
తొట్ట తొలి ఆసియా లెజెండ్స్ లీగ్ ఛాంపియన్‌షిప్‌ను ఆసియా స్టార్స్ కైవసం చేసుకుంది. ఉదయ్‌పూర్‌లోని మిరాజ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిన్న (మార్చి 18) జరిగిన ఫైనల్లో ఇండియన్ రాయల్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది.
ఈ టోర్నీలో ఆసియా ప్రాంతానికి చెందిన మాజీలు, దిగ్గజ క్రికెటర్లు పాల్గొన్నారు. ఐదు జట్లు (ఇండియన్ రాయల్స్, ఆసియా స్టార్స్, శ్రీలంక లయన్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్, బంగ్లాదేశ్ టైగర్స్) పాల్గొన్న ఈ టోర్నీలో ఆసియా స్టార్స్ విజేతగా అవతరించింది.
గ్రూప్ దశలో టాపర్‌గా నిలిచిన ఇండియన్ రాయల్స్ ఫైనల్లో ఆసియా స్టార్స్ చేతిలో చిత్తైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. 19.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ఆసియా బౌలర్లు ఈశ్వర్ పాండే (4-0-31-3), రిషి ధవన్ (3.5-0-27-2), మునవీర (4-0-33-2), పవన్ సుయాల్ (4-0-19-1) రాయల్స్‌ను దెబ్బేశారు. రాయల్స్ ఇన్నింగ్స్‌లో సంజయ్ సింగ్ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.
మిగతా బ్యాటర్లు ఒక్కరు కూడా కనీసం 20 పరుగులు చేయలేకపోయారు. నమన్ ఓఝా 5, రాహుల్ యాదవ్ 4, కెప్టెన్ ఫయాజ్ ఫజల్ 11, నగార్ 16, మనన్ శర్మ 14, సక్సేనా 15, బిపుల్ శర్మ 5, గోని 2, అనురీత్ సింగ్ 15 పరుగులు చేశారు.
అనంతరం బరిలోకి దిగిన ఆసియా స్టార్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి రాయల్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్‌లో పర్వాలేదనిపించిన రిషి ధవన్ (57 బంతుల్లో 83; 11 ఫోర్లు, సిక్స్) బ్యాటింగ్‌లో రెచ్చిపోయి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ధవన్‌కు మరో ధవన్ (రాఘవ్) సహకరించాడు. రాఘవ్ ధవన్ 29 బంతుల్లో 37 పరుగులు చేసి ఆసియా స్టార్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.
ఆసియా స్టార్స్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మెహ్రాన్ ఖాన్ డకౌట్ కాగా.. కశ్యప్ ప్రజాపతి 15, దిల్షన్ మునవీర 2, సరుల్ కన్వర్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ఇండియన్ రాయల్స్ బౌలర్లలో మన్‌ప్రీత్ గోని, అనురీత్ సింగ్, బిపుల్ శర్మ, మనన్ శర్మ తలో వికెట్ తీశారు. ఈ టోర్నీలో ఇండియన్ రాయల్స్ తరఫున టీమిండియా మాజీ ప్లేయర్లు శిఖర్ ధవన్, మునాఫ్ పటేల్, మనోజ్ తివారి, సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆడారు.
Comments
Please login to add a commentAdd a comment