ప్రపంచంలోనే అతిపెద్ద నీటితొట్టెను నిర్మించేందుకు జపాన్ ప్రభుత్వం నడుం బిగించింది. ఈ నీటితొట్టె నిర్మాణం కోసం ఏకంగా ఒక కొండను తొలచడానికి సిద్ధపడింది. ఏకంగా 26 కోట్ల లీటర్ల సామర్థ్యం గల ఈ నీటితొట్టె నిర్మాణానికి 400 మిలియన్ పౌండ్లు (రూ.4,191 కోట్లు) ఖర్చు చేయనుంది. విశ్వం ఆవిర్భావంలో కీలకమైన సూక్షా్మతి సూక్ష్మకణాలైన న్యూట్రినోలను కనుగొనే లక్ష్యంతో జపాన్ ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా ఈ భారీ నీటితొట్టె నిర్మాణాన్ని చేపడుతోంది.
‘న్యూట్రినో’లను కనుగొనడానికి ఈ తొట్టె అడుగున 40 వేల ఆటమ్ డిటెక్టర్లను అమర్చనుంది. న్యూట్రినోలు పరమాణవుల కంటే సూక్షా్మతి సూక్ష్మంగా ఉంటాయి. వీటిని గుర్తించడం చాలా కష్టం. ఇవి అంతరిక్షంలో సంచరిస్తుంటాయి. ఇతర పదార్థాలతో ప్రభావితం కాకుండా ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి సులువుగా చేరుకుంటాయి.
ఇవి జీవుల శరీరాల్లోనూ కోట్ల సంఖ్యలో కదలాడుతూ ఉంటాయి. న్యూట్రినోల స్వభావాన్ని కూలంకషంగా అర్థం చేసుకోగలిగితే, విశ్వం గురించి ఇప్పటి వరకు ఉన్న ఆలోచనా ధోరణిలో మార్పు రాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రయోగానికి ఇరవై ఒక్క దేశాలు అండదండలు అందిస్తున్నాయి. ఈ నీటితొట్టె ఎత్తు 80 మీటర్లు, వెడల్పు 70 మీటర్లు. అంటే, దీనిలో ఏకంగా ఒక బోయింగ్–747 విమానం నిలువునా పట్టేస్తుందన్న మాట.
అబుదాబిలోని ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆక్వేరియం ‘సీ వరల్డ్’తో పోల్చుకుంటే, జపాన్ నిర్మిస్తున్న ఈ నీటితొట్టె పరిమాణం నాలుగున్నర రెట్లు ఎక్కువ. న్యూట్రినోల పరిశీలన కోసం హిడా నగరానికి చేరువలో ఉన్న కొండను తొలిచి చేపడుతున్న ఈ నీటితొట్టె నిర్మాణం 2026 నాటికి పూర్తవుతుందని చెబుతున్నారు. న్యూట్రినోల పరిశీలన, ఇతర ప్రయోగాలను 2027 నుంచి ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు.
ఇవి చదవండి: నిజమే..! ఇది ముక్కుసూటి రహదారే..!! సుమారు..
Comments
Please login to add a commentAdd a comment