Bastille Day military parade
-
‘ఫ్రెంచి పరేడ్’కు ‘రాఫెల్ పాసు’!
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పదం కోసం ఫ్రాన్స్‌లో పర్యటించడం ద్వారా బాస్టిల్ డే కవాతులో పాల్గొనే అవకాశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సంపాదించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘‘మణిపూర్‌లో ఓ వైపు విద్వేషాగ్ని వ్యాపిస్తోంది. ఈ అంశాన్ని యూరప్ పార్లమెంట్ కూడా పట్టించుకుని చర్చకు పెట్టింది! కానీ మన ప్రధాని మాత్రం అసలేం పట్టనట్లు కూర్చున్నారు. మణిపూర్‌పై ఇంతవరకు ఒక్కమాటా మాట్లాడలేదు. పైగా రాఫెల్ ఒప్పందంతో పారిస్‌లో బాస్టిల్ డే కవాతులో పాల్గొనే పాస్ సంపాదించారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా, ‘‘1997లో రిచర్డ్ నెల్సన్ ‘ది మూన్ అండ్ ది గెట్టో’ అని ఒక వ్యాసం రాశారు. అందులో ఏముందంటే.. అద్భుత సాంకేతికత సాధించిన అమెరికా చంద్రుడిపై కాలుమోపింది. కానీ స్వదేశంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కనుగొనలేకపోయింది. ఇప్పుడు ఆ వ్యాసాన్ని భారత్‌లో మాత్రం ‘ది మూన్ అండ్ మణిపూర్’గా చదువుకోవాలి’’ అని విమర్శించారు. విసుగెత్తిన యువరాజు: బీజేపీ కౌంటర్ రాహుల్ విమర్శలపై బీజేపీ నేత స్మృతి ఇరానీ స్పందించారు. ‘ఫ్రాన్స్‌లో నిరసనలు, అల్లర్ల విషయాన్ని ప్రస్తావించని ఈయూ పార్లమెంట్.. భారత్‌లో మణిపూర్ అంశంపై చర్చకు సిద్దమవుతాయి. ఇదే రాహుల్ ఆశించేది. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ఆయన కోరుకుంటున్నారు. ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారంతో మోదీని సత్కరించడంతో విసుగు చెందిన యువరాజు ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలను తుంగలో తొక్కుతున్నారు. ప్రజలు తిరస్కరించిన రాహుల్ రక్షణ ఒప్పందాలు తమ హయాంలో జరగలేదే అని తెగ బాధపడిపోతున్నారు’ అని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇన్నేళ్లూ మణిపూర్ సమస్యను అపరిష్కృతంగా తయారుచేసిన ఘనత కాంగ్రెస్‌దే అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘లైంగిక వేధింపులపై ఉద్యమిస్తున్న మహిళా అథ్లెట్లకు ఈ మహిళా నేత కనీస మద్దతు ఇవ్వరు. కానీ రాహుల్‌పై విమర్శలకు రెడీ అవుతారు’’ అంటూ స్మృతీపై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే విమర్శలు గుప్పించారు. -
నేటి నుంచి ఫ్రాన్స్‌లో... ప్రధాని మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేటి నుంచి రెండు రోజులపాటు ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. అధికారిక పర్యటన వివరాలు బుధవారం వెల్లడయ్యాయి. పారిస్ నగరంలో జూలై 14వ తేదీన జరిగే బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. ఈ కవాతులో భారత త్రివిధ దళాలకు చెందిన బృందం పాల్గొననుంది. ప్రధాని అయ్యాక మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఐదోసారి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాక్రాన్ మోదీకి ఫ్రాన్స్ అధికార విందుతోపాటు ప్రత్యేక ఆతిథ్య విందు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల అగ్రనేతలు విస్తృతస్థాయి అంశాలపై చర్చలు జరపనున్నారు. తర్వాత ఫ్రాన్స్ సెనేట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులనూ మోదీ కలుస్తారు. అక్కడి భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలు, భారతీయ సీఈవోలు, అక్కడి ప్రముఖులను కలుస్తారు. ‘ఇండియా–ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆరంభమైన ప్రధాని మోదీ పర్యటన ఇరుదేశాల భిన్నరంగాల భాగస్వామ్యాన్ని కొత్త పుంతలు తొక్కించనుంది’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. సాంస్కృతిక, శాస్త్రీయ, విద్య, ఆర్థిక, రక్షణ రంగాల్లో పరస్పర భాగస్వామ్యంపై చర్చించనున్నారు. ‘ నేవీ వేరియంట్ 26 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుతోపాటు ఇరుదేశాలు సంయుక్తంగా విమాన ఇంజిన్‌ను భారత్‌లో తయారుచేసే ఒప్పందం ఖరారుకావచ్చు’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా చెప్పారు. ఫ్రాన్స్ గణతంత్ర వేడుకలుగా భావించే బాస్టిల్ డే కవాతులో పాల్గొనేందుకు ఇప్పటికే 269 మంది సభ్యుల త్రివిధ దళ బృందం సీ–17 గ్లోబ్‌మాస్టర్ యుద్ధసరుకు రవాణా విమానంలో పారిస్‌కు చేరుకుంది. ఛాంప్స్ ఎలీసెస్ చారిత్రక ప్రాంత గగనతలంలో ఫ్రెంచ్ యుద్ధవిమానాలకు తోడు భారత రాఫెల్ ఫైటర్జెట్లు ఫ్లైపాస్ట్‌లో పాల్గొననున్నాయి. తిరుగుప్రయాణంలో యూఏఈలో పర్యటన ఫ్రాన్స్ పర్యటన తర్వాత తిరుగుప్రయాణంలో జూలై 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో పర్యటించనున్నారు. యూఏఈ అధ్యక్షులు, అబుదాబీ పాలకుడు అయిన షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్తో ఈ సందర్భంగా మోదీ భేటీ కానున్నారు. సంస్కృతి, ఇంధనం, ఆహార భద్రత, రక్షణ, ఫిన్‌టెక్, విద్య, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత పటిష్టం చేసుకోవడంపై ఇరుదేశాధినేతలు చర్చించనున్నారు. ‘కాప్–28కు యూఏఈ, జీ20కి భారత్ సారథ్యం వహిస్తున్న ఈ తరుణంలో అగ్రనేతలు అంతర్జాతీయ అంశాలపైనా చర్చలు జరపనున్నారు’ అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. -
డేగలతో పరేడ్!
మంగళవారం పారిస్‌లో సంప్రదాయ బాస్టిల్లే డే మిలటరీ పరేడ్‌లో డేగలతో మెక్సికన్ ఆర్మీ సైనికులు కవాతు చేస్తున్న దృశ్యమిది. డేగలకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చి, వాటిని వేటకు ఉపయోగించుకునే ఈ దళాన్ని ‘ఫాల్కనర్స్’గా పిలుస్తారు.