![PM Narendra Modi meets French President Macron in Paris](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/100220251.jpg.webp?itok=Ev2PoXmE)
మూడు రోజులు పర్యటన
అధ్యక్షుడు మాక్రాన్‌తో విందు
రేపు అమెరికాకు, ట్రంప్‌తో భేటీ
న్యూఢిల్లీ: ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. రక్షణ మంత్రి సెబ్ లెకొర్నూ ఆయనకు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం దారి పొడవునా, హోటల్ వద్ద బారులు తీరిన భారతీయుల సమూహానికి మోదీ అభివాదం చేశారు. సాయంత్రం మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విందు ఇచ్చారు. పలు దిగ్గజ టెక్ కంపెనీల సీఈఓలు కూడా విందులో పాల్గొన్నారు.
పారిస్‌లో జరుగుతున్న ఏఐ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సుకు మాక్రాన్‌తో కలిసి మోదీ ఆతిథ్యమిస్తున్నారు. మంగళవారం సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. అనంతరం బుధవారం చారిత్రక నగరం మార్సెయిల్‌లో భారత్ తొలి కాన్సులేట్‌ను మాక్రాన్‌తో కలిసి ప్రారంభిస్తారు. కడారచ్‌లో ఫ్రాన్స్, భారత్, పలు ఇతర దేశాలు నిర్మిస్తున్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్‌ను సందర్శిస్తారు.
![మోదీ ఫ్రాన్స్ టూర్: PM Modi](https://www.sakshi.com/s3fs-public/inline-images/fr.jpg)
తర్వాత ఫ్రాన్స్ గడ్డపై మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో ప్రాణాలర్పించిన భారత సైనికులకు మజారŠగ్స్ వార్ సిమెట్రీ వద్ద నేతలిద్దరూ నివాళులర్పిస్తారు. అనంతరం మోదీ అమెరికా బయల్దేరి వెళ్తారు. ప్రధానిగా ఫ్రాన్స్‌లో మోదీకి ఇది ఆరో అధికారిక పర్యటన. గతేడాది భారత్–ఫ్రాన్స్ తమ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పాతికేళ్ల వేడుక జరుపుకున్నాయి. ఇరు దేశాల భాగస్వామ్యం ఇన్నొవేషన్లు, టెక్నాలజీ, మారిటైం, రక్షణ సహకారం, ఉగ్రవాదంపై పోరు, ఆరోగ్యం, సంప్రదాయేతర ఇంధన వనరులతో పాటు పలు రంగాలకు విస్తరించిందని విదేశాంగ శాఖ ఈ సందర్భంగా ఒక ప్రకటనలో పేర్కొంది. మాక్రాన్ ఆహా్వనం మేరకు మోదీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు.
యూఎస్‌తో బంధం బలోపేతం
తన అమెరికా పర్యటన ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని మోదీ ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘టెక్నాలజీ, వర్తకం, రక్షణ, ఇంధన, సరఫరా తదితర రంగాల్లో అమెరికాలో బంధాన్ని సుదృఢం చేసే అజెండా రూపకల్పనకు నా పర్యటన దోహదం చేయనుంది. ట్రంప్ తొలి హయాంలో పలు అంశాలపై ఆయనతో సన్నిహితంగా కలిసి పని చేశా. ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి భేటీ అవబోతున్నా. నా మిత్రున్ని కలిసేందుకు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా’’ అంటూ ఫ్రాన్స్ బయల్దేరే ముందు ఎక్స్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment