భారత్‌లో మళ్లీ ఎఫ్1?
న్యూఢిల్లీ: ఫార్ములా వన్ రేస్ మళ్లీ భారత్‌లో జరగనుందా ? ఇండియన్ గ్రాండ్ ప్రికి అడ్డంకులన్నీ తొలిగినట్లేనా ? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే ఏడాది ఇండియన్ గ్రాండ్ ప్రి భారత్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదేళ్ల కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం రేస్ ప్రమోటరైన జేపీ గ్రూప్ ఆర్థిక అవసరాలను తీరిస్తే ఫార్ములావన్ రేస్‌ను భారత్‌లో నిర్వహించేందుకు తమకెలాంటి ఇబ్బంది లేదని ఎఫ్ వన్ బాస్ బెర్నీ ఎకిల్‌స్టోన్ తెలిపారు. త్వరలోనే జేపీ గ్రూప్ అధికారులతో సమావేశమై సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ‘ఇది చాలా సుస్పష్టమైన విషయం.
జేపీ గ్రూప్ వాళ్లు ఇక్కడికి(లండన్‌కు) వచ్చి ప్రస్తుతం కొన సాగుతున్న ఒప్పంద సమస్యల్ని పరిష్కరించాలి. వాళ్లు రేస్‌ను తిరిగి నిర్వహించేందుకు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారమై, క్యాలెండర్ ప్రకారం ఇండియాలో రేస్ జరుగుతుందని నాకు కూడా నమ్మకం ఉంది’ అని ఎకిల్‌స్టోన్ స్పష్టం చేశారు. అయితే 2011-13 వరకు వరుసగా మూడు సీజన్ల పాటు ఇండియన్ గ్రాండ్ ప్రిని భారత్‌లో నిర్వహించినప్పటికీ ఆర్థిక సమస్యల కారణంగా ఈ ఏడాది రేస్‌కు ఎఫ్ వన్ బాస్ అనుమతినివ్వలేదు.