హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ | Justice Sujoy Pal appointed as Chief Justice of the High Court | Sakshi
Sakshi News home page

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజోయ్‌పాల్‌

Published Thu, Jan 16 2025 1:23 AM | Last Updated on Thu, Jan 16 2025 1:23 AM

Justice Sujoy Pal appointed as Chief Justice of the High Court

బాంబే హైకోర్టుకు జస్టిస్‌ అలోక్‌అరాధే బదిలీ

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం

బదిలీతో 26కు చేరుకోనున్న హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను జస్టిస్‌ సుజోయ్‌పాల్‌కు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశా రు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్‌ అలోక్‌అరాధే బాంబే హైకోర్టు చీఫ్‌గా బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. సీజే బదిలీతో ఏర్పడనున్న ఖాళీని హైకోర్టులో రెండవ సీనియర్‌ న్యాయ మూర్తిగా ఉన్న జస్టిస్‌ సుజోయ్‌పాల్‌తో భర్తీ చేశారు. రాజ్యాంగంలోని అధికరణ 223 ద్వారా వచ్చిన అధికారాల మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ను రాష్ట్రపతి నియమించినట్టు న్యాయశాఖ పేర్కొంది. రాష్ట్రపతి తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన సీజేగా కొనసాగుతారు.  

2024 మార్చిలో తెలంగాణకు.. 
మధ్యప్రదేశ్‌లో 1964, జూన్‌ 21న జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ జన్మించారు. బీకాం, ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి 1990లో మధ్యప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ చేసుకున్నారు. సివిల్, రాజ్యాంగ, పారిశ్రామిక, సర్వీస్‌తోపాటు పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, బోర్డులకు న్యాయవాదిగా పనిచేశారు. 2011, మే 27న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2014, ఏప్రిల్‌ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ కుమారుడు మధ్యప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. దీంతో అక్కడి హైకోర్టు నుంచి బదిలీ చేయాలని ఆయన కోరుకోగా, రాష్ట్రపతి ఆమోదించారు. 2024, మార్చి 21న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. దాదాపు 10 నెలలుగా ఇక్కడ పనిచేస్తున్న ఆయన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ నిబంధనల ఉల్లంఘన, గ్రూప్‌–1, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా పలు కీలక కేసులపై విచారణ చేపట్టారు. పలు కేసుల్లో తీర్పులు కూడా వెలువరించారు. కాగా, జస్టిస్‌ అలోక్‌అరాధే బదిలీతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 26కు చేరుకోనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement