మెక్సికో సిటీ: మిగతా డ్రైవర్ల ఫలితాలతో సంబంధం లేకుండా టాప్–7లో నిలిస్తే ప్రపంచ టైటిల్ ఖాయమయ్యే పరిస్థితిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అనుకున్నది సాధించాడు. మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో డ్రైవ్ చేసిన ఈ బ్రిటన్ డ్రైవర్ నాలుగో స్థానాన్ని సంపాదించాడు. దాంతో ఈ సీజన్‌లో మరో రెండు రేసులు మిగిలి ఉండగానే హామిల్టన్ ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మెక్సికో గ్రాండ్‌ప్రిలో 71 ల్యాప్‌లను హామిల్టన్ గంటా 39 నిమిషాల 47.589 సెకన్లలో పూర్తి చేసి నాలుగో స్థానాన్ని పొందాడు. ఈ రేసులో 12 పాయింట్లు సంపాదించిన హామిల్టన్ మరో రెండు రేసులు మిగిలి ఉన్న ఈ సీజన్‌లో ఓవరాల్‌గా 358 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. గతంలో హామిల్టన్ 2008, 2014, 2015, 2017లలో ప్రపంచ టైటిల్‌ను గెలిచాడు.
తాజా విజయంతో హామిల్టన్ ఎఫ్1 టైటిల్‌ను అత్యధికసార్లు గెల్చుకున్న డ్రైవర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఫాంగియో (అర్జెంటీనా) సరసన చేరాడు. మైకేల్ షుమాకర్ (జర్మనీ–7 సార్లు) ‘టాప్’లో ఉన్నాడు. మెక్సికో రేసులో రెండో స్థానాన్ని పొందిన నాలుగుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) 294 పాయింట్లతో ఈ సీజన్‌లో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మార్క్ వెర్‌స్టాపెన్ గంటా 38 నిమిషాల 28.851 సెకన్లలో గమ్యానికి చేరి మెక్సికో గ్రాండ్‌ప్రి టైటిల్‌ను గెల్చుకున్నాడు. రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో, బొటాస్ (మెర్సిడెస్) ఐదో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ 11వ స్థానంలో నిలువగా... పెరెజ్ 38వ ల్యాప్‌లో నిష్క్రమించాడు.
హై..హై.. హామిల్టన్
Published Tue, Oct 30 2018 12:54 AM | Last Updated on Tue, Oct 30 2018 12:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment