టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ సేవలను ప్రశంసించిన హైకోర్టు సీజే
లఘు చిత్రాలను ఆవిష్కరించిన జస్టిస్ అలోక్ అరాధే
సాక్షి, హైదరాబాద్: సినిమా అనేది ఒక బలమైన మాధ్యమమని, పోక్సో, సైబర్ క్రైమ్, దాంపత్య వివాదాలు తదితర అంశాలపై తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ) రూపొందించిన లఘు చిత్రాలతో న్యాయ పథకాలు ప్రజలకు మరింత చేరువవుతాయని హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే అభిప్రాయపడ్డారు. పేదలతోపాటు సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ఈ సంస్థ అందిస్తున్న న్యాయ, ఇతర సేవలు లబ్ధి చేకూర్చేవిగా ఉన్నాయన్నారు.
జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన 10 లఘు చిత్రాలను బంజారాహిల్స్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ పాట్రన్–ఇన్–చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువురాని వారికి కూడా పథకాలు తెలిసేలా ఈ చిత్రాలు ఉన్నాయని దర్శకుడు సాయిప్రసాద్‌ను అభినందించారు. సినిమాలతో ఎక్కువ మంది ప్రభావితం అవుతారని, అందుకే నల్సా పథకాలపై లఘు చిత్రాలను రూపొందించామని టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శామ్ కోషి తెలిపారు.
ఉచిత, సమర్థ న్యాయ సేవలను అందిస్తున్న విషయాన్ని ప్రజలకు సులువుగా చేరువ చేస్తాయన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ పథకాలు చేరాలన్నదే తమ లక్ష్యమని టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ సభ్య కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రాలను ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వీక్షించేలా పలు భాషల్లోకి అనువదించనున్నట్లు దర్శకుడు సాయిప్రసాద్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సీత కథ, అంకురం, సంకల్పం, ప్రేరణ, వల, ముందడుగు, నాంది, గెలుపు, జోజో పాపాయితోపాటు టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ ఇతర సేవల లఘుచిత్రాలను ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment