ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న బాధితుడు. చిత్రంలో జడ్జి మురళీమోహన్
చార్మినార్(హైదరాబాద్): రోజూ వేలాది మంది ప్రయాణించే ప్రాంతం అది. రెండు నెలలుగా ఓ మతిస్థిమతం లేని వ్యక్తి ఆ ప్రాంతంలోని రోడ్డుపై తిండిలేక దీనావస్థకు చేరాడు. నడలేని స్థితిలో ఉన్న అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. నిత్యం ఎంతో బిజీగా ఉండే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అతన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. మదీనా సర్కిల్ ఫుట్‌పాత్‌పై గురువారం అతన్ని చూసి చలించిపోయారు.
చింపిరి తల, మాసిన దుస్తులతో ఉన్న ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలని రాష్ట్ర న్యాయ సేవల ప్రాదికార సంస్థ సభ్య కార్యదర్శి గోవర్దన్‌రెడ్డిని సీజే ఆదేశించారు. స్పందించిన గోవర్దన్‌రెడ్డి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిటీ సివిల్ కోర్టు జిల్లా లీగల్ సర్వీసెస్ సభ్య కార్యదర్శి కె.మురళీమోహన్‌ను కోరారు. అలాగే ఇదే విషయంపై సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్ పర్సన్ రేణుక యారా సైతం ఆదేశాలు జారీ చేశారు. దీంతో మురళీమోహన్‌తో పాటు మీర్‌చౌక్ పోలీసులు అక్కడికి వచ్చి అతనికి కొత్త దుస్తులు వేసి చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
శ్రీనివాస్‌గా గుర్తింపు...
అతన్ని ఉప్పల్ పీర్జాదిగూడకు చెందిన గనెగోని శ్రీనివాస్‌గా గుర్తించారు. అవివాహితుడైన అతనికి ప్రవీణ్, రాజేశ్వర్ అనే ఇద్దరు సోదరులున్నారన్నారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న శ్రీనివాస్.. ప్రవీణ్ జీఎస్‌ఐ కార్యాలయంలో పని చేస్తున్నారంటూ శ్రీనివాస్ ఒక పేపర్‌పై రాసి చూపించాడు. కుటుంబ తగాదాల కారణంగా తాను ఇంటి నుంచి వచ్చేసి 2 నెలలుగా మదీనా సెంటర్ వద్ద ఉన్నానని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment