Dilapidation
-
ఒకప్పటి గోల్సావాడీ బస్తీ.. ఇప్పుడు ఉస్మానియా
తెలంగాణ నలుదిక్కుల నుంచి వచ్చే పేద రోగుల పాలిట అది పెద్దాస్పత్రి... పూర్తిగా కోలుకొని ఆరోగ్యవంతులుగా బయటకు వెళతామనే ఓ నమ్మకం.. వైద్యంలో ఎన్నో ప్రయోగాలకు ఇదో వేదిక...అదే ఉస్మానియా ఆస్పత్రి. కానీ ప్రస్తుత ఉస్మానియా ఆస్పత్రి భవనాలను చూస్తే...శిథిల చిత్రాలేకనిపిస్తున్నాయి. పెచ్చులూడిన పై కప్పులు, కూలిపోయిన గోడలు, ఎక్కడపడితే అక్కడ పగుళ్లు...చిన్నపాటి వర్షానికే ఉరుస్తున్న వైనం..వైద్యం సంగతిమాటేమిటోగానీ...ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం నీడన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని రోగులు, వారి సహాయకులు, డాక్టర్లు, సిబ్బంది అనేకఇబ్బందులు పడుతున్నారు. అయితే పదేళ్ల క్రితం నుంచే ఉస్మానియా ఆస్పత్రి భవనాల మరమ్మతులకు ప్రణాళికలు రూపొందిస్తూ వస్తున్నారు. కొత్త భవనాల నిర్మాణానికి ప్రస్తుత ప్రభుత్వం సిద్ధంకాగా, హెరిటేజ్కట్టడాలను కాపాడాలని కొన్ని సంస్థలు, ప్రతిపక్షాల ఆందోళన నేపథ్యంలోఒక్క అడుగూ ముందుకు పడలేదు. అయితే ప్రస్తుతం ఉన్న భవనాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసినా, మరో పాతికేళ్లు అందుబాటులో ఉంటుందని నిపుణులు అంటున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పటి ప్రాణదాత..లక్షలాది రోగుల ఆరోగ్య ప్రదాయిని, అక్కడికి వెళితే చాలు ప్రాణాలతో బయటపడవచ్చు అనే భరోసా..ఎన్నో ప్రయోగాలకు...మరెన్నో అద్భుతాలకు వేదికగా నిలిచిన ప్రతిష్టాత్మాక ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఒక వైపు గోడల పగుళ్లు.. మరో వైపు కుప్పకూలుతున్న పెచ్చులు...ఇంకో వైపు ముంచెత్తుతున్న మురుగు నీరు వెరసి..కనీస వైద్యాన్ని అందించలేని దుస్థితి. ఆస్పత్రికి వెళ్లితే రోగాలు తగ్గుతాయో లేదో కానీ..కొత్త రోగాలు ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు. కనీస భద్రత లేని ఈ పాత భవనంలో వైద్య సేవలు అందించలేమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతుండగా...పడకల మధ్యలో మోకాల లోతులో నిల్వ ఉన్న మురుగు నీటి మధ్య ఉండలేమని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి గోల్సావాడీ బస్తీ..ఇప్పుడు ఆస్పత్రి గోల్సావాడి..వెండి వెన్నెల వెలుగుల్లో తళతళలాడే మూసీనది ఒడ్డున వెలసిన ఓ బస్తీ. పాశ్చాత్య ప్రపంచంలో అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన వైద్యాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేసింది ఈ బస్తీయే. యునానీ, ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్యపద్ధతులు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో నాలుగో నిజాం ప్రభువు నసీరుద్దౌలా బ్రిటీష్ వైద్య చికిత్సలు చేసే ఆస్పత్రిని ఈ బస్తీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వైద్యంతో పాటు బోధనా పద్ధతులను, పాఠ్యగ్రంథాలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. ఆస్పత్రి నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు. ఐదో నవాబు అప్జలుద్దౌలా హయాంలో ఆస్పత్రి నిర్మాణం పూర్తి అయింది. 1866 నాటికి అది అఫ్జల్‌గంజ్ ఆస్పత్రిగా వైద్య సేవలు ప్రారంభించింది. ఫలితంగా అప్పటి వరకు కంటోన్మెంట్‌లోని బ్రిటీష్ సైనికులకు మాత్రమే అందిన ఈ వైద్యసేవలు అప్పటి నుంచి సామాన్యులకు కూడా చేరువయ్యాయి. కానీ ఆ ఆస్పత్రి ఎంతో కాలం మనుగడ సాగించ లేదు. 1908లో వచ్చిన మూసీ వరదల్లో నేలమట్టమైంది. ఆరోనిజాం మీర్‌మహబూబ్ ఆలీఖాన్ పాలనా కాలంలో చోటు చేసుకున్న మహా విషాదం అది! ఆ తర్వాత కొంతకాలానికే ఆయన కూడా కాలధర్మం చేశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ పగ్గాలు చేపట్టారు. అఫ్జల్‌గంజ్ ఆస్పత్రి స్పూర్తిని బతికించాలని భావించిన ఆయన..సుమారు 27 ఎకరాల విస్తీ ర్ణంలో ప్రస్తుతం ఉన్న ఈ భవనాన్ని నిర్మించారు. అలనాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ విన్సెంట్ మార్గదర్శకత్వంలో ఈ మహాసౌధం వెలిసింది. ఇండో పర్షియన్ శైలి..రూ.50 వేల ఖర్చు 1918–20లో ఆస్పత్రి భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నల్లగ్రానైట్, సున్నం కలిపి కట్టించిన ఈ పటిష్టమైన భవనం ఇండో పర్షియన్ శైలిలో రూపుదిద్దుకుంది. అప్పట్లో ప్రసిద్ధి చెందిన రాజస్థానీ, గ్రీకు, రోమన్, శైలి నిర్మాణ పద్ధతులను జత చేశారు. సుమారు తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకేసారి 450 మంది రోగులకు చికిత్స అందించేలా దీన్ని నిర్మించారు. ఎలాంటి యంత్రాలు వాడకుండా కేవలం కూలీలతో ఐదేళ్ల పాటు శ్రమించికట్టారు. నిర్మాణానికి ఆ రోజుల్లోనే రూ.50 వేల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. 1925లో ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. ఇండో పర్షియన్ శైలిలో రూపుదిద్దుకున్న 110 అడుగుల ఎత్తైన విశాలమైన డోమ్‌లు ఆస్పత్రికి ప్రత్యేక ఆకర్షణ. ఎత్తైన గోడలకు పై భాగంలో నిజాం ప్రభువుల తలపాగాలను ప్రతిబింబించే ఆకతులను చిత్రీకరించారు. చార్మినార్‌లోని మినార్లను పోలిన నిర్మాణాలను ఆస్పత్రి భవనంపై కట్టారు. డోమ్‌లను కేవలం కళాత్మకత దష్టితోనే కాకుండా భవనంలోని గాలి, వెలుతురు ప్రసరించేలా నిర్మించారు. రాత్రి వేళ్లలో విద్యుత్ అందుబాటులో లేని సమయాల్లో కూడా వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా ఎక్కువగాలి, వెలుతురు వచ్చేలా వీటి నిర్మాణం ఉంది. తొలి క్లోరోఫామ్ చికిత్స ఇక్కడే ఆస్పత్రి అనేక అద్భుతాలు ఆవిష్కరణలకు వేదికైంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎడ్వర్డ్ లారీ నేతత్వంలోని వైద్యబందం ప్రపంచంలోనే తొలిసారిగా క్లోరోఫామ్‌ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు చికిత్సలు చేశారు. ఈ అద్భుతాన్ని అధ్యయనం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులంతా ఇక్కడికే వచ్చేవారు. అంతేకాదు 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి చికిత్స కూడా ఇక్కడే జరిగింది. డాక్టర్ ఆరస్తు అఫ్జల్‌గంజ్ ఆసుపత్రిలో తొలి చికిత్స చేశారు. ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ ఎడ్వర్డ్ లారీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా వ్యవహరించారు. ఆయన తన జీతభత్యాలు, పెన్షన్ మొత్తాన్ని ఆస్పత్రికే ఖర్చు చేశారు. తర్వాత డాక్టర్ గోవిందరాజులు నాయుడు, డాక్టర్ సత్యవంత్ మల్లన్న, డాక్టర్ హార్డికర్, డాక్టర్ సర్ రోనాల్డ్ రాస్, వంటి ప్రముఖ వైద్యులు ఆస్పత్రిలో సేవలు అందించారు. ప్రతిపాదించి పదేళ్లు దాటింది.. ఇప్పటికీ పునాది రాయి పడలే చారిత్రక ఈ భవనంలో వైద్యసేవలు ఇటు రోగులకు..అటు వైద్యులకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భావించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించాలని భావించి ఆ మేరకు 2009లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత అధికారం లోకి వచ్చిన రోశయ్య 2010 బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్‌రెడ్డి ఇందుకు రూ.50 కోట్లు కేటాయించారు. శంకుస్థాపన కోసం ఓ పైలాన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఏడంతస్తుల భవనానికి ఆర్కియాలజీ విభాగం అ«భ్యంతరం చెప్పడంతో నాలుగు అంతస్తులకు కుదించారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ తొలిసారిగా ఆస్పత్రిని సందర్శించారు. వారం రోజుల్లో పాత భవనాన్ని ఖాళీ చేసి, దాని స్థానంలో కొత్త భవనం నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆమేరకు తెలంగాణ తొలి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. పాతభవనం కూల్చివేతకు ఇటు ఆర్కియాలజీ..అటు ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇదే ఆస్పత్రి ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలంలో మరో రెండు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పునాది రాయికూడా వేయలేదు. రక్షణ లేని ఈ పాత భవనంలో వైద్య సేవలు అందించలేక పోతున్నామని ఆస్పత్రి వైద్య సిబ్బంది 2018లో వంద రోజుల పాటు ఆందోళన చేపట్టింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికే ఒకటి, రెండో అంతస్తులను ఖాళీ చేశారు. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్‌లోనే చికిత్సలు అందిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షానికి మురుగు నీరు వార్డుల్లోకి చేరింది. ఒక వైపు ఊడిపడుతున్న పైకప్పు పెచ్చు లు...మరో వైపు వార్డుల్లో నిలిచిన మోకాలి లోతు మురుగు నీటి దుర్వాసన మధ్య రోగులు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇదీ పాత భవనం దుస్థితి ప్రస్తుతం ఉస్మానియా పాత భవనంలో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాలు కొనసాగుతున్నాయి. 670 పడకల సామర్థ్యం..నాలుగు ఆపరేషన్ థియేటర్లు, 20 వార్డులు ఉండే ఈ భవనంలో పెచ్చులూడి పడుతుండటంతో ఇప్పటికే రెండో అంతస్తును ఖాళీ చేసి, కొన్ని పడకలను క్యాజువాలిటీ బ్లాక్‌కు, మరికొన్ని కులికుతుబ్‌షా బిల్డింగ్‌లోకి తరలించారు. మరో 350 పడకలను పాతభవనం గ్రౌండ్ ఫ్లోర్ సహా ఫస్ట్ ఫ్లోర్లలో సర్దుబాటు చేశారు. చారిత్రక ఈ భవనం నిర్వహణ లోపం వల్ల ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. స్లాబ్ సహా గోడలపై చెట్లు మొలకెత్తడంతో గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. వర్షం కురిసినప్పుడు స్లాబ్ నుంచి వాటర్ లీకవుతోంది. దెబ్బతిన్న డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించక పోవడం, గోడలకు ఏర్పడిన పగుళ్లను అలాగే వదిలేయడం వల్ల వర్షానికి పూర్తిగా తడిసి కూలేందుకు సిద్ధంగా ఉంది. భవనం పునరుద్ధరణ పనులను వదిలేసి..ఇటీవల అంతర్గత రోడ్లు ఏర్పాటు చేశారు. పాతభవనం గ్రౌండ్ ఫ్లోర్ కంటే ఈ రోడ్లు ఎత్తుగా ఉన్నాయి. దీనికి తోడు బేగంబజార్ నుంచి వచ్చే మురుగునీటి వ్య వస్థ ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణం నుంచి మూసిలో కలుస్తుంటుంది. అయితే ఈ డ్రైనేజీ లైన్లు ఇటీవల మట్టితో పూడిపోవడం, వాటిని గుర్తించి క్లీన్ చేయక పోవడంతో బయటి నుంచి వచ్చిన వరద డోమ్గేటు వెనుక భాగంలోని ఆస్పత్రి ఆవరణలో పొంగిపొర్లి పాతభవనంలోని ఎంఎం2, ఎంఎం3 సహా సూపరింటిండెంట్ ఆఫీసు తదితర వార్డులకు చేరుతుంది. ఒక్కోవార్డులో వంద మంది వరకు చికిత్స పొందుతుంటారు. హటాత్తుగా ఆయా వార్డులను వరద నీరు ముంచెత్తడం తో రోగులను ఫస్ట్ ఫ్లోర్‌కు తరలించాల్సి వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంత మంది కిందే నీళ్లలో గడపాల్సి వచ్చింది. పేగు బంధం ఉందన్న వాళ్లే నాశనం చేస్తున్నారు ఇప్పటి వరకు హైదరాబాద్‌తో పేగు బంధం లేనివారే ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థకు కారణమైనట్లు చెప్పుకున్నాం. కానీ ప్రస్తుతం ఈ నగరంతో అనుబంధం ఉన్నట్లు చెప్పు కుంటున్న వారే పరోక్షంగా ఆస్పత్రిని ఉస్మాన్సాగర్ను తలపింపజేశారు. వందేళ్లలో ఎప్పుడు రానీ డ్రైనేజీ వాటర్ ఇప్పుడే ఆస్పత్రిలోకి ఎలా వచ్చింది? ప్రభుత్వ నిర్వహణ లోపమే ఇందుకు కారణం. రోగులను బతి కుండగానే తోడేళ్లకు, రాబంధులకు అప్ప జెప్పుతుంది. కొత్త భవనాల పేరుతో చారిత్రక భవనాలను కూల్చి వేస్తుంది. తెలంగాణ సంపదను కాంట్రాక్టర్లకు కట్టబెడుతోంది. – పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు ఆ సూచనలు పట్టించుకోలేదు పురావస్తు కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న ఉస్మానియా పాత భవనం నాణ్యతను పరిశీలించేందుకు 2014లో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్(ఇంటాక్) బందం సందర్శించింది. నిర్వహణ లోపం వల్లే భవనం శిథిలావస్థకు చేరుకున్నట్లు ప్రకటించింది. 27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్పత్రి ప్రాంగణంలో 2.5 ఎకరాల విస్తీర్ణంలోనే పాతభవనం విస్తరించి ఉంది. రోగుల అవసరాల దష్ట్యా కొత్త భవనం కట్టాలని ప్రభుత్వం భావిస్తే...ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో కట్టొచ్చని సూచించింది. లేదంటే పాతభవనానికి మరమ్మతులు నిర్వహిస్తే మరో పాతికేళ్ల వరకు భవనాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకోవచ్చని సూచించింది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆఘాఖాన్ ట్రస్ట్‌తో మరమ్మతులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత దాన్ని కూడా వదిలేశారు. – అనురాధారెడ్డి, కో కన్వీనర్, ఇంటాక్ తెలంగాణ కొత్తది కట్టాల్సిందే ప్రస్తుతం భవనం పూర్తిగా శిథిలాస్థకు చేరింది. తరచూ పెచ్చులూడి పడుతున్నాయి. ఇలాంటి భవనంలో చికిత్సలు అందించలేమని పేర్కొంటూ ఉస్మానియా ఆస్పత్రి వైద్య సిబ్బంది వంద రోజుల పాటు ఆందోళనలు నిర్వహించాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికే ఫస్ట్ సహా సెకండ్ ఫ్లోర్లను ఖాళీ చేశాం. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్‌లోనే రోగులకు చికిత్స అందిస్తున్నాం. వార్డుల్లోకి మోకాల్లోతు మురుగునీరు చేరింది. పడకలపై ఉన్న రోగుల వద్దకు వైద్యులు వెళ్లలేని దుస్థితి. ఈ భవనాన్ని వెంటనే కూల్చివేయాలి. ఖాళీగా ఉన్న ఏడు ఎకరాల నాలుగు గుంటల స్థలంలో కొత్త భవనం కట్టాలి. – డాక్టర్ బొంగు రమేష్, చైర్మన్, తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తాజా కామెంట్లు ♦ ఖాళీగా ఉన్న ఏడు ఎకరాల నాలుగు గుంటల స్థలంలో కొత్త భవనాలు నిర్మించాలి. ♦ వందేళ్లలో ఎప్పుడూ రాని డ్రైనేజీ వాటర్ ఇప్పుడే ఆస్పత్రిలోకి ఎలా వచ్చింది ? ♦ రోగులు బతికుండగానే తోడేళ్లు, రాబందులకు అప్పజెప్పినట్టుంది..! ♦ ఉన్న భవనాలను ఖాళీ చేసి కొత్త బిల్డింగులు కట్టాల్సిందే. ♦ పాత భవనాలకు మరమ్మతులు చేస్తే.. మరో పాతికేళ్ల వరకు భవనాన్నిచెక్కు చెదరకుండా కాపాడుకోవచ్చు. -
ఆ రైల్వే క్వార్టర్స్ శిథిలావస్థలో..
సాక్షి, హైదరాబాద్: రైల్వే అభివృద్ధిని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన నిజాం రాజులు ‘నిజాం గ్యారెంటీడ్ రైల్వేస్’లో పనిచేసే ఉద్యోగుల కోసం ప్రత్యేక నివాస సముదాయాలను ఏర్పాటు చేశారు. రైల్వే పరిపాలన భవనాలు, వర్క్‌షాపులు, స్టేషన్లు, నివాసాల కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో వేల ఎకరాలు కేటాయించారు. లాలాగూడలోని రైల్వే ఉద్యోగుల క్వార్టర్లు కూడా ఇలా నిర్మించినవే. కానీ అవి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. చాలామంది ఉద్యోగులు అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. ఎలాంటి ఆలనాపాలనా లేకపోవడంతో అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. మందుబాబులకు నిలయాలయ్యాయి. పేకాట రాయుళ్ల నివాసాలయ్యాయి. చీకటైతే చాలు ఆ మార్గంలో వెళ్లడం కష్టమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ శిథిల భవనాలు, ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం ఆర్పీఎఫ్ పోలీసులను ఏర్పాటు చేసేవారు. అయితే ఇప్పుడు ఎలాంటి భద్రతా సిబ్బంది లేకపోవడంతో లాలాగూడ భూముల పరిరక్షణ దక్షిణమధ్య రైల్వేకు సవాల్‌గా మారింది. ఒకవైపు రైల్వే స్థలాల అభివృద్ధి కోసం ప్రత్యేక సంస్థ ద్వారా ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు రూ.వందల కోట్ల విలువైన ఈ స్థలాల అభివృద్ధి, పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. పెండింగ్‌లో ప్రతిపాదనలు... సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు మరిన్ని స్టేషన్లను విస్తరించాలని, సదుపాయాలను మెరుగుపర్చాలని గతంలో అనేక ప్రతిపాదనలు రూపొందించారు. నగరంలోనే అందుబాటులో ఉన్న స్థలాలపై అప్పట్లో అధికారులు దృష్టిసారించారు. నార్త్ లాలాగూడ స్టేషన్‌కు ఆనుకొని ఉండే విధంగా ఇక్కడ రైల్వే సదుపాయాలను అభివృద్ధి చేయొచ్చని... దీంతో పడమటి వైపు లింగంపల్లి స్టేషన్ తరహాలో తూర్పు వైపు లాలాగూడ వినియోగంలోకి వస్తుందని భావించారు. కానీ అది ప్రతిపాదనలకే పరిమితమైంది. ప్రస్తుతమున్న లాలాగూడ కొత్త బ్రిడ్జి నుంచి లాలాపేట్, మిర్జాలగూడ వరకు దక్షిణమధ్య రైల్వేకు సుమారు 50ఎకరాలకు పైగా భూమి ఉంది. ఇక్కడ నిజాం నవాబుల కాలంలో రైల్వే ఉద్యోగుల కోసం కట్టించిన క్వార్టర్లు శిథిలమయ్యాయి. ఒకప్పుడు ఇక్కడ నివాసమున్న కుటుంబాలను గతంలోనే మౌలాలీలోని క్వార్టర్లకు తరలించారు. కొన్ని కుటుంబాలు ఇంకా ఇక్కడే ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిని కూడా ఇతర క్వార్టర్లలోకి తరలించి స్థలాలను వినియోగంలోకి తేవాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. కానీ దానికి తగిన ఆచరణ, చిత్తశుద్ధి లేకపోవడం, పైగా ఏ విధంగా ఆ భూమిని వినియోగంలోకి తేవాలనే అంశంలోనూ స్పష్టత లేకపోవడంతో ఆ ప్రతిపాదన పెండింగ్ జాబితాలో చేరింది. కమర్షియల్గానూ అవకాశం.. ఒకవేళ తూర్పు వైపున చర్లపల్లి స్టేషన్ విస్తరణకు భూమి లభిస్తే లాలాగూడ రైల్వే క్వార్టర్స్ స్థలాల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో భారీ షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయవచ్చు. లేదా మౌలాలీలోని రైల్వే స్థలంలో ప్రతిపాదించినట్లుగా బిల్డర్లకు లీజుకు ఇవ్వడం ద్వారా బహుళ అంతస్తుళ నివాస సముదాయాలను ఏర్పాటు చేయొచ్చు. ప్రస్తుతం మెట్టుగూడలోని రైల్ కళారంగ్ ప్రాంతంలోని 2.36 ఎకరాల మిలీనియం పార్కు స్థలాన్ని 99 ఏళ్లు లీజుకు ఇచ్చేందుకు టెండర్లను ఆహ్వానించారు. రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ ఇందుకోసం ప్రణాళికలు రూపొందించింది. ఇదే తరహాలో లాలాగూడ స్థలాల వినియోగంపై దృష్టిసారించొచ్చు. -
అరుదైన ఆలయంపై అంతులేని నిర్లక్ష్యం!
సాక్షి, హైదరాబాద్: ఎంతో ప్రఖ్యాతి గాంచిన కాకతీయులు నిర్మించిన ఆలయాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పైకప్పులు దెబ్బతిని చిన్న వర్షానికే నీటితో నిండిపోతున్నాయి. ఈ చారిత్రక సంపదను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిరక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా్లలోని గీసుకొండ మండలం మొగిలిచర్ల గ్రామంలో ఉన్న దేవాలయం ప్రత్యేకమైనది. రాణి రుద్రమదేవి కాలంలో ఇక్కడ పూజలు జరిగాయి. వేయి స్తంభాల గుడి, రామప్ప నిర్మాణాలన్నీ సాండ్‌బాక్స్ టెక్నాలజీగా చెప్పుకుంటాం. కానీ మొగిలిచర్లలోని ఆలయం మాత్రం నేటి ఇంజినీర్లకే అంతుచిక్కని సాంకేతికతతో రూపుదిద్దుకుంది. రాతిబండపై భారీ శిల్పాలను, శిలలను పేర్చినా వందల సంవత్సరాల నుంచి చెక్కుచెదరకుండా నిలబడి ఉండటం విశేషం. తెలంగాణలో కాకతీయుల చరిత్రను చెప్పే అత్యంత విశిష్టతను కలిగిన దేవాలయం పాలకుల నిర్లక్ష్యం, పురావస్తు శాఖ అధికారుల చిన్నచూపుతో నిరాదరణకు గురవుతోందని చరిత్రకారులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడి విశిష్టత కాసె సర్వప్ప రచించిన ‘సిద్దేశ్వర చరిత్ర’లో చెప్పిన దాని ప్రకారం గర్భగుడి, అంతరాలయాలు చిన్నగదులుగా, 28 స్తంభాలతో, విశాలమైన అర్ధమంటపంతో కూడిన దేవాలయం ఇది. గర్భగుడిపైన విమానం లేదు. రంగమంటపంపైన అవశేషాలు మిగిలిన ఇటుకల విమానమొకటి కనిపిస్తున్నది. హిందూ దేవాలయాలవలె తూర్పు, ఉత్తర ముఖద్వారాలతో కాక పశ్చిమాభిముఖంగా ఈ గుడి ఉంది. గర్భాలయ ద్వారపాలకులు కనిపించరు. అంతరాలయ ద్వారమొకటి కొంత పూర్వకాకతీయ లేదా చాళుక్యశైలిలో కనిపిస్తుంది. రంగమంటపం లోకప్పు అష్టదళపద్మం, అష్టభుజకోణాల మధ్య చెక్కబడివుంది. గతవైభవం కోల్పోయిన ఆలయం హరిహరదేవుడు, మురారిదేవుడు ఇద్దరూ తిరుగుబాటుకు ప్రయత్నించడం తెలిసిన రుద్రమదేవి వారిని మొగిలిచెర్లవద్దనే నిలువరించి, ఓడించి, బంధించింది. రుద్రమ సైనికాధికారులు రేచెర్ల ప్రసాదిత్యుడు, కాయస్త జన్నిగదేవుడు, విరియాల సూరననాయకుడు వారిని శత్రుశేషం ఉండరాదని వధించారు. దేవగిరి రాజు మహదేవుడు రుద్రమ ఏకవీరాదేవి గుడికి వెళ్తున్నపుడే అడ్డగించి, యుద్ధానికి దిగాడు. మహదేవుని ఓడించి రుద్రమదేవి తరిమికొట్టిందని తెలుస్తోంది. మొగిలిచెర్లలో సైనిక శిక్షణ కేంద్రముండేది. ప్రతాపరుద్రుని కాలంలో ఇక్కడియోధులు ఢిల్లీలో తమ యుద్ధవిద్యా ప్రదర్శనలిచ్చారు. ఏకవీరాలయంలో పేరిణీ నృత్య ప్రదర్శనలు నిర్వహించేవారని ఈ గుడిపై పరిశోధన జరిపిన చరిత్రకారులు తెలిపారు. రుద్రమదేవి పంచరాత్ర వ్రతం మొగిలిచర్ల ఊరికి వాయవ్య భాగాన చేను, చెలకల మధ్య ఏకవీరాదేవి (రేణుకాదేవి) ఆలయం ఉంటుంది. దీనిని కాకతిరుద్రదేవుడు (క్రీ.శ.1042 నుంచి 1130) కట్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఆలయం ముందు కూలిపడిపోయిన మహాద్వారం ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఆలయం పైకప్పు 34 రాతి స్తంభాలపై నిలిచి ఉంది. గర్భాలయంలో రెండు స్తంభాలతో అంతరాలయంతో పాటు, బయట ఒక నాట్యమండపం కూడా ఉన్నది. గర్భాలయంలో ఏకవీరాదేవి విగ్రహం లేకపోయినా, కుండలములు, కంఠాభరణము, దండ కడియాలు ధరించి చతుర్భుజాలతో ఉన్న స్త్రీదేవతామూర్తి కనిపిస్తున్నది. ఈ విగ్రహం నాలుగుచేతుల్లో ఖడ్గం, ఢమరుకం, పానపాత్ర, త్రిశూలం ఉన్నాయి.‘‘కాకతితో పాటు ఏకవీరకు పూజలు గొప్పగా జరుగుతుండేవని, ఏకవీర ఆలయం సైనికాధికారి కట్టించినదని, సువిశాల ప్రాంగణంలో ఆలయనిర్మాణం జరిగిందని, మంచినీటిబావి తవ్వకం చేయబడిందని, ఏకవీరను రుద్రమదేవి క్రమం తప్పక పూజించేదని చరిత్ర చెబుతుంది. అంతేకాకుండా యుద్ధవ్యూహరచనలను కూడా ఇక్కడే చేసేదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ గుడినుంచి ఓరుగల్లుకు రెండు రహస్య సొరంగ మార్గాలుండేవని, కాకతీయులు ఏకవీర గుడి ఎదురుగా వున్న రాతిగుండ్లను తొలిచి గదులుగా చేసారని చెప్పబడింది. పట్టాభిషేకం పూర్తయిన తర్వాత రుద్రమదేవి ఐదు రాత్రులు నిద్రపోకుండా పంచరాత్రవ్రతం ఇక్కడే చేసిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆలయాన్ని కాపాడాలి ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఆలయం నేడు గత వైభవాన్ని కోల్పోయింది. అక్కడికి వెళ్లాలంటే పొలాల గట్లపై నుంచి వెళ్లాలి. సరైన మార్గం లేక అక్కడికి వెళ్లే వాళ్లు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆ గుడిలో ఎప్పుడు కూలిపోతాయో అన్నట్లు ఆలయ స్తంభాలు ఉన్నాయి. మట్టి బస్తాలను స్తంభాలు కూలకుండా పెట్టారు. కాగా వర్షానికి ఆ మట్టి బస్తాలు తడిసి బస్తాల్లోని మట్టి కరిగిపోతుంది. ఇప్పటికైనా పురావస్తుశాఖ స్పందించి ఆలయాన్ని కాపాడాలి. –ఆరవింద్ ఆర్య, చరిత్ర పరిశోధకుడు -
మళ్లీ కూలింది..
చిత్రంలో కనిపిస్తున్న ఈయన పేరు అనంతయ్య(60). షాద్‌నగర్ తొండపల్లికి చెందిన ఈయనకు 20 రోజుల క్రితం బైక్ ఢీకొట్టింది. కాలుకు ఫ్రాక్చర్ కావడంతో సర్జరీ కోసం ఉస్మానియా జనరల్ ఆస్పత్రి పాత భవనం లోని ఆర్థోపెడిక్ వార్డులో ఇటీవల ఇన్‌పేషంట్‌గా చేరాడు. గురువారం తెల్లవారుజామున అకస్మాత్తుగా భవనం పైకప్పు కూలి ఆయనపై పడింది. ఆయన్ను వెంటనే ఐసీయూకు తరలించారు. అదేవార్డులోని రోగులంతా భయంతో బయటికి పరుగులు తీయాల్సి వచ్చింది. నెలలోనే 3సార్లు పెచ్చులూడి పడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సాక్షి, హైదరాబాద్: లక్షలాది రోగుల ఆరోగ్యప్రదాయిని అయిన ఉస్మానియా ఆస్పత్రి నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్ వార్డులో పైకప్పు గురువారం ఉదయం మళ్లీ పెచ్చులూడి పడింది. అసలే వర్షాకాలం.. ఆపై పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో రోగులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపు తున్నారు. భవనం నిర్మించి సుమారు వందేళ్లు కావొస్తుం డటం, ఏళ్ల తరబడి పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఈ నెల 19న 12 ఫీట్ల ఎత్తున్న దోబీఘాట్ గోడ కూలగా.. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ నెల 13న ఓపీ భవన ప్రధాన ద్వారం ఫోర్టికో పైకప్పు కూలింది. భారీ శబ్దం రావడంతో ఓపీలోని రోగులు భయంతో పరుగులు తీయాల్సి వచ్చింది. నెల క్రితం పాత భవనం రెండో అంతస్తులో పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. ఇప్పటికే ఈ విభాగాన్ని ఖాళీ చేయడంతో పెద్ద ప్రమాదం త ప్పింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఇప్పటికే పాత భవనం రెండో అంతస్తును ఖాళీ చేయించాం. అందులోని 240 పడకల ను ఫస్ట్, గ్రౌండ్ ఫ్లోర్లో సర్దుబాటు చేశాం. పాత భవనం దుస్థితిని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వర్షానికి స్లాబ్‌లు, గోడల నాని బలహీనంగా తయారయ్యాయి. - డాక్టర్ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా ఆస్పత్రి -
భారీముప్పు!
నిడదవోలు: నిడవోలులో పురాతన వంతెన కూలినా అధికారులు కళ్లుతెరవడం లేదు. భారీ ముప్పు పొంచి ఉన్నా.. శిథిలావస్థలో ఉన్న వంతెనల పరిరక్షణకు చర్యలు చేపట్టడం లేదు. కూలిన నిడదవోలు వంతెనకు కూతవేటు దూరంలో ఉన్న సమిశ్రగూడెం వంతెనను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ వంతెనపై రాకపోకలకు ప్రస్తుతం ప్రజలు వణుకుతున్నారు. సమిశ్రగూడెం గ్రామంలో పశ్చిమడెల్టా ప్రధాన కాలువపై బ్రిటిష్ హయాంలో 1932లో నిర్మించిన ఐరన్ గడ్డర్ బ్రిడ్జి ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఈ వంతెన 50 మీటర్ల పొడవు, ఆరుమీటర్ల వెడల్పు ఉంటుంది. గతంలో దీని శ్లాబ్ పనులు మాత్రమే చేపట్టారు. ప్రస్తుతం వంతెన ఐరన్ గడ్డర్లు తుప్పుపట్టాయి. గడ్డర్ల ముక్కలు పట్టు వదలి ఒక్కొక్కటిగా కాలువలోకి వేలాడుతున్నాయి. ఏ క్షణంలోనైనా కూలిపోయే పరిస్థితి నెలకొంది. నిబంధనలు పట్టవు ఇంతటి భయానక పరిస్థితి ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం.. ఈ వంతెనపై 16 టన్నులకు మించిన లోడు వాహనాలు తిరగకూడదు. అయితే ప్రస్తుతం 80 టన్నుల లోడు వాహనాలూ యథేచ్ఛగా పోతున్నాయి. అయినా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కనీసం 16 టన్నులలోపు లోడు వాహనాలు మాత్రమే వెళ్లాలనే హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. ఇసుక, క్వారీ లారీలతోపాటు కోళ్ల పరిశ్రమ, వ్యవసాయ ఉత్పత్తుల భారీ లోడు వాహనాలు రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఈ వంతెనపై రెండు వాహనాలు ఒకేసారి రావడానికి వీలుండదు. అయినా చాలా సందర్భాల్లో రెండు వాహనాలు ఒకేసారి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోతోంది. దీంతో పోలీసులకూ తలనొప్పిగా మారింది. ఒక్కోసారి వంతెనపై భారీ వాహనాలు నిలిచిపోయి 200 టన్నుల భారం వంతెనపై పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో వంతెన కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. వంతెనకు రెయిలింగ్ కూడా లేకపోవడంతో కాలువలోకి వాహనాలు దూసుకుపోయిన ఘటనలు అనేకం జరిగాయి. రాత్రి సమయాల్లో భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల మధ్య ప్రధాన మార్గం ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలకు ఈ వంతెన ప్రధాన మార్గంగా ఉంది. తాడేపల్లిగూడెం, నిడదవోలు, పంగిడి, దేవరపల్లి నుంచి రాజమండ్రి, నరసాపురం, ధవళేశ్వరం, రావులపాలెం, మార్టేరుకు వెళ్లాలంటే ఈ వంతెన దగ్గరదారి. అందుకే ఎక్కువమంది వాహనదారులు, ప్రయాణికులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. రోజూ వంతెన పైనుంచి సుమారు 5,000 వేల వాహనాలు వెళ్తుంటాయి. ఇంతటి కీలకమైన వంతెన శిథిలావస్థకు చేరినా.. అధికారులకు పట్టడం లేదు. నిడదవోలు బ్రిడ్జి కూలిన తర్వాత కూడా దీనిపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించలేదు. ప్రతిపాదనలకే పరిమితం చాలాకాలం నుంచి వంతెన పడగొట్టి దాని స్థానంలో కాంక్రీట్ హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. 2014లో రూ.10 కోట్ల అంచనాలతో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇదిలా ఉంటే జలరవాణాలో భాగంగా వంతెన పొడవు పెంచాలనే ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలతో వంతెన నిర్మాణ వ్యయం ప్రస్తుతం రూ.24 కోట్లకు పెరిగింది. పొంతన లేని సమాధానాలు ఈ వంతెన గురించి వివరణ కోరగా ఆర్అండ్ బీ ఏఈ కె.నందకిషోర్ పొంతన లేని సమాధానాలు చెప్పారు. కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని అడగ్గా సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ఉన్నతాధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. రెండు రోజుల పాటు ఆర్అండ్బీ డీఈ ఎ.శ్రీకాంత్‌ను వివరణ కోసం యత్నించగా ఆయన ఫోన్ లిఫ్ట్‌చేయట్లేదు. -
కూలితేనే స్పందిస్తారా!
ధరూరు : అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించిన ట్యాంకులవి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా గ్రామాల ప్రజలకు తాగునీరందించిన ట్యాంకులు.. నాసిరకం పనులతో.. ఎక్కడికక్కడ సీకులు తేలిపోయాయి. ఈ ట్యాంకులతో గ్రామీణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 20 ఏళ్ల వరకు మాత్రమే... సాధారణంగా ట్యాంకు నిర్మాణం జరిగినప్పటి నుంచి 20 ఏళ్ల వరకు మాత్రమే ఆ ట్యాంకులను వాడాలి. అలాంటిది ధరూరులో ఉన్న ట్యాంకు 40 ఏళ్లు గడుస్తున్నా నేటికీ దాని ద్వారా నీటిని వదులుతూనే ఉన్నారు. ట్యాంకుల కాలం చెల్లిన విషయం అధికారులకు తెలిసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ట్యాంకుల పక్కన ఉంటున్న నివాస గృహాల వారు, పాఠశాలలు, అంగన్వాడీ కంద్రాల విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరమ్మతులు కరువు.. శిథిలావస్థలో ఉన్న ట్యాంకులకు కనీసం మరమ్మతులు చేయించడం లేదు. ట్యాంకు అడుగు భాగం, రౌండ్ పిల్లర్లకు సిమెంట్‌ను కూడా ప్లాస్టర్ చేయించలేదు. దీంతో తేలిపోయిన మేకులు వర్షానికి తడిసి చిలుము వస్తున్నాయి. ఇదీ పరిస్థితి... మండలంలో చాలా గ్రామాల్లో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మేకులు తేలి ప్రమాదకరంగా మారాయి. ఈ ట్యాంకులను గతంలో ఆర్‌డబ్లూస్ ఏఈగా పనిచేసిన బషీర్ ఉన్నతాధికారుల ఆదేశానుసారం నాలుగేళ్ల క్రితం నీటిని నింపడం ఆపివేశారు. గ్రామంలో రెండే ట్యాంకులు ఉండటం.. పెద్ద గ్రామం కావడంతో తిరిగి ఆ ట్యాంకును వినియోగంలోకి తీసుకొచ్చారు. వీటితో పాటు పారుచర్ల, మార్లబీడు తదితర గ్రామాల్లోని ట్యాంకులు శిథిలావస్థలో ఉన్నాయి. ప్రతిపసాదనలు పంపించాం.. ధరూరులోని ఎస్సీ కాలనీలోని ట్యాంకు తొలగించాల్సి ఉంది. ప్రతిపసాదనలు పంపించాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాగానే పనులు చేపడుతాం. త్వరలో మిషన్ భగీరథ ట్యాంకులు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంలో పాత ట్యాంకును తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. – పరమేష్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భయంగా ఉంది.. మేము ట్యాంకు పక్కనే నివాసముంటున్నాం. ఏ క్షణం కూలు తుం దోనని భయంగా జీవనం సాగిస్తున్నాం. అధికారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. – వెంకటన్న,ఎస్సీ కాలనీవాసి, ధరూరు -
తొమ్మిదేళ్లు.. సాగని పనులు
జిల్లాలో డెల్టా ఆధునికీకరణ పనులు ఏళ్ల తరబడి సా..గుతూనే ఉన్నాయి. 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధునికీకరణ పనులకు రూ.500 కోట్లు నిధులు మంజూరు చేశాయి. దాదాపు పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రూ.200 కోట్ల మేర పనులు కూడా పూర్తికాలేదు. కాలువలు, డ్రెయిన్లలో మట్టిపూడికతీత పనులు, అవసరమైనచోట రక్షణ గోడలు నిర్మించి అధికారులు చేతులు దులుపుకున్నారు. ముఖ్యమైన స్లూయిజ్‌లు, లాకులు, రెగ్యులేటర్లు, అవుట్ పాల్ స్లూయిజ్‌ల వంటి నిర్మాణాలు మాత్రం పూర్తికాలేదు. దీంతో పాటు ప్రధాన లాకులు శిథిలావస్థకు చేరుకోవడంతో రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. నిడదవోలు: పశ్చిమడెల్టా పరిధిలో విజ్జేశ్వరం హెడ్ స్లూయిజ్‌తో పాటు ప్రధానంగా నరసాపురం కాలువ, బ్యాంకు కెనాల్, కాకరపర్రు కాలువ, గోస్తనీ నది అత్తిలి కాలువ, జంక్షన్ కాలువ, ఏలూరు కాలువ, ఉండి కాలువ, వీఅండ్ డబ్ల్యూ, ఓడబ్ల్యూ కాలువలపై 24 లాకులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. నరసాపురం ప్రాంతంలో మాధవాయిపాలెం, నల్లీక్రిక్, దర్భరేవు, నక్కల డ్రైయిన్, అయితంపూడి, మార్టేరు, కవిటం, పెరవలి, మొగల్తూరు, సిద్దాంతం, కోడే రు, లక్ష్మీపురం, గుమ్మంపాడు లాకులు శిథి లావస్థకు చేరుకున్నాయి. దీంతో సాగునీటి విడుదలకు ఇబ్బందులు తప్పడం లేదు. వీటిలో పెరవలి, కవిటంలో లాకుల నిర్మాణ పనులు చేపట్టినా అవి అసంపూర్తిగా మిగిలిపోయాయి. కాకరపర్రు రెగ్యులేటర్ లక్షల ఎకరాలకు దిక్కు ఉండ్రాజవరం మండలం వేలివెన్ను శివారులో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై 1874 కాటన్ దొర హయంలో నిర్మించిన కాకరపర్రు ప్రధాన రెగ్యులేటర్ (లాకులు) శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ నుంచి జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది. దీనిని నిర్మించి సుమారు 143 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు. పిల్లర్లు పటిష్టంగా ఉన్న రెగ్యులేటర్ యంత్ర సామగ్రి పూర్తిగా శిథిలమైంది. రెగ్యులేటర్‌కు ఉన్న 8 ఖానాల్లో తలుపులు, షట్టర్లు తుప్పుపట్టాయి. దీని ఫలితంగా సాగునీరు క్రమబద్ధీకరించడంలో సి బ్బంది అవస్థలు పడుతున్నారు. రెగ్యులేటర్ శిథిలావస్థకు చేరుకోవడంతో ఒక్కోసారి వరదనీటిని నియంత్రించలేక పొలాలు ముంపుబారిన పడుతున్నాయి. లీకేజీలతో నీరు వృథా అవుతోంది. వంతుల వారీ విధానం అమలు చేస్తున్నా దాళ్వాలో రైతులకు పూర్తిస్థాయిలో నీటి అవసరాలు తీరడం లేదు. పక్కనే గోస్తనీ నది కాలు వపై అదే సమయంలో నిర్మించిన స్లూయిజ్ కూ డా శిథిలావస్థకు చేరుకోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సా..గుతున్న నిర్మాణాలు 2012లో డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా కాకరపర్రు రెగ్యులేటర్, గోస్తనీ నది కాలువ స్లూయిజ్‌ల నిర్మాణానికి రూ.7.50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాదైనా కాలువలు కట్టే సమయంలోపు నిర్మాణాలు పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు. పనులు ఆలస్యానికి కారణాలివే.. కాలువలు కట్టే సమయం సరిపోకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని కాంట్రాక్టర్లు పెదవి విరుస్తున్నారు. ఏటా ఏప్రిల్, మేలో 45 రోజుల పాటు కాలువలకు నీటి విడుదల ఆపుతున్నారు. అయితే కాలువలో పూర్తిగా నీరు లేకుండా 35 రోజులు మాత్రమే ఉం టోంది. ఈ సమయం లాకుల నిర్మాణానికి సరిపోవడం లేదని, చేసిన పనులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. పనుల్లో భాగంగా పెద్ద ప్రాజెక్టులను ప్రోగ్రెసివ్, ఐవీఆర్సీఎల్ సంస్థలు దక్కించుకుంటున్నాయి. ముందుగా 10 శాతం అడ్వాన్సులుగా తీసుకుంటున్నా సకాలంలో పనులు పూర్తికావడం లేదు. దీంతో ఏటేటా నిర్మాణ వ్యయం పెరుగుతోంది. 2008లో పనులు చేపట్టిన సమయంలో రూ.500 కోట్ల వ్యయం అంచనా వేయగా ప్రస్తుతం రూ.1,000 కోట్లకు చేరినట్టు తెలిసింది. పంట విరామానికి ససేమిరా పశ్చిమ డెల్టా పరిధిలో 5.30 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండిస్తున్నారు. విజ్జేశ్వరం నుంచి జిల్లా శివారు భూములకు సాగునీరు పూర్తిస్థాయిలో చేరాలంటే ఆధునికీకరణ పనులు పూర్తిచేయడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో 2010లో ప్రభుత్వం రెండేళ్ల పంట విరామం ప్రకటించాలని ప్రతిపాదనలు తెచ్చినా ప్రజాప్రతినిధులు, రైతులు అంగీకరించలేదు. దీంతో అప్పటినుంచి పంట విరామం ఆలోచనను ప్రభుత్వం పక్కన పెట్టింది. -
పట్టుకుంటారు.. పక్కన పడేస్తారు
♦ వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాల పరిస్థితి ♦ తుప్పుపట్టి శిథిలావస్థకు చేరుతున్న వాహనాలు ♦ మాయమవుతున్న విడి భాగాలు ♦ 12 ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాల్లో ఇదే తంతు కాశినాయన : పలు కేసుల్లో పట్టుబడిన పలు వాహనాలు పోలీస్‌స్టేషన్, ఎక్సైజ్, అటవీ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి మగ్గుతున్నారు. దొంగతనాలకు గురైనవి, రోడ్డు ప్రమాదాల్లో దెబ్బతిన్నవి, అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడినవి, సరైన పత్రాలు లేకుండా సీజ్ చేసిన వాహనాలు ఆయా శాఖల కార్యాలయాల్లో శిథిలావస్థకు చేరుతున్నాయి. అలాగే లారీలు, ఆటోలు, సుమోలు, స్కార్పియోలు, మోటారు సైకిళ్లు తదితర వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడిసి ఎందుకూ పనికిరాకుండా పడి ఉన్నాయి. వాహనాలు పోగొట్టుకున్నవారు కొంత కాలానికి తమ వాహనాలు దొరికాయనే సంతోషం ఎంతో కాలం ఉండడం లేదు. కారణం వాటిని తిరిగి పొందాలంటే చేంతాడంత వ్యవహారం ఉండడమే. ఈలోగా ఆయా వాహనాలకు సరైన రక్షణ లేక అవి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. 1,500 వాహనాలు పనికిరావు జిల్లాలో 12 ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాలున్నా యి. ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాలతో పాటు ఎక్సైజ్, పోలీసుస్టేషన్ల పరి«ధిలో వివిధ కేసుల్లో పట్టుబడినవి దాదాపు 1,500 వాహనాలు న్నాయి. బద్వేలు తాలూకాలో బద్వేలు, పో రుమామిళ్ల అటవీ కార్యాలయాల్లో పట్టుబ డిన వాహనాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో అవి తుప్పుపట్టి పోతున్నాయి. అయినా కూడా అధికారులు వాటిని పట్టించుకో వడం లేదు. ఎక్కువగా ఎర్రచందనం తరలి స్తూ పట్టుబడిన లారీలు, కార్లు, సుమోలు, ఆ టోలు వందల సంఖ్యలో అటవీశాఖ కార్యాలయంలో మగ్గుతున్నాయి. వీటిని అధికారులు పూర్తిగా పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. మాయమవుతున్న వాహనాల విడిభాగాలు ఎర్రచందనాన్ని తరలించేందుకు కండీషన్లో ఉన్న వాహనాలనే ఉపయోగిస్తారు. అవి పట్టుబడితే అటవీశాఖ కార్యాలయానికి చేరతాయి. పట్టుబడిన వాహనాలను కొందరు అధికారులు, సిబ్బంది యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. కొందరు సిబ్బంది పట్టుబడిన వాహనాల విడిభాగాలను తొలగించి విక్రయిస్తున్నట్లు ఆరోపణ లున్నాయి. అంతేకాక గతంలో పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్ కార్యాలయంలో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలు కూడా మాయమైపోయాయి. వాహనాల బ్యాటరీలు, టైర్లు, ఇంజిన్లు వేరుచేసి అ మ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. అయినా కూడా ఉన్నతాధికారులు ఈ విషయమై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. పట్టుకున్న వాహనాలను వేలంలో విక్రయిస్తే అటు పోగొట్టుకున్న యజమానులు గానీ, టెండర్లు వేసే వారు గానీ ఎక్కువ రేట్లకు వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాహనాలను వేలం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
శిథిలావస్థలో మైలవరం మ్యూజియం
జమ్మలమడుగు(మైలవరం): మండల కేంద్రమైన మైలవరంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మ్యూజియం శిథిలావస్థకు చేరుకుంది. ఈ మ్యూజియాన్ని నిత్యం పర్యాటకులు సందర్శిస్తుంటారు. అందులో ఉన్న కళాఖండాలతోపాటు ప్రాచీన కాలంలో రాజులు ఉపయోగించిన కత్తులు, ఆయుధాలను ఆసక్తిగా తిలకిస్తారు. ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి దాదాపు 30ఏళ్లు అవడంతో భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అంతేకాక స్లాబు పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఇరిగేషన్ స్థలంలో మ్యూజియాన్ని నూతనంగా నిర్మాణం చేపడుతామని నాలుగేళ్ల క్రితం పేర్కొన్నారు. ఈ మేరకు స్థలాన్ని ఇరిగేషన్ అధికారులు పురావస్తుశాఖకు కేటాయించారని సమాచారం. అధికారులు కూడ రెండు సార్లు మ్యూజియాన్ని పరిశీలించి వెళ్లారు.అయితే నూతన మ్యూజియం భవన నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. ఆరుబయటనే పురాతన విగ్రహాలు..: మైలవరం జలాశయ నిర్మాణ సమయంలో రాజులు ఉపయోగించిన కత్తులు, ఆయుధాలు, అలనాటి విగ్రహాలు బయటపడ్డాయి. వీటిని భద్రపరిచేందుకు ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేశారు. అందులో వాటిని ఉంచారు. అయితే చాలా విగ్రహాలను మాత్రం ఆరుబయటే ఉంచడంతో అవి పాడుపడ్డాయి. బయట వాటికి రక్షణ లేకపోవడంతో అవి అసలు స్వరూపాన్ని కోల్పోయాయి. ప్రాచీన శిల్ప సంపదను కాపాడి భవిష్యత్ తరాలకు అందించడం కోసం వాటిని భద్రపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని పర్యాటకులు సూచిస్తున్నారు. -
విన్నపాలు వినవలే..!
-
గూడు.. గోడు
దశాబ్దాల కాలంగా గోసపడుతున్న ఖాకీలు ఉమ్మడి జిల్లాలో రక్షక భటులకు నివాస గృహాలు కరువు కొన్ని చోట్ల ఉన్నా.. శిథిలావస్థలో భవనాలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న వైనం 80 శాతం పోలీసుల ఆరుబయటే.. మంచిర్యాల క్రైం : శాంతిభద్రతలు కాపాడు తూ.. నిత్యం ప్రజలకు రక్షణగా నిలుస్తున్న రక్షక భటులకు గూడు గోడు తప్పడం లేదు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో నివాస గృహాలు లేక నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడో ఒక చోట క్వార్టర్స్ ఉన్నా అవి పూర్తిస్థాయి శిథిలావస్థకు చేరాయి. మండలం పరిధిలోని స్టేషన్‌కు దూరంగా ఎక్కడో గృహాలు కిరాయికి తీసుకోవడం.. డ్యూటీ అ యిపోయాక వెళ్లడం.. మళ్లీ ఏదైనా పనిపడితే స్టేషన్‌కు రావడం అంటే నరకం కనిపిస్తోందని పలువురు పోలీస్ సిబ్బంది వాపోతున్నారు. గూడు మరిచిన ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోలీస్ శాఖకు పెద్దపీట వేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సింగాపూర్ పర్యటన అనంతరం అక్కడి పోలీసింగ్ విధానాన్ని ఇక్కడ అమలు చేసే దిశలో పోలీస్ శాఖలో భారీగా మార్పులు చేర్పులు చేశారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌కు కొత్త బొలేరో వాహనాం, జిల్లా స్థాయి పోలీస్ అధికారికి ఇన్నోవా, స్కార్పి యో వంటి టాప్మోడల్ వాహనాలను ప్రభుత్వం అందజేసింది. కానీ.. పోలీసు ఉద్యోగులకు ఇళ్ల ని ర్మాణంపై ప్రభుత్వంలో నేటికీ స్పం దన కానరావడంలేదు. ఉమ్మడి జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో ఎక్కడా నివాస గృహాలు లేవు. చిన్నస్థాయి వారు కొందరు బయట అద్దె చెల్లించే స్థోమత లేక శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పోలీసుల పరిస్థితి ఇది.. ఉమ్మడి జిల్లాలో 82 పోలీస్స్టేషన్లు, రెండు మహిళా పోలీస్ స్టేషన్లు, రెండు ట్రాఫిక్ పోలీస్స్టేషన్లు, ముగ్గురు ఎస్పీలు, ఒక డీసీపీ, ముగ్గురు ఏసీపీలు, 4,304 మంది పోలీçస్ సిబ్బంది, 866 మంది హోమ్ గార్డ్స్ ఉన్నారు. వీరిలో ఎస్పీల నుంచి ఎస్సై స్థాయి అధికారులకు కొంత మందికి అరకొర వసతుల నడుమ పోలీస్‌స్టేషన్ ఆవరణలో క్వార్టర్స్ కేటాయించారు. మరి కొంతమంది ఆరు బయటనే అద్దెకు ఉంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 55 మంది సీఐలు ఉన్నారు. వీరికి 16 క్వార్టర్స్ మాత్రమే ఉన్నాయి. 39 మంది సీఐలు బయటనే అద్దెకు ఉంటున్నారు. 150 మంది ఎస్సైలు ఉన్నారు. వీరికి 55 క్వార్టర్స్ ఉన్నాయి. 95 మంది ఎస్సైలు బయ ట నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఏఎస్సైలు 236 మంది ఉన్నారు. ముగ్గురికే క్వార్టర్స్ ఉన్నాయి. హెడ్‌కానిస్టేబుళ్లు 1296 మంది ఉండగా.. 22 మందికి మాత్ర మే క్వార్టర్స్ ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుళ్లు 2,560 మంది ఉన్నారు. 1,331 మందికి క్వార్టర్స్ ఉన్నాయి. ఇబ్బందుల్లో పోలీసులు.. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటున్న పోలీసులకు స్టేషన్ అవరణలో సొంత భవనాలు లేక తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. డ్యూటీ ముగిసిన వెంటనే ఇంటికి వెళ్లడంతో.. మళ్లీ ఏదైనా అర్జంట్ పని ఉంటే వెళ్లాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. పైగా బయట పోలీసులకు ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని అంటున్నారు. హెచ్ఆర్ఏపై వివక్ష.. నిబంధనల ప్రకారం ప్రతి ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు 14 శాతం హెచ్ఆర్ఏ (హౌజ్ రెంట్ అలవెన్స్) ప్రభుత్వం నెలసరి వేతనంతో పాటు కలిపి ఇస్తోంది. అయితే.. జిల్లా కేంద్రంలోనూ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు 20 శాతం హెచ్ఆర్ఏ చెల్లిస్తోంది. కానీ.. పోలీస్ శాఖలో మాత్రం ఈ నిబంధన వర్తించడం లేదని పలువురు పోలీస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపరీతంగా అద్దె ఉండటంతో తీవ్ర ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. -
మొండిగోడల మధ్య అఆఇఈ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం హైస్కూల్లో తరగతి గదులు శిథిలా వస్థకు చేరి పైకప్పు కూలిపోయింది. దీంతో విద్యార్థులు మొండిగోడల మధ్య చదువు కుంటున్నారు. పాఠశాల భవనం కూలి నాలుగేళ్లయినా కొత్త భవనం నిర్మిం చకపోవడంతో చెట్లకిందే విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటున్నారు. వర్షం వస్తే ఇంటిబాట పడుతున్నారు. తరగతి గదులు నిర్మిస్తామని స్వయంగా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయిన కడియం శ్రీహరి హామీ ఇచ్చినప్పటికీ అది ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. ఇక్కడ పది తరగతి గదులు అవసరం ఉండగా మూడు మాత్రమే ఉన్నాయి. – తొర్రూరు రూరల్ -
శిథిలావస్థలో గ్రంథాలయం
తరిగొప్పుల(నర్మెట) : పది రోజుల క్రితం కురిసన వర్షాలకు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు పూర్తిగా తడిసిపోయాయి. గురువారం ఆ పుస్తకాలను గ్రంథాలయ సిబ్బంది భవనం ముందు ఆరబెట్టడంతో ‘సాక్షి’ కంటపడింది. తరిగొప్పుల గ్రామ గ్రంథాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో పాఠకులు ఎప్పుడూ కూలుతుందోనని భయపడుతున్నారు. భవనం పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. దీంతో గ్రంథాలయానికి రావడానికి పాఠకులు జంకుతున్నారు. ఎంతో సమాచారం, చరిత్ర కలిగిన పుస్తకాలు పూర్తిగా నానిపోవడంతో సంచుల్లో ఓ గదిలో భద్రపరిచారు. మరికొన్ని వర్షానికి నానిపోయి చినిగిపోయాయి. సంబంధిత అధికారులు కాని, ప్రజాప్రతినిధులు కాని స్పందించి గ్రంథాలయానికి నూతన భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
శిథిలావస్థకు సింగరేణి క్వార్టర్లు
భయాందోళనలో కార్మిక కుటుంబాలు పట్టించుకోని అధికారులు గోదావరిఖని : గోదావరిఖని బస్టాండ్ కాలనీలోని సింగరేణి సంస్థకు చెందిన కార్వర్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తుండడంతో క్వార్టర్ల పైకప్పులు ఎప్పుడు కూలుతాయోననే కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో కార్మికుల నివాసానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో యాజమాన్యం 1991లో బస్టాండ్ కాలనీలో క్వార్టర్ల నిర్మాణం పూర్తిచేశారు. ఇందులో 302 టీ2 టైపు, 1995లో 180 ఎస్టీ-2 టైపు క్వార్టర్లను నిర్మించారు. టీ2 టైపు క్వార్టర్లు నిర్మించి 25 ఏళ్ళు, ఎస్టీ-2 టైపు క్వార్టర్లు నిర్మించి 21 ఏళ్ళు అవుతున్నా యాజమాన్యం వాటికి పూర్తిస్థాయి మరమ్మతులను చేపట్టడం లేదు. ఇటీవల ‘కార్మికుల వద్దకు యాజమాన్యం’ కార్యక్రమంలో అధ్వానంగా ఉన్న క్వార్టర్ల గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యలను పుస్తకాలలో నమోదు చేసుకున్నారే తప్ప శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కూలుతున్న పైకప్పులు బస్టాండ్ కాలనీలోని సింగరేణి క్వార్టర్ల విషయంలో యాజమాన్య పర్యవేక్షణ లోపించడం తో క్వార్టర్ల మధ్యలో మొక్కలు మొలుస్తున్నా యి. వాటి వేర్లు క్వార్టర్ల గోడల లోపలికి చొచ్చుకుని వస్తూ అవి పగిలిపోయి కిందపడేలా చేస్తున్నాయి. క్వార్టర్లకు మరమ్మతులు లేకపోవడం తో బెడ్రూమ్లు, వంట గదులు, బాతురూమ్ లు, మరుగుదొడ్లలో పైకప్పులు కూలిపోతూ కు టుంబ సభ్యులపై పడుతున్నాయి. పలు క్వార్టర్ల పైకప్పులు కూలినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని పలువురు కార్మికులు పేర్కొంటున్నారు. క్వార్టర్ల మధ్యలో నిర్మించిన డ్రైరుునేజీ నిర్మాణాలు కూడా సరిగ్గా లేకపోవడం, కుండీల లోని మురుగు సరిగ్గా వెళ్ళలేక నిలిచి ఉండడం తో దుర్వాసన భరించలేకపోతున్నామని కార్మికులు అంటున్నారు. చాలా ఏళ్ళుగా సున్నం వేయకపోవడంతో గోడలన్నీ నల్లటి మరకలతో నిండిపోయూరుు. ఎవరైనా క్వార్టర్లలోకి కొత్తగా వస్తే క్వార్టర్ లోపలి భాగంలో మాత్రమే సున్నం వేసి బయట వేయకుండా వదిలేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే క్వార్టర్ బయట సున్నం వేయడం సింగరేణి నిబంధనల్లో లేదని అధికారులు చెబుతున్నారని కార్మికులు వాపోతున్నారు. మొత్తంగా బస్టాండ్ కాలనీలోని సింగరేణి క్వార్టర్లకు మరమ్మతులు చేయకపోతే పైకప్పులు కూలి కార్మికులు, వారి కుటుంబాల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. -
పదేళ్లుగా శిథిలావస్థ
కూలేందుకు సిద్ధంగా ఉన్న ఏటిగడ్డ మాందాపూర్ పాఠశాల కొల్చారం: పదేళ్లుగా శిథిలావస్థలో ఉన్న కొల్చారం మండలం ఏటిగడ్డ మాందాపూర్ పాఠశాల పరిస్థితి దారుణంగా తయారైంది. ఏ క్షణంలోనైనా కూలేందుకు సిద్ధంగా ఉంది. పదేళ్ల నుంచి గ్రామస్తులు ఇక్కడ నూతన పాఠశాల నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం లేదు. పాఠశాల స్థితిగతులపై సాక్షి దినపత్రిక పలుమార్లు హెచ్చరిస్తు వస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. దీంతో గ్రామస్తులు గత నాలుగు రోజుల నుంచి పాఠశాలను మూసివేయించారు. నూతన పాఠశాల భవనం నిర్మించే వరకు పాఠశాలను కొనసాగించేది లేదంటూ డిమాండ్ చేస్తున్నారు. -
శతాబ్దాల చరిత... శౌరివారి ఘనత
నేడు పునీతశౌరీ వారి పండుగ కులమతాలకతీతంగా నిర్వహణ ఓలేరు (భట్టిప్రోలు) : గ్రామంలోని పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి దేవాలయ చరిత్ర ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. శౌరివారి ఆలయానికి రెండున్నర శతాబ్దాల ఘనత ఉంది. కులమతాలకతీతంగా శౌరివారి పండుగను గురువారం నిర్వహించుకుంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ దేవాలయాన్ని 1784లో ఫాదర్ మానెంటి స్వాములు ఆధ్వర్యంలో ఔస్ట్రీ స్వామి నిర్మించారు. దేశంలో పునీతశౌరీ వారి పేరిట గోవా తరువాత రాష్ట్రంలో ఓలేరు, నరసరావుపేట, ముట్లూరు, మేళ్ళవాగు రెడ్డివారి పాలెం, కాట్రపాడు, నల్లపాడులో ఈ దేవాలయాలున్నాయి. ప్రస్తుతం ఓలేరు దేవాలయం శిథిలావస్థకు చేరింది. ఈ దేవాలయం సమీపంలో నూతన దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. గోవాలోని శౌరీ వారి దేవాలయానికి వెళ్ళలేని భక్తులు ఓలేరులోని ఆలయాన్ని సందర్శిస్తుంటారు. వలసవెళ్ళిన క్రైస్తవులు... 1787లో ఓలేరులో కరువు విలయతాండవం చేయడంతో ఇక్కడి క్రైస్తవులు తమిళనాడు పన్నూరు, కిలచేరి, చెంగలపట్నం, రాష్ట్రంలోని ముట్లూరు, కొండవీడు, పల్నాడు, తలబాడు ప్రాంతాలకు వలసవెళ్లారు. స్పెయిన్ నుంచి తెప్పించిన శౌరీవారి ప్రతిమ ఓలేరులో ఉంది. 1959లో ఓలేరు విచారణ పునఃప్రారంభమైంది. 1960లో విచారణ కేంద్రం ఓలేరు నుంచి రేపల్లెకు బదిలీ చేశారు. ఈ దేవాలయ పునః ప్రతిష్టాపన 1988 ఫిబ్రవరి 14న గుంటూరు పీఠాధిపతులు డాక్టర్ గాలిబాలి చేతుల మీదుగా జరిగింది. 1994 జూన్ 29న పునీత పేతురు పౌలు గార్ల పండుగ పర్వదినాన గుంటూరు మేత్రాసనంలోని రేపల్లె విచారణ నుంచి ఓలేరు విచారణగా ఆవిర్బవించింది. బెంగళూరు శాఖలోని క్లరేషియన్ సంస్థకు ఓలేరు విచారణ అప్పగించారు. ఈ సందర్భంగా ఫాదర్ మాడపాటి జేమ్స్ మాట్లాడుతూ ఏటా డిసెంబర్3వ తేదీన శౌరీ వారి పండుగను నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఏడాది హంగు, ఆర్బాటం లేకుండా దివ్యపూజా బలి నిర్వహించనున్నట్లు తెలిపారు. -
అనంతుని కష్టాలు
శిథిలావస్థలో అనంత పద్మనాభుని ఆలయం దూప, దీప, నైవేద్యాలకు నోచుకోని వైనం వేలాది ఎకరాల ఆస్తులు... పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో ఒకప్పుడు విజయనగర సంస్థానంలో దివ్యంగా వెలుగొందింది. అనంతపద్మనాభుని ఆలయం. దీనికి అనుబంధంగా ఉన్న కుంతీ మాధవ స్వామి ఆలయం పద్మనాభ యుద్ధ కార్య క్షేత్రానికి సాక్షిభూతంగా నిలుస్తుంది. ఎంతో ఘన చరిత్ర గలిగిన ఈ ఆలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. చివరకు దూప, దీప నైవేద్యాలకు వేరొక ఆలయంపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. - పద్మనాభం ఆస్తిపాస్తులు పద్మనాభస్వామికి పూర్వం విజయనగర సంస్థానాదీశులు 3,514 ఎకరాల భూమి కేటాయించారు. ఈ భూములు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ఉన్నాయి. ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయంతో పూర్వం అనంతపద్మనాభస్వామి ప్రాంగణం నిత్యం ఆధ్యాత్మిక వాతావరణంతో వర్ధిల్లేది. ప్రస్తుత పరిస్థితి ఆ భూములన్నీ రైతుల సాగులో ఉన్నాయి. వీటికి సంబంధించి కనీస శిస్తులు వసూలు కావడం లేదు. 1961 వరకు కాస్తో కూస్తో రైతులు శిస్తులు చెల్లించినప్పటికీ ఆ తర్వాత నుంచి పూర్తిగా వసూలు కావడం లేదు. నలుగుతున్న వివాదం 1961 నుంచి శిస్తు బ కాయిలను చెల్లించాలని దేవాదాయ శాఖ అధికారులు గతంలో ఆదేశాలు జారీ చేశారు. వేలాది రూపాయిలు బకాయిలు ఒకేసారి చెల్లించలేమని రైతులు చేతులేత్తేశారు. ఈ భూములకు సంబంధించి సాగు హక్కులను రైతులకు ఇస్తూ పాస్ పుస్తకాలు జారీ చేశారు. టైటిల్ డీడ్లు మాత్రం అనంతపద్మనాభస్వామి పేరునే ఉన్నాయి. గతంలో దేవాదాయ శాఖ అధికారులు ఈ భూములను వేలం పాట వేయడానికి పూనుకున్నారు. దీనికి రైతులు అభ్యంతరం వ్యక్తం చేయగా పాట నిలిచిపోయింది. అభివృద్ధి శూన్యం ఆలయం నిర్మించినప్పటి నుంచి నేటి వరకు క్షేత్ర అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దూప, దీప నైవేద్యాలకు కూడా ఆదాయం లే ని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు అనంతపద్మనాభస్వామి ఆల యం నుంచి సింహాచలం నృసింహస్వామి, పొట్నూరు కొదండ రామస్వామి, పుష్పగిరి వేణుగోపాలస్వామి, విజయనగరం పైడితల్లమ్మ, కురపల్లి శివాలయం వంటి 13 ఆలయాలకు దూప, దీప నైవేద్యాలకు పంపించేవారు. ఎటువంటి ఆదాయం లేకపోవడంతో 1982 నుంచి సింహాచలం దేవస్థానం నుంచి అనంత పద్మనాభ స్వామికి అవసరమైన దూప, దీప, నైవేద్యానికి సంబంధించి దినుసులు పంపుతున్నారు. తగ్గిన వైభవం నిధుల కొరత ఏర్పడడంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించలేదు. కార్తీక మాసంలో దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నా.. అనంతుని జయంతి, కల్యాణాలను అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. కనుమరుగైన బ్రహ్మోత్సవాలు కార్తీమాసంలో గతంలో బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు నిర్వహించేవారు. అనంతుని పుష్కరణిలో తెప్పోత్సవాన్ని వైభవంగా జరిపారు. సుమారు 45 ఏళ్ల నుంచి ఈ ఉత్సవాలను నిర్వహించడంలేదు. ఉత్సవాలు కనుమరుగవడంతో పుష్కరణి నిరాదరణకు గురైంది. ఆరు ఎకరాల్లోని పూలతోట పూర్తిగా ఆక్రమణకు పాలైంది. ఘన చరిత్ర గిరిపైన ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని 14వ శతాబ్దంలోను, గిరి దిగువన ఉన్న కుంతీ మాధవస్వామి ఆలయాన్ని 18వ శతాబ్దం ప్రారంభంలో విజయనగర సంస్థాన దీశులు నిర్మించారు. 1723లో దివాన్లు అయిన పెనుమత్స జగన్నాథరాజు, విజయరామరాజు, సాహెబ్ ఆధ్యర్యంలో కుంతీ మాధవస్వామి ఆలయ బేడా నిర్మించినట్టు శిలా శాసనం ఇప్పటికీ ఉంది. 1793 జులై 10న బ్రిటిష్ వారికి, విజయనగరం సంస్థానదీశుడైన రెండో విజయరామరాజుకు జరిగిన పద్మనాభం యుద్ధానికి సంబంధించి ముందస్తు వ్యూహం కుంతీ మాధవస్వామి ఆలయంలోనే జరిగింది. అనందపద్మనాభస్వామి ఆలయాలు దేశంలో రెండు చోట్ల ఉండగా అందులో ఇది ఒక్కటి. నిర్మాణాలు శిథిలం ఆలయ ప్రాంగణంలోని నిర్మాణాలు శిథిలావస్ధకు చేరుకున్నా వీటి మరమ్మతులు గురించి పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. కుంతీ మాధవ స్వామి ఆలయం లోపల భాగం పెచ్చులూడిపోయింది. బోగ మండపం వర్షాలకు కారిపోతుంది. బేడా పై భాగం పెచ్చులూడిపోయి బీటలు వారింది. రథశాల, వంట, వాహన, దినుసుల శాలలు పూర్తిగా శిథిలమయ్యాయి. దీని వల్ల గరుడ వాహనాన్ని కుంతీ మాధవ స్వామి ఆలయంలో ఉంచాల్సి వస్తోంది. గిరిపైన ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయ ధ్వజ స్తంభం 15 ఏళ్ల క్రితం, కుంతీ మాధవస్వామి ఆలయ ధ్వజ స్తంభం హుద్‌హుద్ తుపాన్‌కు శిథిలమయ్యాయి. వీటిని ఏప్రిల్ 13న పున ఃప్రతిష్ఠించారు. కానీ ఇత్తడి తొడుగు అమర్చకపోవడంతో వెలవెలబోతున్నాయి. -
గత వైభవ వెలుగులు
చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి, భాగ్యనగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఉస్మానియా ఆసుపత్రి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది! లక్షలాది మంది రోగులకు సేవలందజేసి, వేలాది మంది వైద్య నిపుణులకు శిక్షణ ఇచ్చి, ఎన్నో ప్రయోగాలకు, మరెన్నో అద్భుతాలకు చిరునామాగా నిలిచిన ఈ భవనం కూల్చివేత ప్రతిపాదనలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ చరిత్రపై దాని సంతకం, భవనం చారిత్రక విశేషాలు, నిర్మాణ కౌశలంపై ‘సాక్షి’ ఫోకస్.. - సాక్షి, హైదరాబాద్ * చారిత్రక వారసత్వానికి చిరునామా ఉస్మానియా ఆస్పత్రి * ఏడో నిజాం పాలనలో పూర్తయిన మహాసౌధం ఎందరో గొప్ప వైద్యులకు నిలయం ఎంతోమంది గొప్ప వైద్యులను తీర్చిదిద్దే కేంద్రంగా ఆసుపత్రి అభివృద్ధి చెందింది. ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ ఎడ్వర్డ్ లారీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా వ్యవహరించారు. ఆయన తన జీత భత్యాలను, పెన్షన్ మొత్తాన్ని ఆసుపత్రిలోని పేద రోగులకు పాలు, బ్రెడ్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. డాక్టర్ గోవిందరాజులు నాయుడు, డాక్టర్ సత్యవంత్ మల్లన్న, డాక్టర్ హార్డీకర్, డాక్టర్ రోనాల్డ్ రాస్ వంటి ప్రముఖ వైద్యులు ఆసుపత్రిలో సేవలందజేశారు. పునాదులు పడ్డాయిలా.. గోల్సావాడి.. వెండి వెన్నెల వెలుగుల్లో తళతళలాడే మూసీ నది ఒడ్డ్డున వెలసిన ఓ బస్తీ! పాశ్చాత్య ప్రపంచంలో అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన వైద్యాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేసింది ఈ బస్తీయే. యునానీ, ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో నాలుగో నిజాం ప్రభువు నసీరుద్దౌలా బ్రిటిష్ వైద్య చికిత్సలు చేసే ఆసుపత్రిని ఈ బస్తీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వైద్యంతోపాటు, బోధనా పద్ధతులను, పాఠ్యగ్రంథాలను కూడా డాక్టర్లకు అందుబాటులోకి తేవాలనుకున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు. ఐదో నవాబు అఫ్జలుద్దౌలా హయాంలో ఆ ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. 1866 నాటికి అది ‘అఫ్జల్‌గంజ్ ఆసుపత్రి’గా వైద్య సేవలను ప్రారంభించింది. ఫలితంగా హైదరాబాద్ సంస్థానంలోని బ్రిటిష్ కంటోన్మెంట్లలో సైనికులకు మాత్రమే లభించే ఆధునిక వైద్య సేవలు.. సామాన్యుల చెంతకు చేరాయి. కానీ ఆ ఆసుపత్రి ఎంతోకాలం మనుగడ కొనసాగించలేదు. 1908లో వచ్చిన మూసీ వరదల్లో నేలమట్టమైంది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా కాలంలో చోటుచేసుకున్న మహావిషాదం అది! ఆ తర్వాత కొంతకాలానికే ఆయన కూడా కాల ధర్మం చేశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పగ్గాలు చేపట్టారు. ‘అఫ్జల్‌గంజ్’ ఆసుపత్రి స్ఫూర్తిని బతికించాలని భావించిన ఆయన.. సుమారు 27 ఎకరాల సువిశాల ప్రదేశంలో 1925 నాటికి ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేశారు. అలనాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ విన్సెంట్ మార్గదర్శకత్వంలో ఈ మహాసౌధం వెలిసింది. మూసీ ఒడ్డునే ఎందుకు? మూసీ వరదలు విలయాన్నే సృష్టించాయి. వేలాది మంది మృత్యువాత పడ్డారు. మరోసారి అలాంటి వరదలు రాకుండా, వచ్చినా తట్టుకునేలా నది లోతును పెంచి దానికి ఇరువైపులా పెద్దపెద్ద గోడలు కట్టించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మూసీ పరిర క్షణే లక్ష్యంగా ఎత్తై భవనాల నిర్మాణాన్ని చేపట్టారు. అలా సిటీ కాలేజ్, హైకోర్టు భవనం,పేట్లబురుజు ఆసుపత్రి, లక్కల్కోట వెలిశాయి. మూసీ నదికి ఉత్తరాన నిర్మించిన ఉస్మానియా ఆసుపత్రి కూడా ఆ విధంగానే వెలసింది. పచ్చటి పచ్చిక బయళ్లు, ఎత్తై చెట్లు, స్వచ్ఛమైన మూసీ ప్రవాహం, ఆహ్లాదకరమైన వాతావరణం రోగులు త్వరగా కోలుకొనేందుకు సహకరిస్తాయని భావించారు. ఎలాంటి మొండి రోగాలైనా సరే అక్కడి గాలి పీలిస్తే నయమవుతాయని ప్రజలు భావించేవారు. ప్రపంచంలోనే తొలి ‘క్లోరోఫామ్’ శస్త్రచికిత్స ఉస్మానియా ఆస్పత్రి అనేక అద్భుతాలు, ఆవిష్కరణలకు వేదికైంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎడ్వర్డ్ లారీ నేతృత్వంలోని వైద్య బృందం ప్రపంచంలోనే తొలిసారిగా ‘క్లోరోఫామ్’ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు శస్త్ర చికిత్సను అందజేసింది. ఈ అద్భుతాన్ని అధ్యయనం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులంతా ఇక్కడికే వచ్చేవారు. అంతేకాదు 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఇదే ఆస్పత్రిలో జరిగింది. ఆ రోజుల్లోనే రూ.50 వేల ఖర్చు! 1918-20లో ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నల్ల గ్రానైట్, సున్నం కలిపి కట్టించిన ఈ పటిష్టమైన భవనం ఇండో పర్షియన్ శైలిలో రూపుదిద్దుకుంది. అప్పట్లో ప్రసిద్ధి చెందిన రాజస్తానీ, గ్రీకు, రోమన్ శైలి నిర్మాణ పద్ధతులనూ జత చేశారు. సుమారు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకేసారి 450 మంది రోగులకు చికిత్స అందించేలా దీన్ని నిర్మించారు. ఎలాంటి యంత్రాలు వాడకుండా కేవలం కూలీలతో ఐదేళ్ల పాటు కష్టపడి కట్టారు. నిర్మాణానికి ఆ రోజుల్లోనే రూ.50 వేలు ఖర్చయినట్లు అంచనా. 1925లో కొత్త భవనం అందుబాటులోకి వచ్చింది. ఇండో పర్షియన్ శైలిలో రూపుదిద్దుకున్న 110 అడుగుల ఎత్తై విశాలమైన డోమ్‌లు ఆసుపత్రికి ప్రత్యేక ఆకర్షణ. ఎత్తై గోడలకు పై భాగంలో నిజాం ప్రభువుల తలపాగలను ప్రతిబింబించే ఆకృతులను చిత్రించారు. చార్మినార్‌లోని మినార్లను పోలిన నిర్మాణాలను ఆసుపత్రి భవనంపైన కట్టించారు. డోమ్‌లను కేవలం కళాత్మకత దృష్టితోనే కాకుండా భవనంలోకి గాలి, వెలుతురు ప్రసరించేలా నిర్మించారు. రాత్రి వేళల్లో, విద్యుత్ అందుబాటులో లేని సమయాల్లో కూడా వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ గాలి, వెలుతురు వచ్చేలా వీటి ఏర్పాటు ఉంది. కూలుతున్న పైకప్పులు... ఏళ్ల తరబడి పునరుద్ధరణ పనులు చేయకపోవడంతో ఆసుపత్రి పెచ్చులూడుతోంది. ఐదేళ్ల కిందట సూపరింటెండెంట్ తన కార్యాలయంలో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా పైకప్పు కూలింది. డాక్టర్ డీవీఎస్ ప్రతాప్, డాక్టర్ రవీందర్ గాయపడ్డారు. ఆ తర్వాత వార్డులో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు సహా ఇద్దరు రోగులపైన పెచ్చులు పడి గాయాలయ్యాయి. ఇటీవల జనరల్ సర్జన్ విభాగంలో పైకప్పు కూలింది. వారం తిరగకుండానే మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. దీంతో వైద్యులు ఆందోళనకు దిగారు. వైద్యులు, పారామెడికల్ స్టాఫ్, నర్సులు, ఉద్యోగ సంఘాలన్నీ కలసి ఉస్మానియా ఆస్పత్రి పరిరక్షణ కమిటీగా ఏర్పడ్డాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలసి ప్రాణాలకు రక్షణ లేని ఈ ఆస్పత్రిలో పని చేయలేమని స్పష్టం చేశారు. మంత్రి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. భవనంపై అధ్యయనం చేసిన జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణులు కూడా రోగులకు ఏమాత్రం సురక్షితం కాదని స్పష్టం చేశారు. దీంతో కొత్త భవనం నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇంకా వందల ఏళ్ల దాకా కాపాడవచ్చు.. చారిత్రక ఉస్మానియా భవనాన్ని కూల్చడం కన్నా అత్యాధునిక పద్ధతుల్లో మరమ్మతులు చేసి అలాగే కొన సాగించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. భవనం పటుత్వంపై అనుమానాలు అక్కర్లేదని, నిరంతర నిర్వహణ పనులు చేస్తే కొన్ని వందల ఏళ్ల వరకు దాన్ని కాపాడవచ్చని పేర్కొంటున్నారు. ‘అదో అద్భుత నిర్మాణం.. అలనాటి నిర్మాణ శైలికి నిలువెత్తు దర్పణం.. ప్రపంచవ్యాప్తంగా వారసత్వ కట్టడాలను పదిలంగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మనం దానికి భిన్నంగా వ్యవహరించటం సరికాదు. ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు కొనసాగిస్తే మరో 400 ఏళ్లయినా ఇంతే ఠీవిగా నిలబడే సత్తువ ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ఉంది’’ అని ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణులు హను మంతరావు తెలిపారు. పైకప్పు జాక్ ఆర్చి రూఫ్ డిజైన్‌లో ఉంటే దాన్ని క్రాస్ గర్డర్‌లో సరిచేయొచ్చని ఆయన సూచించారు. చూస్తూ ఊరుకోం ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఒక్కో కట్టడం ఒక్కో ప్రత్యేకత. కొత్త భవ న నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు, ఆ పేరుతో వారసత్వ సంపదను ధ్వంసం చేయాలని చూడటం దారుణం. దీన్ని చూస్తూ ఊర్కోబోం. -వేదకుమార్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వైద్యం నిర్వీర్యం చేసేందుకే ఇలా కూల్చివేసుకుంటూ వె ళ్తే వారసత్వ కట్టడాలే ఉండవు. పాత భవనం కూల్చివేత, కొత్త భవన నిర్మాణం పేరుతో రోగులను అయోమయానికి గురి చేసి ప్రజావైద్యాన్ని నిర్వీర్యం చేసేందుకు పన్నిన కుట్ర ఇది. - పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు కొత్త భవనం కావాల్సిందే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం పాత భవనం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ఇక్కడ పని చేయలేం. రోగులు, వైద్యుల సంక్షేమం దృష్ట్యా వెంటనే కొత్త భవనాన్ని నిర్మించాలి. -బొంగు రమేశ్, టీజీడీఏ -
భవనం కూలి 9మంది సజీవ సమాధి
సాక్షి, ముంబై: శిథిలావస్థకు చేరుకున్న ఓ మూడంతస్తుల భవనం కూలి 9 మంది మృతి చెందిన ఘటన ఠాకుర్లీ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో దాదాపు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. చోవ్లే గ్రామంలోని ‘మాతృఛాయ’ భవనాన్ని 35 ఏళ్ల కింద నిర్మించారు. శిథిలావస్థకు చేరుకోవడంతో మంగళవారం అర్ధరాత్రి కుప్పకూలింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోంది. శిథిలాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను డోంబివలీలోని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు 9 మంది మృతదేహాలను వెలికితీసినట్లు కల్యాణ్ మండల తహసీల్దార్ కిరణ్ తెలిపారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఎడతెరపి లేని వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రమాదం జరిగినపుడు ఆ భవనంలో 20 కుటుంబాలు ఉన్నాయి. మంత్రి ఏక్నాథ్ షిండే, ఎంపీ శ్రీకాంత్ షిండే, కలెక్టర్ అశ్విని జోషి, ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా, శిథిలాల్లో చిక్కుకున్న క్షతగాత్రులందరినీ వెలికితీశామని, సహాయక చర్యలు ముగిశాయని తహసీల్దార్ కిరణ్ తెలిపారు. -
మెరుగుపెడితే ‘ఉస్మానియా’ మరో చౌమొహల్లా
ఆస్పత్రి భవనం పటుత్వంపై సందేహాలొద్దు కన్జర్వేషన్ ఇంజనీరింగ్‌తో వందల ఏళ్లు కాపాడొచ్చు చారిత్రక అద్భుతాన్ని నేలకూల్చొద్దు రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ హనుమంతరావు హైదరాబాద్: శిథిలావస్థకు చేరిన చారిత్రక, వారసత్వ కట్టడమైన ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని తొలగించి ఆ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాల (ట్విన్ టవర్స్) ఆస్పత్రి నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్, ఐరాస కన్సల్టెంట్ ఇ.ఎన్.సి హనుమంతరావు తప్పుబట్టారు. ఆ భవనాన్ని కొన్ని వందల ఏళ్లపాటు కళ్లముందు నిలిపే అవకాశం ఉన్నందున దాన్ని కూల్చొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ భవనం పటుత్వంపై సందేహాలొద్దన్నారు. ‘అదో అద్భుత నిర్మాణం.. అలనాటి నిర్మాణ శైలికి దర్పణం.. ప్రపంచవ్యాప్తంగా వారసత్వ కట్టడాలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మనం దానికి భిన్నంగా వ్యవహరించటం సరికాదు.. వందల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా మనగలిగేలా మలిచి ఆ నిర్మాణాన్ని భావితరాలకు అందివ్వాల్సి ఉంది. నిరంతరం నిర్వహణ పనులు కొనసాగిస్తే మరో 400 ఏళ్లయినా ఇంతే ఠీవిగా నిలబడే సత్తువ దానికుంది. ఉస్మానియా వర్సిటీ, హైకోర్టు భవనం సరసన నిలిచిన ఈ భవనం జీవితకాలాన్ని మనం సులభంగా నిర్ధారించలేం. అప్పట్లో అత్యంత పటుత్వంగా ఉండేలా వాటిని నిర్మించారు. అయితే కాలక్రమంలో గోడల పొరలు కొంత బలహీనపడి ఊడిపోవటం కద్దు. నిర్మాణంలో వినియోగించిన డంగు సున్నం వాతావరణ ప్రభావంతో బలహీనపడినంత మాత్రాన భవనమే పటుత్వం కోల్పోయిందని అనడం సరికాదు. పునాదులను బలహీనపడే పటుత్వం లేని భూమి కాదిది. గోడలు శిథిలమైన దాఖలాలేవీ లేవు. పైకప్పు జాక్ ఆర్చి రూఫ్ డిజైన్‌లో ఉంటే దాన్ని క్రాస్ గర్డర్‌లో సరిచేయొచ్చు, భారీ భూకంపాలు వస్తే తప్ప ఆ భవనం కూలే అవకాశమే లేదు’ అని పేర్కొన్నారు. సంరక్షణ చర్యలే కీలకం... గతంలో రాజ్‌భవన్ పైకప్పు నుంచి పెచ్చులూడి కిందపడటంతో ఆ భవనం శిథిలావస్థకు చేరుకుందనే భావన వ్యక్తమైందని, కానీ శాస్త్రీయ పద్ధతిలో దానికి సంరక్షణ చర్యలు చేపట్టడంతో అది ఠీవిగా కొనసాగుతోందని హనుమంతరావు గుర్తుచేశారు. అలాగే కొన్నేళ్లక్రితం వరకు కాలం తీరిన భవనాల జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించిన చౌమొహల్లా ప్యాలెస్ ఇప్పుడు విదేశీ పర్యాటకులను గొప్పగా ఆకట్టుకుంటోందని...అందుకు సంరక్షణ చర్యలే కారణమన్నారు. ఇటలీలో ఓ పక్కకు ఒరిగిన ప్రపంచ ప్రఖ్యాత ‘లీనింగ్ టవర్ ఆఫ్ పీసా’ను కన్జర్వేషన్ ఇంజనీరింగ్ ద్వారానే కాపాడుతున్నారన్నారు. కన్జర్వేషన్ ఇంజనీరింగ్ పద్ధతులను అవలంబించి మరమ్మతు చర్యలు చేపడితే ఉస్మానియా ఆస్పత్రి భవనం మరో చౌమొహల్లా ప్యాలెస్‌గా వెలుగొందుతుందన్నారు. ఆస్పత్రి భవనం పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా జేఎన్టీయూ నుంచి నివేదిక తెప్పించుకోవచ్చన్నారు. -
మరుగున పడ్డాయి..
మరుగుదొడ్లు లేక విద్యార్థుల ఇక్కట్లు జిల్లాలో 5,009 పాఠశాలలు వెయ్యి పాఠశాలల్లో మరుగుదొడ్లు కరువు 2,601 పాఠశాలల్లో బాలురకు మరుగుదొడ్లు లేవు 90 శాతం మరుగుదొడ్లకు నీళ్ల కరువు కొన్నింటికి తాళాలు, మిగిలినవి శిథిలావస్థకు.. నారు పోసినోడు.. నీరు పోయకమానడు అన్న పెద్దలమాట విన్న విద్యార్థులు మరుగుదొడ్లు కట్టించారు కదా.. నీటి వసతి కల్పిస్తారులే అనుకుంటే, అధికారులు మొండిచే రుు చూపారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లోని మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారారుు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ‘నీటి’మూటలుగా మిగలడంతో విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు నోట మాట రాక, ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తున్నారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా బాలికల అవస్థలు అన్నీ ఇన్ని కావు. వారిది చెప్పుకోలేని బాధ. జిల్లాలో 5,009 పాఠశాలుండగా అన్ని నియోజకవర్గాల్లో దాదాపు వెయ్యి పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. 2,601 పాఠశాలల్లో బాలురకు ఒక్క మరుగుదొడ్డి కూడా లేదు. పేరుకు 90 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించినా నీటివసతి లేక నిరుపయోగంగా మారాయి. పాఠశాలలకు నీటి వసతి కల్పిం చాల్సిన బాధ్యత ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలదేనని అధికారులు చెబుతున్నా అమలు కావడం లేదు. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లకు తాళాలు వేయగా, మిగిలినవి పిచ్చి మొక్కలు మొలిచి శిథిలావస్థకు చేరి పనికి రాకుండా పోయాయి. మరికొన్నింటిని తొలగించి పాఠశాల అదనపు గదులను నిర్మించారు. విద్యార్థులు ఆరు బయటే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు వెచ్చి ంచి పేరుకు మరుగుదొడ్లు నిర్మించినా వాటికి నీటివసతి కల్పించి వినియోగంలోకి తీసుకురాకపోవడంతో బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. ఈ ఏడాది మరుగుదొడ్ల నిర్వహణకు ప్రభుత్వం రూ.1.09 కోట్లు మంజూరు చేసిందని, జిల్లాలో జూన్ నుంచి స్పెషల్ డ్రైవ్‌గా చేపట్టామని, పాఠశాలల మరుగుదొడ్లు వినియోగంలో ఉన్నాయని సర్వశిక్షా అభియాన్ పీవో లక్ష్మీ చెప్పడం గమనార్హం. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఎంత ఖర్చు చేసిందని తనకు తెలియదని ఎస్ఎస్ఏ ఇంజినీర్‌ను అడగాలంటూ సమాధానమిచ్చారు. తాను కొత్తగా వచ్చానని, నిధుల ఖర్చుల విషయం తనకు తెలియదని ఇంజినీర్ రవీం ద్రబాబు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. తంబళ్లపల్లె నియోజకవర్గపరిధిలో 390 పాఠశాలలు ఉన్నాయి. నీటి సౌకర్యం లేక 80 శాతం మరుగుదొడ్లు మూతపడ్డాయి. నియోజకవర ్గవ్యాప్తంగా కేవలం 15 పాఠశాలలకు మాత్రమే నీటి సౌకర్యం ఉంది. కొన్ని మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో 325 పాఠశాలలు ఉన్నాయి. 95 శాతం పాఠశాలలకు మరుగుదొడ్లు నిర్మించినా నీరు లేక నిరుపయోగంగా మారాయి. బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుబయట, సమీపంలోని పొలాల్లో కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో 455 పాఠశాలలు ఉన్నారుు. నిబంధనల మేరకు కనీ సం 40 మందికి ఒక మరుగుదొడ్డి నిర్మిం చాల్సి ఉంది. పెనుమూరు పాఠశాలలో 600 మంది విద్యార్థులకు 15 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. నియోజకవర్గం పరిధిలో 90 శాతం మరుగుదొడ్లకు నీటి వసతి లేదు. పలమనేరు నియోజకవర్గంలో ఐదు మం డలాల పరిధిలో 501 పాఠశాలలుండగా, 42.441 విద్యార్థులు ఉన్నారు. 410 పాఠశాలల్లో మరుగుదొడ్లు అలంకారప్రాయంగా మారాయి. కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరాయి. కొన్ని హైస్కూళ్లల్లో ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో 390 పాఠశాలలు ఉన్నాయి. 95 పాఠశాలల పరిధి లో మరుగుదొడ్లకు నీటి వసతి లేదు. కొన్నింటికి తాళాలు వేశారు. మరికొన్ని డోర్లు పాడైపోయి శిథిలావస్థకు చేరాయి. సత్యవేడు నియోజకవర్గంలో 413 పాఠశాలలు ఉన్నాయి. 118 పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. 112 పాఠశాలల్లోని మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేదు. పుంగనూరు నియోజకవర్గంలో 362 పాఠశాలలు ఉన్నాయి. 41 పాఠశాల్లో మాత్రమే నీటి వసతి ఉంది. మిగిలిన పాఠశాలల్లో మరుగుదొడ్లునిరుపయోగంగా మారాయి. పుత్తూరు నియోజకవర్గంలో 307 పాఠశాలలు ఉన్నాయి. 32 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. మిగిలిన పాఠశాలల్లో 90 శాతం వాటికి నీటి సౌకర్యం లేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 349 పాఠశాలలు ఉన్నాయి. 90 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించారు. 60 శా తం పాఠశాలల పరిధిలో నీటివసతి లేక మరుగుదొడ్లునిరుపయోగంగా మారాయి. కుప్పం నియోజకవర్గ పరిధిలో 475 పాఠశాలలు ఉన్నాయి. 80 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించారు. నీటి వసతి కల్పించలేదు. నీటి వసతి కల్పించే బాధ్య త సర్పంచులదేనని జిల్లా అధికారులు చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదు. మదనపల్లె నియోజకవర్గపరిధిలో 215 పాఠశాలల్లో 30,200 మంది విద్యార్థులు ఉన్నారు. 95 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నాయి. 70 శాతం వాటిలో నీటివసతి లేదు. కొన్ని మరుగుదొడ్లు పిచ్చిమొక్కలుమొలిచి పనికి రాకుండా పోయాయి చిత్తూరు నియోజకవర్గపరిధిలో 215 పాఠశాలున్నాయి. వీటిల్లో 11,699 మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించారు. చిత్తూ రు రూరల్, అర్బన్, గుడిపాల పరిధిలో 78 పాఠశాలల్లో నీటి సౌకర్యం లేదు. -
చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాన్ని..!
నాటి రాచరికపు వైభవానికి గుర్తును మాత్రమే కాదు.. శిథిలావస్థలో ఉన్న కట్టడాన్ని అసలే కాదు.. నాటి శిల్పకళా చాతుర్యానికి నిదర్శనాన్ని ఘన చరిత్రకు సజీవ సాక్ష్యాన్ని. నా పేరు ఏదైనా మీరంతా చెప్పుకునే ‘కోట’ను నేను. మీ కోసమే నా ఎదురుచూపు.. మిమ్మల్నే...! అవును, నేను పిలుస్తున్నది మిమ్మల్నే..!! నా పిలుపు మీ చెవిని తాకడం లేదా!! నా రూపు మిమ్మల్ని ఆకట్టుకోవడం లేదా!! అవునులే, వార్ధక్యంలో ఉన్న నన్ను చూడాలని, పట్టించుకోవాలని మీకెందుకుంటుంది?! పుట్టిన నాటి నుంచే ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎన్ని చూశానో మీకు తెలుసా! ఏ రాజు కలలో ఊపిరి పోసుకున్నానో.. ఎంతమంది శ్రామికులు, శిల్పులు.. నన్ను ఇంత ఠీవిగా నిలబెట్టారో, ఎంత ధనం ఖర్చయిందో.. ఎంత మంది నాకు ప్రాణం పోయడానికి తాము ప్రాణార్పణం చేశారో.. ఎన్ని కథలు విన్నానో.. ఎందరి గాథలు తెలుసుకున్నానో.. ఇంకెన్ని యుద్ధాలకు సాక్ష్యంగా నిలిచానో.. వందల ఏళ్లుగా ఉన్నచోటనే సాగే నా ప్రయాణంలో మీరూ ఓ అడుగవ్వమని కోరుతున్నాను. మీకు తీరిక లేకపోయినా.. నాకు తెలిసినది చెప్పాలని ఉబలాటం. చూసినది మీ కళ్లకు కట్టాలని ఆరాటం. కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోయి, అజాగ్రత్తల వలలో ఇమిడిపోయి... ఒళ్లు సడలిపోయి.. అలసిపోయి.. ఇంకా ఎన్నాళ్లు, ఎన్నేళ్లు ఉంటానో తెలియనిదాన్ని. మీ ఊళ్లోనో.. మీ ఊరి చివరనో.. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నదాన్ని. అస్థిత్వాన్ని కోల్పోకుండా ఉండటం కోసమే నా ఆరాటం. నాటి రాజ్యాలకు రాచకొలువును. మేధాపరమైన చర్చలకు, కళలకు, రాచరికపు హుందాతనానికి వేదికను. ఒక్కసారి వచ్చిపోండి. నా ఈ కళ్లతో నాటి అద్భుతాలను మీ ముందుంచుతాను... మీ కళ్లు విప్పార్చి, తల పెకైత్తి నన్నే దీక్షగా చూస్తున్నారా! నాకు ఇంతటి ఠీవిని ఎవరు కట్టబెట్టారో తెలుసా! పెద్ద పెద్ద రాళ్లను ఒకదాని మీద ఒకటి ఎలా పేర్చారో చూశారా! అంతా పుస్తకాల్లో చదివామనో, ఎవరో చెబితే వినడమో కాదు... నేటి మహామహులు సైతం తలవంచి సలామ్ చేసిన నాటి పరిజ్ఞానం ఎంత గొప్పదో మీ కళ్లతో మీరే చూసి తెలుసుకోండి. టైమ్ మిషన్‌ని... పిల్లలకు ‘టైమ్ మిషన్’ గురించి ఎన్నో ఆంగ్ల సినిమాలను పరిచయం చేస్తూ చెబుతారు. కాలాన్ని వెనక్కి తిప్పి చూపించాలనుకుంటారు. ఒక్కసారి నా కోట గుమ్మం వద్దకు తీసుకురండి. కాకతీయుల పాలించిన నేల.. చాళుక్యులు, పల్లవుల పరిపాలన.. అంటూ ఇక్కడే మొదలుపెట్టండి. ‘అనగనగా రాజు.. కోట నుండి యుద్ధానికి బయల్దేరాడు..’ అంటూ బడిలో పుస్తకాల ద్వారా చెప్పిన చరిత్రను కళ్లకు కట్టినట్టుగా చూపించండి. పిల్లల్లో అవగాహన, ఆలోచనా శక్తి మీరు ఊహించనంతగా పెరుగుతుంది. జీవన పోరాటాలను తెలియజేసే కథలెన్నో నన్ను చూపిస్తూ మీ చిన్నారులకు ఎంతో సులువుగా పరిచయం చేయవచ్చు. చెక్కుచెదరని ‘టైమ్ మిషన్’ అవునో కాదో వారే నిర్ధారిస్తారు. ఇంకొన్నాళ్లు నన్ను కాపాడుకోవాలనే ఆలోచన చేస్తారు. అదేగా ముందు తరాలకు మీరిచ్చే సంపద. బంధాలకు ఇల్లు... నేను రాతి కట్టడాన్నే! కానీ, కుటుంబమంతా మీరు కలిసి రావాలని ఆశపడతాను. అలా వస్తే నా గుండె సంతోషంతో ఉప్పొంగిపోతుంది. కూర్చోవడానికి వేదికలు వేసి ఉంచుతాను. కనువిందు చేసే శిల్పాలతో ఊహల్లో నాట్యమాడిస్తాను. గుప్తంగా ఉండే కోశాగారాలను, అబ్బురపరిచే ఆహార శాలలను, ధాన్యపు గిడ్డంగులను.. అన్నీ పరిచయం చేస్తాను. ఇక్కడంతా కలిసి ఎంత చెప్పుకున్నా తనవి తీరని ముచ్చట్లు. ఆ మాటల్లో పెరిగే దగ్గరితనం... బంధాలకు కొలువుగా అతి పెద్ద ఇల్లుగా మీ రాక కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. శత్రురాజులకు దడపుట్టించిన ఫిరంగులు, రేయింబవళ్లు పహారా కాసిన కాపలాదారుల స్థావరాలు, గుర్రపు శాలలు, ఆంతరంగిక మందిరాలు.. ఎన్నో విచిత్రాలతో మిమ్మల్ని అడుగడుగునా విస్మయపరుస్తూనే ఉంటాను. నూతన హంగులు... ఎన్నో కోటలు కనుమరుగయ్యాయి. కోట ప్రాంతాలు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. ఇంకెన్నో కోటలు అవసాన దశలో ఉన్నాయి. గ్రామ, జిల్లా స్థాయిలో ఉండే కొన్ని కోటల గురించి సమాచారమే లేదు. కనుమరుగవుతున్న వాటిని పట్టించుకునేవారూ లేరు. రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలు అద్బుతంగా ఉన్నాయని వాటిని చూడటానికి మళ్లీ మళ్లీ వెళుతుంటారు. కానీ, అలనాటి వైభవాన్ని ఇప్పటికీ చెక్కుచెదరనీయకుండా అక్కడివారు కాపాడుకుంటూ వస్తున్న విధానాన్ని కనిపెడుతున్నారా..! అక్కడి కోటలకు నూతన హంగులు అద్ది, హోటళ్లుగా మార్చే నైజాన్ని తెలుసుకున్నారా! ఈ విధానం వల్ల ఆ రాష్ట్ర ఆదాయమూ పెరిగిందని వార్తలు మీ చెవిన పడుతున్నాయా! ఈ దిశగానూ ఒక్కసారి ఆలోచన చేయండి. నాటి రాజులకు రక్షణ కవచంగానే కాదు, మీకు ఆదాయవనరుగానూ మారుతాను. నాటి వైభవాన్ని ముందు ముందు ఇంకెంతో మందికి చాటుతూనే ఉంటాను. తీసుకువెళ్లండి..! నా దగ్గరకు రండి. నాతో ఉన్న కొన్ని గంటలను అమూల్యంగా మదిలో దాచుకోండి. ఇక్కడ గడిపిన గుర్తులను ఫొటోల రూపంలో పదిలంగా తీసుకెళ్లండి. కానీ, మీ గుర్తులను నా దగ్గర వదలాలని చూడకండి. ఎందుకంటే మీరు వ చ్చిన విషయం నాకు తెలుసు. మీ సందడి నా గుండె గోడల నిండుగా ఘల్లుమంటూనే ఉంటుంది. కానీ, మీ పేర్లు, గుర్తులు నా గుండె మీద చెక్కుతున్నప్పుడు నేను పడే వేదన మీకు తెలియడం లేదు. వాహనాలు, పరిశ్రమలు వదిలే కాలుష్యం నన్ను రోజు రోజుకూ మసకబారేలా చేస్తున్న విషయం మీకు తట్టడం లేదు. మీరు వెళుతూ వెళుతూ ఒక్కసారి నా వేదనను పట్టించుకొమ్మని ఒక చిన్న విన్నపం. - నిర్మలారెడ్డి అప్పటి కథలకు ఆనవాళ్లు హైదరాబాద్ నుంచి సుమారు దూరం (కి.మీ.) గోల్కొండ కోట (హైదరాబాద్)... 23 కి.మీ కొండపల్లి కోట (కృష్ణా జిల్లా).. 258 కి.మీ వరంగల్ కోట (వరంగల్ జిల్లా) .. 150 కి.మీ భువనగిరి కోట (నల్గొండ జిల్లా).. 48 కి.మీ పెనుకొండ కోట (అనంతపురం జిల్లా).. 431కి.మీ గండికోట (వై.ఎస్.ఆర్. కడప జిల్లా ) ... 500 కి.మీ బొబ్బిలి కోట (విజయనగరం జిల్లా).. 636 కి.మీ చంద్రగిరి కోట (చిత్తూరు జిల్లా)... 572 కి.మీ మీ ఊరు, మీ ప్రాంతంలో ప్రాచీన కట్టడాలేవైనా ఉంటే వాటి వివరాలను ఫొటోలతో సహా తెలుపండి. ప్రచురిస్తాం. మీరు పంపవలసిన చిరునామా: విహారి, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్, హైదరాబాద్ -34. e-mail:sakshivihari@gmail.com -
ఆడుకుంటూ అనంతలోకాలకు..
అక్కడ ప్రమాదం పొంచి ఉందని తెలుసు. అంతా అప్రమత్తమై సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫలితం లేదు. ‘సాక్షి’ స్వయంగా పరిశీలించి ప్రమాదాన్ని ముందే ఊహించి ఓ కథనం ప్రచురించింది. సంబంధిత అధికారుల్లో స్పందన కరువైంది. ఫలితంగా ఓ భావి భారత పౌరుడి ప్రాణాలు బలయ్యాయి. * బాలుడిని పొట్టనబెట్టుకున్న శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల గోడ * పాఠశాలను తక్షణమే కూల్చాలని మొత్తుకున్నా పట్టించుకోని అధికారులు * ఐదు నెలల క్రితమే హెచ్చరించిన ‘సాక్షి’ తాళ్లూరు : మండలంలోని వెలుగువారిపాలెం యూపీ పాఠశాల ఆవరణలో ఆదివారం శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం గోడ కూలడంతో మూలంరెడ్డి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (11) అనే బాలుడు మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటరెడ్డికి ముగ్గురు కుమారులు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రెండో కుమారుడు. తూర్పుగంగవరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతూ అక్కడి హాస్టల్లోనే ఉంటున్నాడు. ఆదివారం కావటంతో స్వగ్రామం వెలుగువారిపాలెం వచ్చాడు. స్థానిక సహచర విద్యార్థులతో కలిసి ఉదయం 10 గంటల సమయంలో ప్రభుత్వ యూపీ పాఠశాల ప్రాంగణంలోకి వెళ్లాడు. శనివారం రాత్రి భారీ వర్షం కురవడంతో పాఠశాల గోడలు నానిపోయాయి. ఉన్నట్టుండి అక్కడ ఆడుకుంటున్న విద్యార్థులపై ఓ గోడ కూలిపోయింది. మిగిలిన విద్యార్థులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. శిథిలాల మధ్య ప్రవీణ్‌కుమార్ చిక్కుకున్నాడు. కిటికీపై అమర్చిన నాపరాళ్లు పడటంతో తల, గుండె భాగం తీవ్రంగా గాయపడింది. చిన్నారిని వైద్యశాలకు తరలించేలోపు మృతి చెందాడు. పొలంలో ఉన్న తల్లిదండ్రులు భోరున విలపిస్తూ పాఠశాలకు చేరుకున్నారు. బిడ్డ మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ముందే చెప్పినా పట్టించుకోని అధికారులు శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలపై సాక్షి దినపత్రిక అనేకసార్లు కథనాలు ప్రచురించింది. ఐదు నెలల క్రితం కూడా ‘ప్రమాదపుటంచున పాఠాశాలలు’ శీర్షికతో దర్శి నియోజకవర్గంలోని అనేక పాఠశాలల దుస్థితిపై ఓ కథనాన్ని పబ్లిష్ చేసింది. ప్రస్తుత సంఘటనతో అంతా ఆ కథనాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు.పాఠశాల హెచ్ఎం అజీమ్‌బాషా కూడా ప్రమాదాన్ని ముందే గుర్తించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని కూల్చాలని 2013 జూన్‌లో మండల ప్రజాపరిషత్ అధికారులకు అర్జీ ఇచ్చారు. గ్రామస్తులు, హెచ్ఎం, సాక్షి దినపత్రిక.. ఇలా ఎంతమంది ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా ఒక విద్యార్థి ప్రాణం పోవాల్సి వచ్చింది. -
షట్టర్లు శిథిలం
బాపట్ల బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన లాకులు, షట్టర్లు శిథిలావస్థకు చేరడంతో పొలాలకు సాగునీరు అందడం కష్టంగా మారింది. డ్రైనేజీ ఆధునికీకరణ పనుల్లో జాప్యం రైతుల పాలిట శాపంగా పరిణమించింది. కొమ్మమూరు కాల్వ పరిధిలో బాపట్ల మండలం నరసాయపాలెం వద్దగల నల్లమడ లాకులు, షటర్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. బ్రిటిష్‌కాలం నాటి 15 షట్టర్లు, అనంతరం నిర్మించిన మరో పది పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. వీటితో నీటికి అడ్డుకట్ట వేసే పరిస్థితి లేకపోవడంతో దిగువ ప్రాంతాలకు సక్రమంగా నీరందడం లేదు. కొమ్మమూరు కాలువ కృష్ణా పశ్చిమ డెల్టా నుంచి నరసాయపాలెం వద్ద ఉన్న నల్లమడ లాకుల వద్దకు సుమారు 69.545 కిలో మీటర్ల మేరకు విస్తరించి ఉంది. కొమ్మమూరు కాలువ మొత్తం ఆయకట్టు 2.15 లక్షల ఎకరాలు. అనధికారిక సాగు మరో 50 వేల ఎకరాల వరకూ ఉంటుంది. దుగ్గిరాల వద్ద 3600 క్యూసెక్కులు నీరు వదిలినా బాపట్ల చానల్, పీటీ చానల్లకు పోగా నల్లమడ లాకుల వద్దకు 1100 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక్కడ నుంచి ఈ కాల్వ 70,599 ఎకరాల ఠమొదటిపేజీ తరువాయి ఆయకట్టు ఉంది. ఎగువ కాలువ నీటి మట్టం 11.92 అడుగులు ఉండగా, దిగువ ఆయకట్టు 8.92 అడుగులు ఉంటుంది. ఎగువ ప్రాంతంలో కాలువ వెడల్పు 64 అడుగులుండగా, దిగువ ప్రాంతంలో 48 అడుగులుంటుంది. ఈ ప్రాంతం నుంచి నరసాయపాలెం, వెదుళ్లపల్లి, చెరుకుపల్లి ట్యాంకు కాలువ, ప్రకాశం జిల్లాలోని పెద్దగంజాం వరకూ లాకుల నుంచే నీరు వెళుతుంది. ఈ లాకుల వద్ద కనీసం ఆరు అడుగుల మేరకు నీరుంటే గానీ బాపట్ల, పీటీ చానల్‌కు నీరు పారే అవకాశం లేదు. రైతుల ఇక్కట్లు.: ఉప్పరపాలెం వద్ద కాలువకు మరమ్మతులు చేయకుండా షట్టర్లు ఏర్పాటు చేయడంతో అవీ శిథిలావస్థకు చేరాయి. దీంతో పంట కాలువలో ఉండే నీటికి వర్షం నీరు తోడయినప్పుడు దెబ్బతింటున్నాయి. ఫలితంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కీలకమైన సమయంలో నీటి నిల్వలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఆధునికీకరణకు నిధులు విడుదలైతేనే పూర్తి స్థాయిలో లాకులు, షట్టర్లకు మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
అన్నీ అపశకునాలే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ జిల్లా పరిషత్ భవన నిర్మాణానికి అన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయి. శంకుస్థాపన జరిగి పుష్కరకాలం గడుస్తున్నా, ప్రతిపాదిత భవనం పునాదులకే పరిమితమైంది. శిథిలావస్థకు చేరిన జెడ్పీ భవనాన్ని 2003లో నేలమట్టం చేశారు. దీని స్థానంలో జెడ్పీ కాంప్లెక్స్‌ను నిర్మించాలని నిర్ణయించిన అప్పటి పాలకవర్గం అదే ఏడాది జూన్‌లో పునాదిరాయి వేసింది. భవన నిర్మాణం విషయంలో తనను సంప్రదించకుండా ముఖ్యమంత్రిని కలవడంపై అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం కాస్తా రాజకీయ మలుపు తిరగడంతో జిల్లా పరిషత్ భవన సముదాయం శిలాఫలాకంతోనే సరిపెట్టుకుంది. ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి కొలువుదీరినప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పురాలేదు. చివరకు పాలకవర్గం పదవీకాలం ముగిసే తరుణంలో శాంతించిన సబిత.. జెడ్పీ భవనానికి పాలనాపరమైన అనుమతి లభించేలా చేశారు. దీంతో భవన నిర్మాణానికి మార్గం సుగమమైనా...పురోగతి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. భగీరథ ప్రయత్నం పాత బిల్డింగ్ స్థానే జెడ్పీ కాంప్లెక్స్‌ను నిర్మించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. తొమ్మిది అంతస్తుల భవనాన్ని ప్రతిపాదించిన ఇంజినీరింగ్ శాఖ... ఒక్కో అంతస్తులో 22 వేల చదరపు మీటర్ల స్థలం ఉండేలా డిజైన్ చేసింది. ఈ క్రమంలోనే తొలిదశలో కేవలం జీ+3 అంతస్తులకే పరిమితం చేయాలని భావించి... ఆ మేరకు రూ.10 కోట్లను కేటాయించింది. 2012, జూన్‌లో కాంట్రాక్టర్‌కు పని అప్పగించింది. కాంట్రాక్టు కాలపరిమితి ఈ ఏడాది మే నాటికి పూర్తయినప్పటికీ, పనుల్లో పురోగతి కనిపించకపోవడంతో మరో ఏడాది గడువును పొడిగించింది. జిల్లా పరిషత్ ఆవరణలో భారీ బండరాళ్లు ఉండడం, వీటిని పగులగొట్టడం శక్తికిమించిన భారం కావడంతో పనులు ఆలస్యమయ్యాయి. నివాస ప్రాంతాల మధ్య ఉండడం రాళ్లను పగులగొట్టేందుకు అనుమతి లభించకపోవడం కూడా జాప్యానికి మరో కారణం. ఎలాగోలా రాతి కొండలను తొలగించిన కాంట్రాక్టర్‌కు తాజాగా మరో చిక్కు వచ్చి పడింది. ఈ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటడం... ఇక్కడ వేసిన బోర్లలో నీటి చుక్క రాకపోవడం కొత్త సమస్యకు దారితీసింది. సుమారు 1000-1500 అడుగుల లోతులో దాదాపు 16 బోర్లు వేసినప్పటికీ నీటి అచూకీ లభ్యం కాకపోవడం నిర్మాణ పనులపై తీవ్ర ప్రభావం చూపింది. రూ.36 లక్షలు కడితే..! బోరుబావులు తవ్వినా నీటి జాడ కనిపించకపోవడంతో జలమండలి నుంచి నల్లా కనెక్షన్ తీసుకోవాలని జెడ్పీ నిర్ణయించింది. వాణిజ్యావసరాల కేటగిరి కింద కనెక్షన్ తీసుకోవాల్సి ఉండడం... దీనికి రూ.36 లక్షలు చెల్లించాల్సి రావడంపై జెడ్పీ యంత్రాంగం పెదవి విరుస్తోంది. ఈ మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లిస్తామని, ప్రభుత్వ భవనం కనుక ఉచితంగా కనెక్షన్ ఇవ్వాలని బేరమాడుతోంది. గృహావసరాల కింద కనెక్షన్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని వేడుకుంటోంది. వాటర్‌బోర్డు మాత్రం కమర్షియల్‌గా పరిగణించి కనెక్షన్ జారీచేస్తామని, నయాపైసా కూడా తగ్గించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది. దింపుడు కళ్లెం ఆశలు వదులుకోని జిల్లా పరిషత్ అధికారులు మాత్రం.. పునరాలోచించాలని వాటర్‌బోర్డుకు లేఖ రాయాలని నిర్ణయించారు. కాంట్రాక్టు అగ్రిమెంట్లో కేవలం బోర్లు మాత్రమే ప్రతిపాదించిన నేపథ్యంలో... నల్లా కనెక్షన్‌కు సంబంధించిన మొత్తాన్ని ఎవరు భరించాలనే అంశంపై జెడ్పీ తేల్చుకోలేకపోతుంది. రూ.2 కోట్లు పెంపు..! మరోవైపు అంచనా వ్యయాన్ని పెంచేందుకు ఇంజనీరింగ్ శాఖ తెరవె నుక ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బండరాళ్లను తొలగించడం కాంట్రాక్టర్‌కు ఆర్థికభారాన్ని కలిగించినందున.. అదనంగా రూ.2 కోట్ల వ్యయం పెంచాలని భావిస్తోంది.ఇదిలావుండగా, కాంట్రాక్టర్ కూడా భవన నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల చేస్తే తప్ప పనులు కొనసాగించలేనని చేతులెత్తేశారు. దీంతో గత పక్షం రోజులుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి. రాళ్లను పగలగొట్టేందుకే రూ.కోటిన్నర ఖర్చయిందని, కొంత మేర నిధులు విడుదల చేస్తేనే అడుగు ముందుకేస్తానని తెగేసి చెప్పినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. దీంతో జెడ్పీ యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి మరి.