యానెల్ (ఏడీడీపీ) ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అక్కడ దోషులుగా తేలితే వారిపై రెండు నుంచి నాలుగేళ్ల పాటు నిషేధం విధించే అవకాశం ఉంది. -
నిర్ణయం జేపీ గ్రూప్‌దే!
ఇండియన్ గ్రాండ్‌ప్రిపై ఎకెల్‌స్టోన్ వ్యాఖ్య న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఇండియన్ గ్రాండ్ ప్రి జరగడం రేస్ ప్రమోటర్ జేపీ గ్రూప్‌పైనే ఆధారపడి ఉందని ఎఫ్-1 చీఫ్ బెర్నీ ఎకెల్‌స్టోన్ అన్నారు. ఈ విషయం తేల్చుకోవడానికి వాళ్లకు చాలా తక్కువ సమయం ఉందని స్పష్టం చేశారు. ఓవరాల్‌గా జేపీ గ్రూప్ స్పందన కోసం తాము వేచి చూస్తున్నామని చెప్పిన ఆయన భారత్‌లో రేసు జరిగితే బాగుంటుందన్నారు. ‘దాదాపు ఆరు నెలల తర్వాత జేపీఎస్ఐ చీఫ్ సమీర్ గౌర్తో జరిగిన చర్చలు ఫలవంతంగా ముగిశాయి. 2016లో రేసు నిర్వహణ కోసం కసరత్తులు చేస్తున్నారు. రష్యా గ్రాండ్ ప్రి సందర్భంగా జరిగిన చర్చల్లో కూడా సానుకూలాంశాలే కనిపించాయి. కాబట్టి ఇండియన్ గ్రాండ్ ప్రి జరుగుతుందని నమ్ముతున్నా’ అని ఎకెల్‌స్టోన్ పేర్కొన్నారు. -
భారత్‌లో మళ్లీ ఎఫ్1?
న్యూఢిల్లీ: ఫార్ములా వన్ రేస్ మళ్లీ భారత్‌లో జరగనుందా ? ఇండియన్ గ్రాండ్ ప్రికి అడ్డంకులన్నీ తొలిగినట్లేనా ? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే ఏడాది ఇండియన్ గ్రాండ్ ప్రి భారత్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదేళ్ల కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం రేస్ ప్రమోటరైన జేపీ గ్రూప్ ఆర్థిక అవసరాలను తీరిస్తే ఫార్ములావన్ రేస్‌ను భారత్‌లో నిర్వహించేందుకు తమకెలాంటి ఇబ్బంది లేదని ఎఫ్ వన్ బాస్ బెర్నీ ఎకిల్‌స్టోన్ తెలిపారు. త్వరలోనే జేపీ గ్రూప్ అధికారులతో సమావేశమై సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ‘ఇది చాలా సుస్పష్టమైన విషయం. జేపీ గ్రూప్ వాళ్లు ఇక్కడికి(లండన్‌కు) వచ్చి ప్రస్తుతం కొన సాగుతున్న ఒప్పంద సమస్యల్ని పరిష్కరించాలి. వాళ్లు రేస్‌ను తిరిగి నిర్వహించేందుకు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారమై, క్యాలెండర్ ప్రకారం ఇండియాలో రేస్ జరుగుతుందని నాకు కూడా నమ్మకం ఉంది’ అని ఎకిల్‌స్టోన్ స్పష్టం చేశారు. అయితే 2011-13 వరకు వరుసగా మూడు సీజన్ల పాటు ఇండియన్ గ్రాండ్ ప్రిని భారత్‌లో నిర్వహించినప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా ఈ ఏడాది రేస్‌కు ఎఫ్ వన్ బాస్ అనుమతినివ్వలేదు. -
ఒప్పంద బాధ్యతలను విస్మరించింది
జేపీ గ్రూప్‌పై ఎఫ్-1 బాస్ ఎకిల్‌స్టోన్ ధ్వజం ఆర్థిక హామీలు ఇస్తేనే ఇండియన్ గ్రాండ్ ప్రి న్యూఢిల్లీ: ఇండియన్ గ్రాండ్‌ప్రి వివాదం కొత్త మలుపు తిరిగింది. భారత్‌లో రేసును ప్రమోట్ చేస్తున్న జేపీ గ్రూప్... తమతో కుదుర్చుకున్న ఐదేళ్ల ఒప్పంద బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయిందని ఎఫ్-1 బాస్ బెర్నీ ఎకిల్‌స్టోన్ విమర్శించారు. ‘ఐదేళ్ల ఒప్పందాన్ని కొనసాగించేందుకు నాతో పాటు నా సంస్థ కూడా కట్టుబడి ఉంది. అయితే మధ్యలో ఎదురవుతున్న అడ్డంకులు కొన్ని పరిష్కారమవుతున్నా.. మరికొన్ని అలాగే ఉన్నాయి. మా నిబంధనలను వాళ్లు సంతృప్తిపర్చలేకపోతున్నారు. అందుకే 2015 రేసు సందిగ్ధంలో పడింది. ఇందుకు టాక్స్ మినహాయింపులు, రాజకీయ, అధికారిక అడ్డంకులు ఒక్కటే కారణం కాదు’ అని ఎకిల్‌స్టోన్ పేర్కొన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సీజన్లో రేసు జరిగే అవకాశముందన్నారు. ‘ఒప్పందంలోని కొన్ని అంశాలను ప్రమోటర్లు సంతృప్తిపర్చలేకపోతున్నారు. ఇందులో ఎక్కువగా డబ్బుకు సంబంధించినవే ఉన్నాయి. అయినప్పటికీ ప్రమోటర్స్‌తో మా సంబంధం బాగానే ఉంది. కాబట్టి కాంట్రాక్ట్‌లోని మిగతా రెండేళ్లను పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. రెండు నెలల్లో అన్నీ పరిష్కరించుకుంటే వచ్చే ఏడాది రేసును జరిపేందుకు ప్రయత్నిస్తాం. లేదంటే భవిష్యత్ షెడ్యూల్లో చోటు చాలా కష్టం’ అని ఎకిల్‌స్టోన్ స్పష్టం చేశారు. మరోవైపు ఎఫ్ఓఎమ్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తాము బహిర్గతం చేయలేమని జేపీ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ సీఈఓ సమీర్ గౌర్ అన్నారు. వచ్చే ఏడాది రేసును తీసుకొచ్చేందుకు ఎకిల్‌స్టోన్‌తో చర్చలు జరుపుతానని చెప్పారు. -
ఇండియన్ గ్రాండ్‌ప్రికి విరామం
పారిస్: ఊహాగానాలకు తెరపడింది. అనుకున్నట్లే జరిగింది. వచ్చే ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ నుంచి ఇండియన్ గ్రాండ్‌ప్రి రేసును తొలగించారు. కొత్త రేసులకు చోటు కల్పించాలనే ఉద్దేశంతో ఇండియన్ గ్రాండ్‌ప్రి రేసును వచ్చే ఏడాది నిర్వహించడంలేదని... దానికి బదులుగా 2015 సీజన్ ఆరంభంలో ఇండియన్ గ్రాండ్‌ప్రి రేసుకు స్థానం కల్పిస్తామని గతంలో ఎకిల్‌స్టోన్ తెలిపారు. అంతర్జాతీయ ఆటోమొబైల్ ఫెడరేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో 2014 ఎఫ్1 సీజన్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. గత సెప్టెంబరులో తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించిన సమయంలో వచ్చే ఏడాది 22 రేసులు ఉంటాయని ఎఫ్1 అధ్యక్షుడు ఎకిల్‌స్టోన్ తెలిపారు. అయితే సమావేశంలో చర్చించాక ఈ ఏడాది మాదిరిగానే వచ్చే ఏడాదీ 19 రేసులను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. దాంతో ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్లో ఉన్న దక్షిణ కొరియా, మెక్సికో, న్యూజెర్సీ గ్రాండ్‌ప్రి రేసులను తొలగించారు. ఇండియన్ గ్రాండ్‌ప్రి స్థానంలో ఆస్ట్రియా గ్రాండ్‌ప్రికి స్థానం కల్పించారు. 2014 ఎఫ్1 సీజన్ మార్చి 16న మెల్బోర్న్లో జరిగే ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి రేసుతో మొదలై నవంబరు 23న అబుదాబి గ్రాండ్‌ప్రి రేసుతో ముగుస్తుంది. 2014 ఎఫ్1 షెడ్యూల్ మార్చి 16: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి; మార్చి 30: మలేసియా; ఏప్రిల్ 6: బహ్రెయిన్; ఏప్రిల్ 20: చైనా; మే 11: స్పెయిన్; మే 25: మొనాకో; జూన్ 8: కెనడా; జూన్ 22: ఆస్ట్రియా; జులై 6: గ్రేట్ బ్రిటన్; జూలై 20: జర్మనీ; జూలై 27: హంగేరి; ఆగస్టు 24: బెల్జియం; సెప్టెంబరు 7: ఇటలీ; సెప్టెంబరు 21: సింగపూర్; అక్టోబరు 5: జపాన్; అక్టోబరు 12: రష్యా; నవంబరు 2: యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా; నవంబరు 9: బ్రెజిల్; నవంబరు 23: అబుదాబి గ్రాండ్‌ప్రి. -
వెటెల్దే ఆధిపత్యం
గ్రేటర్ నోయిడా: వరుసగా మూడో ఏడాది ‘ఇండియన్ గ్రాండ్ ప్రి’ టైటిల్‌పై గురిపెట్టిన రెడ్‌బుల్ డ్రైవర్, డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ శుక్రవారం జరిగిన రెండు ప్రాక్టీస్ సెషన్లలోనూ దుమ్మురేపాడు. బుద్ధ సర్క్యూట్లో ఉదయం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్లో ని.1:26.683 సెకన్ల ల్యాప్ టైమింగ్ నమోదు చేశాడు. అయితే మధ్నాహ్నం జరిగిన రెండో ప్రాక్టీస్ సెషన్లో వెటెల్ మరింత మెరుగ్గా డ్రైవ్ చేశాడు. ని. 1:25.722 సెకన్లతో అత్యంత వేగవంతంగా ల్యాప్‌ను పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించాడు. దీంతో రెండు సెషన్లలోనూ టాప్‌లో నిలిచాడు. రెడ్బుల్కు చెందిన మరో డ్రైవర్ మార్క్ వెబెర్ కూడా రెండు సెషన్లలో (1:26.871 సెకన్లు; 1:26.011 సెకన్లు) హవా కొనసాగిస్తూ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తొలి ప్రాక్టీస్ (ఎఫ్పీ-1) సెషన్లో నాలుగో స్థానంలో నిలిచిన లోటస్ డ్రైవర్ గ్రోస్జీన్... రెండో ప్రాక్టీస్‌లో 1:26.220 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలో నిలవగా... మెర్సిడెస్కు చెందిన లూయిస్ హామిల్టన్ (1:26.399 సెకన్లు) నాలుగో స్థానం దక్కించుకున్నాడు. గేర్‌బాక్స్ సమస్యతో తొలి ప్రాక్టీస్ సెషన్లో 12వ స్థానానికి పరిమితమైన ఫెరారీ డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో.... రెండో ప్రాక్టీస్‌లో ఆకట్టుకున్నాడు. 1:26.430 సెకన్ల టైమింగ్‌తో ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. నికో రోస్బెర్గ్ (మెర్సిడెస్) 1:26.582 సెకన్లతో ఆరోస్థానంలో నిలవగా... ఫెలిప్ మసా (ఫెరారీ) 1:26.601 సెకన్లతో; కిమీ రైకోనెన్ (లోటస్) 1:26.632 సెకన్లతో; మెక్లారెన్ డ్రైవర్లు సెర్గి పెరెజ్ 1:26.857 సెకన్లతో; జెన్సన్ బటన్ 1:26.972 సెకన్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ‘ఫోర్స్’ విఫలం భారత రేసింగ్ జట్టు ‘ఫోర్స్ ఇండియా’ రెండు ప్రాక్టీస్ సెషన్లలోనూ విఫలమైంది. తొలి ప్రాక్టీస్ సెషన్లో 15వ స్థానంలో నిలిచిన ఆడ్రియన్ సుటిల్... రెండో సెషన్లో 1:27.375 సెకన్ల ల్యాప్ టైమింగ్‌తో 12వ స్థానంలో నిలిచాడు. తొలి ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్న పాల్ డి రెస్టా... రెండోసెషన్‌లో 1:27.608 సెకన్లతో 15వ స్థానానికి పరిమితమయ్యాడు. విలియమ్స్ జట్టుకు జరిమానా పిట్ స్టాప్‌లో చేసిన చిన్న తప్పిదానికి విలియమ్స్ జట్టుపై 60వేల యూరోల (రూ. 50 లక్షలు) జరిమానా పడింది. రెండో ప్రాక్టీస్ సెషన్లో విలియమ్స్ డ్రైవర్ పాస్టర్ మల్డొ నాల్డో నడుతుపున్న కారు కుడి టైర్ నట్ ఊడిపోయింది. మరోవైపు తొలి ప్రాక్టీస్ సెషన్లో పిట్‌లైన్ వద్ద కారును వేగంగా నడిపినందుకు లోటస్ డ్రైవర్ కిమీ రైకోనెన్పై 400 యూరోల (రూ.34వేలు) జరిమానా విధించారు. -
ఢిల్లీలో ఫార్ములా రయ్...రయ్...
గ్రేటర్ నోయిడా: ఓవైపు వచ్చే ఏడాది జరుగుతుందో లేదోనన్న అనిశ్చితి... మరోవైపు మూడోసారి భారత్‌లో ఫార్ములావన్ రేసు జరుగుతుందన్న ఆనందం.. ఈ నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేస్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు దేశ రాజధాని సమీపంలోని బుద్ధ అంతర్జాతీయ సర్క్యూట్ (బీఐసీ)లో రేసు కార్లు రయ్యిన దూసుకుపోనున్నాయి. శుక్రవారం రెండు ప్రాక్టీస్ సెషన్లతో పాటు శనివారం పోల్ పొజిషన్ కోసం అన్ని జట్ల డ్రైవర్లు తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆదివారం ప్రధాన రేసు జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్, రెడ్‌బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. కార్ల జోరు... డ్రైవర్ల నైపుణ్యం... ట్రాక్‌పై డ్రామాను పక్కనబెడితే ఈ వారాంతం రేసుతో 26 ఏళ్ల వెటెల్... ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. అదే జరిగితే వరుసగా నాలుగుసార్లు టైటిల్ గెలిచిన పిన్న వయస్కుడిగా అతను రికార్డులకెక్కనున్నాడు. యువాన్ మాన్యుయెల్ ఫాంగియో (అర్జెంటీనా), మైకేల్ షుమాకర్ (జర్మనీ) గతంలో నాలుగుసార్లు టైటిల్స్‌ను సాధించారు. రేసు ద్వితీయార్ధంలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న వెటెల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా ఐదు రేసులు గెలిచి చాంపియన్‌షిప్‌లో సమీప ప్రత్యర్థి ఫెరారీ డ్రైవర్ అలోన్సో (207) కంటే 90 పాయింట్ల ఆధిక్యంలో నిలిచాడు. కిమీ రైకోనెన్ (177) మూడోస్థానంలో ఉన్నాడు. ఏకైక డ్రైవర్... ఇప్పటి వరకు ఇండియన్ గ్రాండ్ ప్రిని సొంతం చేసుకున్న ఏకైక డ్రైవర్ వెటెల్. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే ఈసారి కూడా అతనే విజేతగా నిలిచే అవకాశం ఉంది. దీంతో బుద్ధ సర్క్యూట్‌పై ‘హ్యాట్రిక్’ కొట్టాలని టీమ్ మేనేజ్మెంట్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ‘ఇది అంత సులువైన ట్రాక్ కాదు. ఎందుకంటే దీనిపై కొన్ని క్లిష్టమైన రిథమ్ బ్రేకర్స్ ఉన్నాయి. పైకి ఎక్కేటప్పుడు టర్న్-3 చాలా కష్టంగా ఉంటుంది. పైభాగాన్ని చూడటం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. కాబట్టి బుద్ధ సర్క్యూట్‌పై ఓ పరిపూర్ణమైన ల్యాప్‌ను డ్రైవ్ చేయాలంటే డ్రైవింగ్‌లో చాలా మెళకువలు తెలిసి ఉండాలి’ అని వెటెల్ అభిప్రాయపడ్డాడు. ఆరోస్థానం కోసం పోటీ మరోవైపు సొంతగడ్డపై బరిలోకి దిగుతున్న సహారా ఫోర్స్ ఇండియా ‘కన్స్ట్రక్టర్ చాంపియన్‌షిప్’లో ఆరో స్థానాన్ని కాపాడుకోవడంపై దృష్టిపెట్టింది. గత రేసుల్లో ఘోరంగా విఫలమైన మాల్యా జట్టు ఈ రేసులోనైనా పాయింట్లు సాధించాలని భావిస్తోంది. ప్రస్తుతం 62 పాయింట్లతో ఉన్న ఫోర్స్‌ను సిల్వర్‌స్టోన్ రేసు బాగా దెబ్బతీసింది. టైర్లు మార్చాల్సి రావడంతో పాయింట్లు నెగ్గలేకపోయింది. చివరి ఏడు రేసుల్లో కేవలం 3 పాయింట్లు మాత్రమే సాధించిన ఫోర్స్... సాబెర్ (38) టీమ్ కంటే 17 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. అయితే ఈ ట్రాక్‌పై పాయింట్లు సాధించడం చాలా కష్టమని ఫోర్స్ డ్రైవర్ల అభిప్రాయం. ప్రస్తుతం కన్స్ట్రక్టర్ చాంపియన్‌షిప్‌లో రెడ్‌బుల్ (445), ఫెరారీ (297), మెర్సిడెస్ (287) జట్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. గత రెండు సీజన్లలో హిస్పానియా తరఫున ఇండియన్ గ్రాండ్‌ప్రిలో బరిలోకి దిగిన భారత డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్ ఈసారి పాల్గొనడం లేదు. మేరీకామ్‌కు గౌరవం ఇండియన్ గ్రాండ్ ప్రిలో చకర్డ్ ఫ్లాగ్‌ను ఊపే అరుదైన గౌరవం ఈసారి మేరీకామ్‌కు దక్కింది. తొలి రెండు సీజన్లలో సచిన్, గగన్ నారంగ్‌లకు ఈ గౌరవం దక్కింది. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో కాంస్యం సాధించిన మేరీకామ్‌ను ఈసారి ఆహ్వానించారు. అయితే అటు అభిమానుల నుంచి ఈ రేసుకు కాస్త ఆసక్తి తగ్గింది. తొలి సీజన్లో ఏకంగా 90 వేల టిక్కెట్లు అమ్ముడుకాగా... రెండో సీజన్లో 65 వేల మంది మాత్రమే ప్రత్యక్షంగా చూశారు. ఈసారి ఇప్పటివరకు కేవలం 40 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.