మీరు ప్రధాని మోదీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ‘చాయ్ పే చర్చ’ వీడియో చూశారా? అందులో ఓ విషయం గమనించారా? మోదీ హిందీలో మాట్లాడుతుంటే.. అది అర్థమవుతున్నట్లు బిల్‌గేట్స్ తలాడించడం, తిరిగి బదులివ్వడం చేశారు. బిల్‌గేట్స్‌కు హిందీ రాదుగా.. మరి ఇదెలా సాధ్యమైంది? ఈ చర్చలో వారు ప్రధానంగా మాట్లాడుకున్న ఏఐ (కృత్రిమ మేథ)దే ఈ మాయ అంతా. అంటే ఏఐ సాయంతో అప్పటికప్పుడు రియల్ టైంలో ఆంగ్లంలోకి అనువాదమైపోవడమన్న మాట. ఇంతకు ముందు కూడా.. అంటే.. గతేడాది డిసెంబర్‌లో వారణాసిలో జరిగిన ‘కాశీ తమిళ సంగమం’లో పాల్గొన్న ప్రధాని మోదీ... భారతీయ భాషలను రియల్ టైంలో అనువదించగల ఏఐ ఆధారిత టూల్ ‘భాషిణి’ని ఆవిష్కరించారు.
ఆపై ఆ వేదిక నుంచే దాన్ని ఉపయోగించారు కూడా. అంటే మోదీ హిందీలో మాట్లాడుతుంటే.. అది అక్కడ ఇయర్ బడ్స్ పెట్టుకున్న తమిళులకు వారి భాషలోకి అనువాదమై.. వినిపించింది. అలాగే జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ ఈ టూల్‌ను ఉపయోగించే వివిధ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా చాయ్ పే చర్చ కూడా ఇలాంటి ఏఐ ఆధారిత భాషానువాద టూల్ ద్వారానే సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. మీకో విషయం తెలుసా? త్వరలో స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్.. తమ తదుపరి మోడల్ ఐఫోన్–16లో రియల్ టైం ట్రాన్స్‌లేషన్ టూల్ సహా మరికొన్ని ఏఐ ఆధారిత ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుందట.
భాషిణి ఎలా పనిచేస్తుందంటే..
భాషిణి అనేది ఏఐ ఆధారిత భాషానువాద టూల్. యాండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల ద్వారా ఇది సులువుగా పనిచేస్తుంది. దీని సాయంతో ఎవరైనా వ్యక్తులు ఇతర భాషల వారితో మాతృ భాషలో మాట్లాడినా అది ఆయా భాషల్లోకి అప్పటికప్పుడే అనువదించేస్తుంది. దేశంలోని భిన్న భాషలు మాట్లాడే వారి మధ్య భాషా సమస్యను ఇది తొలగిస్తుంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌తోపాటు క్రౌడ్ సోర్సింగ్ ద్వారా పొందిన (భాషాదాన్) వివిధ భాషల పదాలతో తయారు చేసుకున్న డేటాతో వివిధ భాషలను అనర్గళంగా అనువదిస్తుంది. దీన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ రూపొందించింది. – సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment