హామిల్టన్‌కు ‘పోల్’
వెటెల్ విఫలం
టాప్-10లో ‘ఫోర్స్’ హుల్కెన్‌బర్
నేడు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి
మెల్‌బోర్న్: చివరాఖర్లో వేగం పెంచిన మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్-2014 సీజన్ లో తొలి ‘పోల్ పొజిషన్’ సాధించిన డ్రైవర్‌గా నిలిచా డు. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 44.231 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. తొలి రెండు క్వాలిఫయింగ్ రౌండ్లలో అంతగా ఆకట్టుకోని హామిల్టన్ నిర్ణయాత్మక మూడో రౌండ్‌లో జోరు పెంచి మిగతా డ్రైవర్లను వెనక్కి నెట్టాడు. రికియార్డో (రెడ్‌బుల్) రెండో స్థానం నుంచి... రోస్‌బర్గ్ (మెర్సిడెస్) మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు.
గత నాలుగేళ్లుగా ప్రపంచ చాంపియన్‌గా నిలుస్తోన్న రెడ్‌బుల్ స్టార్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ (రెడ్‌బుల్)కు క్వాలిఫయింగ్ సెషన్ కలిసిరాలేదు. రికార్డుస్థాయిలో వరుసగా పదో విజయంపై దృష్టి సారించిన వెటెల్ 2012లో అబుదాబి రేసు తర్వాత తొలిసారి క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. ఓవరాల్‌గా అతను ప్రధాన రేసును 12వ స్థానం నుంచి మొదలుపెడతాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నికో హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానం నుంచి... మరో డ్రైవర్ పెరెజ్ 16వ స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు.