Historical heritage
-
కరుణామయుని కోవెలకు వందేళ్ల ఉత్సవాలు
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న మెదక్ చర్చి ఆసియాలో రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. చారిత్రాత్మక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ కట్టడం నిర్మాణం జరిగి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ విశేషాలు...అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం... తినడానికి తిండిలేక... చేద్దామంటే పని లేక ప్రజలు ఆకలితో నకనకలాడి అలమటిస్తున్న రోజులు. మరో బాధాకరమైన విషయం... అంటురోగాలతో జనం పిట్టల్లా నేలరాలి చనిపోతున్న దుర్భరమైన పరిస్థితులు అవి. పట్టెడన్నం దొరికితేనే పంచభక్ష్యపరమాన్నాలుగా భావించి పరమానంద పడుతున్న రోజులు. సరిగ్గా ఇటువంటì దుర్భర పరిస్థితులలో దేశంకాని దేశం నుండి ఖండంతరాలు దాటి సాక్షాత్తూ పరలోకం నుంచి ప్రభువు పంపిన దేవదూతలా వచ్చాడు చార్లెస్ వాకర్ పాస్నెట్. ఇంగ్లాండ్ దేశస్థుడైన ఆయన ముందుగా సికింద్రాబాద్‌లోని అప్పటి మిలటరి(ఆర్మీ) సేనకు నాయకుడిగా వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికే అమాయక ప్రజలనేకులు గత్తర వ్యాధితో మూకుమ్మడిగా చనిపోతున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంది. ఆకలి తీర్చిన ఆలయం..!ఆకలితో ఎవరూ చనిపోకూడదని భావించిన చార్లెస్ వాకర్ పాస్నెట్ ఈ ప్రాంతంలో చర్చి నిర్మాణం తలపెట్టాడు. చర్చ్ నిర్మాణం కోసం దాదాపు 200 రకాల నమూనాలను తయారు చేశారట. వాటిలో ఏది ఉత్తమమైనదో తెలియక ఆందోళన చెందుతూ వాటన్నింటిని ముందు పెట్టుకుని మోకరిల్లి ‘పరలోకదేవా ఇందులో ఏ నమూనా ప్రకారం నిర్మించాలో దారిచూపు’ అంటూ ప్రార్థన చేయగా ఉన్నటుండి పెద్ద గాలి వచ్చి అందులోని 199 నమూనా కాగితాలు కొట్టుకుపోయి ఒకే ఒక్క నమూనా మిగిలిందట. అదే దైవ నిర్ణయంగా భావించి దాని ప్రకారం నిర్మించబడిందే ప్రస్తుత చర్చి అని పెద్దలు చెబుతున్నారు. నిర్మాణానికి తన వద్ద ఉన్న డబ్బు సరిపోక పోవడంతో స్వదేశంలో భిక్షమెత్తి మరీ నిర్మాణాన్ని పూర్తి చేశారు వాకర్.ఈ చర్చి వల్లే ‘మెదక్’కు ఆ పేరువేలాది మంది కూలీలతో పది సంవత్సరాలపాటు కొనసాగిన నిర్మాణం వల్ల కాలే కడుపులకు పట్టెడు మెతుకులు దొరికేవట. అప్పట్లో ఈ ప్రాంతానికి గుల్షనాబాద్ అని పేరు. వేలాది జనం చర్చి నిర్మాణంలో భాగస్వాములు కావటం కోసం తండోపతండాలుగా తరలి వెళ్లేవారట. వారిని చూసి ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే ‘మెతుకు’ కోసం పనికి వెళ్తున్నామంటూ చెప్పేవారట. దీంతో ఈ ప్రాంతం గుల్షానాబాద్ నుంచి మెతుకు సీమగా పేరుగాంచింది. అది కాస్తా రానురాను మెదక్‌గా రూపాంతరం చెందింది. 175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవిగా కనిపించే మెదక్ చర్చిని భారతీయ, విదేశీ కళానైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం, శిఖరం.. వందేళ్లు పూర్తయినా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు భారతీయ పురాతన పద్ధతులను అనుసరించారు. చర్చి లోపల ప్రతిధ్వనులు వినిపించని విధంగా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు.ప్రశాంతతకు, పవిత్రతకు నిలయమైన ఈ చర్చికి ఇంకా అనేక ప్రత్యేకతలున్నాయి. చర్చి నిర్మాణానికి రాతి, డంగుసున్నాన్ని మాత్రమే వాడారు. పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైనప్రార్థనా మందిరాన్ని, శిఖరాన్ని నిర్మించడం నాటి పనితనానికి అద్దం పడుతోంది. 200 అడుగుల ΄÷డవుతో సువిశాలమైన చర్చి చూపరులను కట్టిపడేస్తుంది.ఈ చర్చి నిర్మాణం కోసం ఆరో నిజాం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. సుమారు 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కొంతకాలం కిందట 2 కోట్లతో మరమ్మతులు చేశారు. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లాంటి పర్వదినాల్లో ఈ చర్చిని సందర్శించేందుకు విదేశీయులు కూడా వస్తుంటారు. సందర్శకుల్లో క్రైస్తవులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఉంటారు. ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ఆసియా ఖండంలోనే అద్భుతంగా నిర్మించిన ఈ చర్చి నిర్మాణం జరిగి ఈ డిశంబర్ 25 నాటికి 100 సంవత్సరాలు పూర్తి కానుంది. 25న క్రిస్మస్ కావడం వల్ల ఆ రోజున భక్తులప్రార్థనలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈనెల 23న శతజయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు చర్చిని ముస్తాబు చేస్తున్నారు. 23న పదిహేను మంది బిషప్‌లతో ఉదయం నుంచే ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. ఇందులో భాగంగా మెదక్ పరిధిలోని ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో పలు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల కోసం చిత్రలేఖనం, నృత్యం తదితర పోటీలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారు. అలాగే చర్చి నిర్మాణదాత చార్లెస్ వాకర్ పాస్నెట్ రక్త సంబంధీకులు సైతం హాజరు అవుతారని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కట్టడాన్ని మూడు గవాక్షాలు, పలు రంగుటద్దాలతో నిర్మింపజేశారు. తూర్పున ఏసుక్రీస్తు జన్మవృత్తాంతం, పడమర క్రీస్తును శిలువ వేసిన దృశ్యం, ఉత్తరాన క్రీస్తు పునరుత్థానుడై నిలిచిన దృశ్యాలు కనిపిస్తాయి. వీటిని తయారు చేసిన కళాకారులు ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఫ్రాంకో ఓ, సాలిస్బర్లు. అంతే కాకుండా ఇవి సూర్యరశ్మివెలుతురులో (పగలు) మాత్రమే కనిపిస్తాయి. సూర్య అస్తమయం అయిందంటే కనిపించవు. ఈ నిర్మాణం 1914 నుండి 1924 డిశంబర్ వరకు 10 ఏళ్లపాటు జరుగగా డిశంబర్ 25న క్రిస్మస్ పర్వదినం రోజున ఆరంభించారు. ఈ చర్చిలో ఒకేసారి 5 నుంచి 6 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు.–సీహెచ్. నీలయ్యసాక్షి, మెదక్ -
Lepakshi: రాతిలో పోత పోసిన లేపాక్షి అందాలు
ఆమధ్య “హంపీ వైభవం" పేరిట వరుసగా వ్యాసాలు రాశాను. అప్పుడు మా లేపాక్షి మనసు చిన్నబుచ్చుకుంది. హంపీ గురించి అన్నన్ని పుస్తకాలు ప్రస్తావిస్తూ వ్యాసాలు రాశావే! నిన్ను పెంచిన లేపాక్షి గురించి పరిశోధించి వ్యాసాలు రాయకపోతే ఎలా? అని లేపాక్షి జనం నన్ను నిలదీశారు. వారి నిలదీతలో అర్థముంది. లేపాక్షిమీద తపన ఉంది. నామీద లేపాక్షికి ఉన్న ఆ హక్కును గౌరవిస్తూ... లేపాక్షి మీద పరిశోధించి రాసిన సాధికారికమయిన పుస్తకాలను, వ్యాసాలను సంవత్సరం పాటు సేకరించాను. రెండు, మూడు కావ్యాలు కాలగర్భంలో కలిసిపోవడం వల్ల దొరకలేదు. నాకు దొరికిన ప్రచురితమైన నలభై తెలుగు, కన్నడ, ఇంగ్లీషు లేపాక్షి పుస్తకాల నుంచి ప్రధానంగా మూడింటి ఆధారంగా ఈ వ్యాసాలను రాస్తున్నాను. అవి:- 1. లేపాక్షి: రచయిత- ప్రఖ్యాత చారిత్రక పరిశోధకుడు ఆమంచర్ల గోపాలరావు. ఇంగ్లీషులో దీన్ని మోనో గ్రాఫ్ పరిచయ వ్యాసంగా పేర్కొన్నా పరిశోధన స్థాయి గ్రంథం ఇది. 1969లో ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడెమీ ప్రచురణ. 2. లేపాక్షి ఆలయం: రచయిత- హిస్టరీ ప్రొఫెసర్ వి కామేశ్వర రావు, ఎస్ వీ యూనివర్సిటీ, తిరుపతి. పరిశోధన గ్రంథం. 1987 ప్రచురణ. 3. త్యాగశిల్పం..పద్య, గద్య కావ్యం: కర్ణాటక ఉన్నత న్యాయస్థానంలో కీలకమైన పదవిలో పనిచేస్తుండిన తెలుగు పద్యప్రేమికుడైన లంకా కృష్ణమూర్తి పద్యాలు; లేపాక్షి ఓరియంటల్ కాలేజీలో తెలుగు అధ్యాపకుడు, అష్టావధాని పమిడికాల్వ చెంచు సుబ్బయ్య శర్మ(మా నాన్న) గద్యం. ఇద్దరూ కలిసి రాసినది. 1975 ప్రచురణ. ఈ పుస్తకాలేవీ ఇప్పుడు మార్కెట్లో లేవు. ఇలాంటివి పునర్ముద్రణ కావు. లేపాక్షిలో మిత్రుడు లేపాక్షి రామ్ ప్రసాద్ దగ్గర భద్రంగా ఉంటే కొరియర్లో తెప్పించుకుని...జిరాక్స్ చేసుకుని వారి పుస్తకాలు వారికి మళ్లీ కొరియర్లో వెనక్కు పంపాను. రామ్ ప్రసాద్ తాత వెంకటనారాయణప్ప లేపాక్షికి తొలి సర్పంచ్. ఐదు దశాబ్దాలపాటు లేపాక్షి గుడిని వెలికి తీసుకురావడానికి కల్లూరు సుబ్బారావుతో కలిసి పనిచేశారు. నాకు తెలిసిన ఆవగింజంత భాషా సాహిత్యాలకు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విషయాలకు లేపాక్షి బీజం. అక్కడ తాకిన ప్రతిదీ శిల్పమే. చూసిన ప్రతిదీ అందమే. రాతిలో పోతపోసిన ఆ అందాలను, ఆనందాలను చెప్పకపోతే... నాకొచ్చిన నాలుగు మాటలకు విలువ ఉండదు. కాబట్టి ఈ ప్రయత్నం. వీరభద్రాలయం లేపాక్షి ఆలయం 16వ శతాబ్దంలో నిర్మితమైనదని మొదట అనుకునేవారు. భారత పురావస్తుతత్వ శాఖ తవ్వకాల్లో బయటపడ్డ శాసనాల ప్రకారం క్రీస్తు శకం 1400 నాటికే లేపాక్షిలో పాపనాశేశ్వర ఆలయం ప్రసిద్ధిలో ఉందని తేలింది. ఇక్కడ వీరభద్రుడు, పాపనాశేశ్వరుడు, దుర్గాదేవి, రఘునాథ స్వామి ప్రధానమైన దేవుళ్లు. "లేపాక్ష్యామ్ పాపనాశనః" అని స్కాంధపురాణంలో ఉన్నది ఈ లేపాక్షి పాపనాశేశ్వర స్వామి ప్రస్తావనే అన్నది ఎక్కువమంది పండితుల అభిప్రాయం. 16వ శతాబ్దిలో విజయనగర రాజులు అచ్యుతదేవరాయలు, అళియరాయల దగ్గర పెనుగొండ మండల కోశాధికారిగా ఉండిన విరుపణ్ణ ఇలవేల్పు వీరభద్రస్వామి. విరుపణ్ణ కలల పంట మనముందున్న ఈ లేపాక్షి కళల పంట. లేపాక్షికి ఆ పేరెలా వచ్చింది? త్రేతాయుగం రామాయణ కథతో లేపాక్షి కథ కూడా మొదలవుతుంది. సీతమ్మను రావణుడు అపహరించుకుని ఆకాశమార్గాన తీసుకువెళుతుంటే జటాయువు అడ్డగించి... యుద్ధం చేస్తుంది. కోపగించిన రావణుడు పక్షికి రెక్కలే బలం కాబట్టి... ఆ రెక్కలను నరికేస్తే చచ్చి పడి ఉంటుందని...రెక్కలను కత్తిరిస్తాడు. జటాయువు రెక్కలు తెగి... రక్తమోడుతూ... నేల కూలుతుంది. సీతాన్వేషణలో భాగంగా చెట్టూ పుట్టా; కొండా కోనా; వాగూ వంకా వెతుకుతూ రామలక్ష్మణులు జటాయువు దగ్గరికి వస్తారు. సీతమ్మ జాడ చెప్పి...రాముడి ఒడిలో జటాయువు కన్ను మూస్తుంది. తమకు మహోపకారం చేసిన జటాయువు అంత్యక్రియలను రామలక్ష్మణులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంలో జటాయువును చూసిన వెను వెంటనే రాముడన్న మాట- “లే! పక్షి!” అదే "లేపాక్షి" అయ్యింది. పమిడికాల్వ మధుసూధన్ -
గత వైభవ వెలుగులు
చారిత్రక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి, భాగ్యనగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఉస్మానియా ఆసుపత్రి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది! లక్షలాది మంది రోగులకు సేవలందజేసి, వేలాది మంది వైద్య నిపుణులకు శిక్షణ ఇచ్చి, ఎన్నో ప్రయోగాలకు, మరెన్నో అద్భుతాలకు చిరునామాగా నిలిచిన ఈ భవనం కూల్చివేత ప్రతిపాదనలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ చరిత్రపై దాని సంతకం, భవనం చారిత్రక విశేషాలు, నిర్మాణ కౌశలంపై ‘సాక్షి’ ఫోకస్.. - సాక్షి, హైదరాబాద్ * చారిత్రక వారసత్వానికి చిరునామా ఉస్మానియా ఆస్పత్రి * ఏడో నిజాం పాలనలో పూర్తయిన మహాసౌధం ఎందరో గొప్ప వైద్యులకు నిలయం ఎంతోమంది గొప్ప వైద్యులను తీర్చిదిద్దే కేంద్రంగా ఆసుపత్రి అభివృద్ధి చెందింది. ప్రఖ్యాత వైద్య నిపుణులు డాక్టర్ ఎడ్వర్డ్ లారీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా వ్యవహరించారు. ఆయన తన జీత భత్యాలను, పెన్షన్ మొత్తాన్ని ఆసుపత్రిలోని పేద రోగులకు పాలు, బ్రెడ్ కోసం ఇచ్చి దాతృత్వాన్ని చాటుకున్నారు. డాక్టర్ గోవిందరాజులు నాయుడు, డాక్టర్ సత్యవంత్ మల్లన్న, డాక్టర్ హార్డీకర్, డాక్టర్ రోనాల్డ్ రాస్ వంటి ప్రముఖ వైద్యులు ఆసుపత్రిలో సేవలందజేశారు. పునాదులు పడ్డాయిలా.. గోల్సావాడి.. వెండి వెన్నెల వెలుగుల్లో తళతళలాడే మూసీ నది ఒడ్డ్డున వెలసిన ఓ బస్తీ! పాశ్చాత్య ప్రపంచంలో అప్పటికే బాగా ప్రాచుర్యం పొందిన వైద్యాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేసింది ఈ బస్తీయే. యునానీ, ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు మాత్రమే అందుబాటులో ఉన్న రోజుల్లో నాలుగో నిజాం ప్రభువు నసీరుద్దౌలా బ్రిటిష్ వైద్య చికిత్సలు చేసే ఆసుపత్రిని ఈ బస్తీలో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వైద్యంతోపాటు, బోధనా పద్ధతులను, పాఠ్యగ్రంథాలను కూడా డాక్టర్లకు అందుబాటులోకి తేవాలనుకున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు. ఐదో నవాబు అఫ్జలుద్దౌలా హయాంలో ఆ ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. 1866 నాటికి అది ‘అఫ్జల్‌గంజ్ ఆసుపత్రి’గా వైద్య సేవలను ప్రారంభించింది. ఫలితంగా హైదరాబాద్ సంస్థానంలోని బ్రిటిష్ కంటోన్మెంట్లలో సైనికులకు మాత్రమే లభించే ఆధునిక వైద్య సేవలు.. సామాన్యుల చెంతకు చేరాయి. కానీ ఆ ఆసుపత్రి ఎంతోకాలం మనుగడ కొనసాగించలేదు. 1908లో వచ్చిన మూసీ వరదల్లో నేలమట్టమైంది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పాలనా కాలంలో చోటుచేసుకున్న మహావిషాదం అది! ఆ తర్వాత కొంతకాలానికే ఆయన కూడా కాల ధర్మం చేశారు. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పగ్గాలు చేపట్టారు. ‘అఫ్జల్‌గంజ్’ ఆసుపత్రి స్ఫూర్తిని బతికించాలని భావించిన ఆయన.. సుమారు 27 ఎకరాల సువిశాల ప్రదేశంలో 1925 నాటికి ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేశారు. అలనాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ విన్సెంట్ మార్గదర్శకత్వంలో ఈ మహాసౌధం వెలిసింది. మూసీ ఒడ్డునే ఎందుకు? మూసీ వరదలు విలయాన్నే సృష్టించాయి. వేలాది మంది మృత్యువాత పడ్డారు. మరోసారి అలాంటి వరదలు రాకుండా, వచ్చినా తట్టుకునేలా నది లోతును పెంచి దానికి ఇరువైపులా పెద్దపెద్ద గోడలు కట్టించేందుకు ప్రణాళికలు రూపొందించారు. మూసీ పరిర క్షణే లక్ష్యంగా ఎత్తై భవనాల నిర్మాణాన్ని చేపట్టారు. అలా సిటీ కాలేజ్, హైకోర్టు భవనం,పేట్లబురుజు ఆసుపత్రి, లక్కల్కోట వెలిశాయి. మూసీ నదికి ఉత్తరాన నిర్మించిన ఉస్మానియా ఆసుపత్రి కూడా ఆ విధంగానే వెలసింది. పచ్చటి పచ్చిక బయళ్లు, ఎత్తై చెట్లు, స్వచ్ఛమైన మూసీ ప్రవాహం, ఆహ్లాదకరమైన వాతావరణం రోగులు త్వరగా కోలుకొనేందుకు సహకరిస్తాయని భావించారు. ఎలాంటి మొండి రోగాలైనా సరే అక్కడి గాలి పీలిస్తే నయమవుతాయని ప్రజలు భావించేవారు. ప్రపంచంలోనే తొలి ‘క్లోరోఫామ్’ శస్త్రచికిత్స ఉస్మానియా ఆస్పత్రి అనేక అద్భుతాలు, ఆవిష్కరణలకు వేదికైంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎడ్వర్డ్ లారీ నేతృత్వంలోని వైద్య బృందం ప్రపంచంలోనే తొలిసారిగా ‘క్లోరోఫామ్’ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు శస్త్ర చికిత్సను అందజేసింది. ఈ అద్భుతాన్ని అధ్యయనం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులంతా ఇక్కడికే వచ్చేవారు. అంతేకాదు 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఇదే ఆస్పత్రిలో జరిగింది. ఆ రోజుల్లోనే రూ.50 వేల ఖర్చు! 1918-20లో ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నల్ల గ్రానైట్, సున్నం కలిపి కట్టించిన ఈ పటిష్టమైన భవనం ఇండో పర్షియన్ శైలిలో రూపుదిద్దుకుంది. అప్పట్లో ప్రసిద్ధి చెందిన రాజస్తానీ, గ్రీకు, రోమన్ శైలి నిర్మాణ పద్ధతులనూ జత చేశారు. సుమారు 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒకేసారి 450 మంది రోగులకు చికిత్స అందించేలా దీన్ని నిర్మించారు. ఎలాంటి యంత్రాలు వాడకుండా కేవలం కూలీలతో ఐదేళ్ల పాటు కష్టపడి కట్టారు. నిర్మాణానికి ఆ రోజుల్లోనే రూ.50 వేలు ఖర్చయినట్లు అంచనా. 1925లో కొత్త భవనం అందుబాటులోకి వచ్చింది. ఇండో పర్షియన్ శైలిలో రూపుదిద్దుకున్న 110 అడుగుల ఎత్తై విశాలమైన డోమ్‌లు ఆసుపత్రికి ప్రత్యేక ఆకర్షణ. ఎత్తై గోడలకు పై భాగంలో నిజాం ప్రభువుల తలపాగలను ప్రతిబింబించే ఆకృతులను చిత్రించారు. చార్మినార్‌లోని మినార్లను పోలిన నిర్మాణాలను ఆసుపత్రి భవనంపైన కట్టించారు. డోమ్‌లను కేవలం కళాత్మకత దృష్టితోనే కాకుండా భవనంలోకి గాలి, వెలుతురు ప్రసరించేలా నిర్మించారు. రాత్రి వేళల్లో, విద్యుత్ అందుబాటులో లేని సమయాల్లో కూడా వైద్యసేవలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ గాలి, వెలుతురు వచ్చేలా వీటి ఏర్పాటు ఉంది. కూలుతున్న పైకప్పులు... ఏళ్ల తరబడి పునరుద్ధరణ పనులు చేయకపోవడంతో ఆసుపత్రి పెచ్చులూడుతోంది. ఐదేళ్ల కిందట సూపరింటెండెంట్ తన కార్యాలయంలో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా పైకప్పు కూలింది. డాక్టర్ డీవీఎస్ ప్రతాప్, డాక్టర్ రవీందర్ గాయపడ్డారు. ఆ తర్వాత వార్డులో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు సహా ఇద్దరు రోగులపైన పెచ్చులు పడి గాయాలయ్యాయి. ఇటీవల జనరల్ సర్జన్ విభాగంలో పైకప్పు కూలింది. వారం తిరగకుండానే మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. దీంతో వైద్యులు ఆందోళనకు దిగారు. వైద్యులు, పారామెడికల్ స్టాఫ్, నర్సులు, ఉద్యోగ సంఘాలన్నీ కలసి ఉస్మానియా ఆస్పత్రి పరిరక్షణ కమిటీగా ఏర్పడ్డాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలసి ప్రాణాలకు రక్షణ లేని ఈ ఆస్పత్రిలో పని చేయలేమని స్పష్టం చేశారు. మంత్రి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. భవనంపై అధ్యయనం చేసిన జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణులు కూడా రోగులకు ఏమాత్రం సురక్షితం కాదని స్పష్టం చేశారు. దీంతో కొత్త భవనం నిర్మించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇంకా వందల ఏళ్ల దాకా కాపాడవచ్చు.. చారిత్రక ఉస్మానియా భవనాన్ని కూల్చడం కన్నా అత్యాధునిక పద్ధతుల్లో మరమ్మతులు చేసి అలాగే కొన సాగించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. భవనం పటుత్వంపై అనుమానాలు అక్కర్లేదని, నిరంతర నిర్వహణ పనులు చేస్తే కొన్ని వందల ఏళ్ల వరకు దాన్ని కాపాడవచ్చని పేర్కొంటున్నారు. ‘అదో అద్భుత నిర్మాణం.. అలనాటి నిర్మాణ శైలికి నిలువెత్తు దర్పణం.. ప్రపంచవ్యాప్తంగా వారసత్వ కట్టడాలను పదిలంగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మనం దానికి భిన్నంగా వ్యవహరించటం సరికాదు. ఎప్పటికప్పుడు నిర్వహణ పనులు కొనసాగిస్తే మరో 400 ఏళ్లయినా ఇంతే ఠీవిగా నిలబడే సత్తువ ఉస్మానియా ఆసుపత్రి భవనానికి ఉంది’’ అని ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణులు హను మంతరావు తెలిపారు. పైకప్పు జాక్ ఆర్చి రూఫ్ డిజైన్‌లో ఉంటే దాన్ని క్రాస్ గర్డర్‌లో సరిచేయొచ్చని ఆయన సూచించారు. చూస్తూ ఊరుకోం ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఒక్కో కట్టడం ఒక్కో ప్రత్యేకత. కొత్త భవ న నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు, ఆ పేరుతో వారసత్వ సంపదను ధ్వంసం చేయాలని చూడటం దారుణం. దీన్ని చూస్తూ ఊర్కోబోం. -వేదకుమార్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వైద్యం నిర్వీర్యం చేసేందుకే ఇలా కూల్చివేసుకుంటూ వె ళ్తే వారసత్వ కట్టడాలే ఉండవు. పాత భవనం కూల్చివేత, కొత్త భవన నిర్మాణం పేరుతో రోగులను అయోమయానికి గురి చేసి ప్రజావైద్యాన్ని నిర్వీర్యం చేసేందుకు పన్నిన కుట్ర ఇది. - పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్టు కొత్త భవనం కావాల్సిందే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం పాత భవనం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. ఇక్కడ పని చేయలేం. రోగులు, వైద్యుల సంక్షేమం దృష్ట్యా వెంటనే కొత్త భవనాన్ని నిర్మించాలి. -బొంగు రమేశ్, టీజీడీఏ