పట్టుకుంటారు.. పక్కన పడేస్తారు
♦ వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాల పరిస్థితి
♦ తుప్పుపట్టి శిథిలావస్థకు చేరుతున్న వాహనాలు
♦ మాయమవుతున్న విడి భాగాలు
♦ 12 ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాల్లో ఇదే తంతు
కాశినాయన :
పలు కేసుల్లో పట్టుబడిన పలు వాహనాలు పోలీస్‌స్టేషన్, ఎక్సైజ్, అటవీ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి మగ్గుతున్నారు. దొంగతనాలకు గురైనవి, రోడ్డు ప్రమాదాల్లో దెబ్బతిన్నవి, అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడినవి, సరైన పత్రాలు లేకుండా సీజ్ చేసిన వాహనాలు ఆయా శాఖల కార్యాలయాల్లో శిథిలావస్థకు చేరుతున్నాయి. అలాగే లారీలు, ఆటోలు, సుమోలు, స్కార్పియోలు, మోటారు సైకిళ్లు తదితర వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడిసి ఎందుకూ పనికిరాకుండా పడి ఉన్నాయి. వాహనాలు పోగొట్టుకున్నవారు కొంత కాలానికి తమ వాహనాలు దొరికాయనే సంతోషం ఎంతో కాలం ఉండడం లేదు. కారణం వాటిని తిరిగి పొందాలంటే చేంతాడంత వ్యవహారం ఉండడమే. ఈలోగా ఆయా వాహనాలకు సరైన రక్షణ లేక అవి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి.
1,500 వాహనాలు పనికిరావు
జిల్లాలో 12 ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాలున్నా యి. ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాలతో పాటు ఎక్సైజ్, పోలీసుస్టేషన్ల పరి«ధిలో వివిధ కేసుల్లో పట్టుబడినవి దాదాపు 1,500 వాహనాలు న్నాయి. బద్వేలు తాలూకాలో బద్వేలు, పో రుమామిళ్ల అటవీ కార్యాలయాల్లో పట్టుబ డిన వాహనాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో అవి తుప్పుపట్టి పోతున్నాయి. అయినా కూడా అధికారులు వాటిని పట్టించుకో వడం లేదు. ఎక్కువగా ఎర్రచందనం తరలి స్తూ పట్టుబడిన లారీలు, కార్లు, సుమోలు, ఆ టోలు వందల సంఖ్యలో అటవీశాఖ కార్యాలయంలో మగ్గుతున్నాయి. వీటిని అధికారులు పూర్తిగా పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి.
మాయమవుతున్న వాహనాల విడిభాగాలు
ఎర్రచందనాన్ని తరలించేందుకు కండీషన్‌లో ఉన్న వాహనాలనే ఉపయోగిస్తారు. అవి పట్టుబడితే అటవీశాఖ కార్యాలయానికి చేరతాయి. పట్టుబడిన వాహనాలను కొందరు అధికారులు, సిబ్బంది యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. కొందరు సిబ్బంది పట్టుబడిన వాహనాల విడిభాగాలను తొలగించి విక్రయిస్తున్నట్లు ఆరోపణ లున్నాయి. అంతేకాక గతంలో పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్ కార్యాలయంలో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలు కూడా మాయమైపోయాయి. వాహనాల బ్యాటరీలు, టైర్లు, ఇంజిన్లు వేరుచేసి అ మ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. అయినా కూడా ఉన్నతాధికారులు ఈ విషయమై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. పట్టుకున్న వాహనాలను వేలంలో విక్రయిస్తే అటు పోగొట్టుకున్న యజమానులు గానీ, టెండర్లు వేసే వారు గానీ ఎక్కువ రేట్లకు వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాహనాలను వేలం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.