ఢిల్లీలో ఫార్ములా రయ్...రయ్... | Organisers refuse to write off Indian Grand Prix | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఫార్ములా రయ్...రయ్..

Published Fri, Oct 25 2013 1:09 AM | Last Updated on Wed, Aug 1 2018 4:17 PM

ఢిల్లీలో ఫార్ములా రయ్...రయ్... - Sakshi

ఢిల్లీలో ఫార్ములా రయ్...రయ్...

గ్రేటర్ నోయిడా: ఓవైపు వచ్చే ఏడాది జరుగుతుందో లేదోనన్న అనిశ్చితి... మరోవైపు మూడోసారి భారత్‌లో ఫార్ములావన్ రేసు జరుగుతుందన్న ఆనందం.. ఈ నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేస్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు దేశ రాజధాని సమీపంలోని బుద్ధ అంతర్జాతీయ సర్క్యూట్ (బీఐసీ)లో రేసు కార్లు రయ్యిన దూసుకుపోనున్నాయి.
 
 
  శుక్రవారం రెండు ప్రాక్టీస్ సెషన్లతో పాటు శనివారం పోల్ పొజిషన్ కోసం అన్ని జట్ల డ్రైవర్లు తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆదివారం ప్రధాన రేసు జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్, రెడ్‌బుల్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. కార్ల జోరు... డ్రైవర్ల నైపుణ్యం... ట్రాక్‌పై డ్రామాను పక్కనబెడితే ఈ వారాంతం రేసుతో 26 ఏళ్ల వెటెల్... ‘డ్రైవర్స్ చాంపియన్‌షిప్’ టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉంది.
 
  అదే జరిగితే వరుసగా నాలుగుసార్లు టైటిల్ గెలిచిన పిన్న వయస్కుడిగా అతను రికార్డులకెక్కనున్నాడు. యువాన్ మాన్యుయెల్ ఫాంగియో (అర్జెంటీనా), మైకేల్ షుమాకర్ (జర్మనీ) గతంలో నాలుగుసార్లు టైటిల్స్‌ను సాధించారు.  రేసు ద్వితీయార్ధంలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న వెటెల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా ఐదు రేసులు గెలిచి చాంపియన్‌షిప్‌లో సమీప ప్రత్యర్థి ఫెరారీ డ్రైవర్ అలోన్సో (207) కంటే 90 పాయింట్ల ఆధిక్యంలో నిలిచాడు. కిమీ రైకోనెన్ (177) మూడోస్థానంలో ఉన్నాడు.
 
 ఏకైక డ్రైవర్...
 ఇప్పటి వరకు ఇండియన్ గ్రాండ్ ప్రిని సొంతం చేసుకున్న ఏకైక డ్రైవర్ వెటెల్. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే ఈసారి కూడా అతనే విజేతగా నిలిచే అవకాశం ఉంది. దీంతో బుద్ధ సర్క్యూట్‌పై ‘హ్యాట్రిక్’ కొట్టాలని టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ‘ఇది అంత సులువైన ట్రాక్ కాదు. ఎందుకంటే దీనిపై కొన్ని క్లిష్టమైన రిథమ్ బ్రేకర్స్ ఉన్నాయి. పైకి ఎక్కేటప్పుడు టర్న్-3 చాలా కష్టంగా ఉంటుంది. పైభాగాన్ని చూడటం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. కాబట్టి బుద్ధ సర్క్యూట్‌పై ఓ పరిపూర్ణమైన ల్యాప్‌ను డ్రైవ్ చేయాలంటే డ్రైవింగ్‌లో చాలా మెళకువలు తెలిసి ఉండాలి’ అని వెటెల్ అభిప్రాయపడ్డాడు.
 
 ఆరోస్థానం కోసం పోటీ
 మరోవైపు సొంతగడ్డపై బరిలోకి దిగుతున్న సహారా ఫోర్స్ ఇండియా ‘కన్‌స్ట్రక్టర్ చాంపియన్‌షిప్’లో ఆరో స్థానాన్ని కాపాడుకోవడంపై దృష్టిపెట్టింది. గత రేసుల్లో ఘోరంగా విఫలమైన మాల్యా జట్టు ఈ రేసులోనైనా పాయింట్లు సాధించాలని భావిస్తోంది. ప్రస్తుతం 62 పాయింట్లతో ఉన్న ఫోర్స్‌ను సిల్వర్‌స్టోన్ రేసు బాగా దెబ్బతీసింది. టైర్లు మార్చాల్సి రావడంతో పాయింట్లు నెగ్గలేకపోయింది. చివరి ఏడు రేసుల్లో కేవలం 3 పాయింట్లు మాత్రమే సాధించిన ఫోర్స్... సాబెర్ (38) టీమ్ కంటే 17 పాయింట్ల ఆధిక్యంలో ఉంది.
 
 
 అయితే ఈ ట్రాక్‌పై పాయింట్లు సాధించడం చాలా కష్టమని ఫోర్స్ డ్రైవర్ల అభిప్రాయం. ప్రస్తుతం కన్‌స్ట్రక్టర్ చాంపియన్‌షిప్‌లో రెడ్‌బుల్ (445), ఫెరారీ (297), మెర్సిడెస్ (287) జట్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.  గత రెండు సీజన్లలో హిస్పానియా తరఫున ఇండియన్ గ్రాండ్‌ప్రిలో బరిలోకి దిగిన భారత డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్ ఈసారి పాల్గొనడం లేదు.
 
 మేరీకామ్‌కు గౌరవం
 ఇండియన్ గ్రాండ్ ప్రిలో చకర్డ్ ఫ్లాగ్‌ను ఊపే అరుదైన గౌరవం ఈసారి మేరీకామ్‌కు దక్కింది. తొలి రెండు సీజన్లలో సచిన్, గగన్ నారంగ్‌లకు ఈ గౌరవం దక్కింది. ఒలింపిక్స్ బాక్సింగ్‌లో కాంస్యం సాధించిన మేరీకామ్‌ను ఈసారి ఆహ్వానించారు. అయితే అటు అభిమానుల నుంచి ఈ రేసుకు కాస్త ఆసక్తి తగ్గింది. తొలి సీజన్‌లో ఏకంగా 90 వేల టిక్కెట్లు అమ్ముడుకాగా... రెండో సీజన్‌లో 65 వేల మంది మాత్రమే ప్రత్యక్షంగా చూశారు. ఈసారి ఇప్పటివరకు కేవలం 40 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement