![Military community gathers in Paris to discuss how AI is impacting conflict around the world](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Paris.jpg.webp?itok=D1E0_7Lu)
మంగళవారం పారిస్‌లో ఏఐ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సు వేదికపై ప్రధాని మోదీతో పాటు పలు దేశాల అధినేతలు, అగ్ర నేతలు
అమెరికా, చైనా, యూరప్ ఎవరికి వారే!
తీర్మానానికి దూరంగా అగ్రరాజ్యం
సంతకం చేసి షాకిచ్చిన చైనా
మితిమీరిన నియంత్రణ వద్దు: వాన్స్
ప్రజల నమ్మకమే కీలకం: ఈసీ చీఫ్
నేతల మాటల యుద్ధం
పారిస్: పెద్దన్నల పోట్లాటకు ఏఐ అంతర్జాతీయ శిఖరాగ్రం వేదికైంది. అతి కీలకమైన కృత్రిమ మేధ రంగానికి సంబంధించి వాటి మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధతీవ్రతకు అద్దం పట్టింది. ఏఐలో తిరుగులేని శక్తిగా మారిన అమెరికా, దాన్ని ఢీకొట్టే దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్న చైనా, ఆ రెండింటికీ దీటుగా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్న యూరప్ మధ్య విభేదాలు సదస్సు సాక్షిగా బయట పడ్డాయి. నిబంధనల పరిమితుల్లేకుండా సరికొత్త ఇన్నోవేషన్లు తదితరాలతో ఏఐ విషయంలో దూకుడుగా వెళ్లనున్నట్టు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుండబద్దలు కొట్టడం తెలిసిందే. చైనా కూడా ప్రభుత్వ దన్నుతో కూడిన టెక్ దిగ్గజాల చురుకైన భాగస్వామ్యంతో ఏఐ రంగంలో అంతర్జాతీయంగా పైచేయి సాధించే ప్రయత్నంలో పడింది.
యూరప్ మాత్రం ఓవైపు ఏఐ వాడకం విషయంలో వ్యక్తుల భద్రతకు, జవాబుదారీతనానికే పెద్దపీట వేస్తూనే మరోవైపు అమెరికా, చైనాలకు దీటుగా మూడో శక్తిగా ఎదిగేందుకు పథక రచన చేస్తోంది. అందులో భాగంగా ఏఐ నిబంధనలను పలు యూరప్ దేశాలు నానాటికీ మరింత కఠినతరం చేస్తూ వస్తున్నాయి. దీనిపై తమ తీవ్ర అసంతృప్తిని పారిస్‌లో జరుగుతున్న ఏఐ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సులో సోమవారం రెండో రోజు అమెరికా బాహాటంగానే వెళ్లగక్కింది. కృత్రిమ మేధపై మితిమీరిన నియంత్రణ మంచిది కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుండబద్దలు కొట్టారు. శరవేగంగా సాగుతున్న ఏఐ ప్రగతి ప్రస్థానానికి అది తీరని అడ్డంకిగా మారవచ్చని హెచ్చరించారు.
ఏఐ తాలూకు దుష్పరిణామాలు, రిస్కులకు అడ్డుకట్ట వేసేందుకు యూరప్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన పరోక్షంగా ఆక్షేపించారు. ట్రంప్ రాకతో ఏఐ విషయంలో సమూలంగా మారిన అమెరికా వైఖరిని ప్రతిఫలించేలా వాన్స్ ప్రసంగం సాగింది. అనంతరం యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ మాట్లాడుతూ వాన్స్ ఆరోపణలను తోసిపుచ్చారు. ఏఐ వాడకం అన్ని విధాలా సురక్షితమేనని ప్రజల్లో నమ్మకం కలగడం అన్నింటికంటే కీలకమని స్పష్టం చేశారు. దాన్ని సాధించడమే ఏఐపై ఈయూ నిబంధనల ఏకైక లక్ష్యమని ఆమె వివరించారు.
ఏఐ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో నిర్దిష్ట నియమ నిబంధనలు తప్పనిసరి అని శిఖరాగ్రం ఏర్పాటుకు చొరవ తీసుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా స్పష్టం చేశారు. ఏఐ రేసులో మూడో శక్తిగా యూరప్ శరవేగంగా ఎదుగుతోందని ఆయన ప్రకటించారు. ఏఐ ఇన్నోవేషన్ల ఫలాలు అంతిమంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ సమానంగా అందాలని తన ముగింపు ప్రసంగంలో ఆకాంక్షించారు. ఏఐ రంగంపై యూరప్ నియంత్రణలను చైనా కూడా వ్యతిరేకించింది. అంతర్జాతీయ ఏఐ ప్రమాణాలనే సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం తమ లక్ష్యమని చైనా ఉప ప్రధాని జాంగ్ గువోకింగ్ పేర్కొన్నారు.
మా కంపెనీలపై మతిలేని నియంత్రణలు: వాన్స్
ఏఐని ఆవిరి యంత్రం ఆవిష్కరణకు దీటైన సరికొత్త పారిశ్రామిక విప్లవంగా అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక ప్రస్థానానికే ఏఐ మేలిమలుపు కాగలదన్నారు. దాన్ని నిబంధనల ఛట్రంలో బిగించి ప్రగతి నిరోధకులుగా మారొద్దని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. అమెరికాలో రూపొందే ఏఐ వ్యవస్థలన్నీ సైద్ధాంతిక, ఇతరత్రా వివక్షలకు తావులేని రీతిలో ఉంటాయని స్పష్టం చేశారు. అమెరికా పౌరుల వాక్ స్వాతంత్య్రం తదితరాలకు తమ ప్రభుత్వం ఎప్పటికీ పరిమితులు విధించబోదన్నారు. అమెరికా టెక్నాలజీ సంస్థలపై పలు దేశాలు మతిలేని నియంత్రణలకు దిగుతున్నాయంటూ యూరోపియన్ యూనియన్ తీరును తప్పుబట్టారు. ఉపాధ్యక్ష హోదాలో అంతర్జాతీయ వేదికపై ఆయనకిది తొలి ప్రసంగం కావడం విశేషం
ఇదీ తీర్మానం
⇒ డిజిటల్ అంతరాలను వీలైనంతగా తగ్గించడమే లక్ష్యం. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఏఐని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మరింతగా కృషి.
⇒ ఏఐ టెక్నాలజీ పారదర్శకంగా, నైతిక సూ త్రాలకు అనుగుణంగా, సురక్షితంగా, విశ్వసనీ యంగా, అదే సమయంలో ఎలాంటి వివక్షకూ తావు లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం.
⇒ ఏఐని ప్రజలకు, మొత్తంగా ప్రపంచానికి విశ్వసనీయ సుస్థిరాభివృద్ధి చోదక శక్తిగా తీర్చిదిద్దడం.
⇒ మానవ హక్కులను, లింగ సమానత్వాన్ని, భాషాపరమైన వైవిధ్యాన్ని, మేధో సంపత్తి హక్కులను అన్ని విధాలా పరిరక్షించడం.
ముప్పుపై ఆందోళనలు
నానాటికీ పెరిగిపోతున్న ఏఐ వాడకంతో పలు కీలక రంగాల్లో తలెత్తగల ముప్పుపై శిఖరాగ్రంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా రక్షణ, యుద్ధతంత్రం తదితరాల్లో ఏఐ అంతిమంగా మానవ నియంత్రణ పరిధినే దాటిపోకుండా చూ డాలని నాటో కమాండర్ అడ్మిరల్ పియరీ వాండి యర్ అన్నారు. లేదంటే చూస్తుండగానే వ్యవహారం చేయి దాటిపోవచ్చని హెచ్చరించారు. వక్తల్లో అత్యధికులు ఆయన వాదనతో ఏకీభవించారు.
‘ఇన్వెస్ట్‌ఏఐ’కి 200 బిలియన్ డాలర్లు: ఈయూ
కృత్రిమ మేధ రంగంపై అత్యంత భారీగా పెట్టుబడుల దిశగా యూరప్ శరవేగంగా సాగుతోంది. ఇందుకు ఉద్దేశించిన ‘ఇన్వెస్ట్‌ఏఐ’ కార్యక్రమానికి యూరప్‌వ్యాప్తంగా ఇప్పటికే ఏకంగా 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమకూరినట్టు కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్ ప్రకటించారు.
మోదీ చెప్పింది అక్షరసత్యం
ప్రధానికి వాన్స్ అభినందనలు
కృత్రిమ మేధ మనిషికి ఏనాటికీ ప్రత్యామ్నాయం కాబోదన్న ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. పారిస్ ఏఐ శిఖరాగ్రంలో మోదీ మాట్లాడుతూ మానవ ఉత్పాదనను మరింతగా పెంచేందుకు, వారికి మరింత స్వేచ్ఛ అందించేందుకు సమర్థమైన పరికరంగా ఏఐ తోడ్పడుతుందని అభిప్రా యపడ్డారు. అనంతరం మాట్లాడిన వాన్స్ ప్రధా ని వ్యాఖ్యలను పూర్తిగా సమర్థించారు. ‘‘మోదీ కీలకమైన అంశాలు లేవనెత్తారు. వాటిపై వాస్తవి క వైఖరిని చక్కగా, సమర్థంగా వెల్లడించారు. అందుకు ఆయనకు అభినందనలు’’ అంటూ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment