ఆపరేషన్‌కు ముందు, తర్వాత దృశ్యం
సాక్షి, అఫ్జల్‌గంజ్(హైదరాబాద్): కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఖరీదైన కాస్మొటిక్ సర్జరీని ఉస్మానియా వైద్యులు ఉచితంగా నిర్వహించి సత్తా చాటుకున్నారు. ఈ మేరకు గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మి, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండు నాయక్ వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలానికి చెందిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినికి కుడివైపు రొమ్ము పెరగకపోవడంతో ఆగస్టులో వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చారు.
అమ్మాయికి వైద్యులు ఓపీ ద్వారా చికిత్స అందించి మళ్లీ రావాల్సిందిగా సూచించారు. అనంతరం ఈ నెల మొదటి తేదీన ఆస్పత్రికి రాగా అదేరోజు ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మి నేతృత్వంలో డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్, డాక్టర్ అశ్వన్ కిషోర్, డాక్టర్ ఫయాజ్, డాక్టర్ విజయ్ బాబు, డాక్టర్ మధులిక, డాక్టర్ అజయ్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండూ నాయక్ నేతృత్వంలోని డాక్టర్ పావని, డాక్టర్ అనుపమ, డాక్టర్ ఆనంద్ బృందం దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి ఆగ్‌మెంటేషన్ మమోప్లాస్టీ శస్త్ర చికిత్సను సిలికాన్ ఇన్‌ప్లాంట్, ఫ్యాట్ గ్రాఫ్టింగ్‌ను అమర్చి పూర్తి చేశామన్నారు.
శస్త్ర చికిత్స జరిగి పదిహేను రోజులు గడిచిందని, ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇలాంటి శస్త్ర చికిత్సకు దాదాపు 5 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, ఉస్మానియాలో అన్నో అభివృద్ది పనులు జరుగుతూ పేదలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. రోగులు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారని, ఉస్మానియా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment