మెక్సికో సిటీ: ఇప్పటికే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నప్పటికీ... రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ మాత్రం ఫార్ములావన్–2023 సీజన్‌లో ఎదురులేకుండా దూసుకుపోతున్నాడు. మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల ప్రధాన రేసును మూడో స్థానం నుంచి ప్రారంభించిన వెర్‌స్టాపెన్ తొలి మలుపు వద్ద ప్రత్యర్థి డ్రైవర్లను ఓవర్‌టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత రేసు చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
వెర్‌స్టాపెన్ 71 ల్యాప్‌లను అందరికంటే వేగంగా 2 గంటల 2 నిమిషాల 30.814 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కిది 16వ గెలుపు కావడం విశేషం. తద్వారా ఒకే ఏడాది అత్యధిక ఎఫ్1 రేసుల్లో గెలిచిన డ్రైవర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును వెర్‌స్టాపెన్ బద్దలు కొట్టాడు. గత ఏడాది వెర్‌స్టాపెన్ 15 రేసుల్లో గెలుపొందాడు. ఓవరాల్‌గా వెర్‌స్టాపెన్ కెరీర్‌లో ఇది 51వ విజయం. ఈ క్రమంలో కెరీర్‌లో అత్యధిక ఎఫ్1 విజయాలు సాధించిన డ్రైవర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అలైన్ ప్రాస్ట్ (ఫ్రాన్స్) సరసన నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment