Legal Services Authority
-
రోజుకు రూ.వెయ్యి జరిమానా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ట్రస్టుకు రూ.300 కోట్ల విలువైన 3.7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించడంపై కౌంటర్ దాఖలు చేయాలని గత నవంబర్‌లో ఆదేశించినా వేయకపోవడంతో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ, కౌంటర్ దాఖలు చేసే వరకు రోజుకు రూ.వెయ్యి చొప్పున తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీకి జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ్ సర్వే నం.83/1లో 3.70 ఎకరాలను ఐఏఎంసీకి కేటాయిస్తూ 2021, డిసెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం జీవో 126 జారీ చేసింది.అలాగే నిర్వహణ ఖర్చుల కింద రూ.3 కోట్ల సాయం చేస్తూ మరో జీవో ఇచ్చింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాదులు వెంకట్రామిరెడ్డి, కోటి రఘునాథరావు 2023లో హైకోర్టులో వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. గత నవంబర్‌లో విచారణ సందర్భంగా పిటిషనర్ వాదనలు వినిపిస్తూ.. ఉచితంగా భూమి, ఆర్థిక సాయంపై ప్రభుత్వ జీవోలు చట్టవిరుద్ధమన్నారు. ఈ జీవోలను రద్దు చేసి, ఇప్పటికే చెల్లించిన సొమ్మును తిరిగి వసూలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.వాదనలను విన్న ధర్మాసనం.. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, రెవెన్యూశాఖ కార్యదర్శి, ఐఏఎంసీ సీఈవోలకు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని గత నవంబర్‌లో ఆదేశించింది. ఈ పిల్లపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఇప్పటివరకు కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యత వహిస్తూ కౌంటర్ వేసే వరకు టీఎస్ఎల్ఎస్ఏకి రోజుకు రూ.వెయ్యి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
లఘు చిత్రాలతో ‘నల్సా’ పథకాలు ప్రజల్లోకి..
సాక్షి, హైదరాబాద్: సినిమా అనేది ఒక బలమైన మాధ్యమమని, పోక్సో, సైబర్ క్రైమ్, దాంపత్య వివాదాలు తదితర అంశాలపై తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) రూపొందించిన లఘు చిత్రాలతో న్యాయ పథకాలు ప్రజలకు మరింత చేరువవుతాయని హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే అభిప్రాయపడ్డారు. పేదలతోపాటు సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ఈ సంస్థ అందిస్తున్న న్యాయ, ఇతర సేవలు లబ్ధి చేకూర్చేవిగా ఉన్నాయన్నారు. జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన 10 లఘు చిత్రాలను బంజారాహిల్స్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, టీఎస్ఎల్ఎస్ఏ పాట్రన్–ఇన్–చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువురాని వారికి కూడా పథకాలు తెలిసేలా ఈ చిత్రాలు ఉన్నాయని దర్శకుడు సాయిప్రసాద్‌ను అభినందించారు. సినిమాలతో ఎక్కువ మంది ప్రభావితం అవుతారని, అందుకే నల్సా పథకాలపై లఘు చిత్రాలను రూపొందించామని టీఎస్ఎల్ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శామ్ కోషి తెలిపారు. ఉచిత, సమర్థ న్యాయ సేవలను అందిస్తున్న విషయాన్ని ప్రజలకు సులువుగా చేరువ చేస్తాయన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ పథకాలు చేరాలన్నదే తమ లక్ష్యమని టీఎస్ఎల్ఎస్ఏ సభ్య కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రాలను ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వీక్షించేలా పలు భాషల్లోకి అనువదించనున్నట్లు దర్శకుడు సాయిప్రసాద్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సీత కథ, అంకురం, సంకల్పం, ప్రేరణ, వల, ముందడుగు, నాంది, గెలుపు, జోజో పాపాయితోపాటు టీఎస్ఎల్ఎస్ఏ ఇతర సేవల లఘుచిత్రాలను ప్రదర్శించారు. -
సీజే ఉజ్జల్ భుయాన్: చలించి... మానవత్వాన్ని చాటి...
చార్మినార్(హైదరాబాద్): రోజూ వేలాది మంది ప్రయాణించే ప్రాంతం అది. రెండు నెలలుగా ఓ మతిస్థిమతం లేని వ్యక్తి ఆ ప్రాంతంలోని రోడ్డుపై తిండిలేక దీనావస్థకు చేరాడు. నడలేని స్థితిలో ఉన్న అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. నిత్యం ఎంతో బిజీగా ఉండే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అతన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. మదీనా సర్కిల్ ఫుట్‌పాత్‌పై గురువారం అతన్ని చూసి చలించిపోయారు. చింపిరి తల, మాసిన దుస్తులతో ఉన్న ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలని రాష్ట్ర న్యాయ సేవల ప్రాదికార సంస్థ సభ్య కార్యదర్శి గోవర్దన్రెడ్డిని సీజే ఆదేశించారు. స్పందించిన గోవర్దన్‌రెడ్డి అవసరమైన చర్యలు తీసుకోవాలని సిటీ సివిల్ కోర్టు జిల్లా లీగల్ సర్వీసెస్ సభ్య కార్యదర్శి కె.మురళీమోహన్ను కోరారు. అలాగే ఇదే విషయంపై సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్ పర్సన్ రేణుక యారా సైతం ఆదేశాలు జారీ చేశారు. దీంతో మురళీమోహన్‌తో పాటు మీర్‌చౌక్ పోలీసులు అక్కడికి వచ్చి అతనికి కొత్త దుస్తులు వేసి చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్రీనివాస్‌గా గుర్తింపు... అతన్ని ఉప్పల్ పీర్జాదిగూడకు చెందిన గనెగోని శ్రీనివాస్‌గా గుర్తించారు. అవివాహితుడైన అతనికి ప్రవీణ్, రాజేశ్వర్ అనే ఇద్దరు సోదరులున్నారన్నారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న శ్రీనివాస్.. ప్రవీణ్ జీఎస్ఐ కార్యాలయంలో పని చేస్తున్నారంటూ శ్రీనివాస్ ఒక పేపర్‌పై రాసి చూపించాడు. కుటుంబ తగాదాల కారణంగా తాను ఇంటి నుంచి వచ్చేసి 2 నెలలుగా మదీనా సెంటర్ వద్ద ఉన్నానని పేర్కొన్నాడు. -
తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ నవీన్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ నవీన్ రావు నియమితుల య్యారు. హైకోర్టు సూచనల మేరకు గవర్నర్ ఈ నియామకం చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. గతంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్‌గా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూ యాన్.. హైకోర్టు ప్రధాన న్యాయమూ ర్తిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ స్థానంలో జస్టిస్ నవీన్‌రావును నియమించారు. -
జూన్ 26న జాతీయ లోక్ అదాలత్
సాక్షి, హైదరాబాద్: క్రిమినల్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు, ఎక్సైజ్ కేసులు, కార్మిక వివాదాలు, మ్యాట్రిమోనియల్ కేసుల్లో రాజీ కోసం ఈ నెల 26న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని వివరించారు. (క్లిక్: కరోనా కాదు.. అసమానతే.. అసలు వైరస్!) -
వివాదాలకు ‘ప్రత్యామ్నాయ’ పరిష్కారాలు
శ్రీనగర్: న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ఇందుకోసం వివాదాల పరిష్కారానికి కక్షిదారులు ప్రత్యామ్నాయ యంత్రాంగాలను ఎంచుకొనేలా జిల్లా స్థాయిలో న్యాయ వ్యవస్థ కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. కక్షిదారులతో ప్రత్యక్ష సంబంధాలు ఉండే క్షేత్రస్థాయిలోని జిల్లా న్యాయ వ్యవస్థ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. సాధ్యమైనంత వరకు వారిని ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించాలన్నారు. దీనివల్ల కక్షిదారులకు మేలు జరగడమే కాకుండా, కోర్టులపై పెండింగ్ కేసుల భారం తగ్గిపోతుందని చెప్పారు. జస్టిస్ ఎన్వీ రమణ శనివారం జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ కార్యక్రమంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. కేసుల పరిష్కారానికి జాతీయ, రాష్ట్ర స్థాయిలోని లీగల్ సర్వీసెస్ అథారిటీలను సమర్థంగా వాడుకోవాలని కోరారు. కక్షిదారుల్లో నిరక్షరాస్యులు, చట్టాలపై అవగాహన లేనివారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఉంటారని, అలాంటి వారికి ఉపశమనంగా కలిగించేలా సేవలు అందించాలని న్యాయవాదులను కోరారు. వృత్తిపరమైన ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, విలువలకు కట్టుబడి ఉండాలని చెప్పారు. న్యాయాన్ని తిరస్కరిస్తే అరాచకమే.. తమ హక్కులకు, గౌరవానికి గుర్తింపు, రక్షణ లభిస్తున్నాయని ప్రజలు భావించడమే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సూచిక అని జస్టిస్ ఎన్వీ రమణ తెలియజేశారు. న్యాయాన్ని తిరస్కరిస్తే అది అరాచకానికే దారి తీస్తుందన్నారు. న్యాయవాదుల సహాయం లేకుండా కోర్టుల్లో ఉత్తమమైన తీర్పు వెలువడే అవకాశం లేదన్నారు. తీర్పు విషయంలో బెంచ్, బార్ సంబంధం కీలక పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు. కక్షిదారులకు సానుకూల వాతావరణం కల్పించేందుకు న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రయత్నించాలని చెప్పారు. ప్రజల హక్కులను కాపాడితేనే శాంతి పరిఢవిల్లుతుందన్నారు. జమ్మూకశ్మీర్ అండ్ లద్ధాఖ్ హైకోర్టులో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
బాబ్లీ’లో పోలీసులపై దాడి కేసులో బాబుకు ఊరట
సాక్షి, ముంబై/హైదరాబాద్: మహారాష్ట్రలో 2010 జులై 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్య అక్కడి పోలీసులపై దాడి చేశారని, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసుల్లో తనకిచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)ను ఉపసంహరించాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు అనుమతించింది. నేరారోపణలు నిర్ధారణ అయ్యేంత వరకు వ్యక్తిగత హాజరు నుంచి కూడా చంద్రబాబుకు కోర్టు మినహాయింపునిచ్చింది. అయితే, ఇన్ని రోజులు కోర్టుకు హాజరు కానందుకు రూ.10 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని ఆదేశించింది. వారెంట్ ఉపసంహరణ కోసం చంద్రబాబు దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌పై ధర్మాబాద్ కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా, పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) అభయ్ శిఖరే హాజరయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నామంటూ అప్పట్లో చంద్రబాబు మహారాష్ట్రకు వెళ్లి హడావుడి చేసిన సంగతి తెలిసిందే. 2010 జులై 16వ తేదీన బాబ్లీ వద్ద నిర్వహించిన ఆందోళనకు సంబంధించిన నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను తరువాత పోలీసులు రద్దు చేశారు. ఇదే కేసులో అరెస్ట్ అనంతరం ధర్మబాదులోని ఐఐటిలో ఉంచిన చంద్రబాబు తదితరుల భద్రతతోపాటు శాంతిభద్రతల దృష్ట్యా ఔరంగాబాదు సెంట్రల్ జైలుకు తరలించేందుకు జులై 20న ప్రయత్నించగా ఉదయం తొమ్మిది గంటల నుంచి 10 గంటల మద్య పోలీసులపై దాడులు, ప్రభుత్వ పనులకు ఆటంకం తదితర సంఘటనలకు సంబంధించి కొత్త సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులోనే నాన్‌బెయిలబుల్ వారంట్‌ను కోర్టు జారీ చేసింది. -
ఆమెను చంపు.. లేదంటే నిన్ను చంపుతా..
అలా ఓ వ్యక్తి తనను బెదిరిస్తున్నాడన్న గుంటూరు వాసి హత్య చేయాలంటూ రివాల్వర్, స్కూటీ ఇచ్చాడని వెల్లడి ప్రాణహాని ఉందని వివరిస్తూ ఏపీ డీజీపీ, ఎస్పీకి లేఖ పట్నంబజారు(గుంటూరు): ఓ మహిళను చంపాలని ఒక వ్యక్తి తనను బెదిరిస్తున్నా డని, ఇందుకోసం తనకు రివాల్వర్ కూడా ఇచ్చాడని ఏపీలోని గుంటూరు బ్రాడీపేటకు చెందిన మోదుగుల విజయభాస్కరరెడ్డి శుక్రవారం సాయంత్రం జిల్లా కోర్టులోని లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎదుట లొంగిపోవడం కలకలం రేపింది. కొంత మంది న్యాయవాదులతో కలిసి వచ్చిన ఆయన రివాల్వర్ అప్పగిస్తూ తను ఎదుర్కొంటున్న సమస్యను వివరిస్తూ ఓ లేఖ అందజేశాడు. అనంతరం లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారులు నగరంపాలెం పోలీసులకు అతన్ని అప్పగించి, ఈ వ్యవహారంపై విచారించాలని ఆదేశించారు. మోదుగుల వెంట వచ్చిన న్యాయవాదులు ఆ లేఖలోని అంశాలను మీడియాకు వివరించారు. వారు వెల్లడించిన మేరకు మోదుగుల మాటల్లో వివరాలు.. ‘‘నేను (మోదుగుల విజయభాస్కరరెడ్డి) స్తంభాలగరువుకు చెందిన శనగా సోమశంకర్‌రెడ్డి గతంలో వ్యాపార భాగస్వాములం. కొద్ది కాలంగా చక్కెర వ్యాధి (డయాబెటిస్)తో బాధ పడుతున్న నేను స్తంభాలగరువులో సోమశంకర్‌రెడ్డి ఏర్పాటు చేసిన శంకర్ హోలిస్టిక్ యోగా కేంద్రంలో చేరాను. అయితే అక్కడ అసాంఘిక కార్యకలాపాలు, వ్యభిచారం జరుగుతోంది. శంకర్‌రెడ్డి నివాసంలోని ఐదో ఫ్లోర్లో అతని రెండో భార్య పోలీసు కానిస్టేబుల్ రమాదేవి ద్వారా నిత్యం మద్యం పార్టీ నిర్వహిస్తుంటాడు. మహిళల ద్వారా మగవారికి మసాజ్‌లు చేయించటంతో పాటు, వ్యభిచారం చేయించి వాటిని చిత్రీకరించి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడు. 2004లో శంకర్‌రెడ్డి బెదిరించి పట్టాభిపురంలోని ఒక బ్రాహ్మ ణుల స్థలాన్ని కబ్జా చేశాడు. ఇందులో 2016లో బిల్డర్ అంకారావుతో కలిసి నిర్మా ణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. అయితే అంకారావు రూ.20 లక్షల వరకు నష్టం చేశాడని, అతని నుంచి డబ్బు వసూలుకు సహకరించాలని నన్ను కోరాడు. అందుకే యోగాకు వెళ్లడం మానేశా.. అదే సమయంలో నాకు ఆరోగ్యం సరిగా లేకపోవటం, శంకర్‌రెడ్డి నేరపూరిత చరిత్ర తెలియడంతో నేను యోగాకు వెళ్లటం మానేశాను. శంకర్‌రెడ్డితో చనువుగా ఉండొద్దని మా పక్క పోర్షన్లో ఉండే ఒక మహిళకు చెప్పాను. ఈ విషయం తెలిసి అతను నన్ను తుపాకీతో బెదిరించాడు. గతంలో చలసాని ఝాన్సీ అనే మహిళ విషయంలో కూడా ఇలానే చేశావంటూ నన్ను చంపుతానన్నాడు. 2004లో ఫైనాన్స్ ఇచ్చి ఝాన్సీని మోసం చేసి ఇంటిని అక్రమంగా కాజేశాడు. దీంతో ఝాన్సీ.. కాల్‌మనీ, రేప్ కేసులు పెట్టబోతోందని, ఆమెను చంపాలని జూన్ 15న నాకు రివాల్వర్, ఓ స్కూటీ ఇచ్చాడు. ఆమెను చంపకపోతే నన్ను చంపుతానని బెదిరించాడు. దీంతో తప్పులు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోవాలని నేను జూన్ 17న శంకర్‌రెడ్డి, ఆయన కుమార్తె మృదుల, ఆయన అనుచరులు వణుకూరి సుబ్బారెడ్డి, సీహెచ్ అనంతబాబులకు వాట్సాప్‌లో మెసేజ్ పంపాను. దీంతో నాకు శంకర్‌రెడ్డి నుంచి ప్రాణ హాని ఉంది’’ అని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు డీజీపీ, ఎస్పీలకు కూడా లేఖ ద్వారా వివరించినట్లు మోదుగుల న్యాయవాదులు తెలిపారు. మోదుగులను విచారిస్తున్నామని, ప్రాథమిక సమాచారం మేరకు భూ వివాదం కారణమని అర్బన్‌ఎస్పీ విజయరావు తెలిపారు.