Alok
-
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్‌పాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను జస్టిస్ సుజోయ్‌పాల్‌కు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశా రు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ అలోక్‌అరాధే బాంబే హైకోర్టు చీఫ్‌గా బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. సీజే బదిలీతో ఏర్పడనున్న ఖాళీని హైకోర్టులో రెండవ సీనియర్ న్యాయ మూర్తిగా ఉన్న జస్టిస్ సుజోయ్పాల్తో భర్తీ చేశారు. రాజ్యాంగంలోని అధికరణ 223 ద్వారా వచ్చిన అధికారాల మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్‌పాల్‌ను రాష్ట్రపతి నియమించినట్టు న్యాయశాఖ పేర్కొంది. రాష్ట్రపతి తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన సీజేగా కొనసాగుతారు. 2024 మార్చిలో తెలంగాణకు.. మధ్యప్రదేశ్‌లో 1964, జూన్ 21న జస్టిస్ సుజోయ్‌పాల్ జన్మించారు. బీకాం, ఎంఏ, ఎల్ఎల్బీ పూర్తిచేసి 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు. సివిల్, రాజ్యాంగ, పారిశ్రామిక, సర్వీస్‌తోపాటు పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, బోర్డులకు న్యాయవాదిగా పనిచేశారు. 2011, మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2014, ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ సుజోయ్‌పాల్ కుమారుడు మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో అక్కడి హైకోర్టు నుంచి బదిలీ చేయాలని ఆయన కోరుకోగా, రాష్ట్రపతి ఆమోదించారు. 2024, మార్చి 21న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. దాదాపు 10 నెలలుగా ఇక్కడ పనిచేస్తున్న ఆయన మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిబంధనల ఉల్లంఘన, గ్రూప్–1, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా పలు కీలక కేసులపై విచారణ చేపట్టారు. పలు కేసుల్లో తీర్పులు కూడా వెలువరించారు. కాగా, జస్టిస్ అలోక్‌అరాధే బదిలీతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 26కు చేరుకోనుంది. -
జీఎస్టీ కేసుల్లో నిర్బంధానికి సరైన కారణం ఉండాలి
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ చట్టం కింద విచక్షణారహితంగా వ్యాపారులను అరెస్టులు చేయడం మంచిది కాదని, నిర్బంధానికి సరైన కారణాలు అధికారుల వద్ద ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభిప్రాయపడ్డారు. అను మానాలు ఉన్నాయన్న కారణంతో జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 69 కింద నిర్బంధం సరికాదని వ్యాఖ్యానించారు. జీఎస్టీ అంశంలో వ్యాపారులను అరెస్టు చేయడానికి అనుమతించే ముందు అందుకు కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. శనివారం ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ (సౌత్‌జోన్), తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ పన్నుల సదస్సుకు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం రెండు రకాల సంతోషానిచ్చింది. పన్ను అంశంపై అనుభవం ఉన్న న్యాయవాదిగా ఇంత మంది ట్యాక్స్ ప్రాక్టీషనర్ల మధ్య పాల్గొనడం ఒకటైతే.. హైదరాబాద్‌ను సందర్శించడం మరొకటి. ఇక్కడ న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడంతో నగరంతో అనుబంధం ఏర్పడింది. హైదరాబాద్ వస్తే ఇంటికి వచి్చనట్లే ఉంటుంది. ఇలాంటి అవకాశాలు వచి్చనప్పుడు వీలున్నంత వరకు నగరాన్ని సందర్శిస్తా’అని చెప్పారు. ఎవరైనా ఆదాయపు పన్ను నివేదిక సమరి్పస్తే.. అది తప్పుడు నివేదిక అని పూర్తిగా నమ్మితే మాత్రమే అసెస్మెంట్ను తిరిగి ప్రారంభించాలని సుప్రీంకోర్టు గతంలో పేర్కొందని ఆయన వివరించారు. ‘ఆయుధాన్ని’దుర్వినియోగం చేయొద్దు.. ‘సీజీఎస్టీలోని సెక్షన్ 69, సెక్షన్ 83.. రాష్ట్ర జీఎస్టీలోని ఇవే నిబంధనలు అధికారులకు కఠిన అధికారాలను అందించాయి. ఈ రెండు నిబంధనలు రెవెన్యూ చేతిలో బలమైన ఆయుధాలు. వీటిని జాగ్రత్తగా, తక్కువగా ఉపయోగించాలి. ఆయుధాన్ని అతిగా ప్రయోగించినా.. దురి్వనియోగపరచినా.. దాని శక్తిని కోల్పోతుందని మనకు తెలుసు. ఇదే జరిగితే అధికారులపై నమ్మకం పోతుంది. ఒక నిబంధన ఎంత కఠినంగా ఉంటే న్యాయపరమైన పరిశీలన కూడా అంతే కఠినంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి’అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సూచించారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. ‘పన్ను వసూలు అనేది సమాజానికి నాడు, నేడు కీలకమైన అంశాల్లో ఒకటి. ఇది ఏ దేశంలో అయినా ప్రభుత్వాన్ని నడపడానికి ఎంతో అవసరం. శతాబ్దాల నుంచి పన్ను విధింపు చట్టాలు మారుతూ వస్తున్నాయి. ఒక తేనెటీగ పువ్వు నుంచి మకరందాన్ని ఎలా సేకరిస్తుందో పన్ను వసూలు కూడా అంతే సున్నితంగా జరగాలని కౌటిల్యుడు వందల సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆధునిక భారత్‌లో కొత్త పన్ను విధానాలతో దేశం పురోగతిలో పయనిస్తోంది’అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి, జస్టిస్ అనిల్‌కుమార్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నరసింహ శర్మ, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు మీలా జయ్‌దేవ్, టీటీపీఏ అధ్యక్షుడు కె.నర్సింగ్‌రావు, ఏఐఎఫ్‌టీపీ (సౌత్‌జోన్) చైర్మన్ రామరాజు శ్రీనివాస్‌రావు, సు«దీర్ వీఎస్, మహమ్మద్ ఇర్షాద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
లఘు చిత్రాలతో ‘నల్సా’ పథకాలు ప్రజల్లోకి..
సాక్షి, హైదరాబాద్: సినిమా అనేది ఒక బలమైన మాధ్యమమని, పోక్సో, సైబర్ క్రైమ్, దాంపత్య వివాదాలు తదితర అంశాలపై తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ (టీఎస్ఎల్ఎస్ఏ) రూపొందించిన లఘు చిత్రాలతో న్యాయ పథకాలు ప్రజలకు మరింత చేరువవుతాయని హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే అభిప్రాయపడ్డారు. పేదలతోపాటు సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ఈ సంస్థ అందిస్తున్న న్యాయ, ఇతర సేవలు లబ్ధి చేకూర్చేవిగా ఉన్నాయన్నారు. జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన 10 లఘు చిత్రాలను బంజారాహిల్స్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో శనివారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, టీఎస్ఎల్ఎస్ఏ పాట్రన్–ఇన్–చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చదువురాని వారికి కూడా పథకాలు తెలిసేలా ఈ చిత్రాలు ఉన్నాయని దర్శకుడు సాయిప్రసాద్‌ను అభినందించారు. సినిమాలతో ఎక్కువ మంది ప్రభావితం అవుతారని, అందుకే నల్సా పథకాలపై లఘు చిత్రాలను రూపొందించామని టీఎస్ఎల్ఎస్ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శామ్ కోషి తెలిపారు. ఉచిత, సమర్థ న్యాయ సేవలను అందిస్తున్న విషయాన్ని ప్రజలకు సులువుగా చేరువ చేస్తాయన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ పథకాలు చేరాలన్నదే తమ లక్ష్యమని టీఎస్ఎల్ఎస్ఏ సభ్య కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రాలను ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వీక్షించేలా పలు భాషల్లోకి అనువదించనున్నట్లు దర్శకుడు సాయిప్రసాద్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సీత కథ, అంకురం, సంకల్పం, ప్రేరణ, వల, ముందడుగు, నాంది, గెలుపు, జోజో పాపాయితోపాటు టీఎస్ఎల్ఎస్ఏ ఇతర సేవల లఘుచిత్రాలను ప్రదర్శించారు. -
ఆరు నెలల్లో 7,877 కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల్లోనే 7,877 కేసులను పరిష్కారించామని, ఈ విషయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులతో పాటు ఇతర సిబ్బంది కృషి ప్రశంసనీయమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కొనియాడారు. ఆన్లైన్ సేవలను మరింత చేరువ చేయడం, కాగిత రహిత ఫైలింగ్ వంటి అంశాలు కేసుల సత్వర పరిష్కారానికి దోహదం చేస్తున్నాయని చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించడం హర్షణీయమన్నారు. త్వరలోనే భవన నిర్మాణం ప్రారంభం కానుందని, అందరికీ అన్ని వసతులు, సాంకేతికతతో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లోనూ న్యాయస్థానాల నిర్మాణానికి ప్రభుత్వం భూములు కేటాయించిందన్నారు. ఈ జిల్లాల్లో అన్ని వసతులతో భవన నిర్మాణాలు జరిగేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వర్రావు, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, ఏఏజీలు ఇమ్రాన్‌ఖాన్, తేరా రజనీకాంత్‌రెడ్డి, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ.. హైకోర్టు ఆవరణలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు సీజే జస్టిస్ అలోక్ అరాధే శుక్రవారం భూమిపూజ చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉన్నదన్నారు. -
25 ఏళ్లయినా..గడువు కోరుతూనే ఉంటారు
సాక్షి, హైదరాబాద్: ఇంకుడు గుంతల ఏర్పాటుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసి 18 ఏళ్లయినా నివేదక అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 25 ఏళ్ల తర్వాత కూడా ఇంకా సమయం కావాలని కోరుతూనే ఉంటారని అసహనం వ్యక్తం చేసింది. మూడు వారాలు సమయం ఇస్తున్నామని, కొత్తగా నిర్మించే భవనాల్లో ఇంకుడుగుంతల ఏర్పాటుపై అమికస్ క్యూరీ చేసిన సూచనలపై ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. హైదరాబాద్‌లో నీటికొరతపై సుభాష్‌చంద్రన్ 2005లో హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్‌అరాధే, శ్రవణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లో అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి నివేదిక సమర్పించారు. ప్రస్తుతం నీటికొరత అంతగా లేకపోయినా, భవిష్యత్ అవసరాల నిమిత్తం సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని, భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేటప్పుడే ఇంకుడుగుంత ఏర్పాటు తప్పనిసరి చేయాలన్నారు. వాల్టా చట్టం కింద బోర్ల తవ్వకంపై నియంత్రణ అవసరమని చెప్పారు. దీనిపై నివేదిక అందజేయడానికి గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ.. ఏళ్లు గడిచినా ఇంకా గడువు కోరడం సాధారణంగా మారిందని ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. 3 వారాలు గడువిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
రాగద్వేషాలకు అతీతంగా తీర్పులిస్తా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం స్వీకారం చేశారు. రాగద్వేషాలకు అతీతంగా నీతి, నిజాయితీతో విధులు నిర్వర్తిస్తూ తీర్పులు వెలువరిస్తానని ప్రమాణం చేశారు. ఆదివారం రాజ్‌భవన్‌లో ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. అనంతరం గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. సీఎస్ శాంతికుమారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, జస్టిస్ అలోక్ నియామకంపై రాష్ట్రపతి జారీ చేసిన వారెంట్‌ను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుజన చదివి వినిపించారు. ఆ వారెంట్‌ను జస్టిస్ అలోక్‌కు గవర్నర్ అందజేశారు. తర్వాత తెలంగాణ హైకోర్టు 6వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ అలోక్ కుటుంబసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 27 మంది న్యాయమూర్తులు హైకోర్టులో ప్రస్తుతం సీజేతో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 27కు చేరింది. ఏపీ నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ కన్నెగంటి లలిత కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. అలాగే ఛత్తీస్‌గఢ్‌కు చెందిన న్యాయమూర్తి జస్టిస్ సామ్ కోషీ తెలంగాణ హైకోర్టుకు బదిలీపై రానున్నారు. ఒకరు రావడం.. ఒకరు వెళ్లడం.. జరిగినా సంఖ్య మాత్రం 27గానే ఉంటుంది. ఇక కొత్తగా కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపితే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం
-
తెలంగాణ హైకోర్టుగా సీజేపగా అలోక్ అరాధే ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు జస్టిస్ అలోక్ అరాధేతో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు హైకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక, ఇటీవల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లడంతో ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ అరాధే తెలంగాణకు వచ్చారు. ఈమేరకు కొలీజియం సిఫార్సులకు కేంద్ర న్యాయ శాఖ గత వారం ఆమోదం తెలుపుతూ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైన తర్వాత 6వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ బాధ్యతలు చేపట్టారు. కర్ణాటక నుంచి తెలంగాణకు... మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అలోక్ అరాధే 1964, ఏప్రిల్ 14న రాయ్‌పూర్‌లో జన్మించారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తిచేశాక 1988లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2007లో సీనియర్ న్యాయవాది అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో రాజ్యాంగం, మధ్యవర్తిత్వం, కంపెనీ చట్టాలకు సంబంధించిన కేసులు వాదించడంలో పేరు గడించారు. 2009 డిసెంబర్ 29న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016, సెప్టెంబర్ 16న జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా చేశారు. 2018, నవంబర్ 17న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. అక్కడ కూడా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. నాలుగేళ్లలో ఆరో సీజే ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన 2019, జనవరి 1న జరిగింది. తెలంగాణ హైకోర్టు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఐదుగురు సీజేలుగా పనిచేశారు. నాలుగేళ్ల కాలంలో సీజేలుగా జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పనిచేశారు. జస్టిస్ అలోక్ అరాధే ఆరో సీజే కానున్నారు. వీరిలో జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వెళ్లారు. -
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే నియామకానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదముద్ర వేశారు. ఒరిస్సా, గుజరాత్, కేరళ హైకోర్టులకూ నూతన సీజేలను నియమించారు. ఈ వివరాలను న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ బుధవారం ట్వీట్‌చేశారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అలోక్ అరాధేను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా , ఒరిస్సా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుభాíÙశ్ తాళపత్రను అదే హైకోర్టుకు సీజేగా ఖరారు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఒరిస్సా హైకోర్టులో ప్రస్తుత సీజే ఆగస్టు ఏడున రిటైర్ అయ్యాక జస్టిస్ సుభాషిశ్ సీజేగా బాధ్యతలు స్వీకరిస్తారు. అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్‌ను గుజరాత్ హైకోర్టు సీజేగా నియమించారు. గుజరాత్ హైకోర్టులో జడ్జి అయిన జస్టిస్ ఆశిశ్ జె.దేశాయ్‌ను కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఈ నెల మొదట్లో ఈ హైకోర్టులతోపాటు ఆంధ్రప్రదేశ్, మణిపూర్ హైకోర్టులకూ సీజేలుగా జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేయగా ఏపీ, మణిపూర్ హైకోర్టుల్లో నియామకాలపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు జడ్జి అయిన జస్టిస్ పి.సామ్ కోషీని తెలంగాణ హైకోర్టుకు బదిలీచేశారు. -
యోగి చెక్ బౌన్స్.. ఫైన్ కట్టిన విద్యార్థి..
లక్నో, ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా క్యాష్ అవార్డు అందుకున్న ఓ విద్యార్థి ఆనందం అంతలోనే ఆవిరయ్యింది. ఉత్తరప్రదేశ్ 10 వ తరగతి బోర్డు పరీక్షల్లో అలోక్ మిశ్రా అనే విద్యార్థి ఏడో ర్యాంకు సాధించారు. దీంతో అతనికి సీఎం యోగి లక్ష రూపాయల క్యాష్ అవార్డును చెక్ రూపంలో ఇచ్చారు. సీఎం ఇచ్చిన డబ్బును అందుకున్న అలోక్ డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు అధికారులు చెక్ బౌన్స్ అయిందని, బదులుగా జరిమానా కట్టాలని చెప్పడంతో షాక్‌కు గురయ్యారు అలోక్. చెక్‌లో సంతకాలు సరిపోలలేదని అందుకే తిరస్కరించినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో అలోక్ పెనాల్టీ చెల్లించాల్సివచ్చింది. ఈ ఘటపై స్పందించిన డీఐఓఎస్ అలోక్‌కు కొత్త చెక్‌ను ఇచ్చినట్లు వెల్లడించారు. -
పునరావృతం కానివ్వం!
శ్రీనివాస్ సంస్మరణ సభలో కన్సాస్ ఉన్నతాధికారులు ♦ కన్సాస్ సిటీలో భారత అమెరికన్ల శాంతి ర్యాలీ ♦ విద్వేషపూరిత రాజకీయాలకు మద్దతివ్వబోమని ప్రకటన ♦ కూచిభొట్లతో అనుబంధాన్ని నెమరువేసుకున్న మిత్రులు హూస్టన్ : విద్వేషపూరిత ఉద్దేశంతో జరిగిన భారత ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యకు నిరసనగా అమెరికాలోని కాన్సస్ సిటీలో వందల మంది క్యాండిల్స్ పట్టుకుని శాంతి ర్యాలీ నిర్వహించారు. ‘శాంతి కావాలి. ప్రేమతో ఉండాలి. సమాజంలో ఐకమత్యం కావాలి. కలిసుంటేనే కలదుసుఖం’ అని నినాదాలు చేశారు. విద్వేషపూరిత రాజకీయాలకు మద్దతివ్వమని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని ముక్తకంఠంతో తెలిపారు. ఈ ర్యాలీలో గత బుధవారం నాటి కాల్పుల్లో గాయపడిన అలోక్ రెడ్డి సహా.. మృతుడు శ్రీనివాస్ మిత్రులు, సన్నిహితులు, దాదాపు 200 మంది భారత–అమెరికన్లు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో.. కాన్సస్ లెఫ్టినెంట్ గవర్నర్ జెఫ్ కాల్యర్, చట్ట సభ్యుడు కెవిన్ యోడర్, ఒలేత్ మేయర్ మైక్ కోప్లాండ్, పోలీస్ చీఫ్ స్టీవెన్ మెంకే, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ శాంతి సమావేశానికి హాజరయ్యారు. వివిధ మతాల పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘ఒకడు చేసిన చెడ్డ పని అమెరికా ఐకమత్యాన్ని దెబ్బతీయదు. భారత–అమెరికన్లకు మేం అండగా ఉంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని కాన్సస్ మేయర్ కోప్లాండ్ తెలిపారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగేందుకు కృషిచేస్తామని పోలీస్ చీఫ్ మెంకే వెల్లడించారు. అనురాగం, ఆప్యాయతల కలబోత కూచిభొట్ల శ్రీనివాస్ సంస్మరణ సభ ఉద్వేగంగా సాగింది. ‘శ్రీనివాస్‌తో నాది తొమ్మిదేళ్ల స్నేహబంధం. ప్రతి ఒక్కరికీ ప్రేమ, అనురాగం, ఆప్యాయత పంచే ఇలాంటి వ్యక్తిని జీవితంలో ఒక్కసారైనా కలవాలి. ఆయన నోటివెంట ఒక్కసారి కూడా చెడు మాట వినబడలేదు. ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునేతత్వం ఆయనది. ఆరోజు బార్లో జరిగిన ఘటన మరెక్కడా పునరావృతం కాకూడదు. శ్రీనివాస్ ఇకలేడనే విషయం జీర్ణించుకోలేకపోతున్నా. నాకోసం ఆయనిక్కడుండాల్సింది’ అని అలోక్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘నేను కారు కొనుక్కునేంతవరకు రోజూ ఆఫీసుకు శ్రీనివాస్ తన కార్లోనే తీసుకెళ్లేవాడు. ఒక్కరోజు కూడా విసుక్కున్నట్లు కనిపించలేదు. అలాంటి మనుషులను చాలా అరుదుగా చూస్తుంటాం. తొమ్మిదేళ్ల మా స్నేహం తాలూకు జ్ఞాపకాలింకా నా మదిలో మెదులుతున్నాయి’ అని వెల్లడించారు. శ్రీనివాస్ మిత్రులు మరికొందరు కూడా అతని మంచితనం, ఇతరులకు సహాయపడే తత్వాన్ని గుర్తుచేసుకుని కంటతడిపెట్టారు. ‘గోఫండ్‌మి’ పేరుతో తెరిచిన మూడు వేర్వేరు అకౌంట్లలో ఇప్పటివరకు దాదాపు మిలియన్ (దాదాపు రూ.6.71 కోట్లు) విరాళాలుగా వచ్చాయి. వీటితో అలోక్, ఇయాన్ కు వైద్యం చేయించటంతోపాటు శ్రీనివాస్ కుటుంబానికి సాయం చేయనున్నారు. ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమే! భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఇయాన్ గ్రిలాట్ ‘ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణమిచ్చేందుకూ సిద్ధమే’ అని తెలిపారు. ‘బార్లో కుటుంబాలతో, చిన్న పిల్లలతో వచ్చిన వారంతా బాస్కెట్‌బాల్ మ్యాచ్ చూస్తున్నారు. చాలా మందే అక్కడున్నారు. ఇంతలోనే ఇద్దరిపై కాల్పులు చేస్తున్న పురింటన్ ను చూశాను. వాళ్ల ప్రాణాలు కాపాడేందుకు నా ప్రాణాలు బలిచ్చేందుకూ వెనకాడలేదు. నేను ఏదోఒకటి చేయాలి. అందుకే అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాను’ అని గ్రిలాట్ తెలిపాడు. పురింటన్ తో పెనుగులాటలో గ్రిలాట్ ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయితే దీన్ని తొలగించటంతో ప్రాణాపాయం తప్పినా.. ఆయన కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. -
చివర్లో అమ్మకాలు
105 పాయింట్లు నష్టం 28,458 వద్దకు సెన్సెక్స్ నిఫ్టీ 26 పాయింట్లు డౌన్ చివర్లో పెరిగిన అమ్మకాలతో మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ 105 పాయింట్లు క్షీణించి 28,458 వద్ద నిలవగా, 26 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 8,538 వద్ద స్థిరపడింది. దీంతో వారం మొత్తంగా కూడా మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఏడు వారాల తరువాత మళ్లీ సెన్సెక్స్ 236 పాయింట్లు కోల్పోయింది. కాగా, బీఎస్ఈలో ప్రధానంగా ఐటీ, హెల్త్‌కేర్ రంగాలు 1.5% స్థాయిలో నష్టపోయాయి. మరోపక్క ఎఫ్ఎంసీజీ, రియల్టీ ఇండెక్స్‌లు 1%పైగా బలపడ్డాయి. ఏడు మాత్రమే... సెన్సెక్స్ దిగ్గజాలలో ఏడు షేర్లు మాత్రమే లాభపడగా, ఐటీసీ, ఎంఅండ్ఎం, సెసాస్టెరిలైట్ 2% స్థాయిలో పుంజుకున్నాయి. అయితే హెల్త్‌కేర్‌లో డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, సిప్లా, ఐటీ బ్లూచిప్స్‌లో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ 2-1.5% మధ్య నీరసించాయి. ఇక బీఎస్ఈ-500 సూచీలో భాగమైన స్పైస్‌జెట్ 14% పతనమైంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ రుణ సౌకర్యాన్ని రద్దు చేయడం ఇందుకు కారణమైంది. ఈ బాటలో షసున్ ఫార్మా, కేశోరామ్, అలోక్, సుజ్లాన్, ఎల్జీ, సద్భావ్ ఇంజినీరింగ్, ఏపీఎల్, ఐడియా, వైభవ్ గ్లోబల్, స్ట్రైడ్స్ ఆర్కోల్యాబ్, హాట్సన్, త్రివేణీ, బీఎఫ్ యుటిలిటీస్, జెట్ ఎయిర్వేస్ తదితరాలు 5-3% మధ్య పతనమయ్యాయి. ఇక రియల్టీ షేర్లలో డీఎల్ఎఫ్ 5% పుంజుకోగా, హెచ్‌డీఐఎల్, ఫీనిక్స్, యూనిటెక్ 1% చొప్పున లాభపడ్డాయి. -
నెక్స్ట్ జెనరేషన్ లీడర్స్ అలోక్
స్ఫూర్తి కొందరు విజయం సాధించడానికి జీవితమంతా పోరాడుతూనే ఉంటారు. కానీ కొందరు విజయం సాధించడం కోసమే పుడతారు. అలోక్శెట్టి ఈ రెండో కోవకు చెందినవారు. ఆయన ఏదైనా అనుకోవడానికి వెనుక ముఖ్యమైన కారణం ఉంటుంది. అనుకున్నది సాధించడం వెనుక అలుపెరుగని కృషి ఉంటుంది. అదే ఆయనను ఇరవై ఎనిమిదేళ్లకే తిరుగులేని విజేతను చేసింది. ఇటీవలే టైమ్స్ వారు ఎంపిక చేసిన ఆరుగురు ‘నెక్స్ట్ జెనరేషన్ లీడర్స్’లో ఒకరిగా నిలిచిన అలోక్ ప్రస్థానం, ఎంతో ఆసక్తికరం... రెండు దశాబ్దాల క్రితం... బెంగళూరులోని ఓ సైట్లో కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అంతలో ఒకాయన తన కొడుకును తీసుకుని వచ్చారు. తను పని చేసుకుంటుంటే, పిల్లాడు ఆడుకుంటాడులే అనుకున్నారాయన. కానీ ఆ అబ్బాయి ఆడుకోలేదు. అక్కడ జరిగే ప్రతి పనినీ గమనించాడు. అప్పుడే కాదు... తన తండ్రితో కన్స్ట్రక్షన్ సైటుకి వెళ్లిన ప్రతిసారీ ఆ బుడతడి కళ్లు అన్నిటినీ నిశితంగా పరిశీలించేవి. అక్కడ చెక్కముక్కలు, ఇనుపరేకులు, విరిగిన ఇటుకలు పడి వుండటం చూసి, అవన్నీ అలా వృథా అయిపోవాల్సిందేనా అనుకునేవాడు. ఆ ఆలోచనే నిర్మాణ రంగంలో సరికొత్త విధానాలకు తెర తీసేందుకు అతణ్ని ప్రోత్సహించింది. వ్యర్థాలతో సైతం నిర్మా ణాలు జరిపేందుకు పురికొల్పింది. అంతే కాదు... నిర్మాణ కూలీల అగచాట్లను చూసి ఆ పసిమనసు కదిలిపోయింది. తల దాచుకోవడానికి సరయిన చోటు కూడా లేక, పని జరిగేచోటే పాలిథీన్ షీట్లతో, గోనెలతో గుడిసెలు వేసుకునే వారి దీనస్థితి, పెద్దయిన తర్వాత పదిమంది గురించీ ఆలోచించేలా చేసింది. ఇవాళ ప్రపంచం ముందు అతణ్ని హీరోగా నిలబెట్టింది. ప్రతి అడుగూ వినూత్నమే... అందరూ చేసే పని అయినా, దాన్ని కొత్త తరహాలో చేయడమే తన శైలి అని ఇప్పటికే చాలాసార్లు నిరూపించాడు అలోక్. ఈజిప్టు నాగరికతను పరిశీలిస్తే... ఇళ్లన్నీ రాళ్లతో నిర్మితమై ఉంటాయి. ఎందుకంటే, వారికి రాయి విరివిగా దొరికేది. మెసపొటేమియా నాగరికతా కాలంలో ఇటుకలతో నిర్మాణం కావించేవారు. ఎందుకంటే, వారికి మన్ను బాగా దొరికేది. కానీ ఈ కాలంలో ఇళ్లను నిర్మించాలంటే ఎక్కువగా లభించేది ఏంటి? ఈ ప్రశ్నకు అలోక్ చెప్పే సమాధానం చాలా షాకింగ్‌గా ఉంటుంది. ఇంతకీ ఆ సమాధానం ఏమిటో తెలుసా... చెత్త. అవును. అలోక్ అదే చెబుతాడు. ఆయా నాగరికతల కాలంలో దొరికేది వాళ్లు వాడినప్పుడు, మన కాలంలో దొరికేది మనం వాడాలి కదా అంటాడు నవ్వుతూ. మన దేశంలో ఎక్కడ చూసినా కనిపించేది చెత్తే, దానివల్ల కాలుష్యం పెరుగుతుంది, వ్యాధులు ప్రబలుతాయి. పోనీ దాన్ని ఏరి పారేద్దామా అంటే అందుకు కొన్ని కోట్లు ఖర్చవుతాయి. అందుకే చెత్తను రూపుమాపడానికి దాన్ని తన పనికి ముడి సరుకుగా చేసుకున్న మేధావి అలోక్. రీసైక్లింగ్ వస్తువులతో పాటు స్థానికంగా దొరికే కలప, వెదురు వంటి వాటితో అతడు నిర్మించిన ఇళ్లను చూస్తే హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. అయితే ఇంత సృజనాత్మకత అతడికి అనుభవంతో రాలేదు. అలోక్ సహజంగానే సృజనశీలి. లేదంటే, పంతొమ్మిదేళ్ల వయసులోనే ఓ ఆసుపత్రిని డిజైన్ ఎలా చేయగలుగుతాడు?! బెంగళూరులోని ఆర్వీ కాలేజీలో ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు... ఓ కాంపిటీషన్ కోసం హాస్పిటల్ నమూనాను రూపొందించాడు అలోక్. మొదటి బహుమతిని గెలుచుకున్నాడు. అది చూసిన ఓ వ్యాపారవేత్త... తాను జైపూర్‌లో నిర్మించాలనుకున్న హాస్పిటల్ని డిజైన్ చేయమని అడిగారు. ఆ వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అతడు పెద్ద కసరత్తే చేశాడు. పలువురు డాక్టర్లు, నర్సులను కలిశాడు. హాస్పిటల్ ఎలా ఉండాలనుకుంటారు అంటూ వాళ్ల ఆలోచనలను తెలుసుకున్నాడు. పలు ఆసుపత్రుల్లోని పేషెంట్లను కలిసి, మీకు హాస్పిటల్ ఎలా ఉంటే ఇష్టం అనడిగాడు. అందరి అభిప్రాయాలనూ తరచి చూసి, మంచి హాస్పిటల్ అంటే ఎలా ఉండాలో నిర్ణయించుకుని, అలా డిజైన్ చేశాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. మనసుతో చేస్తాడు... ఓ ఇంటిని నిర్మించడమంటే... ఇటుకలు పేర్చి, సిమెంటు రాసి, పైకప్పు పరచడం కాదు అలోక్‌కి. అది చాలా గొప్ప పని అంటాడు. ముఖ్యంగా పేదవారికి ఓ ఇల్లు కట్టేటప్పుడు తను పొందే ఆనందం అంతా ఇంతా కాదంటాడు. కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేసి వచ్చాక, డబ్బు ఎలా సంపాదిద్దాం అని ఆలోచించలేదు అలోక్. తన ప్రతిభను దేశానికి, తనవారికి ఎలా ఉపయోగించాలా అని ఆలోచించాడు. పూరి గుడిసెలు చూసినప్పుడల్లా మథన పడేవాడు. వాన గట్టిగా కురిస్తే ఎగిరిపోయే టార్పాలిన్ పైకప్పులు, వరద నీటి ప్రవాహంలో కరిగి కలిసిపోయే మట్టి గోడలు చూసి... వారి కోసం తానేం చేయగలనా అని ఆలోచించాడు. వానకూ వరదకూ చెక్కు చెదరని ఇళ్లకు రూపకల్పన చేశాడు. వెదురు, కలపల సహాయంతో అతడు నిర్మించే ఆ ఇళ్లు చాలా తేలికగా ఉంటాయి. తుపాను, వరదల సమయంలో వేరే చోటికి కూడా తరలించేసుకోవచ్చు. కొన్ని ఇళ్లయితే డిస్‌మ్యాండిల్ చేసి మళ్లీ అతికించుకోవచ్చు. వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చు కేవలం పద్దెనిమిది వేల రూపాయలు. అందుకే అంటాడు అలోక్... ‘ఒక ధనవంతుడు సెల్‌ఫోన్ కొనుక్కోవడానికి వెచ్చించే సొమ్ముతో పేదవాడికి ప్రశాంతమైన నివాసాన్ని ఏర్పరచవచ్చు’ అని! ఇంకా నిర్మాణ రంగంలో అతడు చేసిన ప్రయోగాలు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాయి. ఓడల మీద సరుకులను రవాణా చేసే భారీ కంటెయినర్లను రెండు వందలకు మంది పైగా కూర్చోగల ఆడిటోరియమ్స్గా మార్చి చూపించాడు. భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో... వ్యర్థాలతో తయారుచేసిన తేలికైన ఇటుకలతో ఇళ్లు నిర్మించాడు. అవి కూలినా ఆస్తి నష్టం, ప్రాణనష్టం ఉండదు. ఇలా అతడు నిర్మాణరంగంలో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తి కాకముందే తాను నెలకొల్పిన ‘భూమిపుత్ర’ అనే నిర్మాణ సంస్థ ద్వారా తన ఆశయాలను నెరవేర్చుకుంటున్నాడు. మరో పదిమంది ప్రతిభావంతులైన ఆర్కిటెక్ట్స్ సాయంతో దేశవ్యాప్తంతో ఎన్నో భారీ నిర్మాణాలను పూర్తి చేశాడు. అయితే వాటికంటే ఎక్కువ ఆనందం... పేదవారికి గూడు ఏర్పరచినప్పుడే కలుగుతోందని చెప్పే అలోక్ ఆదర్శనీయుడు, అనితరసాధ్యుడు! - సమీర నేలపూడి కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసే మా నాన్నను చూసి నేను కూడా నిర్మాణ రంగంలోనే స్థిరపడాలనుకున్నాను. డబ్బు సంపాదించడానికి కాక సమాజానికి ఉపయోగపడే ఆర్కిటెక్టును కావాలను కున్నాను. అలా ఉండేందుకే ప్రయత్నిస్తున్నాను. అందుకే నేను చేసేదాన్ని ఆర్కిటెక్చర్ అనను. ప్రాబ్లెమ్ సాల్వింగ్ అంటాను. తన భూమిపుత్ర సంస్థ ద్వారా స్కాలర్షిప్ను ఏర్పాటు చేసి, ఎంతోమంది పేద చిన్నారులకు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాడు అలోక్. బెంగళూరులోని ‘పరిణామ్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు అలోక్. తీరిక దొరికితే వెళ్లి చేయడం కాదు... సేవ కోసం తీరిక చేసుకుంటాడు. ‘స్లమ్ డెవెలప్మెంట్ ప్రాజెక్ట్’ ద్వారా వారంలో ఒకరోజు తన టీమ్‌తో కలిసి మురికివాడల్లోని వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చే పనిలోనే ఉంటాడు. నిర్మాణాన్ని నిలబెట్టేందుకు ఉపయోగించే బొంగులు, నిర్మాణ సమయంలో మిగిలిపోయే వస్తు వుల్ని సేకరించి, వాటిని పేదవారి ఇళ్ల నిర్మాణంలో ఉపయోగిస్తుంటాడు.