మళ్లీ హామిల్టన్‌కే పోల్
♦ ఈ సీజన్‌లో 11వ సారి
♦ నేడు ఇటలీ గ్రాండ్‌ప్రి
మోంజా : సర్క్యూట్ మారినా... సహచరులు ఎంత గట్టిపోటీ నిచ్చినా... తన దూకుడు కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ 11వసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో ప్రపంచ చాంపియన్ హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 23.397 సెకన్లలో పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఫెరారీ జట్టు డ్రైవర్లు, ప్రపంచ మాజీ చాంపియన్స్ కిమీ రైకోనెన్, సెబాస్టియన్ వెటెల్ వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు.
హామిల్టన్ సహచరుడు, మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ నాలుగో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. గతేడాది ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి తర్వాత ఇప్పటివరకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకే పోల్ పొజిషన్స్ లభిస్తుండటం విశేషం. గతేడాది కూడా ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ విజేతగా నిలిచాడు. మరి ఈసారి కూడా అతనికి ఇటలీ గ్రాండ్‌ప్రి కలిసొస్తుందో లేదో వేచి చూడాలి.
నేటి ప్రధాన రేసు
సాయంత్రం గం. 5.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం