విచారణ సమయంలో తన వెంట న్యాయవాదిని కూర్చోనివ్వాలని కోరిన కేటీఆర్
దర్యాప్తు చేసే గదిలో పిటిషనర్,అధికారి మాత్రమే ఉండాలన్న న్యాయమూర్తి
పక్కనే ఉన్న లైబ్రరీ గది నుంచి న్యాయవాది దర్యాప్తును వీక్షించవచ్చని వెసులుబాటు
అధికారుల తీరు సరిగా లేకుంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడి.. గురువారం కేటీఆర్ వెంట రామచందర్‌రావును అనుమతించాలని ఆదేశం
విచారణ 20వ తేదీకి వాయిదా
ఫార్ములా–ఈ రేసు కేసులో కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ల రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు హైకోర్టులో మరోసారి నిరాశే మిగిలింది. ఏసీబీ విచారణ సమయంలో తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం పాక్షికంగా అనుమతించింది. కేటీఆర్ వెంట న్యాయవాది రామచందర్‌రావు విచారణకు వెళ్లవచ్చని, కానీ కేటీఆర్ పక్కన కూర్చోవద్దని పేర్కొంది.
పక్కనే ఉన్న మరో గదిలో నుంచి న్యాయవాది వీక్షించవచ్చని స్పష్టం చేసింది. పిటిషనర్ (కేటీఆర్)కు తన న్యాయవాది కనిపించకుంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. ఏసీబీ అధికారుల దర్యాప్తును ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ కోరగా.. దీనికి న్యాయస్థానం నిరాకరించింది.
తనతోపాటు న్యాయవాదిని కూర్చోనివ్వాలంటూ..
గురువారం ఏసీబీ విచారణకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో... దర్యాప్తు అధికారులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, తనతోపాటు కూర్చొనేందుకు న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ కేటీఆర్ బుధవారం హైకోర్టులో లంచ్ మోహన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 6న తాను విచారణకు హాజరయ్యేందుకు వెళ్లగా.. వెంట న్యాయవాదిని అనుమతించలేదని వివరించారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ మధ్యాహ్నం 2.15 సమయంలో విచారణ చేపట్టారు.
న్యాయవాదిని అనుమతించేందుకు సర్కార్‌కు ఉన్న అభ్యంతరమేమిటో చెప్పాలని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) తేరా రజనీకాంత్‌రెడ్డిని అడిగారు. వివరాలు తెలుసుకుని చెప్పాలంటూ విచారణను సాయంత్రం 4.15కు వాయిదా వేశారు. సాయంత్రం మరోసారి విచారణ చేపట్టారు. కేటీఆర్ తరఫున న్యాయవాది ప్రభాకర్‌రావు వాదనలు వినిపిస్తూ.. కేటీఆర్ వెంట న్యాయవాదిని అనుమతించాలని, విచారించే సమయంలో ఏసీబీ అధికారులు ఆడియో, వీడియో రికార్డు చేసేలా ఆదేశించాలని న్యాయమూర్తిని కోరారు.
న్యాయవాది లైబ్రరీ గది నుంచి వీక్షించొచ్చు..
వాదనలు విన్న న్యాయమూర్తి.. అత్యంత క్లిష్టమైన క్రిమినల్ నేరాల విచారణలో మాత్రమే ఆడియా, వీడియో రికార్డింగ్‌కు ఆదేశాలు ఇవ్వగలమని పేర్కొన్నారు. అయితే న్యాయవాదిని అనుమతించవద్దన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చారు. విచారణలో జోక్యం చేసుకోనప్పుడు న్యాయవాదిని అనుమతిస్తే వచ్చే నష్టమేమిటని ప్రశ్నించారు. అయితే విచారణ సమయంలో పిటిషనర్ (కేటీఆర్), దర్యాప్తు అధికారి మాత్రమే గదిలో ఉండాలని స్పష్టం చేశారు.
విచారించే సమయంలో న్యాయవాదికి కనబడేలా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు. ఏసీబీ ఆఫీస్ దర్యాప్తు గదిని ఆనుకుని ఉన్న లైబ్రరీ గది కిటికీ నుంచి విచారణను వీక్షించే వీలు ఉందని ఏఏజీ వివరించారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించారు. ఆ లైబ్రరీ గదిలో న్యాయవాది కూర్చొని కిటికీలోంచి వీక్షించవచ్చని తెలిపారు.
కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు
పిటిషనర్ వెంట విచారణకు ఎవరు హాజరవుతారో ముగ్గురు న్యాయవాదుల పేర్లు ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలా పిటిషనర్ (కేటీఆర్) ముగ్గురు న్యాయవాదుల పేర్లు ఇవ్వగా.. అందులో రామచందర్‌రావు ఏసీబీ ఆఫీసులోకి వెళ్లవచ్చని న్యాయమూర్తి తెలిపారు.
అయితే సదరు న్యాయవాది ఆ విచారణలో ఎలాంటి జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. ఆ సమయంలో విచారణాధికారులు వ్యవహరించే తీరును బట్టి మళ్లీ హైకోర్టుకు రావచ్చని తెలిపారు. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment