వందేళ్ల పండగకు ముస్తాబవుతున్న మెదక్ చర్చి23న శతాబ్ది ఉత్సవాలు
చర్చి నిర్మాణ ప్రదాత చార్లెస్ వాకర్ పాస్నెట్ రక్తసంబంధీకుల రాక
ముఖ్య అతిథిగా హాజరు కానున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న మెదక్ చర్చి ఆసియాలో రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. చారిత్రాత్మక వారసత్వ సంపదకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ కట్టడం నిర్మాణం జరిగి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ విశేషాలు...
అది మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం... తినడానికి తిండిలేక... చేద్దామంటే పని లేక ప్రజలు ఆకలితో నకనకలాడి అలమటిస్తున్న రోజులు. మరో బాధాకరమైన విషయం... అంటురోగాలతో జనం పిట్టల్లా నేలరాలి చనిపోతున్న దుర్భరమైన పరిస్థితులు అవి. పట్టెడన్నం దొరికితేనే పంచభక్ష్యపరమాన్నాలుగా భావించి పరమానంద పడుతున్న రోజులు.
సరిగ్గా ఇటువంటì దుర్భర పరిస్థితులలో దేశంకాని దేశం నుండి ఖండంతరాలు దాటి సాక్షాత్తూ పరలోకం నుంచి ప్రభువు పంపిన దేవదూతలా వచ్చాడు చార్లెస్ వాకర్ పాస్నెట్. ఇంగ్లాండ్ దేశస్థుడైన ఆయన ముందుగా సికింద్రాబాద్‌లోని అప్పటి మిలటరి(ఆర్మీ) సేనకు నాయకుడిగా వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటికే అమాయక ప్రజలనేకులు గత్తర వ్యాధితో మూకుమ్మడిగా చనిపోతున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉంది.
ఆకలి తీర్చిన ఆలయం..!
ఆకలితో ఎవరూ చనిపోకూడదని భావించిన చార్లెస్ వాకర్ పాస్నెట్ ఈ ప్రాంతంలో చర్చి నిర్మాణం తలపెట్టాడు. చర్చ్ నిర్మాణం కోసం దాదాపు 200 రకాల నమూనాలను తయారు చేశారట. వాటిలో ఏది ఉత్తమమైనదో తెలియక ఆందోళన చెందుతూ వాటన్నింటిని ముందు పెట్టుకుని మోకరిల్లి ‘పరలోకదేవా ఇందులో ఏ నమూనా ప్రకారం నిర్మించాలో దారిచూపు’ అంటూ ప్రార్థన చేయగా ఉన్నటుండి పెద్ద గాలి వచ్చి అందులోని 199 నమూనా కాగితాలు కొట్టుకుపోయి ఒకే ఒక్క నమూనా మిగిలిందట. అదే దైవ నిర్ణయంగా భావించి దాని ప్రకారం నిర్మించబడిందే ప్రస్తుత చర్చి అని పెద్దలు చెబుతున్నారు. నిర్మాణానికి తన వద్ద ఉన్న డబ్బు సరిపోక పోవడంతో స్వదేశంలో భిక్షమెత్తి మరీ నిర్మాణాన్ని పూర్తి చేశారు వాకర్.
ఈ చర్చి వల్లే ‘మెదక్’కు ఆ పేరు
వేలాది మంది కూలీలతో పది సంవత్సరాలపాటు కొనసాగిన నిర్మాణం వల్ల కాలే కడుపులకు పట్టెడు మెతుకులు దొరికేవట. అప్పట్లో ఈ ప్రాంతానికి గుల్షనాబాద్ అని పేరు. వేలాది జనం చర్చి నిర్మాణంలో భాగస్వాములు కావటం కోసం తండోపతండాలుగా తరలి వెళ్లేవారట. వారిని చూసి ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే ‘మెతుకు’ కోసం పనికి వెళ్తున్నామంటూ చెప్పేవారట. దీంతో ఈ ప్రాంతం గుల్షానాబాద్ నుంచి మెతుకు సీమగా పేరుగాంచింది. అది కాస్తా రానురాను మెదక్‌గా రూపాంతరం చెందింది.
175 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఠీవిగా కనిపించే మెదక్ చర్చిని భారతీయ, విదేశీ కళానైపుణ్యాల మేళవింపుతో నిర్మించారు. రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కట్టడం, శిఖరం.. వందేళ్లు పూర్తయినా చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు భారతీయ పురాతన పద్ధతులను అనుసరించారు. చర్చి లోపల ప్రతిధ్వనులు వినిపించని విధంగా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకున్నారు.
ప్రశాంతతకు, పవిత్రతకు నిలయమైన ఈ చర్చికి ఇంకా అనేక ప్రత్యేకతలున్నాయి. చర్చి నిర్మాణానికి రాతి, డంగుసున్నాన్ని మాత్రమే వాడారు. పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమైనప్రార్థనా మందిరాన్ని, శిఖరాన్ని నిర్మించడం నాటి పనితనానికి అద్దం పడుతోంది. 200 అడుగుల ΄÷డవుతో సువిశాలమైన చర్చి చూపరులను కట్టిపడేస్తుంది.
ఈ చర్చి నిర్మాణం కోసం ఆరో నిజాం 1000 ఎకరాల భూమిని కేటాయించారు. సుమారు 14 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కొంతకాలం కిందట 2 కోట్లతో మరమ్మతులు చేశారు. క్రిస్‌మస్, గుడ్ ఫ్రైడే లాంటి పర్వదినాల్లో ఈ చర్చిని సందర్శించేందుకు విదేశీయులు కూడా వస్తుంటారు. సందర్శకుల్లో క్రైస్తవులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఉంటారు.
ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి
ఆసియా ఖండంలోనే అద్భుతంగా నిర్మించిన ఈ చర్చి నిర్మాణం జరిగి ఈ డిశంబర్ 25 నాటికి 100 సంవత్సరాలు పూర్తి కానుంది. 25న క్రిస్‌మస్ కావడం వల్ల ఆ రోజున భక్తులప్రార్థనలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈనెల 23న శతజయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు చర్చిని ముస్తాబు చేస్తున్నారు.
23న పదిహేను మంది బిషప్‌లతో ఉదయం నుంచే ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. ఇందులో భాగంగా మెదక్ పరిధిలోని ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో పలు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల కోసం చిత్రలేఖనం, నృత్యం తదితర పోటీలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా రానున్నారు. అలాగే చర్చి నిర్మాణదాత చార్లెస్ వాకర్ పాస్నెట్ రక్త సంబంధీకులు సైతం హాజరు అవుతారని నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ కట్టడాన్ని మూడు గవాక్షాలు, పలు రంగుటద్దాలతో నిర్మింపజేశారు. తూర్పున ఏసుక్రీస్తు జన్మవృత్తాంతం, పడమర క్రీస్తును శిలువ వేసిన దృశ్యం, ఉత్తరాన క్రీస్తు పునరుత్థానుడై నిలిచిన దృశ్యాలు కనిపిస్తాయి. వీటిని తయారు చేసిన కళాకారులు ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఫ్రాంకో ఓ, సాలిస్‌బర్‌లు. అంతే కాకుండా ఇవి సూర్యరశ్మివెలుతురులో (పగలు) మాత్రమే కనిపిస్తాయి. సూర్య అస్తమయం అయిందంటే కనిపించవు. ఈ నిర్మాణం 1914 నుండి 1924 డిశంబర్ వరకు 10 ఏళ్లపాటు జరుగగా డిశంబర్ 25న క్రిస్మస్ పర్వదినం రోజున ఆరంభించారు. ఈ చర్చిలో ఒకేసారి 5 నుంచి 6 వేల మంది కూర్చొని ప్రార్థనలు చేసుకోవచ్చు.
–సీహెచ్. నీలయ్య
సాక్షి, మెదక్
Comments
Please login to add a commentAdd a comment