విచారణ కోసం ఈడీ కార్యాలయానికి వస్తున్న కేటీఆర్
మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించిన ఈడీ అధికారులు
సాక్షి, హైదరాబాద్: బ్రిటన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈఓ) ఖాతాల్లోకి హెచ్‌ఎండీఏ నిధులు ఎందుకు మళ్లించారు?, రేస్ నిర్వహణ ఒప్పందాలను అతిక్రమించి ఎఫ్‌ఈఓకు డబ్బులు చెల్లించాలని మీరు ఎందుకు ఆదేశించారు?, ఆర్థిక శాఖ, కేబినెట్ అనుమతి లేకుండానే నిధులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?, మీరు చెబితేనే అధికారులు నగదు బదిలీకి పాల్పడ్డారా?, విదేశీ కంపెనీకి నగదు చెల్లింపులో ఆర్బీఐ నిబంధనలు ఎందుకు పట్టించుకోలేదు?, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. ఈసీ అనుమతి తీసుకోవాలని మీకు తెలియదా?, ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి చేకూరిన లబ్ధి ఏంటి?.. అంటూ మాజీమంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
సుమారు ఏడు గంటలపాటు విచారణ కొనసాగింది. గురువారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కేటీఆర్ 10.30 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన మొబైల్ ఫోన్‌ను అధికారులు సెక్యూరిటీ వద్ద డిపాజిట్ చేయించారు. అనంతరం మూడో అంతస్తులో జేడీ రోహిత్ ఆనంద్ ముందు ఓ న్యాయవాదితో కలిసి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం ఐదుగురు సభ్యుల బృందం ప్రశ్నించింది. మధ్యలో కాసేపు భోజన విరామం ఇచ్చారు. సాయంత్రం 5–30 గంటల వరకు విచారణ కొనసాగింది.
రెండు డాక్యుమెంట్లు సమర్పించిన కేటీఆర్
ఈ నెల 8, 9వ తేదీల్లో హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, అప్పటి ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ అందజేసిన డాక్యుమెంట్ల ఆధారంగా కూడా ఈడీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. అవసరమైతే మరోమారు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని సూచించారు.
వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్, ఆస్తుల వివరాలు ఆరా తీయగా, అన్నీ అందిస్తానని కేటీఆర్ తెలిపారు. అలాగే ఈడికి రెండు డాక్యుమెంట్లను (ఫార్ములా–ఈ పైన నీల్సన్ సంస్థ రూపొందించిన నివేదిక, తెలంగాణ ఈవీ పాలసీ –2020) ఇచ్చిన కేటీఆర్ అందుకు సంబంధించి వారి నుంచి రశీదు తీసుకున్నట్లు తెలిసింది.
నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేసినట్లు వెల్లడి
విశ్వసనీయ సమాచారం మేరకు.. కేటీఆర్ చాలా ప్రశ్నలకు విపులంగా సమాధానం ఇవ్వగా..నిధుల మళ్లింపు అంశం, నిబంధనలు ఎందుకు అతిక్రమించాల్సి వచ్చిందన్న ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు దాటవేశారు. మరికొన్నింటికి ముక్తసరిగా జవాబులిచ్చారు. మంత్రిగా తనకు అన్ని విషయాలు తెలుసని చెప్పారు. బిజినెస్ రూల్స్, ఆర్బీఐ నిబంధనల ప్రకారమే ఎఫ్‌ఈఓకు చెల్లింపులు జరిగాయని స్పష్టం చేశారు.
ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కాకూడదనే ఎఫ్‌ఈవోకు చెల్లింపులు జరిపామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా హెచ్‌ఎండీఏ బోర్డు నుంచి మంజూరైన రూ.45.71 కోట్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేవని చెప్పారు. కేటీఆర్ చెప్పిన అంశాలన్నీ అధికారులు రికార్డ్ చేసినట్టు సమాచారం.
ఎఫ్‌ఈఓ ప్రపోజల్స్ ఎవరు తీసుకొచ్చారు? కంపెనీనే నేరుగా సంప్రదించిందా? లేక ఇతర ప్రైవేట్ కంపెనీలు ఈ కార్ రేస్ ఫార్ములాను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశాయా? అనే కోణంలో కూడా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈవెంట్ నిర్వహణకు స్పాన్సర్‌గా అగ్రిమెంట్ చేసుకున్న ఏస్ నెక్సŠట్ జెన్ సంస్థ గురించి కూడా ఆరా తీసినట్లు సమాచారం.
పటిష్ట బందోబస్తు .. ఉద్రిక్తత
కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటీఆర్ ఈడీ కార్యాలయంలోకి వెళుతున్న సమయంలో పార్టీ శ్రేణులు పెద్దపెట్టున జై తెలంగాణ నినాదాలతో ఆయన వాహనం వైపు దూసుకొచ్చారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కొంతసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, మన్నె క్రిశాంక్, సుమిత్రానంద్, పావని గౌడ్, కీర్తిలత గౌడ్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం 5–30 గంటలకు కేటీఆర్ తిరిగి వెళ్లే సమయంలోనూ కొందరు నాయకులు, కార్యకర్తలు అక్కడే ఉండి జై తెలంగాణ నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment