గత వైభవ వెలుగులు | Last Vaibhava glows | Sakshi
Sakshi News home page

గత వైభవ వెలుగులు

Published Sun, Aug 2 2015 1:36 AM | Last Updated on Wed, Sep 19 2018 6:37 PM

గత వైభవ వెలుగులు - Sakshi

గత వైభవ వెలుగులు

చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి, భాగ్యనగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఉస్మానియా ఆసుపత్రి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది! లక్షలాది మంది రోగులకు సేవలందజేసి, వేలాది మంది వైద్య నిపుణులకు శిక్షణ ఇచ్చి, ఎన్నో ప్రయోగాలకు, మరెన్నో అద్భుతాలకు చిరునామాగా నిలిచిన ఈ భవనం కూల్చివేత ప్రతిపాదనలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ చరిత్రపై దాని సంతకం, భవనం చారిత్రక విశేషాలు, నిర్మాణ కౌశలంపై ‘సాక్షి’ ఫోకస్..
- సాక్షి, హైదరాబాద్
 
* చారిత్రక వారసత్వానికి చిరునామా ఉస్మానియా ఆస్పత్రి  
* ఏడో నిజాం పాలనలో పూర్తయిన మహాసౌధం

 
ఎందరో గొప్ప వైద్యులకు నిలయం
ఎంతోమంది గొప్ప వైద్యులను తీర్చిదిద్దే కేంద్రంగా ఆసుపత్రి అభివృద్ధి చెందింది. ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ ఎడ్వర్డ్ లారీ  ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా వ్యవహరించారు. ఆయన తన జీత భత్యాలను, పెన్షన్ మొత్తాన్ని ఆసుపత్రిలోని పేద రోగులకు  పాలు, బ్రెడ్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. డాక్టర్ గోవిందరాజులు నాయుడు, డాక్టర్ సత్యవంత్ మల్లన్న, డాక్టర్ హార్డీకర్, డాక్టర్ రోనాల్డ్ రాస్ వంటి ప్రముఖ వైద్యులు ఆసుపత్రిలో సేవలందజేశారు.
 
పునాదులు పడ్డాయిలా..
గోల్సావాడి.. వెండి వెన్నెల వెలుగుల్లో తళతళలాడే మూసీ నది ఒడ్డ్డున వెలసిన ఓ బస్తీ! పాశ్చాత్య ప్రపంచంలో అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన వైద్యాన్ని హైదరాబాద్‌కు పరిచయం  చేసింది ఈ బస్తీయే. యునానీ, ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో నాలుగో నిజాం ప్రభువు నసీరుద్దౌలా బ్రిటిష్ వైద్య చికిత్సలు చేసే ఆసుపత్రిని ఈ బస్తీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వైద్యంతోపాటు, బోధనా పద్ధతులను, పాఠ్యగ్రంథాలను కూడా డాక్టర్లకు అందుబాటులోకి తేవాలనుకున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు. ఐదో నవాబు అఫ్జలుద్దౌలా హయాంలో ఆ ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది.

1866 నాటికి అది ‘అఫ్జల్‌గంజ్ ఆసుపత్రి’గా వైద్య సేవలను ప్రారంభించింది. ఫలితంగా హైదరాబాద్ సంస్థానంలోని బ్రిటిష్ కంటోన్మెంట్‌లలో సైనికులకు మాత్రమే లభించే ఆధునిక వైద్య సేవలు.. సామాన్యుల చెంతకు చేరాయి. కానీ ఆ ఆసుపత్రి ఎంతోకాలం మనుగడ కొనసాగించలేదు. 1908లో వచ్చిన మూసీ వరదల్లో నేలమట్టమైంది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా కాలంలో చోటుచేసుకున్న మహావిషాదం అది! ఆ తర్వాత కొంతకాలానికే ఆయన కూడా కాల ధర్మం చేశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పగ్గాలు చేపట్టారు. ‘అఫ్జల్‌గంజ్’ ఆసుపత్రి స్ఫూర్తిని బతికించాలని భావించిన ఆయన.. సుమారు 27 ఎకరాల సువిశాల ప్రదేశంలో 1925 నాటికి ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేశారు. అలనాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ విన్సెంట్ మార్గదర్శకత్వంలో ఈ మహాసౌధం వెలిసింది.
 
మూసీ ఒడ్డునే ఎందుకు?
మూసీ వరదలు విలయాన్నే సృష్టించాయి. వేలాది మంది మృత్యువాత పడ్డారు. మరోసారి అలాంటి వరదలు రాకుండా, వచ్చినా తట్టుకునేలా నది లోతును పెంచి దానికి ఇరువైపులా పెద్దపెద్ద గోడలు కట్టించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మూసీ పరిర క్షణే లక్ష్యంగా ఎత్తై భవనాల నిర్మాణాన్ని చేపట్టారు. అలా సిటీ కాలేజ్, హైకోర్టు భవనం,పేట్లబురుజు ఆసుపత్రి, లక్కల్‌కోట వెలిశాయి. మూసీ నదికి ఉత్తరాన నిర్మించిన ఉస్మానియా ఆసుపత్రి కూడా ఆ విధంగానే  వెలసింది. పచ్చటి పచ్చిక బయళ్లు, ఎత్తై చెట్లు, స్వచ్ఛమైన మూసీ ప్రవాహం, ఆహ్లాదకరమైన వాతావరణం రోగులు త్వరగా కోలుకొనేందుకు సహకరిస్తాయని భావించారు. ఎలాంటి మొండి రోగాలైనా సరే అక్కడి గాలి పీలిస్తే నయమవుతాయని ప్రజలు భావించేవారు.
 
ప్రపంచంలోనే తొలి ‘క్లోరోఫామ్’ శస్త్రచికిత్స
ఉస్మానియా ఆస్పత్రి అనేక అద్భుతాలు, ఆవిష్కరణలకు వేదికైంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎడ్వర్డ్ లారీ నేతృత్వంలోని వైద్య బృందం ప్రపంచంలోనే తొలిసారిగా ‘క్లోరోఫామ్’ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు శస్త్ర చికిత్సను అందజేసింది. ఈ అద్భుతాన్ని అధ్యయనం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులంతా ఇక్కడికే వచ్చేవారు. అంతేకాదు 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఇదే ఆస్పత్రిలో జరిగింది.
 
ఆ రోజుల్లోనే రూ.50 వేల ఖర్చు!
1918-20లో ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నల్ల గ్రానైట్, సున్నం కలిపి కట్టించిన ఈ పటిష్టమైన భవనం ఇండో పర్షియన్ శైలిలో రూపుదిద్దుకుంది. అప్పట్లో ప్రసిద్ధి చెందిన రాజస్తానీ, గ్రీకు, రోమన్ శైలి నిర్మాణ పద్ధతులనూ జత చేశారు. సుమారు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకేసారి 450 మంది రోగులకు చికిత్స అందించేలా దీన్ని నిర్మించారు. ఎలాంటి యంత్రాలు వాడకుండా కేవలం కూలీలతో ఐదేళ్ల పాటు కష్టపడి కట్టారు. నిర్మాణానికి ఆ రోజుల్లోనే రూ.50 వేలు ఖర్చయినట్లు అంచనా. 1925లో కొత్త భవనం అందుబాటులోకి వచ్చింది.

ఇండో పర్షియన్ శైలిలో రూపుదిద్దుకున్న 110 అడుగుల ఎత్తై విశాలమైన డోమ్‌లు ఆసుపత్రికి ప్రత్యేక ఆకర్షణ. ఎత్తై గోడలకు పై భాగంలో నిజాం ప్రభువుల తలపాగలను ప్రతిబింబించే ఆకృతులను చిత్రించారు. చార్మినార్‌లోని మినార్‌లను పోలిన నిర్మాణాలను ఆసుపత్రి భవనంపైన కట్టించారు. డోమ్‌లను కేవలం కళాత్మకత దృష్టితోనే కాకుండా భవనంలోకి గాలి, వెలుతురు ప్రసరించేలా నిర్మించారు. రాత్రి వేళల్లో, విద్యుత్ అందుబాటులో లేని సమయాల్లో కూడా వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ గాలి, వెలుతురు వచ్చేలా వీటి ఏర్పాటు ఉంది.
 
కూలుతున్న పైకప్పులు...
ఏళ్ల తరబడి పునరుద్ధరణ పనులు చేయకపోవడంతో ఆసుపత్రి పెచ్చులూడుతోంది. ఐదేళ్ల కిందట సూపరింటెండెంట్ తన కార్యాలయంలో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా పైకప్పు కూలింది. డాక్టర్ డీవీఎస్ ప్రతాప్, డాక్టర్ రవీందర్ గాయపడ్డారు. ఆ తర్వాత వార్డులో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు సహా ఇద్దరు రోగులపైన పెచ్చులు పడి గాయాలయ్యాయి. ఇటీవల జనరల్ సర్జన్ విభాగంలో పైకప్పు కూలింది. వారం తిరగకుండానే మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

దీంతో వైద్యులు ఆందోళనకు దిగారు. వైద్యులు, పారామెడికల్  స్టాఫ్, నర్సులు, ఉద్యోగ సంఘాలన్నీ కలసి ఉస్మానియా ఆస్పత్రి పరిరక్షణ కమిటీగా ఏర్పడ్డాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలసి ప్రాణాలకు రక్షణ లేని ఈ ఆస్పత్రిలో పని చేయలేమని స్పష్టం చేశారు. మంత్రి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. భవనంపై అధ్యయనం చేసిన జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ నిపుణులు కూడా రోగులకు ఏమాత్రం సురక్షితం కాదని స్పష్టం చేశారు. దీంతో కొత్త భవనం నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు.
 
ఇంకా వందల ఏళ్ల దాకా కాపాడవచ్చు..
చారిత్రక ఉస్మానియా భవనాన్ని కూల్చడం కన్నా అత్యాధునిక పద్ధతుల్లో మరమ్మతులు చేసి అలాగే కొన సాగించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. భవనం పటుత్వంపై అనుమానాలు అక్కర్లేదని, నిరంతర నిర్వహణ పనులు చేస్తే కొన్ని వందల ఏళ్ల వరకు దాన్ని కాపాడవచ్చని పేర్కొంటున్నారు. ‘అదో అద్భుత నిర్మాణం.. అలనాటి నిర్మాణ శైలికి నిలువెత్తు దర్పణం.. ప్రపంచవ్యాప్తంగా వారసత్వ కట్టడాలను పదిలంగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మనం దానికి భిన్నంగా వ్యవహరించటం సరికాదు. ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు కొనసాగిస్తే మరో 400 ఏళ్లయినా ఇంతే ఠీవిగా నిలబడే సత్తువ ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ఉంది’’ అని ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణులు హను మంతరావు తెలిపారు. పైకప్పు జాక్ ఆర్చి రూఫ్ డిజైన్‌లో ఉంటే దాన్ని క్రాస్ గర్డర్‌లో సరిచేయొచ్చని ఆయన సూచించారు.
 
చూస్తూ ఊరుకోం
ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఒక్కో కట్టడం ఒక్కో ప్రత్యేకత. కొత్త భవ న నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు, ఆ పేరుతో వారసత్వ సంపదను ధ్వంసం చేయాలని చూడటం దారుణం. దీన్ని చూస్తూ ఊర్కోబోం.
-వేదకుమార్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్
 
వైద్యం నిర్వీర్యం చేసేందుకే
ఇలా కూల్చివేసుకుంటూ వె ళ్తే వారసత్వ కట్టడాలే ఉండవు. పాత భవనం కూల్చివేత, కొత్త భవన నిర్మాణం పేరుతో రోగులను అయోమయానికి గురి చేసి ప్రజావైద్యాన్ని నిర్వీర్యం చేసేందుకు పన్నిన కుట్ర ఇది.
- పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు
 
కొత్త భవనం కావాల్సిందే
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం పాత భవనం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ఇక్కడ పని చేయలేం. రోగులు, వైద్యుల సంక్షేమం దృష్ట్యా వెంటనే కొత్త భవనాన్ని నిర్మించాలి.
-బొంగు రమేశ్, టీజీడీఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement