ఎదురులేని హామిల్టన్
సీజన్‌లో ఏడో టైటిల్
ఇటలీ గ్రాండ్‌ప్రిలోనూ విజయం
మోంజా : క్వాలిఫయింగ్‌లో మొదలైన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన ఖాతాలో మరో విజయాన్ని జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ 53 ల్యాప్‌లను గంటా 18 నిమిషాల 00.688 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది ఏడో టైటిల్ కావడం విశేషం. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) రెండో స్థానాన్ని దక్కించుకోగా... ఫెలిప్ మసా (విలియమ్స్) మూడో స్థానాన్ని పొందాడు.
తాజా గెలుపుతో హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో 252 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ఎఫ్1 ఆల్‌టైమ్ టైటిల్స్ జాబితాలో 40వ విజయంతో ఐదో స్థానానికి చేరుకున్నాడు. గత ఏడాది మాదిరిగానే ఈసారీ హామిల్టన్ ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టి విజేతగా నిలిచాడు. రేసు పూర్తయ్యాక హామిల్టన్ ఉపయోగించిన టైర్లపై రేసు నిర్వాహకులు విచారణ చేశారు. అయితే అతను వాడిన టైర్లు నిబంధనలకు లోబడే ఉండటంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. ‘ఫోర్స్’ డ్రైవర్లిద్దరూ టాప్-10లో నిలిచారు. సెర్గియో పెరెజ్ ఆరో స్థానాన్ని పొందగా... హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానాన్ని సంపాదించాడు. రేసు మొదలైన వెంటనే తొలి ల్యాప్‌లోనే లోటస్ జట్టుకు చెందిన గ్రోస్యెన్, మల్డొనాడో కార్లు ఢీకొట్టుకోవడంతో వారిద్దరూ వైదొలిగారు. మరోవైపు ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ ఆద్యంతం ఆధిక్యంలో నిలిచి అందరికంటే ముందుగా లక్ష్యానికి చేరుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 20న జరుగుతుంది.