ఒప్పంద బాధ్యతలను విస్మరించింది
జేపీ గ్రూప్‌పై ఎఫ్-1 బాస్ ఎకిల్‌స్టోన్ ధ్వజం
ఆర్థిక హామీలు ఇస్తేనే ఇండియన్ గ్రాండ్ ప్రి
న్యూఢిల్లీ: ఇండియన్ గ్రాండ్‌ప్రి వివాదం కొత్త మలుపు తిరిగింది. భారత్‌లో రేసును ప్రమోట్ చేస్తున్న జేపీ గ్రూప్... తమతో కుదుర్చుకున్న ఐదేళ్ల ఒప్పంద బాధ్యతలను పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయిందని ఎఫ్-1 బాస్ బెర్నీ ఎకిల్‌స్టోన్ విమర్శించారు. ‘ఐదేళ్ల ఒప్పందాన్ని కొనసాగించేందుకు నాతో పాటు నా సంస్థ కూడా కట్టుబడి ఉంది. అయితే మధ్యలో ఎదురవుతున్న అడ్డంకులు కొన్ని పరిష్కారమవుతున్నా.. మరికొన్ని అలాగే ఉన్నాయి. మా నిబంధనలను వాళ్లు సంతృప్తిపర్చలేకపోతున్నారు.
అందుకే 2015 రేసు సందిగ్ధంలో పడింది. ఇందుకు టాక్స్ మినహాయింపులు, రాజకీయ, అధికారిక అడ్డంకులు ఒక్కటే కారణం కాదు’ అని ఎకిల్‌స్టోన్ పేర్కొన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సీజన్‌లో రేసు జరిగే అవకాశముందన్నారు. ‘ఒప్పందంలోని కొన్ని అంశాలను ప్రమోటర్లు సంతృప్తిపర్చలేకపోతున్నారు. ఇందులో ఎక్కువగా డబ్బుకు సంబంధించినవే ఉన్నాయి. అయినప్పటికీ ప్రమోటర్స్‌తో మా సంబంధం బాగానే ఉంది.
కాబట్టి కాంట్రాక్ట్‌లోని మిగతా రెండేళ్లను పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. రెండు నెలల్లో అన్నీ పరిష్కరించుకుంటే వచ్చే ఏడాది రేసును జరిపేందుకు ప్రయత్నిస్తాం. లేదంటే భవిష్యత్ షెడ్యూల్‌లో చోటు చాలా కష్టం’ అని ఎకిల్‌స్టోన్ స్పష్టం చేశారు. మరోవైపు ఎఫ్‌ఓఎమ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తాము బహిర్గతం చేయలేమని జేపీ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ సీఈఓ సమీర్ గౌర్ అన్నారు. వచ్చే ఏడాది రేసును తీసుకొచ్చేందుకు ఎకిల్‌స్టోన్‌తో చర్చలు జరుపుతానని చెప్పారు.