పారిస్‌లో జరుగుతున్న తొలి సదస్సు
దేశాధినేతలు, టెక్ దిగ్గజాల హాజరు
నేడు సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగం
అమెరికా నుంచి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
అంతర్జాతీయ వేదికపై వాన్స్ అరంగేట్రం
ప్రత్యేక ఆకర్షణగా వాన్స్
పారిస్: 100కు పైగా దేశాల అధినేతలు, అగ్రనేతలు. అంతర్జాతీయ టెక్ దిగ్గజాల సారథులు. అత్యున్నత స్థాయి ప్రభుత్వాధికారులు. కృత్రిమ మేధ రంగానికి సంబంధించిన మేధావులు. నిపుణులు. సోమవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో మొదలైన రెండు రోజుల ఏఐ శిఖరాగ్ర సదస్సు వీరందరినీ ఒక్కచోట చేర్చింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఏఐ రంగానికి సంబంధించి జరుగుతున్న తొలి అధికారిక సదస్సు కావడం విశేషం. నానాటికీ అనూహ్యంగా మారిపోతున్న ఏఐ రంగంలో అపార అవకాశాలను ఒడిసిపట్టుకోవడం, అందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై సదస్సులో లోతుగా మథనం జరుగుతోంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం సదస్సును లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ టెలివిజన్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మానవాళి చరిత్రలోనే అత్యంత అరుదైందిగా చెప్పదగ్గ శాస్త్ర, సాంకేతిక విప్లవం ఏఐ రూపంలో మన కళ్లముందు కనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ‘ఈ అవకాశాన్ని ఫ్రాన్స్, యూరప్ రెండు చేతులా అందిపుచ్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే మనం మరింత మెరుగ్గా జీవించేందుకు, ఎంతగానో నేర్చుకునేందుకు, మరింత సమర్థంగా పని చేసేందుకు, మొత్తంగా గొప్పగా జీవించేందుకు అపారమైన అవకాశాలను ఏఐ అందుబాటులోకి తెస్తోంది’’అని మాక్రాన్ అభిప్రాయపడ్డారు.
అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏఐ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన 40 ఏళ్ల వాన్స్ అగ్ర రాజ్యానికి తొలిసారిగా ఓ అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. ఉపాధ్యక్షునిగా ఆయనకిదే తొలి విదేశీ పర్యటన కూడా. సదస్సులో భాగంగా పలువురు దేశాధినేతలతో ఆయన తొలిసారి భేటీ అవనున్నారు. అందులో భాగంగా మంగళవారం మాక్రాన్‌తో విందు భేటీలో పాల్గొంటారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా కల్లోలంపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృక్కోణాన్ని మాక్రాన్‌కు వివరించడంతో పాటు ఆయన సందేశాన్ని కూడా వాన్స్ అందజేస్తారని చెబుతున్నారు. తెలుగు మూలాలున్న వాన్స్ సతీమణి ఉష కూడా తన ముగ్గురు పిల్లలతో సహా ఈ అధికారిక పర్యటనలో పాల్గొంటుండటం విశేషం. చైనా తరఫున ఉప ప్రధాని జాంగ్ జువోకింగ్ ఏఐ సదస్సులో పాల్గొంటున్నారు.
మోదీ సహ ఆతిథ్యం
అంతర్జాతీయ ఏఐ రంగం అంతిమంగా అమెరికా, చైనా మధ్య బలప్రదర్శనకు వేదికగా మారకుండా చూడాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే ఐటీతో పాటు అన్నిరకాల టెక్నాలజీల్లోనూ గ్లోబల్ పవర్‌గా వెలుగొందుతున్న భారత్ ఏఐలోనూ కచి్చతంగా అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసి తీరాలని ప్రధాని మోదీ ఇటీవల పదేపదే చెబుతున్నారు. అందులో భాగంగా టెక్ దిగ్గజాలతో మరింత సన్నిహితంగా కలిసి పని చేసేందుకు పారిస్ ఏఐ శిఖరాగ్రం సదవకాశమని ఆయన భావిస్తున్నారు.
అందులో భాగంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు మాక్రాన్‌తో పాటు మోదీ సంయుక్తంగా ఆతిథ్యమిస్తుండటం విశేషం. మంగళవారం సదస్సునుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. ఏఐ వృద్ధిని కొత్త పుంతలు తొక్కించడంపై భారత ఆలోచనలను దేశాధినేతలు, టెక్, ఏఐ దిగ్గజ కంపెనీల సారథులు తదితరులతో ఆయన వివరంగా పంచుకోనున్నారు. అనంతరం ఆయా కంపెనీల సీఈఓలతో విడిగా ముఖాముఖి భేటీ కానున్నారు.
తెరపైకి ‘కరెంట్ ఏఐ’
గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్‌ఏఐ వంటి టెక్, ఏఐ దిగ్గజాల సీఈఓలు, అత్యున్నతాధికారులు సదస్సులో పాల్గొంటున్నారు. ఆరోగ్యం, విద్య, పర్యావరణం, సంస్కృతి తదితర రంగాల్లో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించడంలో ఏఐ టెక్నాలజీ పాత్రను మరింత ప్రభావవంతంగా మార్చడం తదితరాలపై వారంతా లోతుగా చర్చించనున్నారు. ఇందులో భాగంగా ‘కరెంట్ ఏఐ’పేరిట ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంలో అంతర్జాతీయ స్థాయిలో భారీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
పారిస్ శిఖరాగ్రం ఏఐకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విస్తృత చర్చ కోసం జరుగుతున్న తొట్ట తొలి ప్రయత్నమని మొజిల్లా పబ్లిక్ పాలసీ విభాగం వైస్ ప్రెసిడెంట్ లిండా గ్రిపిన్ అన్నారు. ఏఐ అభివృద్ధి ప్రస్థానంలో దీన్ని నిర్ణాయక క్షణంగా అభివరి్ణంచారు. ‘‘ఏఐపై గుత్తాధిపత్యం రూపంలో కీలక సాంకేతిక పరిజ్ఞానంపై అజమాయిషీ కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోకూడదు.
మానవాళి ప్రయోజనాలను తీర్చడమే ఏకైక ప్రాతిపదికగా ఏఐ ఫలాలు ప్రపంచమంతటికీ అందాలి’’అని యురేíÙయా గ్రూప్ సీనియర్ జియోటెక్నాలజీ అనలిస్టు నిక్ రెయినర్స్ అభిప్రాయపడ్డారు. పారిస్ శిఖరాగ్రాన్ని ఆ దిశగా భారీ ముందడుగుగా అభివర్ణించారు. శిఖరాగ్రం వేదికగా ఏఐ రంగంలో యూరప్‌లో భారీ పెట్టుబడి ప్రకటనలు వెలువడుతాయని అక్కడి దేశాలు ఆశిస్తున్నాయి. వచ్చే కొన్నేళ్లలో ఏఐ రంగంలో ఫ్రాన్స్ ఏకంగా 113 బిలియన్ డాలర్ల మేరకు ప్రైవేట్ పెట్టుబడులను ప్రకటించనున్నట్టు మాక్రాన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment