శిథిలావస్థకు చేరుకున్న ఓ మూడంతస్తుల భవనం కూలి 9 మంది మృతి చెందిన ఘటన ఠాకుర్లీ జిల్లాలో చోటుచేసుకుంది.
సాక్షి, ముంబై: శిథిలావస్థకు చేరుకున్న ఓ మూడంతస్తుల భవనం కూలి 9 మంది మృతి చెందిన ఘటన ఠాకుర్లీ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనలో దాదాపు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. చోవ్లే గ్రామంలోని ‘మాతృఛాయ’ భవనాన్ని 35 ఏళ్ల కింద నిర్మించారు. శిథిలావస్థకు చేరుకోవడంతో మంగళవారం అర్ధరాత్రి కుప్పకూలింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోంది. శిథిలాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను డోంబివలీలోని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు 9 మంది మృతదేహాలను వెలికితీసినట్లు కల్యాణ్ మండల తహసీల్దార్ కిరణ్ తెలిపారు.
ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఎడతెరపి లేని వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రమాదం జరిగినపుడు ఆ భవనంలో 20 కుటుంబాలు ఉన్నాయి. మంత్రి ఏక్‌నాథ్ షిండే, ఎంపీ శ్రీకాంత్ షిండే, కలెక్టర్ అశ్విని జోషి, ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా, శిథిలాల్లో చిక్కుకున్న క్షతగాత్రులందరినీ వెలికితీశామని, సహాయక చర్యలు ముగిశాయని తహసీల్దార్ కిరణ్ తెలిపారు.