అక్కడ ప్రమాదం పొంచి ఉందని తెలుసు. అంతా అప్రమత్తమై సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఫలితం లేదు. ‘సాక్షి’ స్వయంగా పరిశీలించి ప్రమాదాన్ని ముందే ఊహించి ఓ కథనం ప్రచురించింది. సంబంధిత అధికారుల్లో స్పందన కరువైంది. ఫలితంగా ఓ భావి భారత పౌరుడి ప్రాణాలు బలయ్యాయి.
* బాలుడిని పొట్టనబెట్టుకున్న శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల గోడ
* పాఠశాలను తక్షణమే కూల్చాలని మొత్తుకున్నా పట్టించుకోని అధికారులు
* ఐదు నెలల క్రితమే హెచ్చరించిన ‘సాక్షి’
తాళ్లూరు : మండలంలోని వెలుగువారిపాలెం యూపీ పాఠశాల ఆవరణలో ఆదివారం శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం గోడ కూలడంతో మూలంరెడ్డి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (11) అనే బాలుడు మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటరెడ్డికి ముగ్గురు కుమారులు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రెండో కుమారుడు. తూర్పుగంగవరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతూ అక్కడి హాస్టల్లోనే ఉంటున్నాడు. ఆదివారం కావటంతో స్వగ్రామం వెలుగువారిపాలెం వచ్చాడు. స్థానిక సహచర విద్యార్థులతో కలిసి ఉదయం 10 గంటల సమయంలో ప్రభుత్వ యూపీ పాఠశాల ప్రాంగణంలోకి వెళ్లాడు.
శనివారం రాత్రి భారీ వర్షం కురవడంతో పాఠశాల గోడలు నానిపోయాయి. ఉన్నట్టుండి అక్కడ ఆడుకుంటున్న విద్యార్థులపై ఓ గోడ కూలిపోయింది. మిగిలిన విద్యార్థులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. శిథిలాల మధ్య ప్రవీణ్‌కుమార్ చిక్కుకున్నాడు. కిటికీపై అమర్చిన నాపరాళ్లు పడటంతో తల, గుండె భాగం తీవ్రంగా గాయపడింది. చిన్నారిని వైద్యశాలకు తరలించేలోపు మృతి చెందాడు. పొలంలో ఉన్న తల్లిదండ్రులు భోరున విలపిస్తూ పాఠశాలకు చేరుకున్నారు. బిడ్డ మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు.
ముందే చెప్పినా పట్టించుకోని అధికారులు
శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలపై సాక్షి దినపత్రిక అనేకసార్లు కథనాలు ప్రచురించింది. ఐదు నెలల క్రితం కూడా ‘ప్రమాదపుటంచున పాఠాశాలలు’ శీర్షికతో దర్శి నియోజకవర్గంలోని అనేక పాఠశాలల దుస్థితిపై ఓ కథనాన్ని పబ్లిష్ చేసింది. ప్రస్తుత సంఘటనతో అంతా ఆ కథనాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు.పాఠశాల హెచ్‌ఎం అజీమ్‌బాషా కూడా ప్రమాదాన్ని ముందే గుర్తించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని కూల్చాలని 2013 జూన్‌లో మండల ప్రజాపరిషత్ అధికారులకు అర్జీ ఇచ్చారు. గ్రామస్తులు, హెచ్‌ఎం, సాక్షి దినపత్రిక.. ఇలా ఎంతమంది ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా ఒక విద్యార్థి ప్రాణం పోవాల్సి వచ్చింది.
ఆడుకుంటూ అనంతలోకాలకు..
Published Mon, Oct 27 2014 3:49 AM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM
Advertisement
Advertisement