మస్క్‌పై వ్యతిరేకత.. టెస్లా షోరూంలపై కొనసాగుతున్న దాడులు | Elon Musk Tesla Oregon Showroom Incident March Latest News | Sakshi
Sakshi News home page

మస్క్‌పై వ్యతిరేకత.. టెస్లా షోరూంలపై కొనసాగుతున్న దాడులు

Published Sat, Mar 15 2025 9:18 AM | Last Updated on Sat, Mar 15 2025 10:02 AM

Elon Musk Tesla Oregon Showroom Incident March Latest News

సలమ్‌: అమెరికాలో టెస్లా షోరూంపై మళ్లీ దాడి జరిగింది.  ఒరెగాన్‌లోని షోరూమ్‌పై గురువారం కొందరు దుండగులు కాల్పులకు దిగారు. ఈ దాడిలో షోరూం అద్దాలు ధ్వంసం కాగా.. పలు వాహనాలు సైతం దెబ్బ తిన్నాయి. అయితే అదృష్టం కొద్దీ ఎవరికీ హాని జరగలేదు. వారం వ్యవధిలో ఇదే షోరూమ్‌పై ఇలా దాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 

డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో ఇలాన్‌ మస్క్‌(Elon Musk) కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే ఆయన డోజ్‌ ఓవెల్‌ ఆఫీస్‌లో అడుగుపెట్టారో.. అప్పటి నుంచి ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. డోజ్‌(DOGE) చీఫ్‌ పేరిట ఫెడరల్‌ ఉద్యోగుల తొలింపు చర్యలతో ఆ వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆయన సీఈవోగా వ్యవహరిస్తున్న టెస్లా కంపెనీ లక్ష్యంగా వరుసగా దాడులు జరుగుతున్నాయి.  

మార్చి 6వ తేదీన ఒరెగాన్‌(Oregon) పోర్ట్‌లాండ్‌ సబర్బ్‌ అయిన టిగార్డ్‌లోని టెస్లా డీలర్‌షిప్‌పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో పలు ఈవీ వాహనాలు ధ్వంసం అయ్యాయి. 

  • కొలరాడో లవ్‌ల్యాండ్‌లోని షోరూమ్‌ను ఓ మహిళ ధ్వంసం చేసింది. ఆపై మస్క్‌ వ్యతిరేక రాతలు రాసి.. బొమ్మలు గీసింది

  • బోస్టన్‌లోని టెస్లా ఛార్జింగ్‌ స్టేషన్‌కు దుండగుల నిప్పు

  • సియాటెల్‌లో టెస్లా వాహనాలకు మంట పెట్టిన ఆగంతకులు

  • వాషింగ్టన్‌ లీన్‌వుడ్‌లో టెస్లా సైబర్‌ ట్రక్కులపై స్వస్తిక్‌ గుర్తులతో పాటు మస్క్‌ వ్యతిరేక రాతలు

  • మార్చి 13వ తేదీన.. ఒరెగాన్‌ టిగార్డ్‌ షోరూంపై మరోసారి కాల్పులు.. షోరూం ధ్వంసం

వారం వ్యవధిలో రెండుసార్లు ఒరెగాన్‌ షోరూంపై దాడి జరిగింది. దీంతో ఎఫ్‌బీఐ, ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో పని చేస్తామని పోలీసులు ప్రకటించారు. మరోవైపు టెస్లాపై జరుగుతున్న దాడులను దేశీయ ఉగ్రవాదంగా(Domestic Terrorism) అభివర్ణించిన ట్రంప్‌.. ఘటనలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని చెబుతున్నారు. ఇలాంటి చర్యలు ఓ గొప్ప కంపెనీకి తీరని నష్టం కలిగిస్తాయని.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు మస్క్‌ కంపెనీలు అందిస్తున్న సేవలు మరిచిపోకూడదని ట్రంప్‌ చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement