నేటి నుంచి ఫ్రాన్స్‌లో... ప్రధాని మోదీ పర్యటన | PM Narendra Modi to attend Bastille Day celebrations in France | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఫ్రాన్స్‌లో... ప్రధాని మోదీ పర్యటన

Published Thu, Jul 13 2023 6:27 AM | Last Updated on Thu, Jul 13 2023 6:27 AM

PM Narendra Modi to attend Bastille Day celebrations in France - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేటి నుంచి రెండు రోజులపాటు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. అధికారిక పర్యటన వివరాలు బుధవారం వెల్లడయ్యాయి. పారిస్‌ నగరంలో జూలై 14వ తేదీన జరిగే బాస్టిల్‌ డే పరేడ్‌లో ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈ కవాతులో భారత త్రివిధ దళాలకు చెందిన బృందం పాల్గొననుంది. ప్రధాని అయ్యాక మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఐదోసారి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ఆహ్వానం మేరకు మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాక్రాన్‌ మోదీకి ఫ్రాన్స్‌ అధికార విందుతోపాటు ప్రత్యేక ఆతిథ్య విందు ఇవ్వనున్నారు.

ఈ సందర్భంగా ఇరుదేశాల అగ్రనేతలు విస్తృతస్థాయి అంశాలపై చర్చలు జరపనున్నారు. తర్వాత ఫ్రాన్స్‌ సెనేట్, నేషనల్‌ అసెంబ్లీ అధ్యక్షులనూ మోదీ కలుస్తారు. అక్కడి భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్‌ పారిశ్రామికవేత్తలు, భారతీయ సీఈవోలు, అక్కడి ప్రముఖులను కలుస్తారు. ‘ఇండియా–ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆరంభమైన ప్రధాని మోదీ పర్యటన ఇరుదేశాల భిన్నరంగాల భాగస్వామ్యాన్ని కొత్త పుంతలు తొక్కించనుంది’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. సాంస్కృతిక, శాస్త్రీయ, విద్య, ఆర్థిక, రక్షణ రంగాల్లో పరస్పర భాగస్వామ్యంపై చర్చించనున్నారు.

‘ నేవీ వేరియంట్‌ 26 రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలుతోపాటు ఇరుదేశాలు సంయుక్తంగా విమాన ఇంజిన్‌ను భారత్‌లో తయారుచేసే ఒప్పందం ఖరారుకావచ్చు’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ ఖ్వాత్రా చెప్పారు. ఫ్రాన్స్‌ గణతంత్ర వేడుకలుగా భావించే బాస్టిల్‌ డే కవాతులో పాల్గొనేందుకు ఇప్పటికే 269 మంది సభ్యుల త్రివిధ దళ బృందం సీ–17 గ్లోబ్‌మాస్టర్‌ యుద్ధసరుకు రవాణా విమానంలో పారిస్‌కు చేరుకుంది. ఛాంప్స్‌ ఎలీసెస్‌ చారిత్రక ప్రాంత గగనతలంలో ఫ్రెంచ్‌ యుద్ధవిమానాలకు తోడు భారత రాఫెల్‌ ఫైటర్‌జెట్‌లు ఫ్లైపాస్ట్‌లో పాల్గొననున్నాయి.  

తిరుగుప్రయాణంలో యూఏఈలో పర్యటన
ఫ్రాన్స్‌ పర్యటన తర్వాత తిరుగుప్రయాణంలో జూలై 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లో పర్యటించనున్నారు. యూఏఈ అధ్యక్షులు, అబుదాబీ పాలకుడు అయిన షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జయేద్‌ అల్‌ నహ్యాన్‌తో ఈ సందర్భంగా మోదీ భేటీ కానున్నారు. సంస్కృతి, ఇంధనం, ఆహార భద్రత, రక్షణ, ఫిన్‌టెక్, విద్య, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత పటిష్టం చేసుకోవడంపై ఇరుదేశాధినేతలు చర్చించనున్నారు. ‘కాప్‌–28కు యూఏఈ, జీ20కి భారత్‌ సారథ్యం వహిస్తున్న ఈ తరుణంలో అగ్రనేతలు అంతర్జాతీయ అంశాలపైనా చర్చలు జరపనున్నారు’ అని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement