Italy Grand Prix
-
Italian Grand Prix: తొమ్మిదేళ్ల తర్వాత...
మోంజా (ఇటలీ): దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఫార్ములావన్ (ఎఫ్1) గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్ జట్టు విజేతగా నిలిచింది. 2012లో జరిగిన బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలో చివరిసారిగా విజేతగా నిలిచిన ఆ జట్టు ఇన్నేళ్లకు ఇటలీ గ్రాండ్‌ప్రిలో మెరిసింది. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో మెక్లారెన్ డ్రైవర్ డానియెల్ రికియార్డో చాంపియన్‌గా నిలిచాడు. 53 ల్యాప్‌ల రేసును అతడు అందరికంటే ముందుగా గంటా 21 నిమిషాల 54.367 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2018 మొనాకో తర్వాత మళ్లీ రికియార్డో ఒక ఎఫ్1 రేసులో గెలుపొందడం ఇదే తొలిసారి. రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన రికియార్డో... ట్రాక్ తొలి మలుపులోనే వెర్స్టాపెన్ను అధిగమించి ఆధిక్యంలోకి వచ్చాడు. అనంతరం తన లీడ్‌ను నిలబెట్టుకున్న అతడు విజేతగా నిలిచాడు. 1.747 సెకన్ల తేడాతో రేసును ముగించిన నోరిస్ (మెక్లారెన్) రెండో స్థానంలో నిలువగా... మూడో స్థానంలో బొటాస్ (మెర్సిడెస్) నిలిచాడు. హోమ్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్లు లెక్లెర్క్ నాలుగో స్థానంలో... సెయింజ్ ఆరో స్థానంలో నిలిచారు. -
హామిల్టన్ సిక్సర్
టస్కన్ (ఇటలీ): గత రేసులో ఎదురైన పరాజయాన్ని పక్కనపెట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మళ్లీ విజయం రుచి చూశాడు. ఆదివారం జరిగిన టస్కన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో తొమ్మిది రేసులు జరగ్గా అందులో హామిల్టన్‌కిది ఆరో విజయం కావడం విశేషం. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ నిర్ణీత 59 ల్యాప్‌లను 2 గంటల 19 నిమిషాల 35.060 సెకన్లలో ముగించి తన కెరీర్లో 90వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని సంపాదించాడు. ఈ క్రీడ చరిత్రలో 1000వ రేసులో బరిలోకి దిగిన ఫెరారీ జట్టుకు ఆశించిన ఫలితం రాలేదు. ఆ జట్టు డ్రైవర్లు చార్లెస్ లెక్లెర్క్ 8వ స్థానంలో నిలిచి 4 పాయింట్లు... సెబాస్టియన్ వెటెల్ 10వ స్థానంలో నిలిచి ఒక్క పాయింట్‌తో సరిపెట్టుకున్నారు. రేసులో మొత్తం 20 మంది డ్రైవర్లు పాల్గొనగా... 8 మంది రేసును పూర్తి చేయకుండానే వైదొలిగారు. తొలి ల్యాప్‌లోనే మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), పియర్ గ్యాస్లీ (అల్ఫా టౌరి) కార్లు ఢీ కొట్టుకొని తప్పుకోగా... ఐదో ల్యాప్‌లో మాగ్నుసెన్ (హాస్), గియోవినాజి (అల్ఫా రోమియో), కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్) కార్లు ఢీ కొట్టుకోవడంతో రేసు నుంచి నిష్క్రమించారు. ఆరో ల్యాప్‌లో నికొలస్ లతీఫి (విలియమ్స్), ఏడో ల్యాప్‌లో ఒకాన్ (రెనౌ), 42వ ల్యాప్‌లో లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్) వెనుదిరిగారు. రేసులో మూడుసార్లు అంతరాయం కలగడంతో గంటన్నరలోపే ముగియాల్సిన రేసు రెండు గంటలకుపైగా సాగింది. తొమ్మిది రేసుల తర్వాత హామిల్టన్ 190 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ విభాగంలో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు రష్యా గ్రాండ్‌ప్రి ఈనెల 27న సోచి నగరంలో జరుగుతుంది. -
హామిల్టన్‌కు చుక్కెదురు
మోంజా (ఇటలీ): పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఇటలీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో ప్రపంచ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు చుక్కెదురైంది. ఊహించని విధంగా అల్ఫా టౌరి జట్టు డ్రైవర్ పియర్ గాస్లీ (ఫ్రాన్స్) విజేతగా అవతరించాడు. 53 ల్యాప్‌ల రేసును 10వ స్థానం నుంచి ప్రారంభించిన 24 ఏళ్ల గాస్లీ గంటా 47 నిమిషాల 06.056 సెకన్లలో రేసుని ముగించి తన కెరీర్లో తొలి ఎఫ్1 టైటిల్‌ను సొంతం చేసుకొని సంచలనం సృష్టించాడు. తద్వారా 1996లో ఒలివర్ పానిస్ (మొనాకో గ్రాండ్‌ప్రి) తర్వాత ఎఫ్1 రేసులో టైటిల్ గెలిచిన తొలి ఫ్రాన్స్ డ్రైవర్‌గా గాస్లీ గుర్తింపు పొందాడు. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్) రెండో స్థానాన్ని, లాన్స్ స్ట్రాల్ (రేసింగ్ పాయింట్) మూడో స్థానాన్ని పొందారు. -
ఎదురులేని హామిల్టన్
సీజన్లో ఏడో టైటిల్ ఇటలీ గ్రాండ్‌ప్రిలోనూ విజయం మోంజా : క్వాలిఫయింగ్‌లో మొదలైన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తన ఖాతాలో మరో విజయాన్ని జమ చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ 53 ల్యాప్‌లను గంటా 18 నిమిషాల 00.688 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది ఏడో టైటిల్ కావడం విశేషం. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) రెండో స్థానాన్ని దక్కించుకోగా... ఫెలిప్ మసా (విలియమ్స్) మూడో స్థానాన్ని పొందాడు. తాజా గెలుపుతో హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో 252 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా ఎఫ్1 ఆల్‌టైమ్ టైటిల్స్ జాబితాలో 40వ విజయంతో ఐదో స్థానానికి చేరుకున్నాడు. గత ఏడాది మాదిరిగానే ఈసారీ హామిల్టన్ ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టి విజేతగా నిలిచాడు. రేసు పూర్తయ్యాక హామిల్టన్ ఉపయోగించిన టైర్లపై రేసు నిర్వాహకులు విచారణ చేశారు. అయితే అతను వాడిన టైర్లు నిబంధనలకు లోబడే ఉండటంతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. ‘ఫోర్స్’ డ్రైవర్లిద్దరూ టాప్-10లో నిలిచారు. సెర్గియో పెరెజ్ ఆరో స్థానాన్ని పొందగా... హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానాన్ని సంపాదించాడు. రేసు మొదలైన వెంటనే తొలి ల్యాప్‌లోనే లోటస్ జట్టుకు చెందిన గ్రోస్యెన్, మల్డొనాడో కార్లు ఢీకొట్టుకోవడంతో వారిద్దరూ వైదొలిగారు. మరోవైపు ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ ఆద్యంతం ఆధిక్యంలో నిలిచి అందరికంటే ముందుగా లక్ష్యానికి చేరుకున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 20న జరుగుతుంది. -
మళ్లీ హామిల్టన్‌కే పోల్
♦ ఈ సీజన్లో 11వ సారి ♦ నేడు ఇటలీ గ్రాండ్‌ప్రి మోంజా : సర్క్యూట్ మారినా... సహచరులు ఎంత గట్టిపోటీ నిచ్చినా... తన దూకుడు కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ 11వసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ప్రపంచ చాంపియన్ హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 23.397 సెకన్లలో పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఫెరారీ జట్టు డ్రైవర్లు, ప్రపంచ మాజీ చాంపియన్స్ కిమీ రైకోనెన్, సెబాస్టియన్ వెటెల్ వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. హామిల్టన్ సహచరుడు, మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ నాలుగో స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. గతేడాది ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి తర్వాత ఇప్పటివరకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకే పోల్ పొజిషన్స్ లభిస్తుండటం విశేషం. గతేడాది కూడా ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ విజేతగా నిలిచాడు. మరి ఈసారి కూడా అతనికి ఇటలీ గ్రాండ్‌ప్రి కలిసొస్తుందో లేదో వేచి చూడాలి. నేటి ప్రధాన రేసు సాయంత్రం గం. 5.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం