విశ్వవిజేత ఎవరో?
మెక్సికో: గతేడాది ఫార్ములావన్ గ్రాండ్ ప్రిలో ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ను సునాయాసంగా దక్కించుకున్న మెర్సిడెస్ జట్టుకు చెందిన బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. ఈ ఏడాది ఆ టైటిల్ను మరోసారి నిలబెట్టుకోవడానికి శ్రమించక తప్పడంలేదు. తన సహచర డ్రైవర్ నికో రోస్ బర్గ్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నాడు. ఆదివారం జరిగిన మెక్సికో ఫార్ములావన్ రేసులో హామిల్టన్ టైటిల్ సాధించినా.. ఆ తరువాత రెండో స్థానంలో మెర్సిడెస్ కే చెందిన నికో రోస్ బర్గ్ నిలిచాడు. ఈ 71 ల్యాప్ల ప్రధాన రేసును పోల్ పొజిషన్తో ఆరంభించిన హామిల్టన్.. అందరికంటే వేగంగా గమ్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు.
దాంతో ఈ సీజన్ ఫార్ములావన్లో హామిల్టన్ 330 పాయింట్లకు చేరగా, రెండో స్థానంలో నిలిచి రోస్ బర్గ్ 349 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బ్రెజిల్, అబుదాబి గ్రాండ్ ప్రిలో మాత్రమే మిగిలి ఉండటంతో హామిల్టన్ ఆ రెండు రేసుల్లో విజేతగా నిలిస్తే వరల్డ్ టైటిల్ను మరోసారి దక్కించుకుంటాడు. అదే క్రమంలో రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలవకూడదు. ఒకవేళ ఆ రెండు రేసుల్లో రెండో స్థానంలో రోస్ బర్గ్ నిలిచిన పక్షంలో టైటిల్ అతనికే దక్కుతుంది.
ఒక ఫార్మాలావన్ రేసులో తొలి స్థానంలో నిలిచిన డ్రైవర్కు 25 పాయింట్లు అతని ఖాతాలో చేరతాయి. అదే సమయంలో రెండో స్థానంలో నిలిచిన డ్రైవర్కు 18 పాయింట్లు వస్తాయి. ఆ లెక్కన హామిల్టన్ మిగతా రెండు రేసుల్లో విజేతగా నిలిస్తే 380 పాయింట్లు అవుతాయి. అప్పుడు రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలిస్తే 384 పాయింట్లు అతని ఖాతాలోకి వస్తాయి. దాంతో ఆ రెండు రేసుల్లో విజయం హామిల్టన్ ఎంత ముఖ్యమో? అదే క్రమంలో రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలవడం కూడా అంతే ముఖ్యం. మరోవైపు ఆ రెండు రేసుల్లో రోస్ బర్గ్ ఒకదాంట్లో విజయం సాధిస్తే ప్రపంచ చాంపియన్ అవుతాడు.
గతేడాది మూడు రేసులు మిగిలి ఉండగానే హామిల్టన్ విశ్వ విజేతగా నిలవడంతో.. ఆ టైటిల్ను మూడుసార్లు సాధించి దిగ్గజాల సరసన నిలిచాడు. అప్పుడు హామిల్టన్ 327 పాయింట్లతోనే ప్రపంచ చాంపియన్షిప్ ను కైవసం చేసుకున్నాడు. గత సీజన్లో 247పాయింట్లు సాధించిన రోస్ బర్గ్.. ఈ సీజన్లో మాత్రం అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఇప్పటివరకూ తొమ్మిది రేసుల్లో రోస్ బర్గ్ విజయం సాధించగా, హామిల్టన్ ఎనిమిదింట్లో మాత్రం గెలుపు దక్కించుకున్నాడు. దాంతో ఇరువురి మధ్య హోరాహోరీగా సాగుతున్న ఈ పోరులో విశ్వ విజేతగా ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.