ఏఐతో ఉద్యోగాలు పోవు..: ప్రధాని మోదీ | PM Narendra Modi Comments At Paris AI Summit | Sakshi
Sakshi News home page

ఏఐతో ఉద్యోగాలు పోవు..: ప్రధాని మోదీ

Published Wed, Feb 12 2025 3:23 AM | Last Updated on Wed, Feb 12 2025 3:23 AM

PM Narendra Modi Comments At Paris AI Summit

పారిస్‌ ఏఐ సమ్మిట్‌లో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

కృత్రిమ మేధ వాడకం వల్ల కేవలం ఉద్యోగాల స్వభావమే మారుతుంది 

కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి.. అందుకుతగ్గ నైపుణ్యాలు సాధించాలి 

పారిస్‌ ఏఐ యాక్షన్‌ సమ్మిట్‌–2025లో యువతకు ప్రధాని మోదీ ఉద్బోధ

ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని విస్తృతి, వేగంతో ఏఐ అభివృద్ధి చెందుతోందని వెల్లడి 

ఓపెన్‌సోర్స్‌ ఏఐ వాడకంలో ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పన కోసం ఉమ్మడి కసరత్తు తప్పనిసరని స్పష్టీకరణ 

‘ఏఐ ఫౌండేషన్‌’, ‘సుస్థిర ఏఐ మండలి’ ఏర్పాటు నిర్ణయంపై హర్షం 

తదుపరి ఏఐ యాక్షన్‌ సమ్మిట్‌కు ఇండియా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన

ఏఐ సామర్థ్యానికి అటూఇటూ
కృత్రిమ మేధ సామర్థ్యం ఎంతో పెరిగింది. ఒక ఏఐ యాప్‌లోకి వైద్య నివేదికను అప్‌లోడ్‌ చేస్తే అది వైద్యపరిభాషలోని సాంకేతిక అంశాలను పక్కనపెట్టి మనకు అర్థమయ్యే సరళమైన భాషలో నివేదిక సారాంశాన్ని సులువుగా వివరించగలదు. అదే సమయంలో ఏఐ పరిమితులను కూడా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు అదే యాప్‌ను ఎడమ చేత్తో రాస్తున్న వ్యక్తి చిత్రాన్ని గీయమంటే అది దాదాపుగా కుడి చేత్తో రాస్తున్న వ్యక్తి బొమ్మ గీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏఐ రంగంలో నూతన ఆవిష్కరణలు, ఏఐ పాలన గురించి లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. 
– ప్రధాని మోదీ 

పారిస్‌: అన్ని రంగాల్లోకి దూసుకొస్తున్న కృత్రిమ మేధ (ఏఐ)తో ఉద్యోగాలు మాయమవుతాయన్న భయాలను ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికగా పటాపంచలు చేశారు. సాంకేతికత వాడ కం వల్ల ఉద్యోగాలు కనుమరుగుకావని తేల్చిచెప్పారు. కేవలం ఉద్యోగాల స్వభావమే మారుతుందని స్పష్టం చేశారు. ఏఐ వాడకంతో కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయని వెల్లడించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌తో కలిసి మంగళవారం ఏఐ యాక్షన్‌ సమ్మిట్‌–2025కు సహాధ్యక్షత వహించిన ప్రధాని మోదీ ఈ అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. 

ఏఐ ఆధారిత భవిష్యత్తులో రాణించాలంటే నైపుణ్యాలను పెంచుకోవడం, వాటికి మెరుగులు దిద్దుకోవడంపై యువత దృష్టిపెట్టాలని సూచించారు. అదే సమయంలో ఓపెన్‌సోర్స్‌ ఆధారిత ఏఐ వినియోగంలో ప్రజావిశ్వాసం, పారదర్శకత పెంచేలా, ఈ రంగంలో వివక్షను రూపుమాపేలా ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పనకు ఉమ్మడి చర్యలు చేపట్టాల్సిన అవసరం కచ్చితంగా ఉందన్నారు.  

చరిత్ర చెప్పేది అదే.. 
‘కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయనేది అత్యధికం మందిని కలవరపరిచే అంశం. కానీ టెక్నాలజీ వల్ల పని మాయం కాదని చరిత్ర చాటిచెప్పింది. కేవలం పని స్వభావం మారి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అందుకు తగ్గట్లుగా మనల్ని మనం మలుచుకోవాలి. నైపుణ్యాలకు పదును పెట్టుకోవాలి. కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి’అని మోదీ సూచించారు. ఈ శతాబ్దిలో కృత్రిమ మేధ మానవాళికి కోడ్‌ను రాస్తోందని.. కానీ మానవ చరిత్రలోని ఇతర మైలురాళ్లకన్నా ఇది ఎంతో విభిన్నమైనదన్నారు. 

‘‘ఏఐ ఇప్పటికే మన రాజకీయ, ఆర్థిక, భద్రతా రంగాలతోపాటు సమాజాన్ని పునరి్నరి్మస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలను మెరుగుపరచడం ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాలను ఏఐ మార్చగలదు. ఇంకెన్నింటినో చేయగలదు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మరింత సులభంగా, వేగంగా చేరుకోవడంలో దోహదపడగలదు. ఇందుకోసం మనం మన వనరులు, ప్రతిభను ఏకం చేయాలి’అని మోదీ పేర్కొన్నారు.

ఏఐలో భారత్‌ సత్తా.. 
ఓపెన్‌ నెట్‌వర్క్, యాక్సెసబుల్‌ నెట్‌వర్క్‌ సాయంతో తక్కువ ఖర్చుతోనే భారత్‌ 140 కోట్ల మందికిపైగా ప్రజల డిజిటల్‌పరమైన మౌలిక వసతులను విజయవంతంగా అభివృద్ధి చేసిందని ప్రధాని మోదీ తెలిపారు. ‘ప్రజాపయోజనాల కోసం మేం ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. భారత్‌లోని భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సొంతంగా లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (ఎల్‌ఎల్‌ఎం)ను అభివృద్ధి చేస్తున్నాం’అని మోదీ తెలిపారు. స్టార్టప్‌లు, పరిశోధకులకు అందుబాటు ధరలో సాంకేతిక వనరులను అందించేందుకు ప్రత్యేకమైన ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిని భారత్‌ అభివృద్ధి చేసిందన్నారు. 

ఏఐ భవిత ఉన్నతంగా, అందరికీ అందుబాటులో ఉండే విషయంలో భారత్‌ తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని ప్రపంచంతో పంచుకొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. డేటా సాధికారత, పరిరక్షక వ్యవస్థ ద్వారా డేటా శక్తిని అందిపుచ్చుకుందని వివరించారు. ‘మేం డిజిటల్‌ కామర్స్‌ను ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేశాం. 

భారత్‌ తీసుకొచ్చిన నేషనల్‌ ఏఐ మిషన్‌కు ఈ దృక్పథమే పునాది. మా హయాంలో జీ20 దేశాలకు సారథ్యం వహించినప్పుడు కృత్రిమ మేధ వాడకం బాధ్యతాయుతంగా ఉండేలా, అందరి మంచికి ఉపయోగపడాలనే విషయంలో ఏకాభిప్రాయం సాధించాం. ప్రస్తుతం ఏఐ వినియోగం, డేటా గోప్యతకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనడంలో భారత్‌ ముందుంది’అని మోదీ తెలిపారు. 

ఏఐ మార్గదర్శకాలపై ఉమ్మడి కసరత్తు ఉండాల్సిందే 
ఓపెన్‌ సోర్స్‌ ఆధారిత ఏఐ వినియోగానికి సంబంధించిన ప్రపంచ మార్గదర్శకాల రూపకల్పన కోసం ఉమ్మడి చర్యలు అవసరమని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ప్రజావిశ్వాసాన్ని, పారదర్శకతను పెంపొందించడంలో, వివక్షను చెరిపేయడంలో ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ‘కనీవినీ ఎరుగని విస్తృతి, వేగంతో ఏఐ అభివృద్ధి చెందుతోంది. అంతకన్నా వేగంగా ఏఐ వినియోగం కొనసాగుతోంది. దీనికితోడు దేశాలకు అతీతంగా ఏఐ రంగంలో పరస్పర ఆధారం పెరుగుతోంది. 

ఈ నేపథ్యంలో ఉమ్మడి విలువలను కాపాడుకోవడంతోపాటు ఏఐపై భయాలను పారద్రోలేందుకు, ప్రజావిశ్వాసం చూరగొనేందుకు దోహదపడే ప్రమాణాలను నెలకొల్పాలి. అందుకు ప్రపంచ దేశాలు ఉమ్మడి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది’అని ప్రధాని మోదీ సూచించారు. మేధస్సుపరంగా మనిషికన్నా యంత్రాలు ఎంతో ముందుంటాయని కొందరు ఆందోళన చెందుతుంటారు. కానీ మన ఉమ్మడి భవిత, గమ్యం విషయంలో మనుషులమైన మనం తప్ప ఇంకెవరూ కీలకపాత్ర పోషించలేరు’అని మోదీ పేర్కొన్నారు. 

తదుపరి ఏఐ యాక్షన్‌ సమ్మిట్‌ నిర్వహణకు సిద్ధం: మోదీ 
తదుపరి ఏఐ యాక్షన్‌ సమ్మిట్‌ను భారత్‌లో నిర్వహించేందుకు ప్రధాని మోదీ ముందుకొచ్చారు. ఈ మేరకు పారిస్‌లో జరిగిన ఏఐ యాక్షన్‌ సమ్మిట్‌–2025లో ప్రతిపాదన చేశారు. సదస్సు ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఏఐ దృక్పథం, ఉద్దేశంలో భాగస్వామ్య పక్షాల మధ్య స్పష్టమైన ఐకత్యను చాటేలా చర్చలు జరిగాయి. ఈ ప్రక్రియకు మరింత ఉత్సాహం తెచ్చేందుకు తదుపరి యాక్షన్‌ సమ్మిట్‌ను భారత్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం’అని పేర్కొన్నారు. 

మరోవైపు ‘ఏఐ ఫౌండేషన్‌’, ‘సుస్థిర ఏఐ మండలి’ని ఏర్పాటు చేయాలన్న సదస్సు నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. ఈ విషయంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ చొరవను అభినందించిన మోదీ.. భారత్‌ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు. అదే సమయంలో ‘ఏఐ కోసం ప్రపంచ భాగస్వామ్యం’స్వభావరీత్యా సైతం నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఉండాలని ఆకాంక్షించారు. దక్షిణాది దేశాలను ఇందులో సమ్మిళితం చేయాలని.. ఆయా దేశాల అవసరాలు, ఆందోళనలు, ప్రాధాన్యతలను గుర్తించాలని సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement