చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాన్ని..! | Could be attributed to the evidence of history | Sakshi
Sakshi News home page

చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాన్ని..!

Published Thu, Nov 20 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

చరిత్రకు  నిలువెత్తు సాక్ష్యాన్ని..!

చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాన్ని..!

నాటి రాచరికపు  వైభవానికి గుర్తును మాత్రమే కాదు..  శిథిలావస్థలో ఉన్న కట్టడాన్ని  అసలే కాదు..  నాటి శిల్పకళా  చాతుర్యానికి నిదర్శనాన్ని  ఘన చరిత్రకు సజీవ సాక్ష్యాన్ని.  నా పేరు ఏదైనా మీరంతా  చెప్పుకునే ‘కోట’ను నేను.  మీ కోసమే  నా ఎదురుచూపు..
 
మిమ్మల్నే...! అవును, నేను పిలుస్తున్నది మిమ్మల్నే..!!
నా పిలుపు మీ చెవిని తాకడం లేదా!! నా రూపు మిమ్మల్ని ఆకట్టుకోవడం లేదా!!  
అవునులే, వార్ధక్యంలో ఉన్న నన్ను చూడాలని, పట్టించుకోవాలని మీకెందుకుంటుంది?!

పుట్టిన నాటి నుంచే ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎన్ని చూశానో మీకు తెలుసా! ఏ రాజు కలలో ఊపిరి పోసుకున్నానో.. ఎంతమంది శ్రామికులు, శిల్పులు.. నన్ను ఇంత ఠీవిగా నిలబెట్టారో, ఎంత ధనం ఖర్చయిందో.. ఎంత మంది నాకు ప్రాణం పోయడానికి తాము ప్రాణార్పణం చేశారో.. ఎన్ని కథలు విన్నానో.. ఎందరి గాథలు తెలుసుకున్నానో.. ఇంకెన్ని యుద్ధాలకు సాక్ష్యంగా నిలిచానో.. వందల ఏళ్లుగా ఉన్నచోటనే సాగే నా ప్రయాణంలో మీరూ ఓ అడుగవ్వమని కోరుతున్నాను.

మీకు తీరిక లేకపోయినా.. నాకు తెలిసినది చెప్పాలని ఉబలాటం. చూసినది మీ కళ్లకు కట్టాలని ఆరాటం. కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోయి, అజాగ్రత్తల వలలో ఇమిడిపోయి... ఒళ్లు సడలిపోయి.. అలసిపోయి.. ఇంకా ఎన్నాళ్లు, ఎన్నేళ్లు ఉంటానో తెలియనిదాన్ని. మీ ఊళ్లోనో.. మీ ఊరి చివరనో.. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నదాన్ని. అస్థిత్వాన్ని కోల్పోకుండా ఉండటం కోసమే నా ఆరాటం. నాటి రాజ్యాలకు రాచకొలువును. మేధాపరమైన చర్చలకు, కళలకు, రాచరికపు హుందాతనానికి వేదికను. ఒక్కసారి వచ్చిపోండి. నా ఈ కళ్లతో నాటి అద్భుతాలను మీ ముందుంచుతాను...

మీ కళ్లు విప్పార్చి, తల పెకైత్తి నన్నే దీక్షగా చూస్తున్నారా! నాకు ఇంతటి ఠీవిని ఎవరు కట్టబెట్టారో తెలుసా! పెద్ద పెద్ద రాళ్లను ఒకదాని మీద ఒకటి ఎలా పేర్చారో చూశారా! అంతా పుస్తకాల్లో చదివామనో,  ఎవరో చెబితే వినడమో కాదు... నేటి మహామహులు సైతం తలవంచి సలామ్ చేసిన నాటి పరిజ్ఞానం ఎంత గొప్పదో మీ కళ్లతో మీరే చూసి తెలుసుకోండి.

టైమ్ మిషన్‌ని...

పిల్లలకు ‘టైమ్ మిషన్’ గురించి ఎన్నో ఆంగ్ల సినిమాలను పరిచయం చేస్తూ చెబుతారు. కాలాన్ని వెనక్కి తిప్పి చూపించాలనుకుంటారు. ఒక్కసారి నా కోట గుమ్మం వద్దకు తీసుకురండి. కాకతీయుల పాలించిన నేల.. చాళుక్యులు, పల్లవుల పరిపాలన.. అంటూ ఇక్కడే మొదలుపెట్టండి. ‘అనగనగా రాజు.. కోట నుండి యుద్ధానికి బయల్దేరాడు..’ అంటూ బడిలో పుస్తకాల ద్వారా చెప్పిన చరిత్రను కళ్లకు కట్టినట్టుగా చూపించండి. పిల్లల్లో అవగాహన, ఆలోచనా శక్తి మీరు ఊహించనంతగా పెరుగుతుంది. జీవన పోరాటాలను తెలియజేసే కథలెన్నో నన్ను చూపిస్తూ మీ చిన్నారులకు ఎంతో సులువుగా పరిచయం చేయవచ్చు. చెక్కుచెదరని ‘టైమ్ మిషన్’ అవునో కాదో వారే నిర్ధారిస్తారు. ఇంకొన్నాళ్లు నన్ను కాపాడుకోవాలనే ఆలోచన చేస్తారు. అదేగా ముందు తరాలకు మీరిచ్చే సంపద.
 
బంధాలకు ఇల్లు...

నేను రాతి కట్టడాన్నే! కానీ, కుటుంబమంతా మీరు కలిసి రావాలని ఆశపడతాను. అలా వస్తే నా గుండె సంతోషంతో ఉప్పొంగిపోతుంది. కూర్చోవడానికి వేదికలు వేసి ఉంచుతాను. కనువిందు చేసే శిల్పాలతో ఊహల్లో నాట్యమాడిస్తాను. గుప్తంగా ఉండే కోశాగారాలను, అబ్బురపరిచే ఆహార శాలలను, ధాన్యపు గిడ్డంగులను.. అన్నీ పరిచయం చేస్తాను. ఇక్కడంతా కలిసి ఎంత చెప్పుకున్నా తనవి తీరని ముచ్చట్లు. ఆ మాటల్లో పెరిగే దగ్గరితనం... బంధాలకు కొలువుగా అతి పెద్ద ఇల్లుగా మీ రాక కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. శత్రురాజులకు దడపుట్టించిన ఫిరంగులు, రేయింబవళ్లు పహారా కాసిన కాపలాదారుల స్థావరాలు, గుర్రపు శాలలు, ఆంతరంగిక మందిరాలు.. ఎన్నో విచిత్రాలతో మిమ్మల్ని అడుగడుగునా విస్మయపరుస్తూనే ఉంటాను.

నూతన హంగులు...

ఎన్నో కోటలు కనుమరుగయ్యాయి. కోట ప్రాంతాలు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. ఇంకెన్నో కోటలు అవసాన దశలో ఉన్నాయి. గ్రామ, జిల్లా స్థాయిలో ఉండే కొన్ని కోటల గురించి సమాచారమే లేదు. కనుమరుగవుతున్న వాటిని పట్టించుకునేవారూ లేరు. రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలు అద్బుతంగా ఉన్నాయని వాటిని చూడటానికి మళ్లీ మళ్లీ వెళుతుంటారు. కానీ, అలనాటి వైభవాన్ని ఇప్పటికీ చెక్కుచెదరనీయకుండా అక్కడివారు కాపాడుకుంటూ వస్తున్న విధానాన్ని కనిపెడుతున్నారా..! అక్కడి కోటలకు నూతన హంగులు అద్ది, హోటళ్లుగా మార్చే నైజాన్ని తెలుసుకున్నారా! ఈ విధానం వల్ల ఆ రాష్ట్ర ఆదాయమూ పెరిగిందని వార్తలు మీ చెవిన పడుతున్నాయా! ఈ దిశగానూ ఒక్కసారి ఆలోచన చేయండి. నాటి రాజులకు రక్షణ కవచంగానే కాదు, మీకు ఆదాయవనరుగానూ మారుతాను. నాటి వైభవాన్ని ముందు ముందు ఇంకెంతో మందికి చాటుతూనే ఉంటాను.

తీసుకువెళ్లండి..!

నా దగ్గరకు రండి. నాతో ఉన్న కొన్ని గంటలను అమూల్యంగా మదిలో దాచుకోండి. ఇక్కడ గడిపిన గుర్తులను ఫొటోల రూపంలో పదిలంగా తీసుకెళ్లండి. కానీ, మీ గుర్తులను నా దగ్గర వదలాలని చూడకండి. ఎందుకంటే మీరు వ చ్చిన విషయం నాకు తెలుసు. మీ సందడి నా గుండె గోడల నిండుగా ఘల్లుమంటూనే ఉంటుంది. కానీ, మీ పేర్లు, గుర్తులు నా గుండె మీద చెక్కుతున్నప్పుడు నేను పడే వేదన మీకు తెలియడం లేదు. వాహనాలు, పరిశ్రమలు వదిలే కాలుష్యం నన్ను రోజు రోజుకూ మసకబారేలా చేస్తున్న విషయం మీకు తట్టడం లేదు. మీరు వెళుతూ వెళుతూ ఒక్కసారి నా వేదనను పట్టించుకొమ్మని ఒక చిన్న విన్నపం.
 - నిర్మలారెడ్డి    
 
 అప్పటి కథలకు ఆనవాళ్లు
 హైదరాబాద్ నుంచి సుమారు దూరం (కి.మీ.)
 గోల్కొండ కోట (హైదరాబాద్)... 23 కి.మీ
 కొండపల్లి కోట (కృష్ణా జిల్లా).. 258 కి.మీ
 వరంగల్ కోట (వరంగల్ జిల్లా) .. 150 కి.మీ
 భువనగిరి కోట (నల్గొండ జిల్లా).. 48 కి.మీ
 పెనుకొండ కోట (అనంతపురం జిల్లా).. 431కి.మీ
 గండికోట (వై.ఎస్.ఆర్. కడప జిల్లా ) ... 500 కి.మీ
 బొబ్బిలి కోట (విజయనగరం జిల్లా).. 636 కి.మీ
 చంద్రగిరి కోట (చిత్తూరు జిల్లా)... 572 కి.మీ
 మీ ఊరు, మీ ప్రాంతంలో ప్రాచీన కట్టడాలేవైనా ఉంటే వాటి వివరాలను ఫొటోలతో సహా తెలుపండి. ప్రచురిస్తాం.
 మీరు పంపవలసిన చిరునామా:  విహారి, సాక్షి ఫ్యామిలీ,
 సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్, హైదరాబాద్ -34.
 e-mail:sakshivihari@gmail.com
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement