న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పదం కోసం ఫ్రాన్స్‌లో పర్యటించడం ద్వారా బాస్టిల్ డే కవాతులో పాల్గొనే అవకాశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సంపాదించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘‘మణిపూర్‌లో ఓ వైపు విద్వేషాగ్ని వ్యాపిస్తోంది. ఈ అంశాన్ని యూరప్ పార్లమెంట్ కూడా పట్టించుకుని చర్చకు పెట్టింది! కానీ మన ప్రధాని మాత్రం అసలేం పట్టనట్లు కూర్చున్నారు. మణిపూర్‌పై ఇంతవరకు ఒక్కమాటా మాట్లాడలేదు.
పైగా రాఫెల్ ఒప్పందంతో పారిస్‌లో బాస్టిల్ డే కవాతులో పాల్గొనే పాస్ సంపాదించారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ కూడా, ‘‘1997లో రిచర్డ్ నెల్సన్ ‘ది మూన్ అండ్ ది గెట్టో’ అని ఒక వ్యాసం రాశారు. అందులో ఏముందంటే.. అద్భుత సాంకేతికత సాధించిన అమెరికా చంద్రుడిపై కాలుమోపింది. కానీ స్వదేశంలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కనుగొనలేకపోయింది. ఇప్పుడు ఆ వ్యాసాన్ని భారత్‌లో మాత్రం ‘ది మూన్ అండ్ మణిపూర్’గా చదువుకోవాలి’’ అని విమర్శించారు.
విసుగెత్తిన యువరాజు: బీజేపీ కౌంటర్
రాహుల్ విమర్శలపై బీజేపీ నేత స్మృతి ఇరానీ స్పందించారు. ‘ఫ్రాన్స్‌లో నిరసనలు, అల్లర్ల విషయాన్ని ప్రస్తావించని ఈయూ పార్లమెంట్.. భారత్‌లో మణిపూర్ అంశంపై చర్చకు సిద్దమవుతాయి. ఇదే రాహుల్ ఆశించేది. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ఆయన కోరుకుంటున్నారు. ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారంతో మోదీని సత్కరించడంతో విసుగు చెందిన యువరాజు ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలను తుంగలో తొక్కుతున్నారు.
ప్రజలు తిరస్కరించిన రాహుల్ రక్షణ ఒప్పందాలు తమ హయాంలో జరగలేదే అని తెగ బాధపడిపోతున్నారు’ అని స్మృతి ఇరానీ ఆరోపించారు. ఇన్నేళ్లూ మణిపూర్ సమస్యను అపరిష్కృతంగా తయారుచేసిన ఘనత కాంగ్రెస్‌దే అని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘లైంగిక వేధింపులపై ఉద్యమిస్తున్న మహిళా అథ్లెట్లకు ఈ మహిళా నేత కనీస మద్దతు ఇవ్వరు. కానీ రాహుల్‌పై విమర్శలకు రెడీ అవుతారు’’ అంటూ స్మృతీపై కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment