
ప్రజా సమస్యల పరిష్కారంలో తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ
న్యాయ సాయమే కాదు.. పథకాల అందజేతలోనూ చేయూత
జువెనైల్ జస్టిస్, డ్రగ్స్, కార్మిక చట్టాలపై అవగాహనకు చర్యలు
మానవ అక్రమ రవాణా, పోక్సో, సైబర్ నేరాలు, ప్రజల హక్కులపై కూడా
రియల్ స్టోరీల లఘు చిత్రాలతో ప్రజలను చైతన్యం చేసేలా ఏర్పాట్లు
పలు కేసుల్లో ఏటా కోట్లలో పరిహారం అందిస్తున్న న్యాయసేవాధికార సంస్థ
ఎలాంటి సాయం కోసమైనా భయం లేకుండా సంప్రదించాలని పిలుపు
సాక్షి, హైదరాబాద్: నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారిపై అత్యాచారం జరిగింది.. పోలీసులు కేసు నమోదు చేశారు.. న్యాయస్థానంలో విచారణ సాగుతోంది.. తీర్పు వచ్చే వరకు ఆమె భవిష్యత్ ఏంటి? కోర్టుటంటే ఏంటో తెలియని ఆ పేదలు ఎలా అక్కడికి వెళ్లగలరు? మానసికంగా కుంగిపోయిన ఆ చిన్నారికి ఎవరు ధైర్యం చెబుతారు? కౌన్సెలింగ్ ఎవరు ఇప్పిస్తారు?.. ఇలాంటి ప్రశ్నలకు జవాబే తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ (టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ). ఒకటి కాదు.. రెండు కాదు.. జువెనైల్ జస్టిస్, డ్రగ్స్, మానవ అక్రమ రవాణా, కార్మిక చట్టాలు, సైబర్ నేరాలు, ప్రజల ప్రాథమిక హక్కులు, ప్రభుత్వ పథకాలు.. ఇలా అనేక సేవలను న్యాయ సేవాధికార సంస్థ అందిస్తోంది.
అయితే, ఈ సేవలు మారుమూల పల్లెలకు సరిగా చేరడం లేదన్న భావనతో సంస్థ కొత్త ఆలోచన చేసింది ఆయా అంశాలతో లీగల్ సర్వీసెస్ అథారిటీ, రాష్ట్ర ఫిల్మ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డి.సాయిప్రసాద్ దర్శకత్వంలో ఈ 10 లఘు చిత్రాలు రూపొందించింది. వీటిని రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. న్యాయ సేవాధికార సంస్థ అందించే సేవలు, న్యాయ సాయం సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేరాలన్నదే లక్ష్యం.
వీరందించే ఆర్థిక సాయం కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. లఘు చిత్రాల ద్వారా ప్రజల్లో సంస్థ అందించే సేవలు, న్యాయ సాయం గురించి అవగాహన పెరుగుతోంది. నిజ జీవితంలో జరిగిన అంశాల ఆధారంగా రూపొందించిన ఈ లఘు చిత్రాలను చూస్తే.. తమ సమస్య ఏంటి? ఎవరిని, ఎలా ఆశ్రయించాలి? ఎలా సా యం పొందాలి? అనేది తెలిసిపోతుంది. ఆ చిత్రాలేంటి.. సాయం ఎలా చేస్తారో తెలుసుకుందాం...
తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ
ఫోన్: 040 – 23446723
E-mail : telenganaslsa@gmail.com
విడుదల...
కొత్తగా ఓ భార్యభర్తలు ఓ ఇంటిలో దిగారు. ఎప్పుడూ భార్య బయటికి వచ్చేది కాదు. భర్త ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు రోజూ ఇంటికి తాళం వేసుకుని వెళ్లేవాడు. చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా ప్రవర్తించేవాడు. కానీ, ఇంటి పక్కనే ఉండే ఓ మహిళకు అతని ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో న్యాయ సేవాధికార సంస్థ పారా లీగల్ వలంటీర్‌ను సమాచారం ఇచ్చింది. వారు పోలీసుల సహకారంతో తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు.
భార్యను చైన్‌తో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి ఉండటాన్ని చూసి వారు షాకయ్యారు. వెంటనే వారు ఆ భార్యకు విముక్తి ప్రసాదించి సఖి కేంద్రంలో చేర్పించారు. వైద్య చికిత్స అందించడంతోపాటు జీవనోభృతి కల్పించారు. ఆ భర్తను అరెస్టు చేసి, శిక్ష పడేలా చర్యలు తీసుకున్నారు. ఆమె ఆనందంగా జీవించేలా ఏర్పాట్లు చేశారు.
అంకురం..
పారా లీగల్ వలంటీర్ ఓ హోటల్‌లో చిన్నారి పని చేయడం చూసి యజమానిని హెచ్చరించాడు. పనిలో తీసేసిన ఆ చిన్నారిని వ్యభిచార గృహానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న వలంటీర్ పోలీసుల సహకారంతో ముఠా గుట్టు రట్టు చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల్లోకి పంపించారు. ఆ చిన్నారితోపాటు చాలామంది చిన్నారులకు జీవితాన్నిచ్చారు. వారంతా చదువుకునేలా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసింది.
సీత కథ..
గిరిజన గ్రామం. చదువుకోవాలని ఎంతో ఆశపడిన బాలికకు 16 ఏళ్లకే తల్లిదండ్రులు వివాహం చేశారు. కాపురం అంటే ఏంటో తెలియని వయసులో అత్త మామలు, భర్త పెట్టే వేధింపులు భరించలేక ఇంట్లోంచి పారిపోయి నగరానికి వచ్చింది. పని ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి ఆమె వద్ద ఉన్న నగలు, డబ్బులు తీసుకుని ఉడాయించాడు.
అయితే కట్టుబాట్లు అంటూ తిరిగి ఆ బాలికను గ్రామంలోకి అనుమతించలేదు. విషయం న్యాయసేవాధికార సంస్థకు తెలిసింది. తొలుత సఖి కేంద్రానికి తరలించి.. చదువుకునేందుకు చర్యలు చేపట్టింది. తర్వాత ఊరి పెద్దలతో మాట్లాడి బాలికను అనుమతించేలా చేశారు. బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు.
ప్రేరణ...
పాఠశాలకు వెళ్లి అందరిలా చదువుకోవాలని ఉన్నా.. ఇళ్లలో పనిచేసేది ఓ బాలిక. పనికి వెళితేనే పైసలు వస్తయని, చదువుకుంటే డబ్బులేం రావని తల్లి చెబుతుండేది. పని చేసే చోట ఓ వృద్ధుడు చదివిస్తానని మాయమాటలు చెబుతూ గర్భవతిని చేశా డు. ఎవరికైనా విషయం చెబితే పుస్తకాలు కొనివ్వన ని బెదిరించాడు. ఎలా అయినా చదువుకోవా లని తపన పడిన చిన్నారి అతని బాధలన్నీ భరించింది.
బాలిక గర్భిణి అని తెలుసుకున్న తల్లిదండ్రులు అల్లాడిపోయారు. న్యాయసేవాధికార సంస్థను సంప్రదించారు. అబార్షన్ చేసే అవకాశం కూడా లేకపోవడంతో బాలిక, పసికందు సంరక్షణ చర్యలు తీసుకున్నారు. పోక్సో చట్టం కింద జైలుకు పంపి నా... నిందితుడు కేసు విచారణలో ఉండగానే మృతి చెందాడు. ఆ బాలిక భవిష్యత్ అంధకారం కాకుండా న్యాయ సేవాధికార సంస్థ ఆర్థిక సాయం చేసింది.
వల...
ఓ యువతి.. తల్లి ప్రోత్సాహంతో రీల్స్, షార్ట్స్ అంటూ వీడియోలు పోస్టు చేసేది. ఆమె ఉత్సాహం, వ్యూస్ చూసిన సైబర్ నేరగాళ్లు ఆమె ఐడీని హ్యాండిల్ చేస్తామని చెప్పారు. మురిసిపోయిన ఆమె తన వ్యక్తిగత వివరాలన్నీ తెలియజేసింది. వాళ్లు ఏమీ చెబితే అది చేయడం ప్రారంభించింది. ఎంత డబ్బు అడిగినా ఇస్తారని తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఓ రోజు ఫేస్ మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియో, ఫొటోలను ఆమెకు పంపించారు.
అడిగినంత డబ్బు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. తండ్రికి విషయం చెప్పడంతో న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించారు. తొలుత 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. న్యాయ సాయం అందించి, ఫేక్ ఏజెన్సీ వాళ్లను పట్టకునేలా సంస్థ చర్యలు చేపట్టింది.
ముందడుగు...
కాలేజీకి వెళ్లే ఓ విద్యార్థి మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. డ్రగ్స్ తీసుకుంటే బాగా చదువుకోవచ్చని స్నేహితులు చెప్పిన మాటలు నమ్మి ఊబిలో కూరుకుపోయాడు. చదువు సంగతి అటుంచితే.. ఆరోగ్యం పూర్తి దెబ్బతినే వరకు తెచ్చుకున్నాడు. ఓ రోజు పోలీసుల వలకు ముఠా చిక్కింది. పెడ్లర్లకు కోర్టు కఠిన శిక్ష విధించింది. న్యాయ సేవాధికార సంస్థ విద్యార్థులను డీఅడిక్షన్ సెంటర్‌కు పంపింది. ఇప్పుడు వారు డ్రగ్స్‌కు దూరంగా సాధారణ జీవనం సాగిస్తున్నారు.
సంకల్పం...
తోపుడు బండ్లపై, గంపల్లో వ్యాపారం చేసుకునే వారి వద్ద బేరమాడి తక్కువ రేటుకు కొంటాం. రోజువారీ వడ్దీకి తెచ్చి ఎండనక, వాననక.. కష్టపడి వందో.. రెండు వందలో ఇంటికి తీసుళ్తే తప్ప పూట గడవదు. ఇలా ఓ మహిళ డబ్బు తీసుకుని ఓ రోజు డబ్బు చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి ఆ వ్యాపారాన్ని నాశనం చేశాడు.
న్యాయసేవాధికార సంస్థను సంప్రదించడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. మెప్మా ద్వారా రుణం ఇప్పించారు. స్టాల్ పెట్టించి సొంత వ్యాపారం పెట్టుకునే భరోసా కల్పించారు. ఇలా పథకాలతో నెలనెలా వేలల్లో సంపాదిస్తున్న వారెందరో ఉన్నారు..
సంరక్షణ...
ఏకాంతంగా ఆడుకుంటున్న ఓ మగ, ఆడబిడ్డపై ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కాస్త ఊహ తెలిసిన బాధిత చిన్నారి ఇచ్చిన సమాచారం మేరకు అతన్ని అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కటకటాల్లోకి పంపారు. చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించిన న్యాయ సేవాధికార సంస్థ కౌన్సెలింగ్ కూడా ఇప్పించింది.
ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నేరుగా జడ్జి ఆ చిన్నారులతో మాట్లాడారు. ఏం జరిగిందో ఆ చిన్నారులు భయపడుతూనే వివరించారు. దుర్మార్గుడిని కూడా గుర్తించడంతో రెండు కేసుల్లో కఠిన శిక్షలు పడ్డాయి. న్యాయ సేవాధికార సంస్థ నుంచి బాధితులకు పరిహారం అందించారు. అందరిలా వారు జీవించేందుకు ఏర్పాట్లు చేశారు.
అంకురం..
పారా లీగల్ వలంటీర్ ఓ హోటల్‌లో చిన్నారి పని చేయడం చూసి యజమానిని హెచ్చరించాడు. పనిలో తీసేసిన ఆ చిన్నారిని వ్యభిచార గృహానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న వలంటీర్ పోలీసుల సహకారంతో ముఠా గుట్టు రట్టు చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల్లోకి పంపించారు. ఆ చిన్నారితోపాటు చాలామంది చిన్నారులకు జీవితాన్నిచ్చారు. వారంతా చదువుకునేలా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసింది.
గెలుపు..
మొబైల్‌కు వచ్చిన లింక్‌ను చదివిన మహిళ పార్ట్ టైమ్ జాబ్‌కు ఓకే కొట్టింది. వెయ్యి, రెండు వేల వరకు బాగానే వేసిన సైబర్ నేరగాళ్లు ఆదాయపు పన్ను అంటూ తొలుత లక్ష, తర్వాత మరో లక్ష చెల్లించాలన్నారు. వారి ఊబిలో ఇరుక్కుపోయిన మహిళ అడిగినప్పుడల్లా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆ నగదు తన అకౌంట్‌లోనే చూపిస్తుండటంతో అనుమానం రాలేదు. ఇలా వివాహం కోసం దాచిన రూ.50 లక్షలు బదిలీ చేసింది.
ఆ తర్వాత కానీ మోసపోయానని ఆమె తెలుసుకోలేదు. ఆత్మహత్యకు యత్నించిన ఆ మహిళను తండ్రి కాపాడి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. సరైన సమయంలో పోలీసులను సంప్రదించడంతో వారు ఆ డబ్బును రికవరీ చేయగలిగారు. గతంలో 2 శాతమే ఉన్న ఈ రికవరీ రేటు ప్రస్తుతం 20 శాతానికి పెరిగింది. వెంటనే సంప్రదిస్తే ఫలితం వచ్చే అవకాశమెక్కువ.
జోజో పాపాయి...
పురిటిలోనే తల్లిని కోల్పోయిన చిన్నారికి పాల కోసం రోజు కిలోమీటర్ల దూరం వెళ్లేవారు తాత. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా గేదెను కొనుక్కొనేందుకు ఆర్థికంగా సహకరించలేదు. న్యాయ సేవాధికార సంస్థకు విషయం తెలియడంతో ఆ తాతను అధికారుల వద్దకు తీసుకెళ్లారు. గిరిజన సంక్షేమ శాఖ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి సహకారంతో ఆవును అందించారు. పసికందు ఆకలి తీర్చడానికి చర్యలు చేపట్టారు. టీకాలు, ఇతర పోషకాహారం కూడా ఇంటికే అందించే ఏర్పాటు చేశారు.
తస్మాత్ జాగ్రత్త..
ఉదయం లేచింది మొదలు ఫోన్‌తోనే గడిపేవారు ఎందరో. కొందరు ఆర్థిక అవసరాల కోసం లోన్ యాప్‌లను సంప్రదిస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదని చెబుతూ బురిడీ కొట్టిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు వడ్డీ వసూలు చేస్తున్నారు. లోన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడే ‘ఓకే’ కొట్టడంతో మన ఫోన్‌లో ఉన్న డేటా అంతా వారికి చేరుతుంది.
మన ఫొటోలు, వీడియోలు కూడా.. తీసుకున్న లోన్ మొత్తం కట్టినా వేధింపులు ఆగలేదు. ఓ వ్యక్తి అక్క వివాహం కోసం లోన్ తీసుకున్నాడు. సైబర్ నేరగాళ్లు అక్క ఫోటోలను మార్ఫింగ్ చేసి పంపారు. దీంతో అతడు న్యాయసేవాధికార సంస్థను సంప్రదించగా.. సైబర్ పోలీసులు అతని ఫోన్‌ను వాచ్ చేసి నేరగాళ్లను అరెస్టు చేశారు.
బంధ విముక్తులను చేసి...
ఇదే నాగర్‌కర్నూల్‌లో రూ.15 వేల అప్పు కట్టలేదని గిరిజన భార్యాభర్తలను నిర్భందించి, పనిలో పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. విషయం తెలుసుకున్న జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్మికులకు అందిస్తున్న పథకం కింద ఇద్దరికీ రూ.30 వేల చొప్పున 2024, డిసెంబర్‌లో అందించింది. వారిని బంధవిముక్తులను చేసింది.
నాంది...
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఇంటికే భోజనం, సరుకులు తెచ్చే యాప్‌లు ఎన్నో ఉన్నాయి. మరి వాటిలో పని చేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటి? వారిని పనిలోంచి తీసేయడం, శ్రమ దోపిడీ జరిగితే ఎక్కడికి వెళ్లాలి.. ఎవరిని సంప్రదించాలి? కార్మిక చట్టం ప్రకారం యాప్ ఆధారిత కార్మికుల పరిస్థితిని సమర్థవంతంగా మెరుగుపర్చడానికి చట్టపరమైన చర్యల ప్రత్యేక బ్లూప్రింట్ అవసరమని న్యాయ సేవాధికార సంస్థ ప్రతిపాదించింది. అసంఘటితరంగ కార్మికుల హక్కుల రక్షణకు అండగా నిలుస్తోంది.
మానసిక వేదనకు పరిష్కారం
బాధితులకు న్యాయం చేయడం కోసం చివరి వరకు ప్రయత్నించాలన్నది సుప్రీంకోర్టు పిలుపు. లీగల్ సర్వీసెస్ అథారిటీ సేవలు దేశవ్యాప్తం కావాలని ఆకాంక్ష. అట్టడుగు వర్గాలకు న్యాయ సేవలు అందాలి. కులం, మతం లేదా ఆర్థిక స్తోమత లేని కారణంగా న్యాయం పొందలేకపోవడం సరికాదు. రూపాయి ఖర్చు లేకుండా లీగల్ సర్వీసెస్ అథారిటీ సేవలు అందిస్తుంది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయితోపాటు గ్రామాల్లో వలంటీర్లు అందుబాటులో ఉంటారు.
న్యాయసాయమే కాదు.. పథకాల వర్తింపుపైనా సమాచారం ఇస్తారు. అంతేకాదు.. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలన్నా న్యాయ సాయం చేస్తారు. ఎలాంటి నేరం జరిగినా బాధితులను ఆర్థికంగా, మానసికంగా అండగా ఉంటారు. ఎలాంటి నేరం జరిగితే.. ఎలా సాయం పొందవచ్చు అని ప్రజలు తెలుసుకునేందుకే రియల్ స్టోరీల ఆధారంగా లఘు చిత్రాలను రూపొందించాం.
గతంలో రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శిగా పనిచేసిన (ప్రస్తుత ఎఫ్‌ఏసీ. రిజిస్ట్రార్ జనరల్) ఎస్.గోవర్ధన్‌రెడ్డి ఈ చిత్రాల రూపకల్పనలో కీలక పాత్ర వహించారు. మార్ఫింగ్ వీడియోలు, అత్యాచారాల్లాంటి ఘటనల్లో ఆర్థిక సాయం అందించొచ్చు.. నేరగాళ్లకు శిక్ష పడొచ్చు.. కానీ, బాధితుల మానసిక వేదనను అర్థం చేసుకునేవారు ఉండరు. అలాంటి సమస్యలను పరిష్కరించడంలో అథారిటీ కీలక పాత్ర పోషిస్తోంది. చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు ప్రభుత్వం మరింత ముందుకొచ్చి చర్యలు చేపట్టాలి. – డి.సాయిప్రసాద్, లఘు చిత్రాల దర్శకుడు
బాధితుల సంక్షేమానికి చర్యలు
న్యాయసేవాధికార సంస్థ అంటే.. న్యాయ సేవలు ఒకటే కాదు. సంక్షేమ ఫలాలు బాధితులకు అందేలా చర్యలు తీసుకున్నాం. నేరం జరిగినప్పుడు బాధితుల వేదనను గుర్తించి నష్ట పరిహారం అందిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా వారికి లబ్ధి చేకూరుస్తున్నాం. కేసు విచారణకు న్యాయ సాయంతోపాటు తీర్పు వచ్చే వరకు అండగా నిలుస్తున్నాం. రాష్ట్రస్థాయిలో టీఎస్‌ఎల్‌ఎస్‌ఏను, జిల్లాల్లో డీఎల్‌ఎస్‌ఏను, మండలాల్లో మండల లీగల్ సర్వీసెస్ కమిటీని సంప్రదించి సాయం పొందవచ్చు.
బాధితులు ఈ కేంద్రాలకు వెళ్లి న్యాయపరమైన సలహాలు కోరవచ్చు. ప్రతీచోట పారా లీగల్ వలంటీర్లు, న్యాయవాదులుంటారు. రాలేని పరిస్థితి ఉంటే నేరుగా మేమే వారి దగ్గరికి వెళ్లి సాయం అందిస్తున్నాం. బాధితులే కాదు.. వారు సాయం అర్థించే పరిస్థితిలో లేకుంటే, వారి తరఫున ఎవరు సమాచారం ఇచ్చినా చేయూత అందించేందుకు కృషి చేస్తాం. మీకు వచ్చిన భాషలో దరఖాస్తుతో వలంటీర్లను లేదా అధికారులను ఆశ్రయించవచ్చు.
న్యాయ సాయం తప్ప ఇతర సేవలను వినియోగించుకునే వారు చాలా తక్కువ. ఎక్కడ, ఎలా వాటిని పొందాలో చాలామందికి తెలియదు. సంస్థ సేవలు అట్టడుగు ప్రజానీకానికి, మారుమూల గ్రామాలకు చేరాల్సిన అవసరం ఉంది. అవసరం ఉన్న వారిలో ఎక్కువ మంది ఆ సేవలు పొందగలిగినప్పుడే నిజమైన సార్థకత చేకూరుతుంది.
– సీహెచ్. పంచాక్షరి, సభ్య కార్యదర్శి, టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ
Comments
Please login to add a commentAdd a comment