కాలం గడుస్తున్న కొద్దీ వయసు పెరుగుతుంది. వృద్ధాప్యం మీద పడుతుంది. వందేళ్లు బతికినా అందులో మూడు వంతులకుపైగా ముసలితనంతోనే గడిచిపోతుంది. అలాకాకుండా బతికినంత కాలం యంగ్‌గానే బతికేస్తే.. అసలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వయసును వెనక్కి తీసుకెళ్లి.. మళ్లీ ఆ బాల్యాన్ని, యవ్వనాన్ని ఎంజాయ్ చేయగలిగితే..!? ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో సీన్‌లా అనిపిస్తోందా.. అలాంటిది ఎప్పటికైనా సాధ్యమేనా అన్న ప్రశ్న వస్తోందా? ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అలాంటి రోజు రావొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం సముద్రంలో జీవించే ఓ చిత్రమైన జెల్లీ ఫిష్‌పై చేస్తున్న పరిశోధనలు తోడ్పడతాయని అంటున్నారు. ఆ వివరాలేమిటో చూద్దామా..
అన్ని జీవులకు భిన్నంగా..
సాధారణంగా సముద్రాల్లో నివసించే చాలా రకాల జెల్లీ ఫిష్‌లకు తమ వయసును వెనక్కి తీసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. కానీ ఇది కొంతకాలం మాత్రమే, అదీ పునరుత్పత్తి చేయగలిగే దశ వరకు మాత్రమే ఉంటుంది. ఈ దశ దాటితే తిరిగి వయసును వెనక్కి తగ్గించుకునే సామర్థ్యం పోతుంది. కానీ శాస్త్రవేత్తలు కొన్నేళ్ల కింద సముద్రంలో సరికొత్త జెల్లీ ఫిష్‌ను కనుగొన్నారు. టుర్రిటోప్సిస్ డొహ్రని (టీ.డోహ్రని) అని పేరుపెట్టి.. పరిశోధన చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. జీవితంలో ఏ దశలో అయినా, ఎప్పుడైనా తిరిగి తన వయసును వెనక్కి తగ్గించుకోలదు. దీనికి ఈ సామర్థ్యం ఎలా వచ్చిందన్న దానిపై స్పెయిన్‌లోని ఓవిడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇటీవలే ఈ పరిశోధన వివరాలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
రెండు సెట్ల జన్యువులతో..
సాధారణంగా ఏ జీవిలో అయి నా వయసు పెరుగుతున్న కొద్దీ, శరీరంలో కణ విభజన జరుగుతూ.. జన్యువుల్లో మార్పులు జరుగుతుంటాయి. కణాల్లో జన్యుక్రమానికి సంబంధించిన సమాచారం నిల్వ ఉండే టెలోమెర్‌ల (జన్యువులు ఉండే క్రోమోజోమ్‌ల చివరన ఉండే భాగాలు) పొడవు తగ్గిపోతూ ఉంటుంది. ఈ మార్పులే వృద్ధాప్యానికి కారణమవుతాయి. టీ.డోహ్రని జెల్లీ ఫిష్‌పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. దానిలో జన్యువులన్నీ మరో సెట్ కాపీ చేసి ఉన్నాయని గుర్తించారు. దీనివల్ల ఈ జెల్లీ ఫిష్ వయసు పెరిగినకొద్దీ ప్రధాన జన్యువుల్లో మార్పులు జరిగినా, దెబ్బతిన్నా.. వాటిని మరో సెట్ సాయంతో తిరిగి సరిచేసుకుంటున్నట్టు తేల్చారు. అంతేగాకుండా ఈ జెల్లీఫిష్ల కణాల్లోని టెలోమెర్ల పొడవు తగ్గకుండా అంతర్గత వ్యవస్థలు పనిచేస్తున్నట్టు గుర్తించారు. దీనివల్ల ఇవి వృద్ధాప్య లక్షణాలను దరిచేరనీయడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ సామర్థ్యంతో ఏం చేస్తుంది?
టి.డోహ్రిని జెల్లీఫిష్‌లకు వృద్ధాప్యం రానప్పుడు.. మళ్లీ వయసును తగ్గించుకునే సామర్థ్యం ఎందుకనే అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ జెల్లీ ఫిష్‌లు మరీ ఎక్కువ వయసుకు వచి్చనప్పుడు, ఇతర జీవుల దాడుల్లో దెబ్బతిన్నప్పుడు, అవి ఉన్న పరిస్థితులు జీవించడానికి అనుకూలంగా లేనప్పుడు.. వయసు తగ్గించేసుకుని, తిరిగి ఎదుగుతున్నట్టు గుర్తించారు. చాలా రకాల కీటకాలు, ఇతర జీవుల తరహాలోనే జెల్లీ ఫిష్‌ల పరిణామక్రమం ఉంటుంది. ఉదాహరణకు దోమ మొదట పిండం రూపంలో, తర్వాత లార్వా వంటి మధ్యస్థ దశలో, తర్వాత పూర్తి రూపంలోకి ఎదుగుతుంది. సీతాకోక చిలుకలు మొదట గుడ్డు, తర్వాత పురుగు, చివరిగా ఎగిరే సీతాకోక చిలుకల్లా మారుతాయి.
ఇదే తరహాలో టి.డోహ్రిని జెల్లీ ఫిష్‌లు
క్రమంగా తమ పూర్వరూపాలకు మారుతూ.. పిండం దశదాకా (జెల్లీ ఫిష్.. సిస్ట్.. పాలిప్ రూపాలదాకా) వెళ్తాయి. అక్కడి నుంచి తిరిగి పూర్తిస్థాయి జీవిగా ఎదుగుతూ వస్తాయి. ఈ క్రమంలో మళ్లీ బాల్యం నుంచి యవ్వనం దాకా అనుభవిస్తాయని అనుకోవచ్చు.
ఇదే శక్తి మనకూ వస్తే..?
ఈ జెల్లీ ఫిష్‌లలో ఉండో రెండో సెట్ జన్యువులు కణాల రక్షణకు, పునరుద్ధరణకు తోడ్పడే ప్రోటీన్లు ఉత్పత్తి చేస్తున్నాయని ఓవిడో వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రోటీన్లపై పరిశోధన చేయడం ద్వారా.. మనం తిరిగి మరీ చిన్నపిల్లల్లా మారిపోకున్నా, వృద్ధాప్యాన్ని దూరం చేసే అత్యాధునిక విధానాలను అభివృద్ధి చేయవచ్చని చెప్తున్నారు. ఎన్నోరకాల జన్యు సంబంధ వ్యాధులు, ఇతర అనారోగ్యాలకూ సమర్థవంతమైన చికిత్సలను రూపొందించవచ్చని అంటున్నారు. అంతేకాదు.. భవిష్యత్తులో అసలు వృద్ధాప్యమే దరి చేరకుండా ఉండే ఔషధాలు, చికిత్సలు వచ్చే అవకాశమూ ఉంటుందని పేర్కొంటున్నారు.
చదవండి: జంతువుల మాదిరిగానే..మనుషులకు తోక!
Comments
Please login to add a commentAdd a comment