పారిస్: ఊహాగానాలకు తెరపడింది. అనుకున్నట్లే జరిగింది. వచ్చే ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్ నుంచి ఇండియన్ గ్రాండ్‌ప్రి రేసును తొలగించారు. కొత్త రేసులకు చోటు కల్పించాలనే ఉద్దేశంతో ఇండియన్ గ్రాండ్‌ప్రి రేసును వచ్చే ఏడాది నిర్వహించడంలేదని... దానికి బదులుగా 2015 సీజన్ ఆరంభంలో ఇండియన్ గ్రాండ్‌ప్రి రేసుకు స్థానం కల్పిస్తామని గతంలో ఎకిల్‌స్టోన్ తెలిపారు. అంతర్జాతీయ ఆటోమొబైల్ ఫెడరేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో 2014 ఎఫ్1 సీజన్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు.
గత సెప్టెంబరులో తాత్కాలిక షెడ్యూల్‌ను ప్రకటించిన సమయంలో వచ్చే ఏడాది 22 రేసులు ఉంటాయని ఎఫ్1 అధ్యక్షుడు ఎకిల్‌స్టోన్ తెలిపారు. అయితే సమావేశంలో చర్చించాక ఈ ఏడాది మాదిరిగానే వచ్చే ఏడాదీ 19 రేసులను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. దాంతో ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్‌లో ఉన్న దక్షిణ కొరియా, మెక్సికో, న్యూజెర్సీ గ్రాండ్‌ప్రి రేసులను తొలగించారు. ఇండియన్ గ్రాండ్‌ప్రి స్థానంలో ఆస్ట్రియా గ్రాండ్‌ప్రికి స్థానం కల్పించారు. 2014 ఎఫ్1 సీజన్ మార్చి 16న మెల్‌బోర్న్‌లో జరిగే ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి రేసుతో మొదలై నవంబరు 23న అబుదాబి గ్రాండ్‌ప్రి రేసుతో ముగుస్తుంది.
2014 ఎఫ్1 షెడ్యూల్
మార్చి 16: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి; మార్చి 30: మలేసియా; ఏప్రిల్ 6: బహ్రెయిన్; ఏప్రిల్ 20: చైనా; మే 11: స్పెయిన్; మే 25: మొనాకో; జూన్ 8: కెనడా; జూన్ 22: ఆస్ట్రియా; జులై 6: గ్రేట్ బ్రిటన్; జూలై 20: జర్మనీ; జూలై 27: హంగేరి; ఆగస్టు 24: బెల్జియం; సెప్టెంబరు 7: ఇటలీ; సెప్టెంబరు 21: సింగపూర్; అక్టోబరు 5: జపాన్; అక్టోబరు 12: రష్యా; నవంబరు 2: యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా; నవంబరు 9: బ్రెజిల్; నవంబరు 23: అబుదాబి గ్రాండ్‌ప్రి.
ఇండియన్ గ్రాండ్‌ప్రికి విరామం
Published Fri, Dec 6 2013 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
Advertisement