
ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో టైటిల్ సొంతం
ప్రతికూల పరిస్థితుల్లో సంయమనంతో గట్టెక్కిన మెక్‌లారెన్ డ్రైవర్
రెండో స్థానంతో వెర్‌స్టాపెన్ సరి
నిరాశపరిచిన హామిల్టన్
రేసు పూర్తిచేయని ఆరుగురు డ్రైవర్లు
తదుపరి రేసు ఈనెల 23న చైనా గ్రాండ్‌ప్రి
మెల్‌బోర్న్: గత సీజన్‌ను విజయంతో ముగించిన మెక్‌లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్ కొత్త సీజన్‌ను కూడా విజయంతో ప్రారంభించాడు. 2025 ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రిలో బ్రిటన్‌కు చెందిన 25 ఏళ్ల లాండో నోరిస్ చాంపియన్‌గా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన నోరిస్ నిర్ణీత 57 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 42 నిమిషాల 06.304 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
గత నాలుగేళ్లుగా ప్రపంచ టైటిల్ సాధిస్తున్న వెర్‌స్టాపెన్ రెండో స్థానంలో నిలిచాడు. వెర్‌స్టాపెన్ రేసును 1 గంట 42 నిమిషాల 07.199 సెకన్లలో ముగించాడు. మెర్సిడెస్ డ్రైవర్ జార్జి రసెల్ మూడో స్థానాన్ని పొందాడు. 1987లో ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రి మొదలుకాగా ఈ రేసుకంటే ముందు వరకు ఫెరారీ జట్టు డ్రైవర్లు అత్యధికంగా 11 సార్లు విజేతగా నిలిచారు.
అయితే ఈసారి ఫెరారీ జట్టుకు ఈ రేసు కలిసిరాలేదు. తొలిసారి ఫెరారీ జట్టు తరఫున బరిలోకి దిగిన మాజీ వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 10వ స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ 8వ స్థానాన్ని సంపాదించాడు.
2010 తర్వాత తొలిసారి ఆ్రస్టేలియన్
గ్రాండ్‌ప్రికి వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా ఈ రేసుకు మూడుసార్లు అంతరాయం కలిగింది. మూడుసార్లు ట్రాక్‌పై సేఫ్టీ కార్లు వచ్చాయి. తొలి ల్యాప్ పూర్తికాకముందే ముగ్గురు డ్రైవర్లు కార్లోస్ సెయింజ్ (విలియమ్స్), జాక్ దూహాన్ (ఆలై్పన్), ఐజాక్ హద్జార్ (రేసింగ్ బుల్స్) రేసు నుంచి వైదొలిగారు. ఫార్మేషన్ ల్యాప్‌లో హద్జార్ తప్పుకోగా... తొలి ల్యాప్‌లో పరస్పరం ఢీకొట్టుకోవడంతో గత ఏడాది ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన సెయింజ్‌తోపాటు దూహాన్ నిష్క్రమించారు.
ఆ తర్వాత అలోన్సో (ఆస్టన్ మార్టిన్) 32వ ల్యాప్‌లో, గాబ్రియేల్ బొర్టోలెటో (కిక్ సాబెర్) 45వ ల్యాప్‌లో, లియామ్ లాసన్ (రెడ్‌బుల్) 46వ ల్యాప్‌లో తప్పుకున్నారు. ఓవరాల్‌గా 20 మంది డ్రైవర్లలో 14 మంది రేసును పూర్తి చేశారు. 24 రేసులతో కూడిన 2025 సీజన్‌లో తదుపరి రెండో రేసు చైనా గ్రాండ్‌ప్రి ఈనెల 23న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment