Translations
-
ఇలా ‘భాషించారు’!
మీరు ప్రధాని మోదీ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ‘చాయ్ పే చర్చ’ వీడియో చూశారా? అందులో ఓ విషయం గమనించారా? మోదీ హిందీలో మాట్లాడుతుంటే.. అది అర్థమవుతున్నట్లు బిల్‌గేట్స్ తలాడించడం, తిరిగి బదులివ్వడం చేశారు. బిల్‌గేట్స్‌కు హిందీ రాదుగా.. మరి ఇదెలా సాధ్యమైంది? ఈ చర్చలో వారు ప్రధానంగా మాట్లాడుకున్న ఏఐ (కృత్రిమ మేథ)దే ఈ మాయ అంతా. అంటే ఏఐ సాయంతో అప్పటికప్పుడు రియల్ టైంలో ఆంగ్లంలోకి అనువాదమైపోవడమన్న మాట. ఇంతకు ముందు కూడా.. అంటే.. గతేడాది డిసెంబర్లో వారణాసిలో జరిగిన ‘కాశీ తమిళ సంగమం’లో పాల్గొన్న ప్రధాని మోదీ... భారతీయ భాషలను రియల్ టైంలో అనువదించగల ఏఐ ఆధారిత టూల్ ‘భాషిణి’ని ఆవిష్కరించారు. ఆపై ఆ వేదిక నుంచే దాన్ని ఉపయోగించారు కూడా. అంటే మోదీ హిందీలో మాట్లాడుతుంటే.. అది అక్కడ ఇయర్ బడ్స్ పెట్టుకున్న తమిళులకు వారి భాషలోకి అనువాదమై.. వినిపించింది. అలాగే జీ20 శిఖరాగ్ర సదస్సులోనూ ఈ టూల్‌ను ఉపయోగించే వివిధ దేశాధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా చాయ్ పే చర్చ కూడా ఇలాంటి ఏఐ ఆధారిత భాషానువాద టూల్ ద్వారానే సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు. మీకో విషయం తెలుసా? త్వరలో స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం యాపిల్.. తమ తదుపరి మోడల్ ఐఫోన్–16లో రియల్ టైం ట్రాన్స్లేషన్ టూల్ సహా మరికొన్ని ఏఐ ఆధారిత ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుందట. భాషిణి ఎలా పనిచేస్తుందంటే.. భాషిణి అనేది ఏఐ ఆధారిత భాషానువాద టూల్. యాండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌ల ద్వారా ఇది సులువుగా పనిచేస్తుంది. దీని సాయంతో ఎవరైనా వ్యక్తులు ఇతర భాషల వారితో మాతృ భాషలో మాట్లాడినా అది ఆయా భాషల్లోకి అప్పటికప్పుడే అనువదించేస్తుంది. దేశంలోని భిన్న భాషలు మాట్లాడే వారి మధ్య భాషా సమస్యను ఇది తొలగిస్తుంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌తోపాటు క్రౌడ్ సోర్సింగ్ ద్వారా పొందిన (భాషాదాన్) వివిధ భాషల పదాలతో తయారు చేసుకున్న డేటాతో వివిధ భాషలను అనర్గళంగా అనువదిస్తుంది. దీన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ రూపొందించింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఎల్లలు దాటించే కళ
నిత్యం మధుర ఫలాలు తినేవాడికి పులుపు మీద మనసు పుడుతుందట. మనిషి స్వభావాన్ని అత్యంత సన్నిహితంగా చూసినవాడు మాత్రమే చెప్పగలిగే ఈ వాక్యాన్ని కవులకే కవి అయిన కాళిదాసు పదిహేను వందల సంవత్సరాల క్రితం అన్నాడట. ఈ అట ఎందుకంటే, సంస్కృతంలో దీన్ని చదివినవాళ్లు ఎంతమందో మనకు తెలియదు. తక్కువమంది అని మాత్రమే నిశ్చయంగా చెప్పగలం. ఆ కాళిదాసుకు వెయ్యి సంవత్సరాల ముందు, మనిషికి శాంతిలోని సౌఖ్యాన్ని తెలియ జేయడానికి బుద్ధ భగవానుడు చెప్పాడని చెప్పేదంతా పాళీ భాషలో ఉంది. అయినా అదంతా మనకు చేరింది. బైబిల్, ఖురాన్ తమ మూలభాషలైన హీబ్రూ, అరబిక్‌లను దాటుకొని ప్రపంచ మూలమూలలకూ వ్యాపించాయి. ఒక్కమాటలో దీనంతటికీ కారణం: అనువాదం. గ్రీకు సోక్రటీసు మనకు సన్నిహితుడే. పారశీక రూమీ కావాల్సినవాడే. గోర్కీ రష్యాలో రాస్తే ఇక్కడి పల్లెటూళ్లలో సమోవార్ల వెచ్చదనం అనుభవించాం. మావో చైనాలో ఏదో చెబితే మన పక్కనే ఉండి మనకు చెప్పాడనుకుని కార్యరంగంలోకి దూకాం. మపాసా ఫ్రాన్సులో చెప్పినదానికి మన చలం చెప్పేవాటితో పోలికలు వెతికాం. పక్కనే కన్నడ దేశంలో ఉన్న భైరప్ప ఏం రాశాడో; పొరుగున మరాఠా ప్రాంతంలో ఉన్న శరణ్ కుమార్ లింబాలే ఏం చేశాడో అనాయాసంగా తెలుసుకోగలం. బహుశా ప్రపంచంలోని సారస్వతం అంతా అనువాద రూపంలోనే బతికి ఉంది. ఈ ప్రపంచం నిలిచింది, వివేకవంతమైంది అనువాదంతోనే. ఒక భాషలోని రచనను ఇంకో భాషవాళ్లకు తెలియజేయాలని ఒక అనువాదకుడు ఎందుకు ఉవ్విళ్లూరుతాడో దానికి తనవైన కారణాలు ఉండొచ్చు. భావజాల వ్యాప్తి మొదలు తాను అనుభవించిన సంతోషాన్ని ఇంకొకరికి పంచడం దానికి ప్రేరేపకాలు కావొచ్చు. మూల భాషలోంచి లక్ష్య భాషలోకి ఎలా తేవాలో చెప్పడానికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఆ తెచ్చిన దాని పట్ల అన్నే నిరసనలూ ఉన్నాయి. పోయే గింజంతా పోగా మిగిలిన పొల్లు మాత్రమే అనువాదం అని చెప్పేంతగా. పూలనే కాదు, ఆ రాళ్లను ముఖాన కొట్టించుకోవడానికి కూడా అనువాదకుడు సిద్ధపడతాడు. పుష్కిన్ కవిత్వాన్ని అనువదించ లేమంటారు. ఆ కారణంగా ఎవరూ అనువాదానికే పూనుకోకపోతే, ఆ అమృతం తాగలేకపోయిన ఇతర భాషీయులకు సువాసన అయినా పీల్చే అవకాశం ఉండదు కదా. అయితే అనువాదకుల వల్ల కూడా లక్ష్యభాషలు వృద్ధి చెందాయి. కొత్త పదాలు పుట్టాయి. కొత్త వ్యక్తీకరణలు పరిచయం అయ్యాయి. ఒక్క మాటలో రచన ఒక కళ అయితే, అనువాదం దాదాపుగా అంతకు తగ్గని కళ. ఆ స్వీయాభిమానంతోనే, ఈ మధ్య కొందరు అనువాదకులు ‘ట్రాన్స్‌లేటర్స్ ఆన్ ద కవర్’ హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ఉద్యమం చేపట్టారు. ప్రచురణ సంస్థలు రచయితల పేర్లను మాత్రమే కవర్ పేజీ మీద వేస్తున్నాయనీ, తమ పేర్లను కూడా గౌరవంగా ముఖపత్రం మీద ముద్రించాలనీ లండన్‌లోని ‘ద సొసైటీ ఆఫ్ ఆథర్స్’ ప్రచారం ప్రారంభించారు. సెప్టెంబర్ 30 నాటి అంతర్జాతీయ అనువాద దినోత్సవం దీనికి ఒక ట్రిగ్గర్‌గా పనికొచ్చింది. దానికి కొనసాగింపుగా చర్చలు జరుగుతున్నాయి. రచయితల సమూహం ప్రచురణకర్తలకు బహిరంగ లేఖ రాశారు. దానికి బలం పెరిగేలా సంతకాల సేకరణ మొదలుపెట్టారు. ఎందరో ప్రసిద్ధ అనువాదకులు సమ్మతి తెలిపారు. పదకొండు వేల మంది సభ్యులున్న అమెరికాకు చెందిన ‘ఆథర్స్ గిల్డ్’ కూడా వీరికి మద్దతుగా నిలిచింది. యాభై లక్షల రూపాయల నగదు కలిగిన ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజును రచయితతో పాటు అనువాదకులకూ 2016 నుంచి సమంగా పంచుతున్నారు. ఇది అనువాద ప్రతిభను గొప్పగా గౌరవించడమే. అయితే, 2018లో ‘ఫ్లైట్స్’ పుస్తకానికి గానూ ఈ పురస్కారం గెలుచుకున్న పోలండ్ రచయిత్రి ఓల్గా తొకార్చుక్ పేరును కవర్ మీద వేశారు గానీ, దాన్ని ఆంగ్లంలోకి అనువదించిన జెన్నిఫర్ క్రాఫ్ట్ పేరును వేయలేదు. పుస్తకం లోపల వేస్తారు; కానీ చూడగానే అనువాదం అని తెలియకుండా అదో చిన్న యుక్తి అనేది కొంత మంది ప్రచురణకర్తల వాదన. అదే సంవత్సరం సాహిత్యంలో అత్యున్నత గౌరవమైన నోబెల్ పురస్కారం కూడా పొందిన తొకార్చుక్ కూడా ముఖపత్రం మీద అనువాదకుల పేరు వేయాలన్న వాదనకు మద్దతునివ్వడం గమనార్హం. భిన్న అనువాదాల్లో వెలువడే అదృష్టం ఉన్న రచయితలు కొంతమంది ఉంటారు. అలాంట ప్పుడు అడిగినా అనువాదకుల పేరు కవర్ మీద వేయడం జరగకపోవచ్చు. కానీ వారి ప్రతిభతో నిమిత్తం లేకపోయినా అనువాదం కావడమే గొప్ప అదృష్టం అయ్యే రచయితలు మరికొందరు ఉంటారు. అలాంటప్పుడు ఆ డిమాండ్ సులువుగానే అంగీకారం పొందుతుంది. అయితే రచయిత, అనువాదకుడు సమానం అవుతారా? కచ్చితంగా కాదని ఆ సంతకాలు పెడుతున్న అనువాదకులు కూడా ఒప్పుకుంటారు. రచయితకూ అనువాదకుడికీ మధ్య ఒక గౌరవప్రదమైన దూరం ఉండాలి. అయితే, కవర్ పేజీ మీద పేరు వేయడం అనేది మరింతమందిని అనువాదంలోకి దిగేలా పురిగొల్పడానికీ, ఏదో భాషలో చీకట్లో ఉండిపోయిన అద్భుతమైన రచనను ప్రపంచానికి తెలియ జెప్పడానికి కావాల్సిన డ్రైవ్ ఇవ్వడానికీ కారణం కాగలదేమో. ‘అనువాదం గనక లేకపోతే, నేను నా దేశ సరిహద్దులకే పరిమితమయ్యేవాణ్ణి’ అన్నాడు స్పానిష్ రచయిత సెర్వాంటెజ్. కదా! అందువల్లే ఆయన ‘డాన్ కిహోటీ’ మనదాకా వచ్చాడు. ప్రపంచ ఎల్లలను చెరపడంలో రచయితల కన్నా అను వాదకుల పాత్రే ఎక్కువనే విషయంలో మాత్రం ఎవరికీ సందేహం లేదు. -
గ్రేట్ రైటర్ (విలియం స్టాన్లీ మెర్విన్)
ప్రధానంగా కవి అయిన విలియం స్టాన్లీ మెర్విన్ (1927–2019) ఒకవైపు విస్తృతంగా రాస్తూనే, మరోవైపు ఇతర భాషల కవిత్వాన్ని అంతే సీరియస్‌గా అమెరికా పాఠకులకు పరిచయం చేశాడు. తన సుదీర్ఘ ప్రస్థానంలో 50కి పైగా పుస్తకాలు వెలువరించాడు. ఐదేళ్ల వయసులోనే వాళ్ల నాన్న కోసం తోచిన పాటలు కట్టేవాడు. ఒకరోజు వీధిలో ఎవరో చెట్టును కొట్టడం చూసి దాని చేతులు నరికేస్తున్నారన్నంతగా బాధపడి, ఆవేశంతో వాళ్ల మీదికి పోయాడు. తర్వాత రెడ్ ఇండియన్ల జీవితం, వాళ్ల ప్రకృతి ప్రేమ, ఆయన ఆసక్తికర అంశాలుగా మారాయి. సంపాదకుడిగా పనిచేశాడు. కాంక్రీటు నగరాల్లో బతకలేనని హవాయిలో స్థిరపడ్డాడు. వ్యవసాయం చేశాడు. చెట్లు పెంచాడు. బౌద్ధ తత్వం, పర్యావరణ ప్రియత్వం ఆయనను పట్టించే మాటలు. అనువాదాల్లోకి దిగటానికి కారణం చెప్తూ– రాయడం మొదలుపెట్టినప్పుడు భావం నీదే కానీ భాష నీదై ఉండదు. ఎప్పుడైతే అనువాదానికి కూర్చుంటామో ప్రతీ పదం మీద శ్రద్ధ పెట్టడానికి అవకాశం దొరుకుతుంది, సరైన మాటలు వాడటమంటే ఏమిటో తెలుస్తుంది, అన్నాడు. ఒక దశలో కవిత్వం ప్రధానంగా మౌఖిక సంప్రదాయంలోనిదన్న అభిప్రాయానికి వచ్చాడు. విరామ చిహ్నాలు పేజీల మీద పదాల్ని కొట్టే మేకుల్లాగా కనబడటం మొదలైంది. పదాల్ని తేలికగా వదిలెయ్యడం కోసం పంక్చువేషన్‌ను వదిలేశాడు. ద లైస్, ద క్యారియర్స్ ఆఫ్ లాడర్స్, ద రెయిన్ ఇన్ ద ట్రీస్, తొంభై ఏళ్ల వయసులో ఈ మార్చి 15న మెర్విన్ మరణించాడు. -
జీవనవేదం
ప్రతి రచయితకీ కలం అందించే చేయి ఒకటి ఉంటుంది. సాధారణంగా ఆ చేయి భార్యది అయినప్పుడే ఆ రచయిత రచనాజీవనం ఒడుదొడుకులు లేకుండా సాగిపోతుంది. దాశరథి రంగాచార్య ఎన్ని వేల పుటలు రాశారో ఆయనకే తెలియదు. కాని ఆయన అక్షరం అల్లుకుంటున్న ప్రతి సందర్భంలోనూ ఆయన భార్య కమల గొడుగు అయ్యింది. గోడ అయ్యింది. నీడ అయ్యింది. ఒక చక్కని చిరునవ్వుతో- ఇవాళ ఏదైనా రాస్తే బాగుండు అనే ఉత్సాహాన్ని కలిగించింది. కథలు, నవలలు, అనువాదాలు, వేద పరిచయాలు... తెలుగువారికి దాశరథి అందించిన సాహితీ రతనాలు ఎన్నో. కూర్చిన వచన రాశులు మరెన్నో. ఇవాళ ఆయన దిగంతాలలో దప్పికగొన్న దేవతలకు తన రచనామృతాన్ని పంచడానికి బయలుదేరి వెళ్లారు. కాని ’సాక్షి ఫ్యామిలీ’కి ఈ అపురూప జ్ఞాపకాన్ని మిగిల్చారు. గతంలో ‘బెటర్ హాఫ్’ శీర్షిక కోసం దాశరథి పంచుకున్న జ్ఞాపకాలను మరోసారి పాఠకులకు అందిస్తున్నాం. సికింద్రాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లిలోని దాశరథి రంగాచార్య నివాసంలోకి అడుగు పెడుతుండగా ఎనభై ఆరేళ్ల రంగాచార్యను ఆయన భార్య ఎనభై ఏళ్ల కమల తన రెండు చేతుల్తో పదిలంగా పొదువుకొని జాగ్రత్తగా కూర్చోబెడుతూ కనిపించారు. ఇద్దరినీ ఆ క్షణంలో చూస్తే ఫలాలు ఇచ్చీ ఇచ్చీ పరిపూర్ణతతో మిగిలిన రెండు మామిడివృక్షాలు గుర్తుకువచ్చాయి. పిందె, పత్రం, శాఖ, కాండం అన్నీ అనుభవాలను నింపుకున్నవే. భావితరాలకు విలువైనవి. భార్యను పక్కనే కూచోబెట్టుకుని పాత జ్ఞాపకాల వెలుగు కళ్లలో ప్రసరిస్తుండగా ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. ‘పెళ్లప్పుడు కమల వయసు ఆరు. నా వయసు 12. శారదా చట్టం ప్రకారం బాల్య వివాహం నేరంగా పరిగణించే రోజులు. పోలీసులొస్తే గుమ్మం దగ్గరే ఆపి, ఏదో పూజ అని చెప్పి, మా పెళ్లి చేశారు పెద్దలు. తర్వాత పదహారేళ్ల వయసులో కమల మా ఇంట అడుగు పెట్టింది. అప్పటికే కమ్యూనిస్టు ఉద్యమాలలో ఉన్నాను. జైలుకు కూడా వెళ్లాను’ అన్నారాయన. కమల అందుకున్నారు - ‘అత్తింట అడుగుపెట్టాక నాకు ఈయన గురించి అర్థమైన సంగతి ఒకటే ఒకటి. అది ఈయనకు పుస్తకాలు ఇష్టమని. టీచర్ ఉద్యోగమైతే ఇంకా చదువుకోవడానికి వ్యవధి ఉంటుందని మెట్రిక్యులేషన్ పాసై, ఆ ఉద్యోగం తెచ్చుకున్నారు కూడా. అప్పుడే నిశ్చయించుకున్నాను ఈయన చదువుకు నేనో దీపంలా మసలాలని. నాలుగైదు ఊర్లు మారి హైదరాబాద్‌కు వచ్చాం. పగలంతా ఉద్యోగం చేయడం, సాయంత్రాలు రాసుకోవడం ఈయన పని. ఇంటిపనులు, పిల్లల వ్యవహారాలు నా బాధ్యత. ముందు వైపు నుంచి చూస్తే ముఖం కనపడుతుంది. వెనుక నుంచి చూస్తే వీపు. ఏదీ ఒక దాని కంటే ఒకటి తక్కువ కాదు. రెండూ ఉంటేనే మనిషి’ అన్నారామె. ఆయన మాట కలిపారు. ‘మాకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. పిల్లల చదువులు, నా తోబుట్టువుల పెళ్లిళ్లు, కూతుళ్ల పెళ్లిళ్లు, వారి బారసాలలు.. అన్నీ కమలే చూసుకునేది. నా కోసం కుటుంబం కోసం ఇంత కష్టపడిన నా భార్యకు ఏమివ్వగలను అనిపించేది’ అని రంగాచార్య చెబుతుంటే ఆమె- ‘ఈయన షష్టిపూర్తి అయిన ఆరేళ్లకు నాకు అరవై ఏళ్లు వచ్చాయి. వెంటనే ‘మా ఆవిడకు షష్టిపూర్తి’ అని పెద్ద ఎత్తున వేడుక మొదలుపెట్టారు. ‘అదేమిటి, ఆవిడకు షష్టిపూర్తి ఏమిటి?’ అని అందరూ ఆశ్చర్యంగా ప్రశ్నించారు. అన్నేళ్లయినా మా అనురాగం పదిలం అని చెప్పడానికే అని ఈయన జవాబు. ఇంతకన్నా ఏం కావాలి’ అన్నారు సంతోషం నిండిన హృదయంతో. రంగాచార్య స్పందించారు... ‘ఇప్పుడు ఆరోగ్యం సహకరించడం లేదు. వీల్‌చెయిర్‌కే పరిమితం అయ్యాను. ఈవిడ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే! అయినా నా ఆరోగ్యం కోసం తహతహలాడుతుంది. ఈ వయసులో అంతకుమించిన బాంధవ్యం ఎవరి ద్వారా లభిస్తుంది? భార్య కాకుండా ఇలా ఎవరైనా అంతడగా నిలువగలరా’ అంటుంటే - ‘సంసారం నడపడానికి ఎన్నో పరుగులు తీశాం. ఇప్పుడు తీరిక దొరికింది. పిల్లలకు సంబంధించిన విషయాలు, రచనలు, సమకాలీన పరిస్థితులు ముచ్చటించుకుంటూ ఉంటాం. గతం తాలూకు జ్ఞాపకాలను కలబోసుకోవడంలో ఆనందాన్ని పొందుతుంటాం. మొదటినుంచి ఈయన ఏది చెప్పినా నేను ‘సరే’ అనే అన్నాను. ఆయన కూడా అంతే. అందుకే ఇన్నేళ్లలో ఒకరి మీద ఒకరం విసుక్కున్నది లేదు. కోపమన్నదే ఎరగం’ అన్నారు కమల. కాని విషాదాలు లేవా? ఆ సమయాలను ఎలా దాట గలిగారు? ఆ ప్రశ్నే అడిగితే రంగాచార్య కళ్లల్లో ఒకరమైన విచారం కమ్ముకుంది. ఆమె కళ్లల్లో పల్చటి కన్నీటి తెర. ఆయన గొంతు గద్గదమవుతుండగా జ్ఞాపకం బయటకు వచ్చింది. ‘మొదటి కాన్పు సమయంలో డెలివరీకని బెజవాడ ఆసుపత్రికి బయల్దేరాం. దారిలో ట్రెయిన్లో నొప్పులు. ఏం చేయాలో తోచలేదు. పాతరోజులు. నలుగురూ సాయం పట్టి కదులుతున్న ట్రెయిన్‌లోనే పురుడు పోశారు. కాని బిడ్డ మమ్మల్ని కరుణించలేదు. పుడుతూనే చనిపోయింది. తీవ్ర రక్తస్రావంతో ఈమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఏం చేయాలి? వేరే మార్గం కనిపించక, ఆ బిడ్డ కాయాన్ని కృష్ణానది ఒడిలో వదిలేయాల్సి వచ్చింది’ ఆ తర్వాత ఆయన మాట్లాడలేకపోయారు. ‘నేను ఎన్నిసార్లు అడిగినా మూడురోజుల వరకు బిడ్డ బతికుందనే చెప్పారు. నా ఆరోగ్యం పర్వాలేదనుకున్నాక అసలు విషయం చెప్పి ఎంతో బాధపడ్డారు’ అంటూ కమల భర్త చేతిపై తన చేయుంచారు. ఉద్యోగరీత్యా నగరానికి వచ్చాక ఇల్లు కట్టుకోవడంలో పడిన కష్టాన్ని రంగాచార్య గుర్తుచేసుకుంటూ- ‘యాభై ఏళ్ల క్రితం ఇప్పుడున్న ఈ ఇల్లు కట్టాలని నిశ్చయించుకున్నాం. అయితే ఇల్లు గోడల వరకు లేచి ఆగిపోయింది. పై కప్పు వేయడానికి పైకం లేదు. పిల్లలు చిన్నవారు. నిలవనీడ లేదు. ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇల్లు కట్టడానికి పోసిన ఇసుకలో కూర్చొని కన్నీరు పెట్టుకున్నాం. జీవితంలో దుఃఖపూరితమైన సంఘటనలు ఏవేవో వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలోనే ఆలుమగలు ఒకరికొకరు ఓదార్చు కోవాలి. పంచుకునే హృదయం తోడుంటే ఎంతటి కష్టమైనా తట్టుకొని నిలబడవచ్చు. గాలిని ఎవరైనా తట్టుకుంటారు. వానను కూడా. కాని గాలీ వానా కలగలిసి వచ్చినప్పుడు తట్టుకుని నిలుచునేవారే భార్యాభర్తలు’ అని ముగించారాయన. తిరిగి వచ్చే ముందు వారి పాదాలను తాకాలనిపించింది. కాని - వారిని కలవడమే ఒక ఆశీర్వాదం కదా అని చిర్నవ్వుతో సాగనంపుతున్న ఆ ఇరువురిని చూసినప్పుడు అనిపించింది. - సాక్షి ఫ్యామిలీ నా రచనా వ్యాసంగానికి ఎలాంటి అడ్డంకి రానివ్వని నా భార్య కమల వల్లనే నాకు పేరుప్రఖ్యాతులు, అవార్డులు, రివార్డులు అందాయి. - దాశరథి రంగాచార్య -
కొత్త పుస్తకం
నివేదన (విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ బెంగాలీ గీతం ‘కొరొ జాగొరితొ’కి పలువురు తెలుగు కవుల అనువాదాలు, అనుకరణలు) సంపాదకుడు: మోదుగుల రవికృష్ణపేజీలు: 140; వెల: 100 ప్రతులకు: నవోదయా బుక్ హౌస్, హైదరాబాద్‌తోపాటు, సంపాదకుడు, 26-19-10, ‘0’ లేన్, మెయిన్ రోడ్, ఎ.టి.అగ్రహారం, గుంటూర్-522004. ఫోన్: 09440320580 ఒక ఆనందకారణం... ఇది సమీక్ష, అభిప్రాయం కన్నా- ఒక చిన్న పరిశీలన. ముందుగా పుస్తకం గురించి. ఇరవయ్యో శతాబ్దపు ఆరంభంలో రవీంద్రనాథ్ టాగోర్ వంగభాషలో ‘చిత్తొ జెథా భొయ్షున్నొ, ఉచ్ఛొ జెథా శిర్/ గ్యాన్ జెథా ముక్తొ, జెథా గ్రిహేర్ ప్రాచీర్’ గీతం రాశాడు. ఆయనే స్వయంగా ‘గీతాంజలి’ ఆంగ్ల సంకలనంలోకి దాన్ని అనువదించుకున్నాడు. తద్వారా అది ప్రపంచవ్యాప్తంగా ఎందరికో చేరువైంది; ఎన్నో భాషల్లోకి అనువాదమైంది; అలా తెలుగులోకీ వచ్చింది. 1913లో ఆదిపూడి సోమనాథరావుతో మొదలుపెట్టి, 2014లో షేక్‌బాబ్జీ దాకా... కొంగర జగ్గయ్య, చలం, చినవీరభద్రుడు, తిరుమల రామచంద్ర, దాశరథి, బెజవాడ గోపాలరెడ్డి, మధు రొండా, మో, రాయప్రోలు; ఇలా ఎందరో ఆ గీతాన్ని అనువదించారు. అలాంటి అనువాద ప్రేరేపకమైన గీతానికి వచ్చిన 41 తెలుగు తర్జుమాలతో 2003లో బి.ఎస్.ఆర్.కృష్ణ ‘నివేదన’ సంకలనం తెచ్చారు. దానికి రెట్టింపు జోడింపులతో వచ్చిన మలిముద్రణ ఇది. ఆంగ్లపాఠం ‘వేర్ ద మైండ్ ఈజ్ వితవుట్ ఫియర్’ కూడా కలుపుకొంటే పూర్తిగా వంద అనువాదాలు ఇందులో ఉన్నట్టు లెక్క! క్లుప్తంగా అనువాదకుల పరిచయాలు కూడా ఉన్నాయి. అయితే, వంగ గీతం అర్థం కాకపోయినా అందులో ఒక తూగువుంది; చక్కగా పాడుకోగలిగే అంత్యప్రాసల లయ ఉంది; అలాంటిది ఆంగ్లంలోకి కేవలం భావమే వచ్చింది; పైగా అది చేసుకున్నది స్వయంగా రవీంద్రుడే! అంటే, సాక్షాత్తూ గురుదేవుడే ‘ఫెయిల్’ అయ్యాడంటే, మిగిలిన అనువాదకులను తప్పు పట్టడానికి ఏముంది? అంటే, ఈ ఆహారం ఏమిటి? దేనికి మంచిది? ఎన్ని క్యాలరీలున్నాయి తరహా ఎన్సైక్లోపీడిక్ సర్వస్వం బట్వాడా అవుతుందేగానీ ‘రుచి’ బదిలీ కాదన్నమాట! ఇది సమస్త అనువాదాల సమస్య అనుకుంటాను. అయితే, ఈ విషయం టాగోర్‌కీ తెలుసు, అనువాదాలు చేసే పెద్దవాళ్లందరికీ తెలుసు. ఒక మూలభాషలో పలవరించింది, పూర్తిగా ఆ భాష పాఠకులకే చెందుతుంది. అంటే ప్రతి భాషా పాఠకులకూ - ఇంకా చెప్పాలంటే, ఆ భాష మాట్లాడేవాళ్లందరికీ కూడా- తాము మాత్రమే అనుభవించగలిగే ప్రత్యేక నిధి ఏదో ఉంటుందన్నమాట! భాషల అస్తిత్వాల స్పృహతో చూస్తే, ఇది కూడా ఆనందం కలిగించే విషయమే కదా! - రాజిరెడ్డి కొత్త పుస్తకాలు వాన కురిసిన రాత్రి (కవిత్వం) రచన: డా.బండి సత్యనారాయణ పేజీలు: 112; వెల: 60 ప్రతులకు: కవి, ఆల్ ఇండియా రేడియో, విశాఖపట్నం-530003. ఫోన్: 8331841965 గుండెలవిసినచోట (కవిత్వం) రచన: సిరిసిల్లా గఫూర్‌శిక్షక్ పేజీలు: 112; వెల: 95; ప్రతులకు: తెలంగాణ రచయితల వేదిక, కేరాఫ్ జూలూరు గౌరీశంకర్, 1-8-702/33/20ఎ, పద్మ కాలనీ, నల్లకుంట, హైదరాబాద్-44. కవి ఫోన్: 9849062038 నేస్తం (కవిత్వం) రచన: అవధాని కడిమిళ్ల రమేష్ పేజీలు: 32; వెల: - ప్రతులకు: కడిమిళ్ల శ్రీవిరించి, 3-6-50, యర్రమిల్లివారి వీధి, నరసాపురం, ప.గో.-534275; ఫోన్: 9247879606 యోగసిద్ధి రచన: డా. పిట్టా సత్యనారాయణ పేజీలు: 60; వెల: 80; ప్రతులకు: పి.విజయలక్ష్మి, 24-7-199/1/1, ఎన్ఐటి దగ్గర, హన్మకొండ-4. ఫోన్: 9849812054 గర్జన (తెలంగాణ ముస్లింవాద కవిత్వం) రచన: మహమ్మద్ హనీఫ్ అలీ పేజీలు: 50; వెల: 40; ప్రతులకు: రచయిత, 5-9-68, మాన్యం చెల్క, గల్లీ, నల్గొండ. ఫోన్: 9346491023 ఉషోదయం రచన: రామదాసు వీరభద్రరావు పేజీలు: 72; వెల: 50; ప్రతులకు: రచయిత, ఎల్ఐజి 17, ఎపిహెచ్‌బి కాలనీ, రామచంద్రాపురం. తూ.గో. ఫోన్: 9542787287 హృదయాలాపన (కవిత్వం) రచన: చిత్రాడ కిషోర్‌కుమార్ పేజీలు: 60; వెల: 60; ప్రతులకు: మల్లెతీగ, 41-20/3-24, మన్నవ వారి వీధి, కృష్ణలంక, విజయవాడ-13. ఫోన్: 9246415150 స్త్రీచక్రం (నాటిక) రచన: పగడాల శ్యామ్‌సుందర్ పేజీలు: 40; వెల: 25; ప్రతులకు: 9291346318