
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె.. వాళ్లలో వాళ్లకే చిచ్చు రాజేసింది. జూడాలు రెండుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. సమ్మె విరమించినట్లు జూడాల ప్రెసిడెంట్ ప్రకటించిన వేళ.. ఉస్మానియా జూడాలు మాత్రం సమ్మె కొనసాగుతోందని ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తెలంగాణలో జూడాల సమ్మె విరమణ.. గాంధీ ఆస్పత్రి వర్సెస్ ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్ల అంశంగా మారిందిప్పుడు. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీ రోడ్ల మరమ్మత్తుల నిధుల విడుదల బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధులు విడుదల.. ఈ రెండు హామీలతో సమ్మె విరమిస్తున్నట్లు(తాత్కాలికంగానే) జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ ప్రకటించారు.
అయితే.. ప్రభుత్వం ముందు ఎనిమిది డిమాండ్లు ఉంచామని, అందులో కేవలం రెండు డిమాండ్లను మాత్రమే ప్రభుత్వం అంగీకరిస్తే సమ్మె ఎలా విరమిస్తారని ఉస్మానియా జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గాంధీ ఆస్పత్రి జూడాలు ప్రభుత్వానికి లొంగిపోయారంటూ ఆరోపిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం తమ ప్రధాన డిమాండ్ అని, ప్రభుత్వం నుంచి ఈ డిమాండ్‌పై స్పష్టమైన హామీ వచ్చేదాకా యధావిధిగా సమ్మె కొనసాగిస్తామని వారంటున్నారు.
ఈ క్రమంలో జూడా జనరల్ సెక్రటరీ ఉస్మానియా జూడాలకు మద్దతుగా నిలవడంతో.. ఈ వ్యవహారం ఏ మలుపు తిరగబోతుందా? అనే ఆసక్తి నెలకొంది.

Comments
Please login to add a commentAdd a comment