
ధరూరు : అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించిన ట్యాంకులవి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా గ్రామాల ప్రజలకు తాగునీరందించిన ట్యాంకులు.. నాసిరకం పనులతో.. ఎక్కడికక్కడ సీకులు తేలిపోయాయి. ఈ ట్యాంకులతో గ్రామీణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
20 ఏళ్ల వరకు మాత్రమే...
సాధారణంగా ట్యాంకు నిర్మాణం జరిగినప్పటి నుంచి 20 ఏళ్ల వరకు మాత్రమే ఆ ట్యాంకులను వాడాలి. అలాంటిది ధరూరులో ఉన్న ట్యాంకు 40 ఏళ్లు గడుస్తున్నా నేటికీ దాని ద్వారా నీటిని వదులుతూనే ఉన్నారు. ట్యాంకుల కాలం చెల్లిన విషయం అధికారులకు తెలిసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ట్యాంకుల పక్కన ఉంటున్న నివాస గృహాల వారు, పాఠశాలలు, అంగన్‌వాడీ కంద్రాల విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
మరమ్మతులు కరువు..
శిథిలావస్థలో ఉన్న ట్యాంకులకు కనీసం మరమ్మతులు చేయించడం లేదు. ట్యాంకు అడుగు భాగం, రౌండ్ పిల్లర్లకు సిమెంట్‌ను కూడా ప్లాస్టర్ చేయించలేదు. దీంతో తేలిపోయిన మేకులు వర్షానికి తడిసి చిలుము వస్తున్నాయి.
ఇదీ పరిస్థితి...
మండలంలో చాలా గ్రామాల్లో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మేకులు తేలి ప్రమాదకరంగా మారాయి. ఈ ట్యాంకులను గతంలో ఆర్‌డబ్లూస్ ఏఈగా పనిచేసిన బషీర్ ఉన్నతాధికారుల ఆదేశానుసారం నాలుగేళ్ల క్రితం నీటిని నింపడం ఆపివేశారు. గ్రామంలో రెండే ట్యాంకులు ఉండటం.. పెద్ద గ్రామం కావడంతో తిరిగి ఆ ట్యాంకును వినియోగంలోకి తీసుకొచ్చారు. వీటితో పాటు పారుచర్ల, మార్లబీడు తదితర గ్రామాల్లోని ట్యాంకులు శిథిలావస్థలో ఉన్నాయి.
ప్రతిపసాదనలు పంపించాం..
ధరూరులోని ఎస్సీ కాలనీలోని ట్యాంకు తొలగించాల్సి ఉంది. ప్రతిపసాదనలు పంపించాం. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రాగానే పనులు చేపడుతాం. త్వరలో మిషన్ భగీరథ ట్యాంకులు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంలో పాత ట్యాంకును తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.
– పరమేష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ
భయంగా ఉంది..
మేము ట్యాంకు పక్కనే నివాసముంటున్నాం. ఏ క్షణం కూలు తుం దోనని భయంగా జీవనం సాగిస్తున్నాం. అధికారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.
– వెంకటన్న,ఎస్సీ కాలనీవాసి, ధరూరు
Comments
Please login to add a commentAdd a comment