mexico grand prix
-
సెయింజ్‌కు ‘పోల్’ పొజిషన్
మెక్సికో సిటీ: ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ సీజన్లో తొలి పోల్ పొజిషన్ సాధించాడు. మెక్సికో గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ టోర్నీలో సెయింజ్ అగ్రస్థానంలో నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో సెయింజ్ ల్యాప్‌ను అందరికంటే వేగంగా 1 నిమిషం 15.946 సెకన్లలో పూర్తి చేశాడు. మెక్సికో గ్రాండ్‌ప్రిలో ఐదుసార్లు విజేతగా నిలిచిన రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ (1 నిమిషం 16.171 సెకన్లలో) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ (1 నిమిషం 16.260 సెకన్లలో) మూడో స్థానంలో నిలిచాడు. గత వారం యూఎస్ గ్రాండ్ ప్రి నెగ్గిన ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ నాలుగో స్థానంతో క్వాలిఫయింగ్ రౌండ్‌ను ముగించాడు. బ్రిటన్ స్టార్ డ్రైవర్ హామిల్టన్ (మెర్సిడెస్) ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ‘మెక్సికోలాంటి క్లిష్ట తరమైన ట్రాక్‌పై వరుసగా రెండు ల్యాప్‌ల్లో అగ్రస్థానంతో ముగించడం ఆనందంగా ఉంది’ అని సెయింజ్ అన్నాడు. మెయిన్ రేసును సెయింజ్ పోల్ పొజిషన్‌తో ప్రారంభించనున్నాడు. -
వెర్స్టాపెన్ రికార్డు
మెక్సికో సిటీ: ఇప్పటికే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నప్పటికీ... రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ మాత్రం ఫార్ములావన్–2023 సీజన్లో ఎదురులేకుండా దూసుకుపోతున్నాడు. మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల ప్రధాన రేసును మూడో స్థానం నుంచి ప్రారంభించిన వెర్స్టాపెన్ తొలి మలుపు వద్ద ప్రత్యర్థి డ్రైవర్లను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత రేసు చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్స్టాపెన్ 71 ల్యాప్‌లను అందరికంటే వేగంగా 2 గంటల 2 నిమిషాల 30.814 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది 16వ గెలుపు కావడం విశేషం. తద్వారా ఒకే ఏడాది అత్యధిక ఎఫ్1 రేసుల్లో గెలిచిన డ్రైవర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును వెర్స్టాపెన్ బద్దలు కొట్టాడు. గత ఏడాది వెర్స్టాపెన్ 15 రేసుల్లో గెలుపొందాడు. ఓవరాల్‌గా వెర్స్టాపెన్ కెరీర్లో ఇది 51వ విజయం. ఈ క్రమంలో కెరీర్లో అత్యధిక ఎఫ్1 విజయాలు సాధించిన డ్రైవర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అలైన్ ప్రాస్ట్ (ఫ్రాన్స్) సరసన నిలిచాడు. -
హై..హై.. హామిల్టన్
మెక్సికో సిటీ: మిగతా డ్రైవర్ల ఫలితాలతో సంబంధం లేకుండా టాప్–7లో నిలిస్తే ప్రపంచ టైటిల్ ఖాయమయ్యే పరిస్థితిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అనుకున్నది సాధించాడు. మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో డ్రైవ్ చేసిన ఈ బ్రిటన్ డ్రైవర్ నాలుగో స్థానాన్ని సంపాదించాడు. దాంతో ఈ సీజన్లో మరో రెండు రేసులు మిగిలి ఉండగానే హామిల్టన్ ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మెక్సికో గ్రాండ్‌ప్రిలో 71 ల్యాప్‌లను హామిల్టన్ గంటా 39 నిమిషాల 47.589 సెకన్లలో పూర్తి చేసి నాలుగో స్థానాన్ని పొందాడు. ఈ రేసులో 12 పాయింట్లు సంపాదించిన హామిల్టన్ మరో రెండు రేసులు మిగిలి ఉన్న ఈ సీజన్లో ఓవరాల్‌గా 358 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. గతంలో హామిల్టన్ 2008, 2014, 2015, 2017లలో ప్రపంచ టైటిల్‌ను గెలిచాడు. తాజా విజయంతో హామిల్టన్ ఎఫ్1 టైటిల్‌ను అత్యధికసార్లు గెల్చుకున్న డ్రైవర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఫాంగియో (అర్జెంటీనా) సరసన చేరాడు. మైకేల్ షుమాకర్ (జర్మనీ–7 సార్లు) ‘టాప్’లో ఉన్నాడు. మెక్సికో రేసులో రెండో స్థానాన్ని పొందిన నాలుగుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) 294 పాయింట్లతో ఈ సీజన్లో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మార్క్ వెర్స్టాపెన్ గంటా 38 నిమిషాల 28.851 సెకన్లలో గమ్యానికి చేరి మెక్సికో గ్రాండ్‌ప్రి టైటిల్‌ను గెల్చుకున్నాడు. రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో, బొటాస్ (మెర్సిడెస్) ఐదో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ 11వ స్థానంలో నిలువగా... పెరెజ్ 38వ ల్యాప్‌లో నిష్క్రమించాడు. -
విశ్వవిజేత ఎవరో?
మెక్సికో: గతేడాది ఫార్ములావన్ గ్రాండ్ ప్రిలో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సునాయాసంగా దక్కించుకున్న మెర్సిడెస్ జట్టుకు చెందిన బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. ఈ ఏడాది ఆ టైటిల్‌ను మరోసారి నిలబెట్టుకోవడానికి శ్రమించక తప్పడంలేదు. తన సహచర డ్రైవర్ నికో రోస్ బర్గ్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నాడు. ఆదివారం జరిగిన మెక్సికో ఫార్ములావన్ రేసులో హామిల్టన్ టైటిల్ సాధించినా.. ఆ తరువాత రెండో స్థానంలో మెర్సిడెస్ కే చెందిన నికో రోస్ బర్గ్ నిలిచాడు. ఈ 71 ల్యాప్‌ల ప్రధాన రేసును పోల్ పొజిషన్‌తో ఆరంభించిన హామిల్టన్.. అందరికంటే వేగంగా గమ్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. దాంతో ఈ సీజన్ ఫార్ములావన్‌లో హామిల్టన్ 330 పాయింట్లకు చేరగా, రెండో స్థానంలో నిలిచి రోస్ బర్గ్ 349 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బ్రెజిల్, అబుదాబి గ్రాండ్ ప్రిలో మాత్రమే మిగిలి ఉండటంతో హామిల్టన్ ఆ రెండు రేసుల్లో విజేతగా నిలిస్తే వరల్డ్ టైటిల్‌ను మరోసారి దక్కించుకుంటాడు. అదే క్రమంలో రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలవకూడదు. ఒకవేళ ఆ రెండు రేసుల్లో రెండో స్థానంలో రోస్ బర్గ్ నిలిచిన పక్షంలో టైటిల్ అతనికే దక్కుతుంది. ఒక ఫార్మాలావన్ రేసులో తొలి స్థానంలో నిలిచిన డ్రైవర్‌కు 25 పాయింట్లు అతని ఖాతాలో చేరతాయి. అదే సమయంలో రెండో స్థానంలో నిలిచిన డ్రైవర్‌కు 18 పాయింట్లు వస్తాయి. ఆ లెక్కన హామిల్టన్ మిగతా రెండు రేసుల్లో విజేతగా నిలిస్తే 380 పాయింట్లు అవుతాయి. అప్పుడు రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలిస్తే 384 పాయింట్లు అతని ఖాతాలోకి వస్తాయి. దాంతో ఆ రెండు రేసుల్లో విజయం హామిల్టన్ ఎంత ముఖ్యమో? అదే క్రమంలో రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలవడం కూడా అంతే ముఖ్యం. మరోవైపు ఆ రెండు రేసుల్లో రోస్ బర్గ్ ఒకదాంట్లో విజయం సాధిస్తే ప్రపంచ చాంపియన్ అవుతాడు. గతేడాది మూడు రేసులు మిగిలి ఉండగానే హామిల్టన్ విశ్వ విజేతగా నిలవడంతో.. ఆ టైటిల్‌ను మూడుసార్లు సాధించి దిగ్గజాల సరసన నిలిచాడు. అప్పుడు హామిల్టన్ 327 పాయింట్లతోనే ప్రపంచ చాంపియన్‌షిప్ ను కైవసం చేసుకున్నాడు. గత సీజన్లో 247పాయింట్లు సాధించిన రోస్ బర్గ్.. ఈ సీజన్లో మాత్రం అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ తొమ్మిది రేసుల్లో రోస్ బర్గ్ విజయం సాధించగా, హామిల్టన్ ఎనిమిదింట్లో మాత్రం గెలుపు దక్కించుకున్నాడు. దాంతో ఇరువురి మధ్య హోరాహోరీగా సాగుతున్న ఈ పోరులో విశ్వ విజేతగా ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.